Tuesday, May 5, 2009

నకరాలు చేస్తున్నారా? ఇంతకి ఎవరు చేస్తున్నట్లు?

[మెదక్ రైతు నాగరాజుపై కలెక్టరు కస్సుబుస్సు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చదివావా బావా? కరెంటు కోతలతో ఎండిన తన వరిపొలాన్ని నాగరాజు అనే ఈ రైతు తగలేసాట్ట. అది పత్రికల్లో వచ్చింది. మెదక్ ఆర్డీవో, తహశీల్థార్ కలెక్టరుని కలవమని చెబితే ఈ రైతు కలెక్టర్ ని కలవటానికి వచ్చాడట. “ఏం మజాక్ చేస్తున్నారా? పిచ్చిపిచ్చి నకరాలు చేస్తున్నారా? బయటకు నడవండి. తమాషా చేస్తే కేసు చేయిస్తా” అని కలెక్టర్ మండి పడ్డాడట. ఈరైతు భోరుమంటున్నాడు.

సుబ్బారావు:
అంతే కాదు మరదలా! తన తాత పేరిట ఉన్న బ్యాంకు రుణం మాఫీ అయిన విషయం తనకుతెలియదని, బ్యాంకు అధికారులు మాఫీకాలేదని చెప్పడంతో కలెక్టరు విచారణకు వచ్చినప్పుడు అదే చెప్పామని, అయితే అధికారుల విచారణలో రుణం మాఫీ అయిందని తేలటంతో కలెక్టరు తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఈ రైతు చెబుతున్నాడు.

సుబ్బలష్షిమి:
బావా నాకో సందేహం! బ్యాంకు రుణం మాఫీ అయినప్పుడు, బ్యాంకు వారు రైతుకి అదే విషయమై ఓ లేఖ పంపిస్తారు కదా? అప్పుడు ఖచ్చితంగా రైతు దగ్గర ఆ లేఖ ఉంటుంది. బ్యాంకు అధికారుల దగ్గర అలాంటి లేఖ రైతు అందుకున్నట్లు రసీదు ఉంటుంది కదా?

సుబ్బారావు:
ఖచ్చితంగా ఉండాలి మరదలా! అయితే విషయమంతా రచ్చయ్యి, ప్రజల దృష్టికి వచ్చినప్పుడు అధికారులు రుణం ఎప్పుడో మాఫీ అయ్యిందని బుకాయిస్తుండవచ్చు. మాఫీ అయినా ఆ పత్రం రైతుకి ఇవ్వకుండా లంచాల కోసం వేధించి ఉండొచ్చు. ఇప్పడవేవీ బయటకు రాకుండా, పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా, రైతు మీద కలెక్టరు కస్సుబుస్సులాడి ఉండవచ్చు. ఎంతైనా ఎండన పడి సేద్యం చేసి, అందరికి తిండిపెడుతున్న రైతాయె, ఏసీ లో కూర్చుని నెలనెలా చెక్కులందుకునే వాణ్ణి చూసి దడుచుకోవాలి కదా? అంచేత నకరాలు చేస్తున్నావా అనగలడు, ఇంకా ఏమైనా అనగలడు?

No comments:

Post a Comment