Monday, November 29, 2010

మొత్తానికి, పుట్టలోంచి పాముల్లా… నిజాలు బయటి కొస్తున్నాయి!

[ఎస్. జైపాల్ రెడ్డి Vs. వై.యస్. జగన్ ల విమర్శల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎస్. జైపాల్ రెడ్డి, వై.యస్. జగన్ క్రమశిక్షణ మీరు తున్నాడన్నాడట. ఆ నేపధ్యంలో చెలరేగిన విమర్శలలో… ఎస్. జైపాల్ రెడ్డి గురించి ఆసక్తికరమైన అంశాలు మరోసారి ప్రచారంలో కొచ్చాయి.

గతంలో చాలా పార్టీలు మారిన జైపాల్ రెడ్డి, కాంగ్రెసేతర ప్రభుత్వాల హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసాడు. కాంగ్రెస్ కు ప్రతిపక్షంగా ఉన్నరోజుల్లో, బోఫోర్సు వ్యవహారమై ‘రాజీవ్ గాంధీ జేబులు కొట్టే దొంగ కన్నా హీనంగా ఉన్నాడనీ, అతణ్ణి ఉరి తీయాలనీ’ అన్నాడట.

అలాంటి విమర్శలు చేసిన వాణ్ణి, ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ గా మీడియా కితాబులందుకున్న వాణ్ణి, పక్కా కాంగ్రెస్ వ్యతిరేకిని… కాంగ్రెస్ అధ్యక్షురాలు 1998లో పగ్గాలు చేపట్టిన వెంటనే చేరదీసి, 1999 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టిచ్చింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే, మంత్రి పదవులూ ఇచ్చింది. ఆమెకి జైపాల్ రెడ్డి పై ఎందుకింత అభిమానమో?

సుబ్బారావు:
రాజీవ్ గాంధీని ఉరితీసి చంపాలన్నాడు కదా మరదలా, అందుకై ఉంటుంది! అతణ్ణొక్కణ్ణేనా? 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు ఘటనా స్థలంలోనే ఉన్న, హంతక ముఠాకి సహకరించిందన్న ఆరోపణలున్న జయంతీ నటరాజన్ ని కూడా దరిజేర్చుకుంది కదా!

అసలు కరుణానిధి అయితే, ఎల్.టి.టి.ఇ.కి గొప్ప మద్దతుదారు. ఎల్.టి.టి.ఇ. స్వయంగా రాజీవ్ గాంధీ హత్యకు బాధ్యత ప్రకటించుకుంది. అలాంటి వాడితో పొత్తు పెట్టుకుని మరీ, తన ‘పతి భక్తి’ నిరూపించుకుంది కదా ఈ ఇటలీ మహిళ!?

సుబ్బలష్షిమి:
ఇదంతా వ్యూహాత్మకంగా ఇప్పుడు గుర్తుకొచ్చినట్లుంది బావా… మొన్న ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్ కీ, నిన్న వి.హెచ్.పి. నేత ఆశోక్ సింఘాల్ కి! అందుకే… సుదర్శన్ ‘సోనియా సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తున్నారు. ఇందిరా రాజీవ్ ల హత్యలలో ఆమె కుట్ర ఉంది’ అనంటే, అశోక్ సింఘాల్ ‘సోనియా రాజీవ్ భార్యగా భారత్ రాలేదు. ప్రత్యేక ఉద్దేశంతోనే వచ్చింది. హిందూ మత నాశనం కోసమే పనిచేస్తుంది’ అంటున్నాడు.

సుబ్బారావు:
పాపం! ఆలస్యంగా సత్యం గ్రహింపు కొచ్చిందో, నోరు తెరిచే అవకాశం ఇప్పుడొచ్చిందో మరదలా!

సుబ్బలష్షిమి:
మొత్తానికీ, పుట్టలోంచి పాముల్లా… నిజాలు బయటికొస్తున్నాయి బావా!

No comments:

Post a Comment