Tuesday, November 9, 2010

సరదాగా ఒబామా స్వగతం!

[బలం పోయే... హజం పోయే! అమెరికా అధిపత్యం సడలిందని అంగీకరించిన ఒబామా వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యానాలకి, సరదాగా కొన్ని స్వగతాలు చెప్పనా?అంటే... ఒబామా పైకి అన్నమాటల నేపధ్యంలో లోపల ఏమనుకొని ఉంటాడో... అని!

సుబ్బారావు:
మరెందుకు ఆలస్యం!? కానీయ్!

సుబ్బలష్షిమి:
ఒబామా పైకి:
అమెరికా అధిపత్యం సడలిందని అంగీకరిస్తున్నాను.

స్వగతం:
[అంగీకరించక ఛస్తానా? అవతల మా దేశంలో కొంపలు కూలుతుంటే!? ఎన్నికల్లో ఓడిపోతుంటిని మరి! ఉద్యోగాలు ఊడిపోతున్నాయయ్యె!]

పైకి:
ఆసియాతోనే కోలుకుంటామని ఆశాభావం.

స్వగతం:
[అప్పట్లో అలాంటి ఆశలు భారత్ అమెరికా మీద పెట్టుకుంటే, నెత్తిన మరో బండ వేయ చూసామే గానీ, చిగురంత సాయం కూడా చేయలేదు. ఇప్పుడు కానికాలం వచ్చి, భారత్ కొచ్చి, ఇవన్నీ మాట్లాడుతున్నాను.]

పైకి:
భారత్ రక్షణాత్మక వైఖరిని అమెరికన్లు అంగీకరించరని స్పష్టీకరణ.

స్వగతం:
[అప్పట్లో ఇలాంటి సవాలక్ష ‘రక్షణాత్మక వైఖరి’ కారణాలే చెప్పాం. అప్పుడు భారతీయులు అంగీకరించారేమిటి?]

పైకి:
ఎన్నికల్లో ఓటమి నేపధ్యంలో విధానాల్లో మార్పులుంటాయి.

స్వగతం:
[ఉండబట్టే గదా, భారత్ వచ్చి మరీ... ‘నమస్తే ఇండియా’ అంటూ అడుగుతున్నాను. డాన్సులు చేసి సంబంధాలు గట్టి పర్చుకుంటున్నాను.]

పైకి:
భారత్ ఎదుగుతున్న శక్తి కాదు, ఇప్పటికే ఎదిగిన శక్తి.

స్వగతం:
[నిజం ఒప్పుకోకపోతే నా వీపూ, దేశపు వీపూ విమానం మోత మోగుతుందని ఒప్పుకుంటున్నాను గానీ, గతంలోలాగే మా ఆటగే గనక సాగుతుంటేనా...?]

పైకి:
భారత్-అమెరికా ప్రజల అభివృద్ధికి ఈ రెండు దేశాల భాగస్వామ్యం అనంత అవకాశాలను కల్పిస్తుంది.

స్వగతం:
[వసుదేవుడంతటి వాడే గాడిదల కాళ్ళు పట్టుకున్నాడని భారతీయుల సామెతట! కొంచెం సేపు నేను వసుదేవుడనుకుంటా!]

పైకి:
భారతీయ మార్కెట్లలో అమెరికన్లకు మరిన్ని అవకాశాలు ఉండాలని కోరుకుంటున్నాం. మా దగ్గర మేలైన వస్తువులున్నాయి. మీదగ్గరా ఉన్నాయి. వ్యాపారం ఉభయతారకంగా ఉంటుంది. వాణిజ్యం అనేది ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి. ఏకపక్షంగా ఉంటే అది చెడ్డ ఒప్పందమని అమెరికన్లు భావిస్తారు.

స్వగతం:
[ఒకప్పుడు ఇవే అభ్యర్ధనలు భారత్ మమ్మల్ని చేస్తే సహకరించకపోగా, వీలయినన్ని రాళ్ళు విస్తారంగా విసిరాం. దేవుడా! దేవుడా! ఇప్పుడవన్నీ భారతీయులకి గుర్తు రాకుండా చూడు తండ్రి!]

పైకి:
పెరుగుతున్న నిరుద్యోగంతో ఆమెరికన్లు నిస్పృహకు గురయ్యారు. ఆర్ధిక మందగమనంపై నిరాశ చెందుతున్నారు.

స్వగతం:
[ఒకప్పుడు అదే నిరాశకి భారతీయులు గురయ్యారు. మాకేమైనా పట్టిందా? ఎద్దుపుండు కాకికి రుచి అన్నట్లు గడిపాం. దాంతో ఎగిరిన ఎద్దులా ఇప్పుడు గంత మోయాల్సి వచ్చింది. దీన్నే అంటారేమో చేసిన కర్మ అనుభవించటం అని!]

పైకి:
హింసను సమర్ధించుకోడానికి కొందరు ఇస్లాంకు వక్రభాష్యం చెబుతున్నారు. వారిని ఒంటరివారిని చేయడమే మనముందున్న పెద్దసవాలు. తీవ్రవాదాన్ని తుడిచిపెట్టటంలో పాకిస్తాన్ చురుగ్గా వ్యవహరించడం లేదు.

స్వగతం:
[అవసరమై ఇప్పిడిలా మాట్లాడుతున్నాను గానీ, చేతల్లో ఇప్పటికీ మాకు పాకిస్తానే ప్రియమైనది. అందుకే కదా దానికి యుద్దవిమానాలు ఇస్తున్నాం, డాలర్ల వరద ప్రవహింప చేస్తున్నాం? భారత్ నేతలు మన్మోహన్, సోనియాలు మనకి మస్తు అనుకూలమే గానీ... నిన్న ముంబైలో చూడలా, విద్యార్ధులే గూబగుఁయ్యి మనేలా... ‘పాకిస్తాన్ ని తీవ్రవాద దేశంగా ఎందుకు ప్రకటించలేదు?’ అని నిలదీసారు. భారతీయ భావితరాన్ని మభ్యపెట్టటానికి తలప్రాణం తోకకి వస్తోంది.]

ఇంకా చాలా ఉన్నాయి గానీ, ఇప్పటికింతే బావా! ఎలా ఉంది?

సుబ్బారావు:
ఎలా ఉందో, బ్లాగు మిత్రుల్నే అడుగుదాం మరదలా!

5 comments:

  1. బాగున్నదండి సుబ్బారావు స్వగతం!

    ReplyDelete
  2. [! కొంచెం సేపు నేను వసుదేవుడనుకుంటా!]---Offensive...!!!

    ReplyDelete
  3. కర్లపాలెం హనుమంతరావు గారు: ఈ స్వగతం చెబుతున్న సుబ్బారావు ఎక్కడి నుండి వచ్చాడండి? నా టపాకాయలో సుబ్బలష్షిమి చెప్పింది ‘ఒబామా’ స్వగతం గురించి కదా! :)

    అజ్ఞాత గారు, కొత్తపాళి గారు: నెనర్లండి!

    ReplyDelete
  4. అదేలెండి అమ్మ ఒడి గారూ! ఒబామా గారి స్వగతం గురించి అన బోయి ఏదో సుబ్బారావు అనేసా ! పొరపాటే !

    ReplyDelete