Thursday, October 7, 2010

పాచిపని పాటి ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే!


[దారి దున్నేసారు - వార్త నేపధ్యంలో, ఈనాడు 02, అక్టోబరు 2010]

సుబ్బలష్షిమి:
బావా! మురుగు నీటి కోసంగానీ, త్రాగునీటి కోసం గానీ... ఆ ఏర్పాట్లోవో ముందు చేశాకే రోడ్డు వేయవచ్చుకదా, ఈ అధికారులు!? లక్షలు ఖర్చుపెట్టి పక్కాగా సిమెంట్‌ రోడ్డో, తారు రోడ్డో వేసాక, తీరిగ్గా అప్పుడొచ్చి తవ్వి పారేస్తారు. అదేమని అడిగితే... `ఆ కాంట్రాక్టు ఒకరిది, ఈ కాంట్రాక్టు మరొకరిది' అనో `రోడ్డు తర్వాత నీటి పైపుల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయనో' చెబుతారు.

వెరసి... ప్రజాధనం నీళ్ళలా ఖర్చవుతుంది, ఊరు బురదగుంటలా తయారౌతుంది. కాంట్రాక్టర్లు వేరైనా, నిధులు ముందు వెనుకలుగా మంజూరు చేసినా, ప్రభుత్వం దగ్గర సమన్వయం లేనప్పుడే కదా ఇలా జరిగేది? ఆపాటి బుర్ర కూడా లేకుండా పనులెందుకు చేస్తారు బావా?

సుబ్బారావు:
అదిబుర్ర లేకపోవటం కాదు మరదలా, తమ పని పట్ల నిజాయితీ, నిబద్దతా లేకపోవటం! లేదా, కమీషన్ల కోసం ఇలా దుంపనాశనం చేయటం! లేకపోతే... పాచిపని చేసేటప్పుడు కూడా... ముందు వాకిలి ఊడ్చి కళ్ళాపి జల్లి ఆ తర్వాత ముగ్గు వేస్తారు. అంతేగానీ, ముందు ముగ్గు వేసి, ఆ తర్వాత ఊడ్చి నీళ్ళు చల్లరు గదా! ఆ పాటి ఇంగింత జ్ఞానం కూడా లేదంటే ఇంకేమంటాం చెప్పు!

2 comments: