Saturday, July 2, 2011

త్యాగాలు ప్రజలకి, భోగాలు తమకీ!

[నేను రాజీనామా చేయను – వీహెచ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ప్రత్యేక తెలంగాణా కోసం రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల నిర్ణయాన్ని ఆ పార్టీ నేత వీహెచ్ సమర్ధించాడట. అయినా గానీ, తాను ప్రత్యక్ష ఎన్నికలో గెలిచిన వాడు కాదు గనుకా, తనది రాజ్యసభ సీటు గనుకా, తాను మాత్రం రాజీనామా చేయడట.

తప్పించుకునేందుకు ఏం డొంక తిరుగుడు వాదన బావా? నిజంగా చిత్తశుద్దే ఉంటే, ఏ సీటు అయితేనేం?

సుబ్బారావు:
ఆహా! భలే చెప్పావులే మరదలా! ఇతడి లాంటి నాయకుల దృష్టిలో ‘త్యాగాలు కార్యకర్తలూ, ప్రజలూ చేయాలి. అంతే తప్ప. తాము కాదు’! త్యాగాలు ప్రజలకి, భోగాలు తమకీ మరి!

అసలిలాంటి వాళ్ళని నాయకులుగా కొనసాగనిస్తే అది తెలంగాణా ఉద్యమం కాదు, మరే ఉద్యమమైనా దుంపనాశనం కావటం ఖాయం!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఇలాంటి వాళ్ళని నాయకులనుకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదాలను కోవటమే!

Sunday, March 13, 2011

ఇలా చేస్తే దెబ్బకి పదిహేను రోజుల్లో తెలంగాణ వచ్చితీరుతుంది!

[పదిలక్షల మందితో మొన్నటి మిలియన్ మార్చ్ నిర్వహించిన తెలంగాణా ఉద్యమనేతలు, రానున్న మేలో మరోసారి హైదరాబాద్ దిగ్భందానికి పూనుకుంటామని ప్రకటిస్తున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 30 రోజులుగా సహాయ నిరాహరణ చేస్తామన్న తెలంగాణా ఉద్యోగులు, ఒకటో తారీఖు జీతాల రోజు రాగానే, ఎంచక్కా దాన్ని చర్చల పేరుతో విరమించేసి, జీతాలు, (ఉద్యమ నాయకులు దండిగా డబ్బులు కూడా) పుచ్చుకుని ఇంటి కెళ్ళిపోయారు. వెరసి బందులూ, సహాయ నిరాకరణలూ వంటి వాటితో బ్రతుకు భారమైనది జనాలకే!

ఇటు చూస్తే..... మిలియన్ మార్చ్ అంటూ, అష్ట దిగ్భందం అంటూ ఇన్ని గొడవలు పెట్టి, వీళ్ళు ఉద్యమాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నారో?

మరోప్రక్క..... ‘ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్ళిపోయింది, అందుకే విగ్రహాలు ధ్వంసం చెయ్యబడ్డాయి’ అని ప్రకటిస్తున్నారు. ఏమిటిదంతా! ఇలా చేస్తే తెలంగాణా వస్తుందా?

సుబ్బారావు:
ఇదంతా వృధా మరదలా! స్వాతంత్ర సమరం రోజుల్లో, సత్యాగ్రహులు ఒకరి వెనక మరొకరుగా..... వేలూ లక్షల మంది ఉద్యమించే సరికి, ఎందర్నని జైల్లో పెట్టగలదు నాటి బ్రిటీషు ప్రభుత్వమైనా? ఎంతగా రవి అస్తమించనిదైనా, నోరు మూసుకుని తలవొంచుకుంది.

అలాంటి చోట.... ఈ తెలంగాణా ఉద్యమ నేతలు కూడా..... ఎటూ ఉద్యమం ప్రజల చేతుల్లోకి వెళ్ళిందంటున్నారు కదా, పదో పాతికో లక్షల మందితో పాటు, అన్నిపార్టీల నేతలూ, అనుచరులూ..... జింఖానా గ్రౌండ్స్ దగ్గరి నుండి మైదానాలన్నిటిలో, ఆమరణ నిరాహార దీక్షలు చేపడితే సరి!

ప్రభుత్వం.... ఒక్క కేసీఆర్ నంటే, అసుపత్రికి తరలించి టీపీఎన్ లిచ్చింది గానీ, లక్షల మందికేం ఇచ్చి ఛస్తుంది!?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అలా చేస్తే, దెబ్బకి పదిహేను రోజుల్లో తెలంగాణా వచ్చి తీరుతుంది. మిలియన్ మార్చ్ లూ, చారిత్రక చవట తనాలూ అనవసరం.

Saturday, March 12, 2011

కన్నకొడుకులే తల్లిని ‘లం’ అని తిట్టటం అంటే ఇదేనేమో!

[టాంక్ బండ్ పై చారిత్రక మహనీయుల విగ్రహాల ధ్వంసం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ తెలంగాణా వాదులు నిజంగా తెలబాన్ లే సుమా! తాలిబాన్లు బుమియాన్ బుద్ద విగ్రహాల్ని ధ్వంసం చేస్తే, తెలబాన్లు ట్యాంకు బండ్ మీది మహనీయుల విగ్రహాలు ధ్వంసం చేసారు చూడు!

సుబ్బారావు:
నిజమే మరదలా! కొంతమంది అన్నదమ్ములు ఆస్తి కోసం, లేక మరేదైనా వివాదం ఏర్పడినప్పుడు, ఒకరినొకరు చాలా క్యాజువల్ గా, ఏమాత్రం ఆలోచించకుండా ‘లం..కొడకా!’ అని తిట్టుకుంటారు. ఆ రకంగా వాళ్ళు తమని తిట్టుకోవటం లేదు, తమ తల్లిని ‘లం’ అని తిడుతున్నారు.

అదెలాంటి హేయమైన చర్యో.... చారిత్రక ద్రోహాలు చేయటం, చరిత్ర సృష్టించిన మహనీయులని ‘చీదర’ పెట్టటం.... అలాంటి హేయమైన చర్యే!

అలాంటి మిలియన్ మార్చ్ ని విజయవంతమైందని ప్రకటించిన కోదండరాం లాంటి వాళ్ళు బోధనావృత్తిలో ఉండటం ఆ వృత్తికే అవమానం!

Wednesday, March 9, 2011

ఆస్తులమ్ముకున్నాడా? టిక్కెట్లన్నారే!

[పార్టీ కోసం ఆస్తులమ్ముకున్న చిరంజీవి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పార్టీ కోసం చిరంజీవి ఆస్తులమ్ముకున్నాట్ట, తెలుసా!

సుబ్బారావు:
అవునా! ఇంకా అందరూ అతడు టిక్కెట్లు అమ్ముకున్నాడన్నారే! బహుశః ఇంకా పార్టీని నడిపితే మరిన్ని ఆస్తులమ్ముకోవాల్సి వస్తుందనే, పరుగులెత్తి మరీ ప్రరాపాని, కాంగ్రెస్ లో కలిపేసినట్లున్నాడు మరదలా!

సుబ్బలష్షిమి:
పార్టీని, కార్యాలయాలని నడిపించటం పెద్ద తూమూలాగా కన్పించబట్టే, చిరంజీవి పార్టీ జెండా పీకేసాడనుకుంటా బావా! పార్టీ ప్రారంభ సమయంలో ఉన్న పరకాల ప్రభాకర్ లూ, మిత్రాలూ ఎప్పుడో ఇంటికెళ్ళి పోయారు. ముందంతా చక్రం తిప్పిన అల్లు అరవింద్ కూడా, విలీనం నేపధ్యంలో ఎక్కడా కనబడ లేదూ, వినబడలేదు.

ఏమైనా రాజకీయాల్లో చిరంజీవి హీరో అవుదామనుకొని వచ్చి, జోకర్ గా మిగిలిపోయాడు.

బాసిని మాట వినకపోతే..... కెరీర్ కీ, పైసలకీ గండి పడటం ఖాయం!

[మిలియన్ మార్చ్ మూడు గంటలే – ఐకాస ఛైర్మన్ కోదండరాం వెల్లడి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! దాదాపు రెండువారాల క్రితం..... మార్చి పదో తేదిన ‘హైదరాబాద్ ని దిగ్భంధం చేస్తామనీ, చీమని కూడా కదలనివ్వమనీ’ హుంకరించారు ఐకాస ఛైర్మన్ కోదండరాం, కేసీఆర్ లూ!

అప్పటికే ఖరారైన ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ని వాయిదా వేసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి అల్టిమేటంలూ ఇచ్చారు. పరీక్షలున్నా గానీ.... విద్యార్ధుల భవిష్యత్తు ఏమైనా గానీ.... ఉద్యమం మా ఊపిరి, పది లక్షల మందితో కదం తొక్కిస్తాం అంటూ గర్జించారు.

మరి ఢిల్లీ బాసులకీ, తెరాస నేత కేసీఆర్ కీ మధ్య ఏ మంతనాలు నడిచాయో గానీ... ముందుగా కేసీఆర్, మిలియన్ మార్చ్ ని నీరు గార్చే ప్రయత్నం ప్రారంభించాడు.

మెల్లిగా క్రిందికి పాకిన అదే తీరు.... కోదండరాం నుండి ‘మూడు గంటల ప్రకటన’ దగ్గరికి చేరింది, చూసావా!

సుబ్బారావు:
కేసీఆర్ రిమోటు సోనియా చేతిలో ఉంది. కోదండరాం రిమోటు కేసీఆర్ చేతిలో ఉంది. అలాంటప్పుడు అక్కడి తీరు ఇక్కడ ప్రతిఫలించడం సహజమే కదా మరదలా!

లేకపోతే.... ‘చీమని కూడా కదల నివ్వం’ అనే రోజున తెలియదా పరీక్షలు వ్రాసే విద్యార్ధులకు ఇబ్బంది కలుగుతుందని?

సుబ్బలష్షిమి:
బహుశః దడదడ లాడించ గలం అనుకుని ఉంటారు బావా! పైనుండి క్రింది దాకా.... ఏ పరిస్థితి మారిందో, ప్రస్తుతం గడగడలాడుతున్నారు.

సుబ్బారావు:
ఏదేమైనా పరిస్థితులకీ కెరీర్ కీ, పైసలకీ సంబంధం ఉంటుంది మరదలా! బాసిని మాట వినకుండా... ఉద్యమం అంటూ ఉరికితే ‘కెరీర్ కీ, పైసలకీ గండి పడటం ఖాయం’ అన్న సూత్రం తెలియని వాడు కాదు కేసీఆర్!

ఖర్మ కాలడం అంటే ఇదే!

[ఇటీవల కాంగ్రెస్ లో విలీనం అయిన ప్రరాపా నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామచంద్రయ్య పోటీ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెదేపా నుండి ప్రరాపాలో చేరిన రామచంద్రయ్య, తన రాజ్యసభ సీటు కి రాజీనామా చేసి వచ్చి మరీ, ప్రరాపాలో చేరాడు. ప్రరాపా, కాంగ్రెస్ లో కలిసి పోయాక, ఇప్పుడు మండలికి పోటీ చేస్తున్నాడు. ఇతడి రాజకీయ కెరీర్ ఆరోహణ చెందిందా, అవరోహణ చెందిందా!?

సుబ్బారావు:
బహుశః అప్పట్లో ప్రరాపా... ‘అదిగదిగో నిశ్శబ్ద విప్లవం!’ ‘రేపోమాపో చిరంజీవి ముఖ్యమంత్రి కాబోతున్నాడు’ అంటే నిజమేననుకొని, మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసు కున్నట్లున్నాడు మరదలా!

సుబ్బలష్షిమి:
మొత్తానికి ఖర్మ కాలటం అంటే ఇదేనేమో బావా!

Tuesday, March 8, 2011

ఏ తీగని పట్టుకుని లాగినా, కదులుతున్న డొంకలన్నీ హైదరాబాద్ కే తేలుతున్నాయి!

[హవాలా వ్యాపారి, గుర్రాల దిగుమతి వ్యాపారీ హసన్ ఆలీ స్వస్థలం హైదరాబాదే – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! హవాలా వ్యాపారీ, ఇతరత్రా ఆక్రమ లావాదేవీలతో విదేశీ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల నల్లధనం దాచిపెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన ఆలీ స్వస్థలం హైదరాబాదేనట. మలక్ పేట రేస్ కోర్సులో పంటర్ గా జీవితం ప్రారంభించిన హసన్ అలీ, చాలా వ్యాపారాలే చేసాడట. ట్రావెల్ ఏజన్సీ వ్యాపారంలో నష్టం రావటంతో ‘పురాతన వస్తువుల ఎగుమతి’ వ్యాపారం మొదలెట్టి కోట్లకు పడగెత్తాడట.

ఆపైన మేలు జాతి గుర్రాల దిగుమతి వ్యాపారం, హవాలా వ్యాపారం గట్రాలతో మకాం పూణేకి మార్చి ముంబైని మరో అడ్డాగా మార్చుకున్నాడట. ఉగ్రవాదులకు ధన సహాయం చేయటంతో ఐబీ శాఖ ట్రాక్ చేసింది.

మొత్తానికి హవాలా వ్యాపారం కానివ్వు, ఉగ్రవాదం కానివ్వు, నకిలీ కరెన్సీ కానివ్వు... ఆర్ధిక నేరాల దగ్గరి నుండి అన్ని అక్రమాలకూ మూలాలు హైదరాబాద్ లోనే ఉంటాయేం బావా! ఎంత విచిత్రం ఇది?

సుబ్బారావు:
విచిత్రమేమీ లేదు మరదలా! హసన్ అలీలు, చంద్రస్వామిలు, తెల్గీలు అందరూ పైబొమ్మలే! అలాంటి ఏజంట్ల దగ్గరుండే సొమ్మంతా వంతెన క్రింద పారే నీరులాంటిది. వాళ్ళ మెయింటెనెన్స్ చూసి జనం కళ్ళు తేలేయాల్సిందే గానీ, ఆ ఇమేజి వెనక చూస్తే.... వాళ్ళు ఇంకెవరి సొమ్ముకో బినామీలుగా ఉంటారు.

ఇక పోతే.... ఉగ్రవాదంతో సహా అన్ని అక్రమాల మూలాలు హైదరాబాద్ లోనే ఉంటాయంటావా! అన్నిటినీ నడిపేది ఒకే వ్యవస్థ అయినప్పుడూ, అందులోని కీలక వ్యక్తుల స్థావరం హైదరాబాదే అయినప్పుడు, అది సహజమే కదా!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! కాబట్టే – ఇప్పుడు ఏ తీగని పట్టుకుని లాగినా, కదులుతున్న డొంకలన్నీ హైదరాబాద్ కే తేలుతున్నాయి.

మూడు సీట్ల కోసమో? మరింక దేని కోసమో?

[కాంగ్రెస్, డీఎంకే ల మధ్య ఎన్నికల సర్ధుబాటు విషయంలో కుదరని సయోధ్య – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో, సీట్ల సర్ధుబాటు గురించి.... కాంగ్రెస్, డీఎంకే ల మధ్య సయోధ్య బెడిసి కొట్టిందట. 63 సీట్లు అడుగుతోందట కాంగ్రెస్, డీఎంకే 60 సీట్లే ఇస్తానంటోందట. తొక్కలోది మూడు సీట్ల కోసం ఎడతెగని చర్చలు నడుస్తాయా బావా! కాంగ్రెస్ ట్రబుల్ షూటరూ, అధిష్టానపు రాజకీయ కార్యదర్శి వంటి దిగ్గజాలు దిగి రాయబారాలు నడుపుతున్నారు, తెలుసా!

సుబ్బారావు:
ముష్టి మూడు సీట్ల కోసం అంత రగడ నడవదు మరదలా! ఆ పైకారణంతో మరింక దేని గురించో రాయబారాలు నడుస్తుంటాయి. అందునా 2జీ స్పెక్ట్రం కేసులో, ఎంత గింజుకుని గిల్లార్చుకున్నా.... రాజా అరెస్టు గాక తప్పలేదు. ఇప్పుడు తీహార్ జైల్లో కూర్చుని ఊచలు లెక్క వేస్తున్నాడు.

మరోప్రక్క లాబీయిస్టు రాడియాతో, కరుణానిధి కూతురు కనిమొళి మాటా మంతీ గురించి సిబీఐ విచారణ బయటికొచ్చేట్లుంది. ఇప్పుడు కూతురి భవితవ్యం, తన భవితవ్యం ఏమిటో నని.... కరుణానిధి, కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ కుర్చీవ్యక్తికి పీక మీద కత్తి పెట్టాడు. ఏ కన్ను లేదా కాలు వదులుకోవాలో తేల్చుకోలేక సతమతం అవుతోంది కాంగ్రెస్!
అందుకే అంత సుదీర్ఘంగా నడుస్తున్నాయి మంతనాలు.

సుబ్బలష్షిమి:
అదా సంగతి! మొత్తానికి రాజకీయం రంజుగా నడుస్తున్నట్లుంది బావా!

Wednesday, March 2, 2011

అందుకే బంగారం ధర ఇంతగా మండి పోతున్నది!?

[నాల్కో సీఎండీ శ్రీవాస్తవ, అరెస్టు, సస్పెన్షన్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రభుత్వ రంగ జాతీయ అల్యూమినియం కంపెనీ (నాల్కో) సీఎండీ శ్రీవాస్తవ, పది కిలోల బంగారం, 29 లక్షల రూపాయల నగదు…. లంచంగా పుచ్చుకుంటూ పట్టుబడ్డాడట. అతడితో పాటు మరో అధికారి కూడా పట్టుబడ్డాడు. చిత్రమేమిటంటే – ఈ ఇద్దరు అధికారులకి కూడా, వారి భార్యలే లాబీయిస్టులుగా పనిచేసారట, తెలుసా బావా!

సుబ్బారావు:
నీరా రాడియాల పాటి తామూ చేయలేమా అనుకొని ఉంటారు మరదలా, ఛాందినీ శ్రీవాస్తవలు! మనం చాలా చోట్ల ప్రభుత్వ అధికారుల అటెండర్లు “ఆఫీసర్ గారి ఇంటికెళ్ళి, అమ్మగారిని కలవండి. మీ పని అయిపోతుంది” అని కార్యార్ధులకి సలహాలివ్వటం చూస్తూనే ఉంటాం కదా!

సుబ్బలష్షిమి:
గమ్మత్తేమిటంటే – తన భర్త తప్పేం లేదనీ, ఆయన అమాయకుడనీ..... పాపం చాందినీ కోర్టుహాల్లో కన్నీళ్ళు పెట్టుకుందట. అతడూ తను అమాయకుణ్ణి అన్నాడట, తెలుసా!

సుబ్బారావు:
తాటి చెట్టు మీద పట్టుబడిన ప్రతివాడూ, దూడగడ్డి కోసమే ఎక్కానంటాడు మరదలా! వినేవాడుంటే చేతిలోని కల్లుముంతని కూడా, దూడగడ్డిగా బుకాయించనూ గలరు.

సుబ్బలష్షిమి:
అయినా ఎకాఎకీ కోట్లలో లంచం తీసుకున్నారంటే..... ఎన్ని కోట్ల అక్రమాలకు పాల్పడి ఉండాలి బావా!? అధికారుల లెవెల్ 10 కిలోల బంగారాలైతే, మంత్రులూ, ఎంపీలూ ఎంఎల్ ఏ ల లెవెల్ ఎంతుండాలి? ఇక అధిష్టానాల లెవెల్ కి ఎంత బంగారం ఉండాలి?

సుబ్బారావు:
బహుశః అందుకే బంగారం ధర ఇంతగా మండి పోతున్నది మరదలా!

Friday, February 11, 2011

మఖలో పుట్టి పుబ్బలో మరణించాక కూడా గోల దేనికి?

[కాంగ్రెస్ లో ప్రరాపా విలీన ప్రక్రియకి 45 రోజులు పడుతుంది. ఆ తర్వాత భారీగా విలీన సభ నిర్వహిస్తామని, చిరంజీవి చేసిన ప్రకటన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మఖలో పుట్టి, పుబ్బలో మరణించిన ప్రజారాజ్యం పార్టీ… కాంగ్రెస్ లో విలీనమయ్యింది కదా! ‘ఇక నుండీ చిరంజీవి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడంటూ’ వీరప్ప మొయిలీ ప్రకటించేసాడు కూడా! కాంగ్రెస్ అధినేత్రితో భేటీ అయిన గంట వ్యవధిలో, పార్టీని గుంటలో పెట్టి గంట వాయించేసాడు గదా చిరంజీవి!?

మరి ఇప్పుడదేదో ‘సుదీర్ఘ ప్రక్రియ’ అన్నట్లు నానా రచ్చ చేస్తూ… విలీన ప్రక్రియకి 45 రోజులు, తర్వాత విలీన సభ భారీగా నిర్వహిస్తాం, గట్రా ప్రకటనలిస్తున్నాడేమిటి?

సుబ్బారావు:
పార్టీ చచ్చిపోయింది గదా మరదలా! ఏదో రచ్చ చేస్తూ వార్తల్లో ఉండకపోతే, తమ మనుగడ చచ్చిపోతుందని హైరానా పడుతున్నాడు.

లేకపోతే అదేమైనా అమెరికా వైట్ హౌస్ లో అధికార మార్పిడా, రెండు నెలలు పట్టడానికి?

సుబ్బలష్షిమి:
అదే గదా మరి! అదేదో మహానది, సాగర సంగమం అన్నట్లు? తెగ గోల చేస్తున్నారు.

సుబ్బారావు:
భలే చెప్పావు మరదలా! ప్రరాపాల్లాంటి పార్టీలు మహానదులు కాదు, మూసీనదులు. కాంగ్రెస్ అవినీతి కాలుష్య కాసారం మరి! వాటిని తక్కువ చేసి మాట్లాడకు!

Wednesday, February 9, 2011

వీటిని సొల్లు రాజకీయాలు అనవచ్చన్న మాట!

[గుంటూరు జిల్లా చిలకలూరి పేట బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబు, కాంగ్రెస్, వై.ఎస్.జగన్, సోనియా, చిరంజీవి, ప్రధాన మంత్రి లపై విమర్శలు చేసిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… కాంగ్రెస్ నీ, అందులో విలీనమైన చిరంజీవినీ విమర్శిస్తూ… ‘ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు’ పెట్టారని విమర్శించాడు, బాగానే ఉంది.

అయితే అదే సందర్భంలో…

>>>రూ. 8 లక్షల పెట్టుబడి పెట్టి రూ.1200 కోట్లతో సాక్షి పత్రికను నడుపుతున్నారు. ఇండియా సిమెంట్ షేర్ రూ.100 ఉంటే, వీళ్ళ షేర్ మాత్రం రూ.1450 పలుకుతోంది. వీటిపై ప్రధాని ప్రేక్షక పాత్ర వహించటం దురదృష్టకరం.

అన్నాడు చూశావా?

జగన్ కంపెనీ షేర్ల ధరేం ఖర్మ, చంద్రబాబు కి గాడ్ ఫాదరూ, కింగ్ మేకరూ, మార్గదర్శీ అయిన రామోజీరావు షేరు కూడా… కంఫానీ నిధుల పుణ్యమాని, ఒక్కొటి 5 లక్షల పైచిలుకు పలికింది కదా! అప్పుడూ ప్రధాని ప్రేక్షక పాత్రే వహించాడు కదా! ఆ విషయం మాట్లాడడేం ఇతడు? ఇలాంటి అవినీతిపరులకు, అన్ని అవకాశాలు కల్పిస్తున్న రాజ్యాంగంలోని లొసుగుల గురించీ మాట్లాడడు.

సుబ్బారావు:
అబ్బా! ఎక్కడైనా బావా గానీ, వంగతోట దగ్గర మాత్రం కాదన్నాడట! అదే ఇతడి తీరు కూడా! రామోజీరావు కంపానీ కంపుల వంటివి మాట్లాడితే, తన లెక్కల తొక్కలూ బయటికి వస్తాయి మరి! అందుకే…ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చుకుంటూ, ఉనికి కాపాడుకుంటూ, బ్రతకాలని ప్రయత్నిస్తున్నాడు. అంతే!

సుబ్బలష్షిమి:
అయితే వీటిని సొల్లు రాజకీయాలు అనవచ్చన్న మాట! ఆ కోవకే చెందుతాయి, అవినీతి గురించి మాట్లాడుతున్న సోనియా సుపుత్రుడు రాహుల్ రాజకీయాలు కూడా!

Friday, February 4, 2011

మాటలకీ చేతలకీ పొంతన ఎంత? రోల్స్ రాయల్స్ కారంత!

[ప్రరాపా అధినేత చిరంజీవి ఇటీవల 5 కోట్ల రూపాయల విలువ చేసే రోల్స్ రాయిల్స్ కారు కొన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, ఇటీవల 5కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిల్స్ కారుని కొన్నాడు. సిరిసంపదల ప్రదర్శన పట్ల ఎంత మోజు ఈ ప్రజా నాయకుడికి? ఇంకా ఇతడు ప్రజల కష్టాలూ కన్నీళ్ళ గురించి ఉపన్యాసాలిస్తాడు. రిక్షాలోంచి సరుకులు, రెండు చేతుల్లో మోసుకొచ్చిన తనకి, కష్టాలెలా ఉంటాయో తెలుసని స్వయం కితాబులిచ్చుకుంటాడు.

సుబ్బారావు:
అతడు సినిమా నటుడిగా ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్నా, సంపాదించుకున్న దాంతో ఎన్ని విలాసాలు పోయినా, సౌఖ్యాలనుభవించినా… ఎవరూ పట్టించుకోరు మరదలా! అప్పుడది అతని వ్యక్తిగత వ్యవహారం అనుకునే వాళ్ళు. రాజకీయాల్లోకి వచ్చాక, అతడి మాటలకీ చేతలకీ… పొంతన పరిశీలిస్తారు కదా!

ఏం చేస్తాం? విలాస పురుషులు ప్రజానాయకులై పోయారు. ఈ విలాసాల పట్ల మోజులున్న వాళ్ళకి, అవి పోతాయంటే ఎంతటి రాజీ అయినా పడతారు మరదలా!

సుబ్బలష్షిమి:
అదే కదా, ఇప్పుడు చిరంజీవి నిరూపించుకుంటున్నది? ప్రజల సహన పరిమితి, గుడ్డి అభిమానపు పరిధీ…ఎంత మేరకు ఉన్నాయో వేచి చూడాల్సిందే బావా!?

Thursday, February 3, 2011

తాను పెట్టిన కళ్ళద్దాలలోంచే, ప్రజలు ప్రపంచాన్ని చూడాలన్నది మీడియా ఆకాంక్ష!

[ఇద్దరూ తమిళ తంబిలే! ఒకరు చోరుడు (రాజా), మరొకరు యోధుడు (సుబ్రమణ్య స్వామి) – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే పెద్దదైన 2జీ స్ప్రెక్ట్రం అవినీతి వ్యవహారానికి కారకుడైన రాజా చోరుడని (ఈనాడు) మీడియా ఉటంకించింది. అది పచ్చి నిజం! పోతే… దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, తీవ్రంగా పోరాడిన సుబ్రమణ్య స్వామిని యోధుడని కితాబులిచ్చింది, చూసావా?

సుబ్బారావు:
అవును, మరదలా! ఒకప్పుడూ… ఈ సుబ్రమణ్య స్వామి, ఏదోక వ్యవహారాన్ని బయటకి తీసేవాడు. అయితే, అప్పట్లో మీడియా, ప్రత్యేకించి ఈనాడు, ఇతడికి `అంతర్జాతీయ విదూషకుడ’ని కితాబులిచ్చింది. ఇప్పుడు అవసరాలు మారాయో లేక పరిస్థితులు ముంచుకొచ్చాయో గానీ, యోధుడంటోంది.

సుబ్బలష్షిమి:
బహుశః పరిస్థితులే పీకల మీదికి వచ్చి ఉంటాయి బావా! లేకపోతే మీడియా… తాను గోల చేయదలుచుకున్న వ్యవహారాలనే బయటకి తెస్తుంది తప్ప,తమ వారికి తలనొప్పి తెచ్చే వ్యవహారాలని, తాను వెలికీ తీయదూ, వేరెవరైనా వెలికి తీసినా… వాళ్ళని విదూషకులనో, మానసిక రోగులనో ప్రచారిస్తుంది. ఎన్ని సార్లు ఇలాంటివి చూడలేదు?

సుబ్బారావు:
అంతే మరదలా! తాను పెట్టిన కళ్ళద్దాలలోంచే, ప్రజలు ప్రపంచాన్ని చూడాలన్నది మీడియా ఆకాంక్ష!

పోపయితే పసరు కక్కిస్తాడు. బాబా అయితే విభూతి, తాయెత్తులు ఇస్తాడు!

[నా మీద చేతబడి చేసారు – యడ్యూరప్ప వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప… పదవిలోకి వచ్చినప్పటి నుండీ తనకి కష్టాలే ఎదురౌతున్నాయనీ, తనని చంపేందుకు చేతబడి చేస్తున్నారని ఆరోపించాడు. దానికి విరుగుడుగా తాంత్రికుల సలహా మేరకు నగ్నంగా నిద్రలూ, నగ్నంగా సూర్యనమస్కారాలూ’ గట్రాలు చేస్తున్నారని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి తెలుసా?

సుబ్బారావు:
ఇంకేం? నేరుగా అటు వాటికన్ కో, ఇటు పుట్టపర్తికో వెళ్తే సరి! పోపయితే పసరు కక్కిస్తాడు. బాబా అయితే విభూతి, తాయెత్తులు ఇస్తాడు,

సుబ్బలష్షిమి:
అది కాదు బావా! ఇవేవీ పత్రికల దృష్టిలో ‘మతి స్థిమితం తప్పటం’ గాదు, ‘స్ల్పిట్ పర్సనాలిటిలూ, స్క్రిజోఫినియాలూ, xyz డిజార్డర్ లూ, ABCD సిండ్రోములూ’ కావు. ఎవరైనా నిజాలు చెబితే మాత్రం… వాళ్ళని, మానసిక రోగులనేయటానికి సదా సిద్దంగా ఉంటారు.

సుబ్బారావు:
అంతే మరి! నిజాలు బయటికొస్తే తమకీ, తమ వాళ్ళకీ ఎంత ప్రమాదం!?

Wednesday, February 2, 2011

ఏ పుట్టలో ఏ పాముందో!

[ఈజిప్టులో హోస్నీ ముబారక్ కు వ్యతిరేకంగా ప్రజానిరసనల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈజిప్టులో 30 ఏళ్ళుగా అధికారం చెలాయిస్తున్న నియంత హోస్నీ ముబారక్ కి వ్యతిరేకంగా జనం తిరగబడ్డారు. నిన్న ‘అతడు సీటు దిగి పోవాలంటూ’ కైరో లోని లిబరేషన్ స్క్వేర్ వద్ద జరిగిన నిరసన సభ ఫోటో ఈనాడు లో వచ్చింది, చూడు,


ఈ ఫోటోలో నీకు వేలాది మంది ప్రజలు కనిపిస్తున్నారా బావా? ‘ఈనాడు’ యాజమాన్యానికి కనిపిస్తున్నారు. చంద్రబాబు, చిరంజీవి, కేసీఆర్ సభలకి వచ్చిన జనం వేలల్లో ఉంటే – ‘ఈనాడు’ లక్ష అంటుంది, లక్ష ఉంటే పది లక్షలంటుంది. తనకి నచ్చని నాయకుల సభలకి జనం వచ్చినా… పల్చగా ఉన్న వైపు నుండి ఫోటో తీసి ‘ఇదిగిదిగో సభ బోసి పోయింది’ అంటుంది.
‘సరే! ఈ స్థానిక పత్రిక తనకి నచ్చిన వాళ్ళ గురించి… నచ్చినట్లు, నచ్చని వాళ్ళ గురించి… నచ్చనట్లు ప్రచారిస్తుంది’ అనుకుని ఊరుకుంటున్నారు జనం. అవునా, కాదా చెప్పు!

సుబ్బారావు:
అవును, అయితే!

సుబ్బలష్షిమి:
మరీ…మన దేశంలో జాతీయ స్థాయి కూడా కాదు, ప్రాంతీయ స్థాయి పత్రిక ‘ఈనాడు’కి… ప్రపంచంలో ఎక్కడో ఈజిప్టులో జనం…ఎవరో ఓ నియంత హోస్నీ ముబారక్ మీద తిరగబడితే…అంత నొప్పేమిటి బావా! ‘లక్షల మంది’ని ‘వేలాది జనం’ అనేంత నొప్పి?

సుబ్బారావు:
అదే గమ్మత్తు మరదలా! ఈ మారుమూల పచ్చళ్ళ వ్యాపారీ, స్థానిక పత్రికాధిపతీ అయిన రామోజీరావుకి… ‘అంతర్జాతీయ సంఘటనలలో కొన్నిటికి గుఁయ్ మనేంత, కొన్నింటికీ హోరుమనేంత’ సంబంధాలుంటాయి. ఆ లింకేమిటో!?

సుబ్బలష్షిమి:
నిజంగా గమ్మత్తే బావా! అందుకే పెద్దలు ‘ఏ పుట్టలో ఏ పాముందో!’ అంటారు కాబోలు! బయటి కొచ్చినప్పుడు గానీ తెలియదు లోగుట్టేమిటో!?

దొంగే... ‘ఎదుటి వాళ్ళని దొంగా దొంగా పట్టుకోండి’ అని అరుస్తున్నట్లుంది!

[పాపపు సొమ్ము కోసం పరుగులొద్దు – దేశ ప్రజలకు సోనియా పిలుపు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! న్యూఢిల్లీలో నిన్న(ఫిబ్రవరి 01, 2011) చౌదరి రణభీర్ సింగ్ స్మారక తపాలా బిళ్ళను ఆవిష్కరిస్తూ, కాంగ్రెస్ అధిష్టానం సోనియా…

అధికారం, పాపపు సొమ్ముకోసం సాగుతున్న పరుగు పందెం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ పరుగు పందెం ఒక పరిధి దాటితే కేవలం దురాశగానే మిగిలి పోతుందని హెచ్చరించింది.

ప్రజలు ధనవంతులు అయ్యేందుకు, ఉన్నత పదవులు సంపాదించేందుకు గుడ్డిగా పరుగులెడుతున్నారు అని వ్యాఖ్యానించింది, తెలుసా!

సుబ్బారావు:
భేష్ మరదలా! ఓ ప్రక్క ప్రజలు ఉల్లిపాయలు కొనలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. పప్పూ బియ్యం కొనలేక చతికిల బడుతున్నారు. పిల్లల్ని చదివించుకోలేక బావురు మంటున్నారు.

ఈవిడ గారికేమో…ప్రజలు ధనవంతులు అయ్యేందుకు, ఉన్నత పదవులు సంపాదించేందుకు గుడ్డిగా పరుగు లెడుతున్నట్లు కనబడుతోంది.

సుబ్బలష్షిమి:
బహుశః తనూ, తన బృందం చేస్తున్న పనులని ప్రజలకి అనువర్తిస్తోంది కాబోలు బావా! దొంగే... ‘ఎదుటి వాళ్ళని దొంగా దొంగా పట్టుకోండి’ అని అరుస్తున్నట్లుంది కదూ!

Monday, January 31, 2011

తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగానే ఉంది మరి!

[పెట్టింది 8 లక్షల రూ. కొట్టింది 1246 కోట్ల రూ. అధికార పాపం, అవినీతి కూపం – వెరసి సాక్షి రూపం – ఈనాడు ఉవాచ.
ఒక్కప్పుడు రెండెకరాల ఆసామి అయిన చంద్ర బాబు ఇప్పుడు 2000 కోట్ల రూ.ల ఆస్థిపరుడెలా అయ్యాడు?
పచ్చళ్ళ వ్యాపారి రామోజీరావు వందల వేల ఎకరాల ఫిల్మిసిటికీ అధిపతి ఎలా అయ్యాడు? – సాక్షి ప్రశ్నల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వై.యస్. అధికారంతో కొడుకు జగన్ కి వేల కోట్లు ఎలా కట్టబెట్టాడు? జగన్ కి సంపద సమకూడిన మార్గాలేమిటి? – అంటూ ఈనాడు ప్రశ్నిస్తోంది. జవాబు చెప్పమని జగన్ ని నిలదీస్తోంది. ఈ సవాల్ కి ప్రతి సవాల్ గా సాక్షి…చంద్రబాబు, రామోజీరావులు ఆస్థులెలా సంపాదించారో చెప్పమంటోంది.

సుబ్బారావు:
సుబ్బరం! చంద్రబాబు, రామోజీరావుల సంపద, సంపాదనా రహస్యాలు జగనూ, జగన్ సంపదా, సంపాదనా రహస్యాలు రామోజీరావూ బయటపెడితే సరి మరదలా! తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగానే ఉంది మరి!

సుబ్బలష్షిమి:
నిజం బావా! అసలుకే నల్లడబ్బు దాచుకున్న ఘరానా దొంగల వివరాలు ప్రధాని ఎటూ బయట పెట్టనంటున్నాడు. కనీసం వీళ్ళన్నా పరస్పరం తమ వివరాలు బయట పెడితే… ప్రజలు తెలుసుకుని తరిస్తారు!

Wednesday, January 26, 2011

పాల నురుగు కూడా పాలిపోయేంత స్వచ్ఛత ఇది!

[నాన్న అంతరాత్మ స్వచ్ఛం, ప్రధాని కుమార్తె దామన్ సింగ్ వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, ఈ వార్త విన్నావా?

>>> తన తండ్రి అంతరాత్మ స్వచ్ఛమైనదని ప్రధాని మన్మోహన్ సింగ్ రెండో కుమార్తె, రచయిత దామన్ సింగ్ వ్యాఖ్యానించారు. దీనితో పాటు ఆయనకు వ్యక్తిత్వం, నిరాడంబరత ఉన్నాయని, మిగతావాళ్ళకు ఆయనకు ఉన్న తేడా ఇదేనని అభిప్రాయపడ్డారు. ఎవరి ఇష్టాయిష్టాల ప్రకారమో కాకుండా, తన అంతరాత్మ చెప్పినట్లుగానే ఆయన నడుచుకుంటారని పేర్కొన్నారు.
అంటే – మన్మోహన్ సింగ్ రిమోట్ సోనియా చేతుల్లో లేదు, చేసే వాటినన్నింటినీ అతడు స్వయంగానే చేస్తున్నాడనేగా బావా!

సుబ్బారావు:
అంతే అనుకోవాలి మరదలా! నల్లడబ్బు వివరాలు వెల్లడించలేనన్న దగ్గరి నుండి, 2జీ స్పెక్ట్రం గురించి జేపీసీVs పీఏసీ దాకా… పెట్రో ధరల పెంపకాన్ని చూస్తూ ఊరుకోవడం దగ్గరి నుండి, అవినీతి అక్రమాలు సమర్ధించటం దాకా… అన్ని వ్యవహారాలూ అతడి స్వంతమే నన్నమాట!

సుబ్బలష్షిమి:
గొప్ప స్వచ్ఛతే బావా! పాల నురుగు కూడా పాలిపోయేంత స్వచ్ఛత మరి!

Friday, January 21, 2011

ఊసరవెల్లులు వీళ్ళని చూసి దడుచుకుంటాయి సుమా!

[10 లక్షల కోట్ల రూపాయల దోపిడి చేసిన కాంగ్రెస్ నాయకులు, అవినీతి పరులకు బుద్ది చెప్పాలి – చంద్రబాబు నాయుడి పిలుపు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు
>>>ఇటీవల కొందరు నాయకులు రూ. వేలు లక్షల కోట్లు సంపాదించారు. ఆ అవినీతి, అక్రమ సొమ్మును నల్ల ధనాన్ని కొంత విదేశాల్లో దాచారు. కొంత డబ్బును ఇక్కడ వైట్ మనీగా మార్చేసుకున్నారు. చివరకు నీతి, నిజాయితీ ఉన్నవారు చేతకాని వారుగా, అవినీతి అక్రమాలకు పాల్పడే వారు తెలివైన వారుగా చలామణి అయ్యే పరిస్థితి వచ్చింది. ఇది చాలా ప్రమాదకరం. సమాజం స్పందించాలి. అవినీతి పరులకు బుద్ది చెప్పాలి

అంటూ, తెగ ఆక్రోశ పడిపోతున్నాడు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అందునా మామ ఎన్టీఆర్ వర్ధంతి సంధర్భంలో!

ఇప్పుడు ఇన్ని నీతులు చెబుతున్న ఈ చంద్రబాబే కదా బావా, అప్పట్లో ‘వెన్నుపోటు పొడవటం, నమ్మక ద్రోహం చేయటమే… తెలివిగా, నీతి నిజాయితీ అనటం… తెలివితక్కువగా’ చలామణి చేస్తూ, మామని ఇంటికి పంపించి, తాను సీఎం సీటు ఎక్కేసాడు? అంతేకాదు, మామ స్థాపించిన పార్టీని కూడా ‘ప్రజాస్వామ్యం బద్దం’గా తానే స్వంతం చేసుకున్నాడు!?

సుబ్బారావు:
అంతే మరదలా! ‘తాను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం’ అంటాడీ మాజీ ముఖ్యమంత్రి. వ్యాపారాల పేరుతో, రాజకీయాల్ని అడ్డం పెట్టుకుని సంపాదించడంలో చంద్రబాబు, వై.యస్.ల కుటుంబీకులతో సహా… ఎవరూ, ఎవరికీ తీసిపోరు.

కాకపోతే… పదవిలో ఉన్నప్పుడు అప్పటి మాటలు, లేనప్పుడు ఇప్పటి మాటలు… మాట్లాడతారు. అంతే!

సుబ్బలష్షిమి:
మొత్తంగా ఊసరవెల్లులు వీళ్ళని చూసి దడుచుకుంటాయి సుమా!

Wednesday, January 19, 2011

ధరలనీ, ప్రజలనీ కలిపి బంతాట!

[కూరగాయల ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు : పవార్
ధరల పాపం రాష్ట్ర ప్రభుత్వాలదే – రాహుల్ గాంధీ… వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కూరగాయల ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదనీ, తాము ఆహారధాన్యాలు, పప్పుదినుసులు, చెరకు ఉత్పత్తుల మీదే దృష్టి పెడతామనీ, కూరగాయల సేద్యంపై ప్రత్యక్ష పాత్ర లేదని’ కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్ పవార్ చెప్పాడు. పైగా ‘స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ పంట పండించాలో, ఏ మార్కెట్ లో విక్రయించాలో రైతులే నిర్ణయించుకోవాలని’ ముక్తాయించాడు కూడా!

సుబ్బారావు:
మరేమనుకున్నావ్ మరదలా! అందునా ఈ వ్యవసాయ మంత్రికి ‘వ్యవసాయం మీద కంటే క్రికెట్ మీదే మక్కువ ఎక్కువని’ గతంలో స్వయంగా చెప్పుకున్నాడు కూడా! అంచేతే, తీరిగ్గా కూరగాయల ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని తెగేసి చెప్పాడు. రైతులూ, ప్రజలే నియంత్రించుకోవాలని సదరు మంత్రి అభిప్రాయం కాబోలు.

సుబ్బలష్షిమి:
మరి కేంద్ర వ్యవసాయశాఖ దృష్టి పెట్టిన బియ్యం, జొన్నల వంటి ఆహార ధాన్యాల ధరలు, కందిపప్పూ, మినప్పప్పూ, శనగ బేడలతో సహా పప్పుదినుసుల ధరలు, బెల్లం, చక్కెర వంటి చెరకు ఉత్పత్తుల ధరలు కూడా అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి కదా! అసలు ధరల నియంత్రణ వాళ్ళ చేతుల్లో లేనప్పుడు అధికార కుర్చీల్లో ఎందుకున్నట్లు?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! పన్నుల రూపేణా, అక్రమాల రూపేణా డబ్బు దండుకునేందుకు! ప్రజా ధనాన్ని లూటీ చేసేందుకు తప్ప, పదవులు ఇంకెందుకనుకున్నావ్!?

సుబ్బలష్షిమి:
అందుకే కాబోలు బావా, కాబోయే ప్రధానిగా ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ కూడా ‘ధరల పాపం రాష్ట్ర ప్రభుత్వాలదే’ అంటూ సెలవిస్తున్నాడు. మొత్తానికి ధరల పాపం మీదంటే మీదంటూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, మంత్రిపుంగవులూ, రాజకీయరాక్షసులూ… ఎంచక్కా ప్రజలని బంతాట ఆడుకుంటున్నారు బావా!

Tuesday, January 18, 2011

ఇప్పుడు సహ చట్టం, ముందడుగు అంటూ భుజ కీర్తులు తగిలించుకుంటున్నట్లే!

[స్పెక్ట్రం అక్రమాల విషయమై కాగ్ నివేదిక తప్పుల తడక – కపిల్ సిబాల్, వార్త దాని మీద ‘ఈనాడు’ కార్టూన్ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2జీ స్పెక్ట్రం అవకతవకలపైన కాగ్ నివేదిక తప్పుల తడకని కేంద్రమంత్రి కపిల్ సిబాల్ అన్నాడు. దాన్ని కాంగ్రెస్సూ, కేంద్ర ప్రభుత్వమూ సమర్ధించుకుంది. సదరు వార్తల్ని ‘ఈనాడు’ ఓ చిన్న మల్టిబాక్స్ ఐటమ్ గానూ, ఓ కార్టూన్ గానూ వేసింది.

అదే ‘ఈనాడు’ రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్సు అవకతవకల గురించి కాగ్ నివేదికని ఉటంకిస్తూ… రోజుల తరబడి ప్రధాన శీర్షికలూ, సంపాదకీయాలూ, ఉప సంపాదకీయాలూ పెద్ద పెద్ద హెడ్డింగులతో పేజీల నిండా వ్రాసింది తెలుసా? కాగ్ విలువ అంత తగ్గిపోయిందా బావా?

సుబ్బారావు:
విలువలు పెరగటం, తరగటం అంటూ ఏమీ లేదు మరదలా! ‘ఈనాడు’ పత్రిక తనకి అప్పటి అవసరమై, కాగ్ ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటూ తెగ బిల్డప్ ఇస్తూ వ్రాసి పారేసింది.

ఇప్పటి అవసరాన్ని బట్టి అప్రధాన వార్తగా పక్కన పారేస్తోంది. ఎప్పటి అవసరాలు అప్పటివి!

సుబ్బలష్షిమి:
ఈపాటి దానికి ‘ఈనాడు’ అప్పట్లో తెగ పత్రికా విలువలు చెప్పింది మరి!?

సుబ్బారావు:
అదే మరి ఈనాడు మార్క్ జర్నలిజం! ఇప్పుడు సహ చట్టం, ముందడుగు అంటూ భుజ కీర్తులు తగిలించుకుంటున్నట్లే!

Monday, January 17, 2011

సోనియా, ఖత్రోచీ ఏం మాట్లాడుకొని ఉంటారో?

[>>>పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఖత్రోచీ ఈ దేశం విడిచి విదేశాలకు పారిపోయారు. ఖత్రోచి ఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరి, మధ్యలో పది, జనపథ్ వద్ద కాసేపు ఆగి, లోపలికి వెళ్ళివచ్చినట్లు ఆనాడు ఆయన కారు నడిపిన డ్రైవర్ ఆ తరువాత వెల్లడించారు – ఈనాడు సంపాదకీయ పేజీలో (09 జనవరి, 2011) వీరేంద్ర కపూర్ వ్యాసం నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పీవీజీ ప్రధానిగా ఉన్నప్పుడు, ఖత్రోచీ భారత్ నుండి పారిపోతూ పదీ జనపథ్ కి వెళ్ళినప్పుడు… సోనియా, ఖత్రోచీ ఏం మాట్లాడుకొని ఉంటారో?

సుబ్బారావు:
“ఈ పీవీ నరసింహారావు చూశావా, నేను ఇక్కడి నుండి పారిపోయేలా చేస్తున్నాడు. కాస్త ఇతడి పని పట్టు!” అని ఖత్రోచీ సోనియాకి చెప్పి ఉంటాడు మరదలా! అందుకే గదా, ఈ ఇటలీ నాయకి పీవీజీని అడుగడుగునా అవమానించింది?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! 2004 లో పీవీజీ మరణించిన తక్షణమే, ఢిల్లీలోని ఆయన నివాసం భవనం నుండి, ఆయన కుమారుణ్ణి బయటికి పంపారట.

సుబ్బారావు:
పీవీజీ మరణించిన వెంటనే రూల్స్ ప్రకారం ఆయన నివాస భవనాన్ని స్వాధీనం చేసుకొని ఉంటారు, మరదలా!

సుబ్బలష్షిమి:
మరి అదే అయితే… జగ్ జీవన్ రామ్ నివాస భవనమైతే అతడు మరణించినప్పుటి నుండి అతడి కుమార్తె మీరా కుమార్ అధీనంలోనే ఉంది, స్పీకర్ గా ఆమెకి కేటాయించిన భవనానికి ఇది అదనమని, ఇదే వీరేంద్ర కపూర్ మొన్నటి ‘ఈనాడు’ సంపాదకీయం పేజీలో వ్రాసాడు తెలుసా!

సుబ్బారావు:
మరి!? పీవీజీ బ్రతికినంత కాలం కాంగ్రెస్ కండువా మార్చలేదు. జగ్ జీవన్ రామ్ జనతా పార్టీ గట్రాలకి వెళ్ళొచ్చిన వాడు. తేడా లేదూ! అందుకే ప్రజాస్వామ్యంలో చట్టాలున్నది అవసరమైనప్పుడు తమకు అనుకూలంగా ఉపయోగించు కోవటానికే!

Tuesday, January 11, 2011

ఎదుటి వాళ్ళకీ చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, డోంట్ కేర్!

[విచక్షణాధికారాలు వదులుకోండి నిరాడంబరతకు పెద్ద పీట వేయాలని ఉద్భోద. కాంగ్రెస్ సీఎంలకు సోనియా లేఖలు – ఈనాడు (08 జనవరి, 2011) వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ అధిష్టానం సోనియా, కాంగ్రెస్ సీఎంలకి తమ విచక్షణాధికారాలని వదులు కోవాలనీ, నిరాడంబరతకు పెద్ద పీట వేయాలనీ ఉద్భోదించిందట, తెలుసా?

సుబ్బారావు:
అందుకే కాబోలు, కాంగ్రెస్ శాసన సభా సమావేశాల్లో, కాంగ్రెస్ ప్లీనరీల్లో అంతిమ నిర్ణయం అధిష్టానానిదే అంటు ఏక వాక్య తీర్మానాలు చేయించుకుంటూ ఉంటుంది. గజమాలలు మెడలో వేయించుకుంటూ ఉంటుంది. అంటే విచక్షణాధికారాలు తనకి మాత్రమే ఉండాలనీ, నిరాడంబరత తనకి తప్ప అందరికీ ఉండాలనీ అధిష్టాన దేవత అభీష్టం కాబోలు మరదలా!

సుబ్బలష్షిమి:
అంతే బావా! అప్పుడెప్పుడో ‘ప్రేమ్ నగర్’ సినిమాలోని పాట ‘ఎదుటి వాళ్ళకీ చెప్పేటందుకే నీతులు ఉన్నాయి, డోంట్ కేర్’ అన్నదే సోనియా ఆదర్శం అయి ఉండొచ్చు.

Wednesday, January 5, 2011

అవసరాలు ఎంత వేగంగా మారితే, రాజకీయ వ్యూహాలు అంత వేగంగా మారతాయి!

[పీఏసీ ముందు ప్రధాని హాజరు కావాల్సిన అవసరం లేదు – ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2జీ స్ప్రెక్ట్రమ్ ఆక్రమాల గురించి పీఏసీ ఎదుట హాజరౌతానంటూ ప్రధాని లేఖ వ్రాయటం గొప్ప విషయమని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఆ రోజే ప్రకటించారు కదా? పార్టీ అభిప్రాయాన్నే కదా అధికార ప్రతినిధులు ప్రకటిస్తారు?

మరి ఇప్పుడేమిటీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘నెంబర్ టూ’గా, ‘ట్రబుల్ షూటర్’గా పిలవబడే ప్రణబ్ ముఖర్జీ, ‘ప్రధాని పీఏసీ ముందు హాజరౌతాననటం సరికాదు. పార్టీతో చర్చించకుండానే మన్మోహన్ నిర్ణయం తీసుకున్నాడు’ అంటున్నాడు? ‘తనని అడిగి ఉంటే వద్దని చెప్పే ఉండేవాణ్ణి’ అని కూడా అన్నాడు తెలుసా?

సుబ్బారావు:
అవసరాన్ని బట్టి మాట మార్చడం ఇప్పటి కాంగ్రెస్ అధినాయకురాలికీ, అగ్ర నాయకులకీ అలవాటే మరదలా! కాకపోతే, ఆయా అవసరాలు మరీ తొందరగా మారిపోతున్నట్లున్నాయి. అందుకే వ్యూహాలూ ప్రకటనలూ కూడా త్వరగా త్వరగా మారిపోతున్నాయి.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! అవసరాలు ఎంత వేగంగా మారితే రాజకీయ ఊసరవెల్లులూ, అంతే వేగంగా రంగులు మారుస్తాయి. అప్పుడు కదా ప్రజలకి బాగా అర్ధమయ్యేది!
~~~~~~~

Tuesday, January 4, 2011

ఏ అంశం లో నైనా రామోజీరావు మార్కు జర్నలిజమే ఉంటుంది కాబోలు!

[బోఫోర్సు వ్యవహారంలో ఖత్రోచి, విన్ చద్దాలకు 41 కోట్ల రూపాయలు చెల్లించిన సర్కార్ – వెల్లడించిన ఆదాయపన్ను ట్రిబ్యునల్,

మద్దెల చెర్వు సూరి హత్య – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇప్పటికే స్పెక్ట్రం సెగలతో సహా పలు స్కాంలలో ఇరుక్కుపోయిన కాంగ్రెస్ + యూపీఏ ప్రభుత్వానికి ఇప్పుడు మళ్ళీ బోఫోర్సు తలనొప్పి తాజాగా పట్టుకొందట. ఖత్రోచి, విన్ చద్దాలకి 41 కోట్ల రూ.లు చెల్లించారనీ, ఆ మేరకు వారిద్దరూ భారత్ లో పన్ను చెల్లించాల్సిందేననీ… ఆదాయ పన్ను ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.

ఆ వార్తని ‘ఈనాడు’ ఎక్కడో 11 పేజీలో చిన్న అక్షరాల శీర్షికలో ఓ 3 కాలమ్ వార్త వేసి అయ్యిందని పించేందేం బావా! ఒకప్పుడైతే పేజీలన్నీ భోపోర్సు తోనే నింపేది కదా?

అందునా బోఫోర్సు వ్యవహారంలో ఎవరికీ ఎటువంటి కమీషన్లు అందలేదని సీబీఐ తన దర్యాప్తులో తేల్చగా, దానికి విరుద్దంగా ఐటీ ట్రిబ్యూనల్ తీర్పు వెలువరించిన సందర్భంలో, ‘ఈనాడు’కి అది అంత అప్రాధాన్య వార్త ఎలా అయ్యింది?

సుబ్బారావు:
అప్పటిది రాజీవ్ గాంధీ హయాం, ఇప్పటికి సోనియా హయాం! తేడా లేదా మరదలా!? ఈనాడు రామోజీరావు… ఇందిరా, రాజీవ్ కీ, కాంగ్రెస్ కీ వ్యతిరేకి! సోనియాకైతే పరమ రక్షకుడు!

కాబట్టే - రాజీవ్ ని ఇరుకున బెట్టేందుకు పేజీలన్నీ బోఫోర్సు ఆక్రమాల గురించే నింపి పారేసేవాడు. ఇప్పుడు సోనియాని రక్షించేందుకు, శాయశక్తులా పాటుపడుతున్నాడు.

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! ఈ మద్దెల చెర్వు సూరి Vs పరిటాల రవి ల వ్యవహారాల్లో కూడా ‘ఈనాడు’ కవరేజీ అలాగే ఉంది! అసలు ఈనాడు అంత ఎక్కువగా స్పందిస్తుందేమిటి? వాళ్ళేదో మహాత్ములో, ప్రపంచ నాయకులో అన్నట్లు… పరిటాల రవి హత్య జరిగాక, కొన్ని రోజుల పాటు, ప్రతీ రోజూ ఈటీవీ కి అదే ప్రధాన వార్త అయ్యింది. దాదాపు సంవత్సరం పాటు పదే పదే రవి హత్యా దృశ్యాల్ని, ఈగలు మూగిన అతడి రక్తసిక్త దేహాన్నీ చూపింది.

ఇప్పుడు సూరి కాల్చివేత కీ అంతే ప్రాధాన్యత! తొలిపేజీ తొలివార్త. 2వ పేజీలో దాదాపు సగం కవరేజీ! 6వ పేజీ పూర్తిగా అదే! 13 వ పేజీలో బాక్సు వార్తలు!

వాళ్ళు నిత్యం దందాలు, హత్యలూ చేసే నేరగాళ్ళు. అదేదో మహానాయకులన్నట్లు ఈనాడు ఎందుకంతగా అంగలారుస్తుంది?

సుబ్బారావు:
ఈనాడు రామోజీరావుకి అలాంటి దందారాయుళ్ళే ఆప్తులు మరదలా!

అయితే సూరి Vs రవిల వ్యవహారంలో మరికొంత మెలిక ఉంది. రెండు మూడునెలల క్రితం ‘ఈనాడు’ ఆదివారం సంచికలో పరిటాల రవి భార్య సునీత స్వగతం గురించి ప్రత్యేక కథనం ప్రచురించారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడూ ఈనాడు అతడికి సానుకూలంగా వ్రాసింది. అందుకే పత్రికనీ, టీవీనీ ఉపయోగించింది.

ఇప్పుడు సూరి మృతి విషయంలో… అతడి ప్రత్యర్ధుల బలానికి దన్ను ఇస్తూ అతిగా స్పందిస్తోంది.

సుబ్బలష్షిమి:
ఏ అంశం లో నైనా రామోజీరావు మార్కు జర్నలిజమే ఉంటుంది కాబోలు బావా!

Monday, January 3, 2011

అందుకేనా అద్వానీ ఇంత మడత నాలుక ప్రదర్శించిందీ!

[ఎమర్జన్సీ తప్పిదాలకు సంజయ్ ని బలి పశువు చేస్తున్నారు, కాంగ్రెస్ పై అద్వానీ ధ్వజం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భాజపా అగ్రనేత అద్వానీ తన బ్లాగ్ లో ‘ఎమర్జన్సీకి పూర్తి బాధ్యత ఇందిరా గాంధీదేననీ, కాంగ్రెస్… సంజయ్ గాంధీని బలిపశువుని చేస్తోందని’ విమర్శించాడు.

గతంలో ఎమర్జన్సీ పాపం ఇందిరా సంజయ్ లదేనంటూ తల్లికొడుకుల్ని విమర్శించిన భాజపా, ఆ పార్టీ నేతా… ఈ రోజు సంజయ్ ని బలి పశువుని చేశారంటున్నారు. ఎందుకలా?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! సంజయ్ గాంధీ భార్యా మనేకా, కుమారుడు వరుణ్ ఇప్పుడు భాజపాలో ఉన్నారు కదా మరి!?

సుబ్బలష్షిమి:
ఓహో! అందుకేనా అద్వానీ ఇంత మడత నాలుక ప్రదర్శించిందీ!