Monday, December 14, 2009

వంకలేనమ్మ డొంకపట్టుకుని ఓ డొంకా నీకెన్ని వంక[ర]లే అని ఏడ్చిందట

[రెండురోజుల్లో అధిష్టానం ప్రకటన - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా ఈ వార్త విను. "ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ అధిష్టానం నిశ్శబ్ద్ధంగా గమనిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్ర, శనివారాలు ఢిల్లీలో లేకపోవడం, ఆదివారం సెలవు కావడంతో రోజు వారీ కసరత్తుకు ఆటంకం కలిగింది" - ఇదీ వార్త. బావా! నాకు తెలియక అడుగుతాను, రాష్ట్రం ఇలా రావణ కాష్టంలా తగలడుతుంటే తీరిగ్గా సెలవు పుచ్చుకుంటారా? అదే పుట్టిన రోజు కానుకలు ఇవ్వడానికైతే పనిగంటలు పట్టించుకోకుండా అర్ధరాత్రి దాకా భేటీలు, ప్రకటనలు చేసారు గదా?

సుబ్బారావు:
అంతే మరదలా! తమకి అవసరం అయినప్పుడు అవసరమైనట్లు చేస్తారు. మొన్న తెలంగాణా వాళ్ళు బస్సులు, ఆస్తులు తగలబెట్టేదాకా చూసారు. ఇప్పుడు సమైక్యాంధ్ర వాళ్ళు కూడా బస్సులు, ఆస్తులు తగలబెట్టెదాకా చూసి, తరువాత తీరిగ్గా ఆలోచిస్తారనుకుంటా. రోజులు దొర్లించేందుకు సెలవులు ’వంక’ అన్నమాట.

సుబ్బలష్షిమి:
దీన్నే ’వంకలేనమ్మ డొంకపట్టుకుని ఓ డొంకా నీకెన్ని వంక[ర]లే అని ఏడ్చిందంటారు’కదా బావా!

1 comment:

  1. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.

    ReplyDelete