Wednesday, September 29, 2010

కేసీఆర్ అంతర్జాతీయ నాయకుడై పోయాడా?

[>>>టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను పాలస్తీనా విమోచనా సంస్థ ప్రతినిధులు ప్రొఫెసర్ లిసా తారకీ, మిస్టర్ థామస్ ఆదివారం కలిశారు. టీఆర్‌ఎస్ కార్యాలయానికి వచ్చిన వారు కేసీఆర్‌తో సుమారు పావుగంటపాటు సమావేశమయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ పాలస్తీనాపై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ పట్ల భారత్ కఠినంగా వ్యవహరించాలని కోరేందుకు వచ్చామన్నారు.
కేసీఆర్‌తో పాలస్తీనా ప్రతినిధుల భేటీ - సాక్షిపత్రిక 27 సెప్టెంబరు, 2010, 12వ పేజీ వార్త నేపధ్యంలో...

>>>పాలస్తీనా దేశస్తులకు అండగా నిలవాలని, భారతదేశం వారికి సహాయపడేలా చూడాలని పాలస్తీనాకు చెందిన హక్కుల కార్యకర్త లిసాతరకీ, ఫ్రాన్స్‌కు చెందిన మరో కార్యకర్త థామస్ సోమ్మర్‌లు ఆదివారం కేసీఆర్‌ను పార్టీ కార్యాలయంలో కలిసారు. తాము దేశంలోని అన్ని పార్టీల నాయకులను కలుస్తున్నామని, భారతదేశం కొత్తగా రూపొందించిన విదేశీ విధానాలు ఇజ్రాయెల్ దేశానికి అనుకూలంగా ఉన్నాయని, వీటిని సవరించేలా ఒత్తిడి తేవాలని కోరుతున్నామని వివరించారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించారని, పాలస్తీనా ప్రజలకు సంఘీభావం ప్రకటించారని లీసా తరకీ మీడియాతో చెప్పారు.
కేసీఆర్‌తో పాలస్తీనా సామాజిక కార్యకర్తల భేటీ: ఈనాడు 27 సెప్టెంబరు, 2010, 09వ పేజీ వార్త నేపధ్యంలో...]


సుబ్బలష్షిమి:
బావా! పాలస్తీనా పై దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయెల్ పట్ల భారత్ కఠినంగా వ్యవహరించాలని కోరేందుకు, పాలస్తీనా విమోచన సంస్థ ప్రతినిధులు(?) వచ్చారట. వచ్చి కేసీఆర్‌ని కలిసారట. ఇదేం చోద్యం బావా? కేసీఆరేమన్నా భారత ప్రభుత్వంలో ఉన్నాడా? జాతీయ నాయకుడా? ఓ ఉప ప్రాంతీయ నాయకుడే కదా?

ఇది మరీ మోకాలికీ బోడిగుండుకీ సంబంధం పెట్టినట్లు గానో, తాటి చెట్టు ఎందుకెక్కావంటే దూడగడ్డి కోసమన్నట్లు గానో లేదూ?

సుబ్బారావు:
ఏం చేస్తాం మరదలా!? అన్నీ వింతలే అయిపోయాయి. లోపల వాళ్ళేం మాట్లాడుకున్నా... ఏ సమాచారం ఇచ్చిపుచ్చుకున్నా... పైకి మాత్రం, వాళ్ళేం చెబితే అదే నమ్మాలి కదా! మోకాలు బోడిగుండులా ఉందన్నా, దూడగడ్డి కోసం తాటి చెట్టు ఎక్కానన్నా, ‘కామోస’ను కోవాల్సిందే! తప్పదు! సామాన్యులంత కంటే ఏం చెయ్యగలరు చెప్పు!

Tuesday, September 28, 2010

బదిలీ చేస్తే శిక్షపడినట్లా?

[అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిపై బదిలీ వేటు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! శ్రీశైలం దేవాలయపు అతిశీఘ్రదర్శన కౌంటర్‌లోనూ, లడ్డూ విక్రయాల్లోనూ(1100 లడ్డూలు) గోల్‌మాల్‌లు చేసిన ఉద్యోగులపై బదిలీ వేటు పడిందట. అసలు ఉద్యోగులకి బదిలీలన్నవి వాళ్ళ ఉద్యోగంలో భాగం కదా బావా? అలాంటిది బదిలీ చేస్తే శిక్షపడినట్లు అంటారేమిటి, అధికారులూ, మీడియా కూడా? ఇది ఈ ఒక్క ఉద్యోగి విషయంలోనే కాదు, ఐఏఎస్‌ల దగ్గర నుండి చిన్నస్థాయి ఉద్యోగి దాకా ‘బదిలీ వేటు’ అన్నది ‘శిక్ష’గానే ప్రచారం జరుగుతుంది.

సుబ్బారావు:
అంటే మరదలా, కేసులు రాలే సీట్లో నుండి మరో సీటుకి బదిలీ అయితే, మళ్ళీ అన్నీ సర్ధుబాట్లు చేసుకుని... లంచాలతోనో, అక్రమాలతోనూ పైసలు రాబట్టుకోవాలంటే కొంచెం సమయం పడుతుంది కదా! అందుచేత శిక్షపడినట్లేనన్న మాట. అది అధికారులూ, పత్రికలూ కలిసి పుట్టించిన కొత్త భాష, భాష్యమూ కూడా! అవినీతిపరులని రక్షించటానికే కదా ఈ చట్టాలు ఉన్నాయి? అంత ఉదార ప్రజాస్వామ్యం మరి!

సుబ్బలష్షిమి:
ఇంతా చేసి, ఆ బదిలీలు కూడా అంతర్గత బదిలీలు బావా! ఆఫీసులో, ఒక గది నుండి మరో గదికి అన్నంత మామూలుగా! లడ్డూల కౌంటర్లో ఆఫ్‌రికార్డులో లడ్డూలమ్ముకున్నట్లే, గంగాసదన్‌లో ఆఫ్‌రికార్డులో గదులద్దెకిచ్చుకోవచ్చు, తెలుసా?

సుబ్బారావు:
తూతూమంత్రపు శిక్షలైనప్పుడు అక్రమాలు అలాగే కొనసాగుతాయి మరి!

Monday, September 27, 2010

కోడిపుంజు గుడ్లుపెట్టినట్లు, దున్నపోతు ఈనుతుందేమో!


[కోడి పుంజు గుడ్లు పెట్టింది - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రంగారెడ్డి జిల్లా రాఘవాపూర్‌లో కోడిపుంజు గుడ్లు పెట్టిందట. మొన్నెప్పుడో అంబటి రాంబాబు "రామోజీ...దున్నపోతు ఈనిందా!" అన్నాడని సాక్షి పత్రిక వ్రాసింది. ఇప్పుడు కోడిపుంజు గుడ్లు పెట్టింది. అసలే ఆధునిక సాంకేతికత అందుబాటులో కొచ్చిన చోట, రేపెప్పుడో దున్నపోతు ఈనినా ఈనుతుందేమో కదా, బావా!

సుబ్బారావు:
ఏమో మరదలా! ఈనాడు కోడిపుంజు గుడ్లుపెట్టినట్లు, మరోనాడు దున్నపోతు ఈనుతుందేమో! దున్నపోతు ఈనితే మాత్రం... ఏ దూడ పుడుతుందో చూడాల్సిందే!

Saturday, September 25, 2010

ఇంతకంటే గొప్ప పరిపాలనని ఇంకెవరూ అందించలేరేమో!

[కల్మాడీకి కత్తెర! మన్మోహన్‌తో సమావేశానికి దూరం. క్రీడాగ్రామం బాధ్యతల్లో కోత! ఇకపై నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వానిదే! ప్రధాని చొరవతో మారిన పరిస్థితి - ఈనాడు (24/09/10) తొలిపేజీ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామన్వెల్త్ క్రీడల నిర్మాణాలు, నిర్వహణల్లో... వేలకోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శుభ్రతతో సహా ఏర్పాట్లు పరమనాసిగా ఉన్నాయని, బీబీసీతో సహా అంతర్జాతీయ మీడియా... ఫోటోలు, వీడియోలు విడుదల చేసీ మరీ గోలపెడుతోంది. కొందరు ఆటగాళ్ళు పాల్గొనేందుకు తిరస్కరిస్తున్నారని వార్తలొస్తున్నాయి. అవసరం లేకున్నా... అల్లంతదూరంలో యమున నదికీవలి ఒడ్డున, ఆవలి ఒడ్డునున్న ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ కుమారుడు(ఎంపీ) సందీప్ దీక్షిత్ నియోజక వర్గానికి సమీపదూరంలో ఉండేటట్లుగా, క్రీడాగ్రామం నిర్మించబడిందనీ వార్తలొచ్చాయి.

ఓ దశలో విలేఖరుల ప్రశ్నలెదుర్కోలేక కర్మాడీ పక్కాగా పరుగందుకున్న ఫోటోలు కూడా వార్తల్లో వచ్చాయి. అలాంటి కల్మాడీని... సమావేశానికి దూరంగా ఉంచటంతో, ప్రధానమంత్రి చొరవ తీసుకున్నట్లేనట! దాంతో ‘పరిస్థితి మారినట్లేనని’ ఈనాడు వ్రాసింది. అంటే ఏమిటి బావా!?

సుబ్బారావు:
ఏముంది మరదలా! కల్మాడిని ఒక్క సమావేశానికి దూరంగా ఉంచితే సరి! జరిగిపోయిన అవకతవకలనీ పరిష్కరించినట్లే! జరుగుతున్న, జరగబోయే అవినీతిని కూడా అరికట్టినట్లే! పోయిన దేశం పరువు వచ్చినట్లే! ఎంత గొప్పగా భాష్యం చెప్పబడిందో చూశావా! వినేవాడుంటే ఏదైనా చెప్పచ్చునని దాని అర్ధం!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఇంతకంటే గొప్ప పరిపాలనని ఇంకెవరూ అందించలేరు. ఈ లెక్కన... పార్ధసారధి, ఆచార్యలని ఒక్క సమావేశానికి పిలవకపోతే ఎమ్మార్ దోపిడి కూడా పరిష్కరింపబడినట్లే కదా!?

Friday, September 24, 2010

ఆ 20% నిజాయితీపరులు వీళ్ళే అయ్యుంటారు!?

[భారతీయులలో 20 శాతం మంది మాత్రమే నిజాయితీ పరులూ అని ప్రకటించిన మాజీ సీవీసీ కమీషనర్ ప్రత్యూష్ సిన్హా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కేంద్ర విజిలెన్స్ కమీషనర్ గా పదవీ విరమణ చేసిన ప్రత్యూష్ సిన్హా అనే సీనియర్ అధికారి, భారతీయులలో అవినీతి పెరిగిపోతోందని, కేవలం 20% మంది మాత్రమే ఏ ప్రలోభాలకు లొంగని వాళ్ళున్నారని అంటున్నాడు, తెలుసా?

సుబ్బారావు:
అవును మరదలా! కాకపోతే ఆ 20% మంది ఎక్కడున్నారో మనలాంటి సామాన్యులకి తెలియదు గానీ, అభిమానుల అంధనేత్రాలకు మాత్రం, తమ ప్రియతమ నేతలు మూర్తీభవించిన నిజాయితీ పరులుగా కనబడుతుంటారు.

సుబ్బలష్షిమి:
అదేమిటి బావా!

సుబ్బారావు:
అదంతే మరదలా! ఉదాహరణకి చంద్రబాబు, వై.ఎస్.,కేసీఆర్ గట్రాల అవినీతి గురించి ఎవరైనా ఏమైనా అన్నారనుకో! వాళ్ళ అభిమానులు రఁయ్యిన వచ్చి, ఆ అన్నవాళ్ళ మీద మాటల తూటాలు పేల్చి, ‘తమ అభిమాన నాయకులు నిజాయితీకి నిజరూపాలు’ అంటారు.

ఈ లెక్కన... సదరు అభిమానుల అభిప్రాయంలో దేశం లో ఉన్న 20% నిజాయితీపరుల్లో కేవలం... సోనియా, మన్మోహన్ సింగ్, చంద్రబాబు, జగనూ, రామోజీరావు, లల్లూ ప్రసాద్ యాదవ్, మాయావతి, కరుణానిధి, జయలలిత, టాటాలు, బిర్లాలూ, అంబానీలు.... వగైరాలు మాత్రమే ఉండి ఉండాలి.

సుబ్బలష్షిమి:
ఏం చెప్పగలం బావా! అభిమానులకి హరతివ్వాల్సిందే!

Thursday, September 23, 2010

ఇంటి కన్న జైలు పదిలం! అది విలాసాల నిలయం!

[జైలు జీవితం ఇక ‘సుఖ’వంతం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇక నుండీ జైల్లో ఖైదీలకు నెలకు 8 సార్లు ఫోన్ సౌకర్యం కలిగిస్తారట. నెలకు మూడురోజులు పాటు కుటుంబ జీవితం గడపనిస్తారట. ఎటూ వారాంతంలో మాంసాహారం ఇస్తారు. టీవీ, పత్రికలు, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఖైదీలలో మానసిక పరివర్తన సంగతేమో గానీ, మొత్తానికి బయట కంటే జైల్లోనే జీవితం సుఖవంతంగా ఉండబోతుందేమో బావా!

సుబ్బారావు:
మరి!? చట్టాలున్నది నేరగాళ్ళ శ్రేయస్సు కోసమే కదా మరదలా! అందునా ఈ మధ్య రాజకీయ నాయకులు కూడా జైలు కెళ్ళి, రోగమో రొప్పొ వచ్చిందని ఆసుపత్రికి ఉరికే దాకా, బెయిల్ వచ్చే దాకా, ఖైదీలుగా ఉండాల్సి వస్తోంది కదా! ముందు జాగ్రత్త చర్యలుగా సౌకర్యాలు మెరుగు పరుచుకుంటున్నట్లున్నారు.

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! జైల్లో ఖైదీలు మాట్లాడే ఫోన్‌కు నిమిషానికి 10/- రూపాయలు వసూలు చేస్తారట! ఎంతో పెద్ద శిక్ష కదూ!

సుబ్బారావు:
అది కాదు మరదలా! మొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ‘పోలీసులు క్రికెట్ట్ బెట్టింగ్ ఆపలేకపోతున్నారు. కాబట్టి, ప్రభుత్వమే అధికారికంగా అనుమతిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ డబ్బుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించవచ్చని’ సలహా కూడా ఇచ్చాడు. అదే మాదిరిగా... ప్రభుత్వం ఎలాగూ జైళ్ళల్లో ఫోన్లను ఆపలేకపోతున్నది కదా! కాబట్టి ప్రభుత్వమే, ప్రజాసంక్షేమ నిధులు కోసం, ఫోన్ కాల్ ఛార్జిలు నిమిషానికి 10/- రూపాయలు వసూలు చేస్తున్నారు కాబోలు! మొత్తానికి పెద్ద శిక్షే!

విమర్శిస్తే వ్యతిరేక ఆలోచనా విధానమే!

[కామెన్వెల్త్ క్రీడ నిర్మాణాలలో రోజు కొకటి కూలటం, రోజుకో అవినీతి వెలికి రావటం కొనసాగుతున్న తరుణంలో,
‘మీడియాది వ్యతిరేక ఆలోచనా ధోరణి’ - జైపాల్ రెడ్డి, షీలాదీక్షిత్‌లు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామెన్వెల్త్ క్రీడల ఏర్పాట్లలో ఎన్ని అవకతవకలు, ఎంత అవినీతో! మొన్న సోమవారం మండపమొకటి కూలింది, మంగళ వారం పాదచారుల వంతెన కూలింది. బుధవారం ఫాల్స్ స్లాబు కూలింది. ఈ నేపధ్యంలో... కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌లు ‘మీడియా అతిగా స్పందిస్తోందనీ, మీడియాది వ్యతిరేక దృక్పధమనీ’ తేల్చి చెప్పారు, తెలుసా!

సుబ్బారావు:
అంతే మరి! తమనెవరైనా విమర్శిస్తే... ఎవరైనా అనే మాటే ఇది! చివరికి మీడియాని విమర్శిస్తే, మీడియా కూడా ఆ విమర్శించిన వాళ్ళని ఇదే అంటుంది.

సుబ్బలష్షిమి:
వెరసి... ‘ఎవరెంత అవినీతి అక్రమాలూ చేసినా కిమ్మనకుండా ఉండటం సానుకూల ఆలోచనా ధోరణి, తప్పులెత్తి చూపటం వ్యతిరేక ఆలోచనా విధానంగా’ నిర్వచింపబడ్డాయన్న మాట! ఎంత బేవార్సు భాష్యాలు బావా!

Monday, September 20, 2010

ఆత్మాభిమానమే తెలిసి ఉంటే ఇలా ఉంటారా?[కేసీఆర్‌కి చెప్పులు తొడుగుతున్న తెరాస కార్యకర్తల వార్త నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! మొన్నోసారి డి.శ్రీనివాస్‌కి చెప్పులు తొడిగారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు కేసీఆర్‌కి చెప్పులు తొడుగుతున్నారు తెరాస కార్యకర్తలు. ఆ నాయకులకేమో వొళ్ళొంగదు. ఆత్మాభిమానం కోసం ప్రత్యేక రాష్ట్రం అనే వీళ్ళకి అసలు ఆత్మాభిమానం అంటే ఏమిటో తెలుసా బావా?

సుబ్బారావు:
ఆత్మాభిమానమా? ఏదో నాయకుల అరుస్తున్నారు కాబట్టి, తామూ అరవటమే గానీ, ఆత్మాభిమానమే తెలిసి ఉంటే అలా ఉంటారా మరదలా? డి.శ్రీనివాస్, కేసీఆర్‌‌ల వంటి ఒళ్ళొంగని నాయకులూ, వాళ్ళ పాదాలు పట్టుకునే కార్యకర్తలూ ఉన్నంత కాలం... ఏ దేశమైనా, రాష్ట్రమైనా పొందేది అధోగతే! రావలసిన మార్పు రాజకీయంగా కాదు మరదలా, ముందు ప్రజల బుర్రల్లో రావాలి!

Thursday, September 16, 2010

మొగుడు ముం... అంటే ముష్టికొచ్చిన వాడూ ముం... అంటాడన్నట్లు!
[ఆదోని పట్టణంలో వై.యస్. వేషధారణలో విఘ్నేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ విపరీత పోకడ లేమిటి బావా! బ్రతికున్న వాళ్ళని గానీ, చనిపోయిన వాళ్ళని గానీ, రాజకీయ నాయకుల రూపంలో దేవుళ్ళ విగ్రహాలా? అప్పుడెప్పుడో దుర్గా మాత విగ్రహ రూపంలో, కాంగ్రెస్ అధిష్టానం సోనియాని ప్రతిష్ఠించినందుకు గొడవయ్యింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడి విగ్రహ రూపంలో వై.యస్.ని ప్రతిష్ఠించారు. ఇవెక్కడి వెర్రితలలు?

సుబ్బారావు:
అదే వై.యస్. బొమ్మని ముస్లింల మత చిహ్నం ఏ చంద్రవంకా, నక్షత్రంలోనో వెయ్యగలరా? వెయ్యలేరు. వై.యస్. వేషధారణలో ఏ క్రీస్తుగానో నిలబెట్టగలరా? లేరు. అదే హిందూ దేవుళ్ళ రూపాల్లో అయితే...? ఎదురే లేకుండా చేస్తారు. ఎవరో కాదు, హిందువులే చేస్తారు! మొగుడు ముం... అంటే ముష్టికొచ్చిన వాడూ ముం... అంటాడన్నట్లు, తమ మతం పట్ల తమకే శ్రద్ద లేనప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా, ఎక్కడైనా ఎప్పుడైనా, హిందూమతాన్ని కించపరిచేందుకు పేటెంటు ఉందనే అనుకుంటారు మరదలా!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ప్రజా జీవనంలో అవినీతి అడుగంటు దాకా వస్తే, ఇలాంటి వెర్రితలలే పుడతాయి. లోపలి కారణం - ‘డబ్బులు ముట్టడం, కెరీర్ కోసం’ పైకారణం - ‘అభిమానాలుండటం’....! ఇది, ఎవరూ ఛేదించలేని ద్వంద్వమై కూర్చొంటుంది.

సుబ్బారావు:
ఖచ్చితంగా అంతే మరదలా! కాబట్టే, మార్పు రావలసింది ప్రజల్లోనే!

Friday, September 10, 2010

ఉగ్గుపాలతోనే నేర్చుకుని ఉంటాడు, ఈ రాజకీయ నట వారసుడు!

[చనిపోయిన వారిపై విమర్శలా! ప్రకాశం ఓదార్పు యాత్రలో జగన్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బ్రతికున్న వారిని విమర్శిస్తే వివరణలైనా ఇచ్చుకుంటారు. చనిపోయిన వారిని సైతం విమర్శిస్తున్నారు. రాజకీయాలు అంత నీచంగా తయారయ్యాయని కడప ఎంపీ వై.యస్.జగన్ అన్నాడట. తండ్రి అడ్డూ అదుపూ లేకుండా దోచుకుని సొమ్ము కట్టబెట్టినప్పుడు రాజకీయాలన్నీ స్వచ్ఛంగా ఉన్నాయి కాబోలు బావా! పైగా చనిపోయిన వారిని విమర్శించ కూడదట. చేసేవన్నీ చేసినా, దోచుకున్నంత దోచుకున్నా, చచ్చిపోయాడు కాబట్టి అడగ కూడదు. తండ్రి వారసత్వంగా సీఎం సీటు కావాలట, అతడి అక్రమార్జనలూ కావాలట, విమర్శలూ విచారణలూ మాత్రం వద్దట. అవకాశ వాదం కూడా వారసత్వంగా అబ్బింది ఈ ఓదార్పు వీరుడికి!

సుబ్బారావు:
ఉగ్గుపాలతోనే నేర్చుకుని ఉంటాడు మరదలా! మరి రాజకీయ నట వారసుడు కదా!

Thursday, September 9, 2010

అంత గండికోట రహస్యాలు అక్కడేమున్నాయబ్బా!

[బెంగుళూరులో ఎకరాల కొద్దీ విశాలమైన ప్యాలెస్ కట్టుకున్న జగన్ - తెదేపా నేతల విమర్శ.
ఫిల్మ్ సిటీ పేరుతో బుల్లెట్ ఫ్రూప్ ఇల్లు నిర్మించుకున్న రామోజీరావు - జగన్ వర్గీయుల ప్రతివిమర్శల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బెంగుళూరులో జగన్, అతడి తండ్రి వై.యస్. బ్రతికి ఉన్న రోజుల్లోనే, ఎకరాల కొద్దీ సువిశాలమైన ఇల్లు కట్టుకున్నారట. భద్రత కోసం పలు గేట్లు పెట్టుకున్నాడట. షిప్టుకి 200 మంది చొప్పున, రోజుకి 600 మంది సెక్యూరిటీ సిబ్బందిని పెట్టుకున్నాడట - ఇది ఆ రెండు పత్రికలూ, తెదేపా నేతలూ చేస్తున్న విమర్శ!

ఇందుకు జగన్ వర్గీయులు... ఫిల్మ్ సిటీ పేరిట వందల ఎకరాలు కాజేసి, అందులో 20 ఎకరాలలో రామోజీరావు బుల్లెట్ ఫ్రూప్ ఇల్లు కట్టుకున్నాడన్నాడని ప్రతివిమర్శ చేస్తున్నారు.

నాకు తెలియక అడుగుతాను, అంత పటిష్టమైన, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, వాళ్ళ ఇళ్ళకెందుకు బావా? పోనీ ప్రాణ రక్షణ కోసం అనుకుందామంటే, ఓ వైపు రామోజీరావు సినీ తారల ఇంట పెళ్ళిళ్ళూ, రోడ్డు ప్రమాదాల పరామర్శలూ వంటి వ్యక్తిగత సందర్శనలకు పోతూనే ఉంటాడయ్యె. మరో వైపు జగన్, మీ ఇంట్లో ‘పెరుగున్నం తింటా, పెద్ద కొడుకుగా ఉంటా’ అంటూ ఓదార్పు యాత్రలూ మామూలుగానే చేస్తున్నాడయ్యె!

తమ ప్రాణాల కంటే విలువైనవీ, ముఖ్యమైనవీ వాళ్ళ ఇళ్ళల్లో ఏమున్నాయి బావా, అంతగా రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు?

సుబ్బారావు:
అంత గండికోట రహస్యాలు ఏమున్నాయో? బయటికి వచ్చినప్పుడు కదా మనబోటి వాళ్ళకి తెలిసేది మరదలా!

Tuesday, September 7, 2010

ఏ క్రీడలు చూసినా, ఏమున్నది.....

[క్రికెట్ ఆటలో ఫిక్సింగులూ, బెట్టింగులూ, అద్లెటిక్స్ లో డోపింగులు వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
జనాలు టీవీల కతుక్కు పోయి, కళ్ళార్ప కుండా, ఉత్కంఠకి ఊపిరి పీల్చకుండా చూసే క్రీడా పోటీల్లో.... చూడబోతే చాలా అవకతవకలే ఉన్నట్లున్నాయి కదూ, బావా!

సుబ్బారావు:
అప్పుడెప్పుడో శ్రీశ్రీ,

"ఏ దేశ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
నరజాతి చరిత్ర మొత్తం
పరపీడన పరాయణత్వం"
అన్నాడు మరదలా!

మనం దాన్ని తిప్పి చదువుకోవచ్చు.

‘ఏ క్రీడలు ఏ ఛానెల్ లో చూసినా
ఏమున్నది ఆనందం?
క్రీడాపోటిల క్రీనీడలన్నీ
ఫిక్సింగు డోపింగుల మయం’
అని.....

సుబ్బలష్షిమి:
నిజమే సుమా!

Monday, September 6, 2010

ఎక్కడైనా బావా గానీ వంగ తోట కాడ మాత్రం కాదు!

[ప్రాణాలైనా తీసుకొండి. తెలంగాణా ఇవ్వండి - కేకే వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు కె.కె..... "ప్రాణాలైనా తీసుకొండి, తెలంగాణా ఇవ్వండి" అంటున్నాడు తెలుసా?

సుబ్బారావు:
అంత త్యాగమెందుకులే మరదలా! ఎటూ అమాయక విద్యార్ధులు ప్రాణాలిస్తూనే ఉన్నారు కదా? "తెలంగాణా సాధన కోసం ఏ త్యాగమైనా చేస్తాం" అనే కేకేలు, కేసీఆర్ లు వంటి నాయకులంతా.... ప్రాణాలొద్దు గానీ, ఇప్పటి వరకూ నానా రకాలుగా కూడబెట్టిన తమ ఆస్థులన్నిటినీ త్యాగం చేసి, తెలంగాణా లోని పేద ప్రజలకి పంచిపెట్టమను. దెబ్బకి, తెలంగాణా ఎలా రాదో చూద్దాం!

సుబ్బలష్షిమి:
అబ్బా ఆశ దోస అప్పడం! ఏదో ప్రాస కోసం "ప్రాణాలైనా ఇస్తాం" అంటారు గానీ, ఆస్థుల్ని ఇచ్చేస్తారేమిటి? ‘ఎక్కడైనా బావా గానీ వంగ తోట కాడ మాత్రం కాదన్న’ సామెత, కేకేలకీ, కేసీఆర్ లకీ, టీజీ వెంకటేష్ లకీ, బొత్సలకి బాగా తెలుసు!

Thursday, September 2, 2010

అమ్మదయా, మజాకానా? - దటీజ్ రేణుకా చౌదరి!

[రేణుకా చౌదరికి పునరావాసం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎన్నికల్లో ఓడిపోయినా... రేణుకా చౌదరికి ఢోకా లేదు చూశావా! ఆమెను బ్యూరో ఆఫ్ పార్లమెంట్ స్టడీస్ అండ్ ట్రెయినింగ్[బీపీఎస్ టీ] గౌరవ సలహాదారుగా ప్రభుత్వం నియమించిందట. బీపీఎస్ టీ పార్లమెంట్ పనితీరుపై సదస్సులు నిర్వహిస్తుందట, ఎంపీలకు, మీడియా ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందట. గత వారమే రేణుకా చౌదరి బాధ్యతలు స్వీకరించిందట. తాజా హోదాలో ఆమెకు ఢిల్లీలో ప్రత్యేక ఇంటినీ, ఇతర సౌకర్యాలను కల్పిస్తారట, తెలుసా?

సుబ్బారావు:
బ్రహ్మండం మరదలా! మరి అమ్మదయా, మజాకానా?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! రేణుకా చౌదరి పార్టీలు మారిన హవా మాత్రం తగ్గదు. ఒకప్పుడు తెదేపాలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా! దటీజ్ రేణుకా చౌదరి!
~~~~~~~~~

Wednesday, September 1, 2010

నిను వీడని నీడను నేనే!

[బంగారు లక్ష్మణ్‌పై కేసు కొట్టివేతకు ఢిల్లీ హైకోర్టు నో!
న్యూఢిల్లీ: పదేళ్ల క్రితం.. ఓ స్టింగ్ ఆపరేషన్‌లో డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన కేసులో బీజేపీ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌పై ఉన్న విచారణను కొట్టివేసేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను తొలగించేందుకు జస్టిస్ ధింగ్రా ఒప్పుకోలేదు. 2001లో తెహల్కా పత్రిక నిర్వహించిన ఓ శూలశోధనలో లక్ష్మణ్ రూ.లక్ష తీసుకుంటూ పట్టుబడ్డారు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004లో సీబీఐ దీనిపై కేసు దాఖలు చేసింది.]

సుబ్బలష్షిమి:
బావా! పాపం, ఈ భాజపా మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ ని, లక్షరూపాయల లంచం తీసుకున్న తెహల్కా కేసు ‘నిను వీడని నీడను నేనే’ అన్నట్లు పట్టుకుంది చూడూ!

సుబ్బారావు:
నిజమే మరదలా! పదేళ్ళ క్రితం లక్షరూపాయల లంచం! ఈ రోజు ప్రభుత్వ శాఖల్లో అవినీతి అటెండర్ల అక్రమార్జన చూసినా... అధమ పక్షం పదుల లక్షల్లో ఉంటోంది. అలాంటి చోట, బంగారు లక్ష్మణ్ దురదృష్టం దుక్కలాగున్నట్లుంది. తెహల్కా కేసు విడిచిపెట్టటం లేదు.

సుబ్బలష్షిమి:
సిగ్గు చిమడటం అంటే ఇదేనేమో బావా!

ఇది బాహాబాహీ, ముష్టా ముష్టీ లాగా... శిఖా శిఖీ పోరాటమన్న మాట!

[ప్రధాని శుభ్రం చేసినా.... వేదికలు సిద్దం కావు. కామన్వెల్త్ క్రీడల నిర్వహణపై నరేంద్రమోడీ విమర్శ - నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామన్వెల్త్ క్రీడలు జరిగే ప్రాంగణాలని అత్యంత నాసిగా నిర్మించారనీ, ప్రధాని శుభ్రం చేసినా క్రీడల ప్రారంభం నాటికి వేదికలు సిద్దం కావనీ నరేంద్రమోడీ విమర్శించాడు. మరో ప్రక్క వందల కోట్లలో అవకతవకలు జరిగాయని వార్తలు! ఇంతకీ ప్రధాని వచ్చి ఊడ్చాలంటాడా ఏం? అయినా గానీ.... మరీ ప్రధానిని పట్టుకుని, అంత మాట అనేసాడేం బావా, నరేంద్ర మోడీ?

సుబ్బారావు:
మరేం చేస్తాడు మరదలా? చర్యకు ప్రతిచర్య ఇలాగే ఉంటుంది. అతడి కడుపుమంట అతడిది. తన కుడి ఎడమ భుజాల వంటి అనుచరుల్ని సీబీఐ ద్వారా వేధించారని అతడి దుగ్ధ! అసలుకే సీబీఐని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వం తమపైన కక్ష సాధింపులూ, కెరీర్ నాశనాలూ చేస్తొందని భాజపా వాళ్ళు పార్లమెంటులోనే గోల పెట్టారు కూడా!

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే ఇది బాహాబాహీ, ముష్టా ముష్టీ లాగా... శిఖా శిఖీ పోరాటమన్న మాట!

సుబ్బారావు:
అదేమిటి?

సుబ్బలష్షిమి:
అంటే ఏముంది బావా? జానపద గీతం ఉంటుంది చూడు!
"జుట్లు జుట్లు పట్టుకుని కొట్టుకున్నా మప్పో
తిట్టుకున్నా మప్పో!" అని. అలాగన్న మాట!