Wednesday, January 19, 2011

ధరలనీ, ప్రజలనీ కలిపి బంతాట!

[కూరగాయల ధరల నియంత్రణ మా చేతుల్లో లేదు : పవార్
ధరల పాపం రాష్ట్ర ప్రభుత్వాలదే – రాహుల్ గాంధీ… వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కూరగాయల ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదనీ, తాము ఆహారధాన్యాలు, పప్పుదినుసులు, చెరకు ఉత్పత్తుల మీదే దృష్టి పెడతామనీ, కూరగాయల సేద్యంపై ప్రత్యక్ష పాత్ర లేదని’ కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి శరద్ పవార్ చెప్పాడు. పైగా ‘స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ పంట పండించాలో, ఏ మార్కెట్ లో విక్రయించాలో రైతులే నిర్ణయించుకోవాలని’ ముక్తాయించాడు కూడా!

సుబ్బారావు:
మరేమనుకున్నావ్ మరదలా! అందునా ఈ వ్యవసాయ మంత్రికి ‘వ్యవసాయం మీద కంటే క్రికెట్ మీదే మక్కువ ఎక్కువని’ గతంలో స్వయంగా చెప్పుకున్నాడు కూడా! అంచేతే, తీరిగ్గా కూరగాయల ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని తెగేసి చెప్పాడు. రైతులూ, ప్రజలే నియంత్రించుకోవాలని సదరు మంత్రి అభిప్రాయం కాబోలు.

సుబ్బలష్షిమి:
మరి కేంద్ర వ్యవసాయశాఖ దృష్టి పెట్టిన బియ్యం, జొన్నల వంటి ఆహార ధాన్యాల ధరలు, కందిపప్పూ, మినప్పప్పూ, శనగ బేడలతో సహా పప్పుదినుసుల ధరలు, బెల్లం, చక్కెర వంటి చెరకు ఉత్పత్తుల ధరలు కూడా అమాంతం పెరిగిపోతూనే ఉన్నాయి కదా! అసలు ధరల నియంత్రణ వాళ్ళ చేతుల్లో లేనప్పుడు అధికార కుర్చీల్లో ఎందుకున్నట్లు?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! పన్నుల రూపేణా, అక్రమాల రూపేణా డబ్బు దండుకునేందుకు! ప్రజా ధనాన్ని లూటీ చేసేందుకు తప్ప, పదవులు ఇంకెందుకనుకున్నావ్!?

సుబ్బలష్షిమి:
అందుకే కాబోలు బావా, కాబోయే ప్రధానిగా ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి రాహుల్ గాంధీ కూడా ‘ధరల పాపం రాష్ట్ర ప్రభుత్వాలదే’ అంటూ సెలవిస్తున్నాడు. మొత్తానికి ధరల పాపం మీదంటే మీదంటూ… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, మంత్రిపుంగవులూ, రాజకీయరాక్షసులూ… ఎంచక్కా ప్రజలని బంతాట ఆడుకుంటున్నారు బావా!

2 comments: