Sunday, March 13, 2011

ఇలా చేస్తే దెబ్బకి పదిహేను రోజుల్లో తెలంగాణ వచ్చితీరుతుంది!

[పదిలక్షల మందితో మొన్నటి మిలియన్ మార్చ్ నిర్వహించిన తెలంగాణా ఉద్యమనేతలు, రానున్న మేలో మరోసారి హైదరాబాద్ దిగ్భందానికి పూనుకుంటామని ప్రకటిస్తున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 30 రోజులుగా సహాయ నిరాహరణ చేస్తామన్న తెలంగాణా ఉద్యోగులు, ఒకటో తారీఖు జీతాల రోజు రాగానే, ఎంచక్కా దాన్ని చర్చల పేరుతో విరమించేసి, జీతాలు, (ఉద్యమ నాయకులు దండిగా డబ్బులు కూడా) పుచ్చుకుని ఇంటి కెళ్ళిపోయారు. వెరసి బందులూ, సహాయ నిరాకరణలూ వంటి వాటితో బ్రతుకు భారమైనది జనాలకే!

ఇటు చూస్తే..... మిలియన్ మార్చ్ అంటూ, అష్ట దిగ్భందం అంటూ ఇన్ని గొడవలు పెట్టి, వీళ్ళు ఉద్యమాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారో?

మరోప్రక్క..... ‘ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది, అందుకే విగ్రహాలు ధ్వంసం చెయ్యబడ్డాయి’ అని ప్రకటిస్తున్నారు. ఏమిటిదంతా! ఇలా చేస్తే తెలంగాణా వస్తుందా?

సుబ్బారావు:
ఇదంతా వృధా మరదలా! స్వాతంత్ర సమరం రోజుల్లో, సత్యాగ్రహులు ఒకరి వెనక మరొకరుగా..... వేలూ లక్షల మంది ఉద్యమించే సరికి, ఎందర్నని జైల్లో పెట్టగలదు నాటి బ్రిటీషు ప్రభుత్వమైనా? ఎంతగా రవి అస్తమించనిదైనా, నోరు మూసుకుని తలవొంచుకుంది.

అలాంటి చోట.... ఈ తెలంగాణా ఉద్యమ నేతలు కూడా..... ఎటూ ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్ళిందంటున్నారు కదా, పదో పాతికో లక్షల మందితో పాటు, అన్నిపార్టీల నేతలూ, అనుచరులూ..... జింఖానా గ్రౌండ్స్ దగ్గరి నుండి మైదానాలన్నిటిలో, ఆమరణ నిరాహార దీక్షలు చేపడితే సరి!

ప్రభుత్వం.... ఒక్క కేసీఆర్ నంటే, అసుపత్రికి తరలించి టీపీఎన్ లిచ్చింది గానీ, లక్షల మందికేం ఇచ్చి ఛస్తుంది!?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అలా చేస్తే, దెబ్బకి పదిహేను రోజుల్లో తెలంగాణా వచ్చి తీరుతుంది. మిలియన్ మార్చ్ లూ, చారిత్రక చవట తనాలూ అనవసరం.

Saturday, March 12, 2011

కన్నకొడుకులే తల్లిని ‘లం’ అని తిట్టటం అంటే ఇదేనేమో!

[టాంక్ బండ్ పై చారిత్రక మహనీయుల విగ్రహాల ధ్వంసం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ తెలంగాణా వాదులు నిజంగా తెలబాన్ లే సుమా! తాలిబాన్లు బుమియాన్ బుద్ద విగ్రహాల్ని ధ్వంసం చేస్తే, తెలబాన్లు ట్యాంకు బండ్ మీది మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసారు చూడు!

సుబ్బారావు:
నిజమే మరదలా! కొంతమంది అన్నదమ్ములు ఆస్తి కోసం, లేక మరేదైనా వివాదం ఏర్పడినప్పుడు, ఒకరినొకరు చాలా క్యాజువల్ గా, ఏమాత్రం ఆలోచించకుండా ‘లం..కొడకా!’ అని తిట్టుకుంటారు. ఆ రకంగా వాళ్ళు తమని తిట్టుకోవటం లేదు, తమ తల్లిని ‘లం’ అని తిడుతున్నారు.

అదెలాంటి హేయమైన చర్యో.... చారిత్రక ద్రోహాలు చేయటం, చరిత్ర సృష్టించిన మహనీయులని ‘చీదర’ పెట్టటం.... అలాంటి హేయమైన చర్యే!

అలాంటి మిలియన్ మార్చ్ ని విజయవంతమైందని ప్రకటించిన కోదండరాం లాంటి వాళ్ళు బోధనావృత్తిలో ఉండటం ఆ వృత్తికే అవమానం!

Wednesday, March 9, 2011

ఆస్తులమ్ముకున్నాడా? టిక్కెట్లన్నారే!

[పార్టీ కోసం ఆస్తులమ్ముకున్న చిరంజీవి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పార్టీ కోసం చిరంజీవి ఆస్తులమ్ముకున్నాట్ట, తెలుసా!

సుబ్బారావు:
అవునా! ఇంకా అందరూ అతడు టిక్కెట్లు అమ్ముకున్నాడన్నారే! బహుశః ఇంకా పార్టీని నడిపితే మరిన్ని ఆస్తులమ్ముకోవాల్సి వస్తుందనే, పరుగులెత్తి మరీ ప్రరాపాని, కాంగ్రెస్ లో కలిపేసినట్లున్నాడు మరదలా!

సుబ్బలష్షిమి:
పార్టీని, కార్యాలయాలని నడిపించటం పెద్ద తూమూలాగా కన్పించబట్టే, చిరంజీవి పార్టీ జెండా పీకేసాడనుకుంటా బావా! పార్టీ ప్రారంభ సమయంలో ఉన్న పరకాల ప్రభాకర్ లూ, మిత్రాలూ ఎప్పుడో ఇంటికెళ్ళి పోయారు. ముందంతా చక్రం తిప్పిన అల్లు అరవింద్ కూడా, విలీనం నేపధ్యంలో ఎక్కడా కనబడ లేదూ, వినబడలేదు.

ఏమైనా రాజకీయాల్లో చిరంజీవి హీరో అవుదామనుకొని వచ్చి, జోకర్ గా మిగిలిపోయాడు.

బాసిని మాట వినకపోతే..... కెరీర్ కీ, పైసలకీ గండి పడటం ఖాయం!

[మిలియన్ మార్చ్ మూడు గంటలే – ఐకాస ఛైర్మన్ కోదండరాం వెల్లడి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! దాదాపు రెండువారాల క్రితం..... మార్చి పదో తేదిన ‘హైదరాబాద్ ని దిగ్భంధం చేస్తామనీ, చీమని కూడా కదలనివ్వమనీ’ హుంకరించారు ఐకాస ఛైర్మన్ కోదండరాం, కేసీఆర్ లూ!

అప్పటికే ఖరారైన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ని వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి అల్టిమేటంలూ ఇచ్చారు. పరీక్షలున్నా గానీ.... విద్యార్ధుల భవిష్యత్తు ఏమైనా గానీ.... ఉద్యమం మా ఊపిరి, పది లక్షల మందితో కదం తొక్కిస్తాం అంటూ గర్జించారు.

మరి ఢిల్లీ బాసులకీ, తెరాస నేత కేసీఆర్ కీ మధ్య ఏ మంతనాలు నడిచాయో గానీ... ముందుగా కేసీఆర్, మిలియన్ మార్చ్ ని నీరు గార్చే ప్రయత్నం ప్రారంభించాడు.

మెల్లిగా క్రిందికి పాకిన అదే తీరు.... కోదండరాం నుండి ‘మూడు గంటల ప్రకటన’ దగ్గరికి చేరింది, చూసావా!

సుబ్బారావు:
కేసీఆర్ రిమోటు సోనియా చేతిలో ఉంది. కోదండరాం రిమోటు కేసీఆర్ చేతిలో ఉంది. అలాంటప్పుడు అక్కడి తీరు ఇక్కడ ప్రతిఫలించడం సహజమే కదా మరదలా!

లేకపోతే.... ‘చీమని కూడా కదల నివ్వం’ అనే రోజున తెలియదా పరీక్షలు వ్రాసే విద్యార్ధులకు ఇబ్బంది కలుగుతుందని?

సుబ్బలష్షిమి:
బహుశః దడదడ లాడించ గలం అనుకుని ఉంటారు బావా! పైనుండి క్రింది దాకా.... ఏ పరిస్థితి మారిందో, ప్రస్తుతం గడగడలాడుతున్నారు.

సుబ్బారావు:
ఏదేమైనా పరిస్థితులకీ కెరీర్ కీ, పైసలకీ సంబంధం ఉంటుంది మరదలా! బాసిని మాట వినకుండా... ఉద్యమం అంటూ ఉరికితే ‘కెరీర్ కీ, పైసలకీ గండి పడటం ఖాయం’ అన్న సూత్రం తెలియని వాడు కాదు కేసీఆర్!

ఖర్మ కాలడం అంటే ఇదే!

[ఇటీవల కాంగ్రెస్ లో విలీనం అయిన ప్రరాపా నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామచంద్రయ్య పోటీ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెదేపా నుండి ప్రరాపాలో చేరిన రామచంద్రయ్య, తన రాజ్యసభ సీటు కి రాజీనామా చేసి వచ్చి మరీ, ప్రరాపాలో చేరాడు. ప్రరాపా, కాంగ్రెస్ లో కలిసి పోయాక, ఇప్పుడు మండలికి పోటీ చేస్తున్నాడు. ఇతడి రాజకీయ కెరీర్ ఆరోహణ చెందిందా, అవరోహణ చెందిందా!?

సుబ్బారావు:
బహుశః అప్పట్లో ప్రరాపా... ‘అదిగదిగో నిశ్శబ్ద విప్లవం!’ ‘రేపోమాపో చిరంజీవి ముఖ్యమంత్రి కాబోతున్నాడు’ అంటే నిజమేననుకొని, మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసు కున్నట్లున్నాడు మరదలా!

సుబ్బలష్షిమి:
మొత్తానికి ఖర్మ కాలటం అంటే ఇదేనేమో బావా!

Tuesday, March 8, 2011

ఏ తీగని పట్టుకుని లాగినా, కదులుతున్న డొంకలన్నీ హైదరాబాద్ కే తేలుతున్నాయి!

[హవాలా వ్యాపారి, గుర్రాల దిగుమతి వ్యాపారీ హసన్ ఆలీ స్వస్థలం హైదరాబాదే – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! హవాలా వ్యాపారీ, ఇతరత్రా ఆక్రమ లావాదేవీలతో విదేశీ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల నల్లధనం దాచిపెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఆలీ స్వస్థలం హైదరాబాదేనట. మలక్ పేట రేస్ కోర్సులో పంటర్ గా జీవితం ప్రారంభించిన హసన్ అలీ, చాలా వ్యాపారాలే చేసాడట. ట్రావెల్ ఏజన్సీ వ్యాపారంలో నష్టం రావటంతో ‘పురాతన వస్తువుల ఎగుమతి’ వ్యాపారం మొదలెట్టి కోట్లకు పడగెత్తాడట.

ఆపైన మేలు జాతి గుర్రాల దిగుమతి వ్యాపారం, హవాలా వ్యాపారం గట్రాలతో మకాం పూణేకి మార్చి ముంబైని మరో అడ్డాగా మార్చుకున్నాడట. ఉగ్రవాదులకు ధన సహాయం చేయటంతో ఐబీ శాఖ ట్రాక్ చేసింది.

మొత్తానికి హవాలా వ్యాపారం కానివ్వు, ఉగ్రవాదం కానివ్వు, నకిలీ కరెన్సీ కానివ్వు... ఆర్ధిక నేరాల దగ్గరి నుండి అన్ని అక్రమాలకూ మూలాలు హైదరాబాద్ లోనే ఉంటాయేం బావా! ఎంత విచిత్రం ఇది?

సుబ్బారావు:
విచిత్రమేమీ లేదు మరదలా! హసన్ అలీలు, చంద్రస్వామిలు, తెల్గీలు అందరూ పైబొమ్మలే! అలాంటి ఏజంట్ల దగ్గరుండే సొమ్మంతా వంతెన క్రింద పారే నీరులాంటిది. వాళ్ళ మెయింటెనెన్స్ చూసి జనం కళ్ళు తేలేయాల్సిందే గానీ, ఆ ఇమేజి వెనక చూస్తే.... వాళ్ళు ఇంకెవరి సొమ్ముకో బినామీలుగా ఉంటారు.

ఇక పోతే.... ఉగ్రవాదంతో సహా అన్ని అక్రమాల మూలాలు హైదరాబాద్ లోనే ఉంటాయంటావా! అన్నిటినీ నడిపేది ఒకే వ్యవస్థ అయినప్పుడూ, అందులోని కీలక వ్యక్తుల స్థావరం హైదరాబాదే అయినప్పుడు, అది సహజమే కదా!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! కాబట్టే – ఇప్పుడు ఏ తీగని పట్టుకుని లాగినా, కదులుతున్న డొంకలన్నీ హైదరాబాద్ కే తేలుతున్నాయి.

మూడు సీట్ల కోసమో? మరింక దేని కోసమో?

[కాంగ్రెస్, డీఎంకే ల మధ్య ఎన్నికల సర్ధుబాటు విషయంలో కుదరని సయోధ్య – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో, సీట్ల సర్ధుబాటు గురించి.... కాంగ్రెస్, డీఎంకే ల మధ్య సయోధ్య బెడిసి కొట్టిందట. 63 సీట్లు అడుగుతోందట కాంగ్రెస్, డీఎంకే 60 సీట్లే ఇస్తానంటోందట. తొక్కలోది మూడు సీట్ల కోసం ఎడతెగని చర్చలు నడుస్తాయా బావా! కాంగ్రెస్ ట్రబుల్ షూటరూ, అధిష్టానపు రాజకీయ కార్యదర్శి వంటి దిగ్గజాలు దిగి రాయబారాలు నడుపుతున్నారు, తెలుసా!

సుబ్బారావు:
ముష్టి మూడు సీట్ల కోసం అంత రగడ నడవదు మరదలా! ఆ పైకారణంతో మరింక దేని గురించో రాయబారాలు నడుస్తుంటాయి. అందునా 2జీ స్పెక్ట్రం కేసులో, ఎంత గింజుకుని గిల్లార్చుకున్నా.... రాజా అరెస్టు గాక తప్పలేదు. ఇప్పుడు తీహార్ జైల్లో కూర్చుని ఊచలు లెక్క వేస్తున్నాడు.

మరోప్రక్క లాబీయిస్టు రాడియాతో, కరుణానిధి కూతురు కనిమొళి మాటా మంతీ గురించి సిబీఐ విచారణ బయటికొచ్చేట్లుంది. ఇప్పుడు కూతురి భవితవ్యం, తన భవితవ్యం ఏమిటో నని.... కరుణానిధి, కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ కుర్చీవ్యక్తికి పీక మీద కత్తి పెట్టాడు. ఏ కన్ను లేదా కాలు వదులుకోవాలో తేల్చుకోలేక సతమతం అవుతోంది కాంగ్రెస్!
అందుకే అంత సుదీర్ఘంగా నడుస్తున్నాయి మంతనాలు.

సుబ్బలష్షిమి:
అదా సంగతి! మొత్తానికి రాజకీయం రంజుగా నడుస్తున్నట్లుంది బావా!

Wednesday, March 2, 2011

అందుకే బంగారం ధర ఇంతగా మండి పోతున్నది!?

[నాల్కో సీఎండీ శ్రీవాస్తవ, అరెస్టు, సస్పెన్షన్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రభుత్వ రంగ జాతీయ అల్యూమినియం కంపెనీ (నాల్కో) సీఎండీ శ్రీవాస్తవ, పది కిలోల బంగారం, 29 లక్షల రూపాయల నగదు…. లంచంగా పుచ్చుకుంటూ పట్టుబడ్డాడట. అతడితో పాటు మరో అధికారి కూడా పట్టుబడ్డాడు. చిత్రమేమిటంటే – ఈ ఇద్దరు అధికారులకి కూడా, వారి భార్యలే లాబీయిస్టులుగా పనిచేసారట, తెలుసా బావా!

సుబ్బారావు:
నీరా రాడియాల పాటి తామూ చేయలేమా అనుకొని ఉంటారు మరదలా, ఛాందినీ శ్రీవాస్తవలు! మనం చాలా చోట్ల ప్రభుత్వ అధికారుల అటెండర్లు “ఆఫీసర్ గారి ఇంటికెళ్ళి, అమ్మగారిని కలవండి. మీ పని అయిపోతుంది” అని కార్యార్ధులకి సలహాలివ్వటం చూస్తూనే ఉంటాం కదా!

సుబ్బలష్షిమి:
గమ్మత్తేమిటంటే – తన భర్త తప్పేం లేదనీ, ఆయన అమాయకుడనీ..... పాపం చాందినీ కోర్టుహాల్లో కన్నీళ్ళు పెట్టుకుందట. అతడూ తను అమాయకుణ్ణి అన్నాడట, తెలుసా!

సుబ్బారావు:
తాటి చెట్టు మీద పట్టుబడిన ప్రతివాడూ, దూడగడ్డి కోసమే ఎక్కానంటాడు మరదలా! వినేవాడుంటే చేతిలోని కల్లుముంతని కూడా, దూడగడ్డిగా బుకాయించనూ గలరు.

సుబ్బలష్షిమి:
అయినా ఎకాఎకీ కోట్లలో లంచం తీసుకున్నారంటే..... ఎన్ని కోట్ల అక్రమాలకు పాల్పడి ఉండాలి బావా!? అధికారుల లెవెల్ 10 కిలోల బంగారాలైతే, మంత్రులూ, ఎంపీలూ ఎంఎల్ ఏ ల లెవెల్ ఎంతుండాలి? ఇక అధిష్టానాల లెవెల్ కి ఎంత బంగారం ఉండాలి?

సుబ్బారావు:
బహుశః అందుకే బంగారం ధర ఇంతగా మండి పోతున్నది మరదలా!