Saturday, November 27, 2010

అవినీతిపై ద్వంద్వ వైఖరి వీడండి – దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదే కాబోలు!

[అవినీతిపై ద్వంద్వ వైఖరి వీడండి – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ అధినేత్రి సోనియా, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ…
“అవినీతి విషయంపై ప్రతిపక్ష భాజపా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది.
అవినీతి విషయంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ఎన్నడూ జాప్యం చేయలేదు.
ప్రధాని చిత్తశుద్ధిని ప్రశ్నించలేం.” అన్నది తెలుసా?

సుబ్బారావు:
ఇంత కంటే గురివింద గింజ నైజం మరొకటుండదు మరదలా! వై.యస్. బ్రతికి ఉన్న రోజుల్లో… అతడు రాష్ట్రాన్ని దోచి సూట్ కేసులు కొద్దీ రోజు వారీ వసూళ్ళు ఢిల్లీకి పంపాడంటూ, ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. పుస్తకాలు కూడా ప్రచురించాయి. అదేం పట్టించు కోకుండా అతణ్ణి ‘మార్గదర్శి, దార్శినికుడు’ అంది. అతడి అవినీతి గురించి అతడి మరణానంతరం వార్తలు బయటికొస్తున్నాయి.

ఇక కామన్వెల్త్ వ్యవహారంలో కంపు కంపు అయినా, కల్మాడీ గురించి కిమ్మన లేదు. రెండేళ్ళుగా సాగిన 2జి స్పెక్ట్రమ్ ఆరోపణలకి నిన్నమొన్నగానీ రాజాని పదవి దించలేదు. ఇప్పటికీ ఆ రగడతో పార్లమెంటు పనిచేసిన రోజు లేదు.
ఇంకా ‘ఈమె’… అవినీతిని కాంగ్రెస్ సహించదనీ, చర్యలు తీసుకోవడంలో జాప్యం చెయ్యదనీ అంటోందంటే … ద్వంద్వ వైఖరికి పెద్దమ్మన్న మాటే!

సుబ్బలష్షిమి:
దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదే కాబోలు బావా!

No comments:

Post a Comment