Monday, November 30, 2009

అమ్మ చెప్పింది అమ్మకిమ్మని .....

[పులివెందుల అసెంబ్లీ టిక్కెట్ ని ‘అమ్మ విజయలక్ష్మి’కిమ్మని ‘సోనియమ్మ’ చెప్పిందన్న జగన్ వార్తల నేపధ్యంలో, రేపు YS విజయలక్ష్మి నామినేషన్ వేయనున్న సందర్భంగా]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా! అమ్మ చెప్పింది అమ్మకిమ్మని అంటున్నాడు జగన్. పులివెందుల అసెంబ్లీ టిక్కెట్ తన తల్లికివ్వాలని అధిష్టానం చెప్పిందట, తను శిరసావహిస్తున్నారట. ఎంతలో ఎంత మార్పు? ఎంత విధేయత బావా?
మరి సీ.ఎం. సీటు రోశయ్యకివ్వమని ఈ అమ్మే కదా చెప్పింది? అప్పుడంతా “సీ.ఎం. సీటు నాదే” “సీ.ఎం. సీటు” నాదే అని నానా మారాం చేశాడేం బావా?

సుబ్బారావు:
అందుకే గదా ఈ అమ్మ, ఆ బ్యాడ్ బాయ్ ని గనుల్లో పడేసి నలగేసి కూర్చో బెట్టింది? దెబ్బతో విధేయత రాక ఛస్తుందా?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అందుకే కాబోలు ’అమ్మ పెట్టే ఆ నాలుగూ పెడితేనే!’ అంటారు పెద్దలు!

Friday, November 27, 2009

భర్త చనిపోయినప్పుడు, ఆ బాధ మరిచిపోవాలంటే భార్య రాజకీయాల్లోకి రావాలా?

[“భర్త చనిపోయినప్పుడు ఓ మహిళ బాధ ఎలా ఉంటుందో, ఆ జ్ఞాపకాలు ఎలా వెంటాడుతాయో నాకు తెలుసు, ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల్లో తిరిగితే పాత జ్ఞాపకాల నుండి కొంత డైవర్షన్ వస్తుంది. అందువల్ల విజయలక్ష్మినే పోటీలో నిలబెడదాం!” అని సోనియా జగన్ తో అన్నట్లు సమాచారం – ఈనాడు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నాకు తెలియక అడుగుతాను, భర్త చనిపోయినప్పుడు ఆ బాధ మరిచి పోవాలంటే భార్య రాజకీయాల్లోకే రావాలా? ఏ సామాజిక సేవో చేస్తే ప్రజల్లో తిరిగినట్లు కాదా? అప్పుడు బాధనుంచి డైవర్షన్ రాదా?

సుబ్బారావు:
సామాజిక సేవచేస్తే, ఆస్తులు కూడబెట్టటం ఎలా కుదురుతుంది మరదలా!

Monday, November 23, 2009

రామోజీ ‘నాన్ స్టాప్’ జడ టపాకాయలు

[రామోజీరావు, సుమన్ బాబుకు శుభాకాంక్షలు చెబుతూ……
>>>మా అబ్బాయి సుమన్ నిర్మించిన ’నాన్ స్టాప్’ చిత్రం పాటల్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. సుమన్ బహుముఖ కళారూపాల్లో ప్రజ్ఞను అనేక విధాలుగా చూపాడు. ఇప్పుడు సినిమాల్లో తన శక్తి, సత్తా చూపించడానికి సిద్దమయ్యాడు. ’నాన్ స్టాప్’గా ప్రజల ఆదరణ పొందాలి.

>>>నాలాంటి వారికి నవ్వే అవకాశాలు చాలా తక్కువ. ఈ చిత్రం అందరినీ మనసారా నవ్విస్తుందని ఆశిస్తున్నాను. – అన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ సినిమా వార్త చదివావా బావా! ఈనాడు రామోజీరావు తన కుమారుడు సుమన్ బహుకళా ప్రపూర్ణుడంటున్నాడు!

సుబ్బారావు:
మరి ఎందుకు ఈటీవీ నుండి సుమన్ బాబును బయటకు గెంటేసాడట?

సుబ్బలష్షిమి:
తన లాంటి వాళ్ళకు నవ్వే అవకాశాలు తక్కువగా ఉంటాయట!

సుబ్బారావు:
బహుశ మన హాస్యనటుల హాస్యం నచ్చదేమో! అయితే సుమన్ బాబు ‘నాన్ స్టాప్ కామెడీ’ని ప్రతీక్షణం చూస్తూ కూర్చుంటే సరి!

సుబ్బలష్షిమి:
సరిగ్గా పోయిన ఏడాది నవంబరు 21 వ తేదీన, తండ్రితో తనకున్న గొడవల గురించి, సుమన్, సాక్షి పత్రికకి ఇంటర్యూ ఇచ్చాడు. సరిగ్గా సంవత్సరం తరువాత, [నవంబరు 21, 09 వతేదీన] తన ’నాన్ స్టాప్’ సినిమా పాటల సీడీని తండ్రి చేత విడుదల చేయించాడు. రామోజీ రామాయణం పేరిట వచ్చిన ఆ ఇంటర్యూ చదివినప్పటి నుండీ బావా, నాకో సందేహం ?

సుబ్బారావు:
ఇంకెందుకాలస్యం? అడుగు!

సుబ్బలష్షిమి:
ఆ ఇంటర్యూలో “ఎందుకో తెలీదు. నాన్న గారికి మొదటి నుండీ నా పనితీరూ, నా రాతలు నచ్చేవి కాదు. మరి అది మా వృత్తి కాదనో, అలా రాయడం మూలంగా బిజినెస్ దెబ్బతింటుందనో తెలీదు. నిత్యం నన్ను ఏదో ఒకటి అనేవారు. తనకేం కావాలో చెప్పెవారు కాదు. నేను చేసింది నచ్చేది కాదు” అన్నాడు సుమన్[బాబు] , వాళ్ళ వృత్తి అంటే ఏమిటి బావా?

సుబ్బారావు:
బహుశః వార్తలూ, సంపాదకీయాలూ వ్రాయటం, దాని ద్వారా రాజకీయ వ్యాపారం చేయటం, పచ్చళ్ళు తయారుచేయటం వంటివి అయి ఉంటాయి మరదలా! ఏమైనా శ్రీహరి స్వరాలూ, కృష్ణుడి లాంటి పౌరణిక పాత్రలూ వేయటం మాత్రం అయి ఉండదు.

సుబ్బలష్షిమి:
ఇంకో సందేహం బావా! అదే ఇంటర్యూలో…..”అలా అందరి ముందర నన్ను ఎన్నిసార్లు అవమానించారో చెప్పలేను. అడుగు తీసి అడుగు వేయాలంటే భయం. ఏంచేస్తే ఎక్కడ కోపమోస్తుందోనన్న భయం. ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో, ఎప్పుడొచ్చి ఆయన నా మీద విరుచుకుపడతారో అని భయం. నేనేం తప్పుచేశానని నన్ను అన్ని మాటలంటున్నారు అని ఆలోచించేవాడిని. అర్ధమయ్యేది కాదు. 15 ఏళ్ళ తర్వాత కూడా నాది అదే పరిస్థితి” అన్నాడు సుమన్. 15 ఏళ్ళ తర్వాత అని 2008 లో అన్నాడంటే….అతడు చెపుతున్న స్థితి అతడికి ప్రారంభమైంది 1993లో అయి ఉండాలి. ఈ టీవీ పుట్టింది 1995 లో. మరి అప్పటికి అతడి ఏ రాతలు నచ్చక రామోజీ రావుకి కోపం వస్తుంది?

సుబ్బారావు:
ఓర్నాయనో మరదలా! సందేహాలంటూ ఏకంగా చిక్కుప్రశ్నలే వేస్తున్నావు. నీ చిక్కు ప్రశ్నలకు సమాధానం రామోజీరావే ఇవ్వగలడు.

సుబ్బలష్షిమి:
సరే వదిలెయ్ బావా! ఇంకొక్క సందేహం తీర్చు. సాక్షి ఇంటర్యూలో సుమన్ “ ఏ కైక ఏ రూపంలో వచ్చి ఏం కోరిందో…. నన్ను వనవాసాలకి పంపారు” అని తండ్రి గురించి అన్నాడు. దశరధుడి కంటే ముగ్గురు భార్యలున్నారు గనక, కౌసల్యా నందనుడిపైన వివక్ష చూపమని కైక కోరింది. మరి రామోజీ రావుకి ఉంది ఒక భార్యే కదా? మరి సుమనేమిటి ఇలా అంటాడు?

సుబ్బారావు:
ఏ కైక ఏ రూపంలో అంటే అర్ధమేమిటో మనకేం తెలుసు మరదలా!

సుబ్బలష్షిమి:

అందుకేనేమో ’ఇంటి గుట్టు ఈశ్వరుడి కెరుక ‘ అంటారు పెద్దలు. బావా! చివరగా ఒక ప్రశ్న! రామోజీ ఫిల్మ్ సిటి భూముల్లో 1300 వందల ఎకరాల భూమి ముస్లిం భూములట, అవి గాలిబ్ జంగ్ వారసుల భూమి అట. ఎప్పుటికైనా ఆ భూములు జంగ్ వారసులకే చెందుతాయట. ఏ కోర్టుల కెక్కినా రామోజీరావుకి ఆ భూములు దక్కవని గోనె ప్రకాష్ రావు ‘సాక్షి’ పత్రికలో ఆరోపిస్తున్నాడు. మరి ఆ భూములలో రామోజీరావు ఫిల్మ్ సిటి ఎందుకు కట్టించాడు బావా? రామోజీరావుకి ఈ విషయం తెలియదా?

సుబ్బారావు:
రామోజీరావు కి జంగ్ లన్నా, పాత బస్తీ ముస్లిం నాయకులన్నా ప్రత్యేక అభిమానం మరదలా! బహుశ బాదరాయణ సంబంధాలు ఉండి ఉంటాయి. కాబట్టి ఆభూములకి వచ్చిన ఢోకా లేదనుకుని ఉంటాడు. కావాలంటే చూడు, పాతబస్తీలో ఎం.ఐ.ఎం. వాళ్ళు ఏం చేసినా, ఈనాడు రామోజీరావు మాత్రం, ఓవైసీ కుటుంబాన్ని ఏమీ అన డు.

సుబ్బలష్షిమి:
నిజమే బావా!

అవసరమైనప్పుడు….. అవసరమైనట్లు పేజీలకు పేజీలు

[టూటీ…. ’గని’పాఠీలు. ఓ.ఎం.సీ. గనుల అక్రమాలపై ఈనాడు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
నవంబరు 21 వ తేదీ ఈనాడు ’పత్రిక’ చూశావా బావా? మొత్తం తొలిపేజీలో రెండు వ్యాపార ప్రకటనలు, పతాకవార్త టూటీ….. ’గని’పాఠీలు తాలూకూ పెద్దపెద్ద అక్షరాల ప్రధాన శీర్షిక, చిన్నపెద్ద అక్షరాల ఉపశీర్షికలూ, ఫోటోలూ పోనూ, అసలు వార్త, కేవలం సింగిల్ కాలం 10 సెంటీమీటర్లే తెలుసా?

సుబ్బారావు:
పదకొండో పేజీలో కొనసాగింపు ఉంది లే మరదలా! అయితే అదీ దాదాపు ఇలాగే ఉందిలే! అయినా ఎవరి అవసరాలు వాళ్ళవి మరదలా! తమకి కావలసినప్పుడు, అప్పటికి కావలసిన వాళ్ళని దేవుళ్ళనటానికీ, వద్దనుకున్నప్పుడు వాళ్ళనే దెయ్యాలనటానికే ఇవాళా రేపు, ఏ పత్రికైనా పేజీలకు పేజీలు అదనంగా కేటాయిస్తోంది. మనమే అమాయకంగా మన డబ్బులు పెట్టి, వాళ్ళ గోకుళ్ళనో, గొడవల్నో చదువుతున్నాం. అంతే!

Sunday, November 22, 2009

కోర్టుల్లో కిలోల లెక్కన న్యాయం దొరుకుతోంది!

[‘ఉత్తరాదీయులపై దాడి కేసులో రాజ్ థాకరే మీద చార్జిషీటు’ శీర్షీక, ఈనాడు, తేదీ: సెప్టెంబరు 19, 2009; పేజీ.నెం.05 – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! గత ఏడాది, ఎం.ఎన్.ఎన్. కార్యకర్తలు, రైల్వే ఉద్యోగ నియామక పరీక్ష వ్రాయడానికి వచ్చిన ఉత్తరాది యువకులని చెప్పులతోనూ, చేతులతోనూ చావబాదటం అందరం టీవీ వార్తల్లో చూసిందే! ఆ కేసు, సంవత్సరం తర్వాత, నిన్న, ముంబై, బాంద్రాలోని మేజిస్ట్రేటు కోర్టులో విచారణకు వచ్చిందట. కేసుని పరిశీలించిన న్యాయమూర్తి నిందితులపై ఆరోపణల నమోదు కు వచ్చే ఏడాది సెప్టెంబరు 13 వ తేదీని నిర్ణయిస్తూ విచారణ వాయిదా వేసాడు. అంటే దాదాపు 10 నెలల తర్వాతన్న మాట. విన్నావా బావా!

సుబ్బారావు:
విన్నాను మరదలా! ఈ లెక్కన ఇక ఆ కేసులు తేలాలంటే ఎన్ని దశాబ్దాలు/శతాబ్దాలు పడతుందో! కోర్టుల్లో న్యాయం కేజీల లెక్కన దొరుకుతున్నట్లుంది కదా, మరదలా!

Saturday, November 21, 2009

తండ్రిపోయిన దుఃఖం నుండి తేరుకోకుండానే…..

[తండ్రి పోయిన దుఃఖంలో ఉన్న జగన్ పై విమర్శలు తగవు – కాంగ్రెస్ స్పోక్స్ మెన్ మనీష్ తివారీ.
తండ్రిపోయిన దుఃఖం నుండి నేనింకా తేరుకోలేదు – జగన్ , వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తండ్రిపోయిన దుఃఖంలో జగన్ ఉన్నాడని, అతడిపై అవినీతి ఆరోపణలు చేయటం తగదని మనీష్ తివారీ అంటున్నాడు. జగన్ కూడా అవునని అంటున్నాడు.

సుబ్బారావు:
తండ్రిపోయిన దుఃఖంలో నుండి తేరుకోకుండానే రాజకీయాలు చేస్తున్నాడా? పైపెచ్చు వ్యూహ ప్రతివ్యూహాలూ పన్నుతున్నాడు కదా?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా, నేనే తరవాత సి.ఎం., నేనే తరవాత సి.ఎం. అని కూడా అంటున్నాడు. బహుశః సి.ఎం. అయితేగానీ తండ్రిపోయిన దుఃఖం నుండి తేరుకోడేమో బావా?

Friday, November 20, 2009

కొండని తవ్వి ఎలుకని పట్టటమంటే…..

[యడ్యూరప్పా……. అందరితో మాట్లాడప్పా!

కన్నడనాట పాలక పక్షంలో ఇటీవలి సంక్షోభానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన సహచరులతో మాటామంతీ లేకుండా భీష్మీంచుకు కూర్చోవటమేనని భాజపా అధిష్టానం తరపున సుష్మాస్వరాజ్ తేల్చి చెప్పారు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
సుష్మాస్వరాజ్ విలేఖరులతో మాట్లాడుతూ “ఇటీవలి సంక్షోభానికి కారణాన్ని కనుగొన్నాం. ముఖ్యమంత్రి యడ్యూరప్ప సహచరులతో మరింత చురుగ్గా సంప్రదింపులు సాగించాల్సి ఉంది!” అని చెప్పిందట, విన్నావా బావా?

సుబ్బారావు:
విన్నాను మరదలా! అయితే…. ఇటీవలి కర్ణాటక సంక్షోభానికి వాటాల గొడవ, శోభా కరంద్లాజేలూ, గాలిసోదరులూ కారణం కాదన్నమాట. యడ్యూరప్ప మూతి మూడుచుకు కూర్చోవటమే అసలు కారణమన్నది నిజంగా అద్భుతమైన పరిశోధన మరదలా! ఈ పరిశోధనకై సుష్మాస్వరాజ్ కి నోబెల్ కు తక్కువ కాకుండా బహుమానం ఇవ్వాలి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! కొండని తవ్వి ఎలకని పట్టింది కదా! నోబెల్ వంటి బహుమానం ఇవ్వాల్సిందే మరి!

Saturday, November 14, 2009

బార్టర్ పద్దతి ఇంకా ఆచరణలోనే ఉంది!

[టివి 9, రవి ప్రకాష్ పై స్టార్ నైట్ ప్రశంసల వర్షం కురిపించింది – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇది విన్నావా బావా! వరద బాధితుల కోసం, మొన్న గచ్చిబౌలీ స్టేడియంలో నిర్వహించిన స్టార్ నైట్ లో, తారలంతా ముక్తకంఠంతో ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన టీవీ 9 నీ, ఆ సంస్థ సి.ఇ.వో. రవిప్రకాష్ నీ, పోటీలు పడి మరీ పొగిడేసారట!

సుబ్బారావు:
అవును మరదలా! మరి, అక్టోబరు 26 వ తేదీన….పీసీసీ అధ్యక్షుడు డి.ఎస్. ఢిల్లీ వెళ్ళగానే….. పీసీసీ అధ్యక్ష పదవి జగన్ కిస్తారని షకీల్ అహ్మద్ చెప్పాడంటూ, తమ విశ్వసనీయతని సైతం ఫణంగా పెట్టిమరీ టీవీ 9 లో ప్రసారం చేశాడు గదా రవిప్రకాష్! బదులుగా….. ఇలా…..తారలందరి చేతా ప్రశంసలు గుప్పించి Exchange favor ఇచ్చారన్నమాట. ఎవరిచ్చారన్నది వేరే విషయం. చెల్లుకుచెల్లు అన్నది అసలు విషయం!

సుబ్బలష్షిమి:
అంటే బార్టర్ పద్దతి ఇంకా ఆచరణలోనే ఉందన్నమాట!

Friday, November 13, 2009

రమణారెడ్డి అన్నట్లు ఆశకు చావే…… లేదు

[ఎప్పటికైనా సి.యం. నవుతా – జగన్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా? జగన్ “ఈ రాష్ట్రముఖ్యమంత్రి స్థానంలో, మీ చిన్నతమ్ముడిగా మీముందు కొస్తాను. అది ఈరోజు కాకపోవచ్చు, ఈ సంవత్సరం కాకపోవచ్చు, రెండేళ్ళలో కాకపోవచ్చు. ఎప్పటికైనా సీ.ఎం. నవుతా” అన్నాడట.

సుబ్బారావు:
చూశాను మరదలా! సంవత్సరాలెందుకు? "ఈ జన్మకు కాకపోవచ్చు. మరు జన్మకు కాకపోవచ్చు. అయినా ఫర్వాలేదు. ఎప్పటికైనా సీ.ఎం. నవుతా” అనాల్సింది.

సుబ్బలష్షిమి:
ఏమైనా గుండమ్మ కథ సినిమాలో రమణారెడ్డి అన్నట్లు, "ఓసి పిచ్చిదానా! ఆశకు చావే….. లేదు” అన్న డైలాగు గుర్తొస్తోంది బావా! నిజంగానే ఆశకు చావు లేదు కదా!

Thursday, November 12, 2009

ఎంత నీచమైన పనికైనా పాజిటివ్ కాప్షన్లు!

[’ఇటీవలి కాలంలో కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఆ రీత్యా గ్రేటర్ టిక్కెట్లకు రద్దీ పెరిగింది. దానిపై ఆరోపణలు రావడం సహజమే’ – అన్న ముఖ్యమంత్రి రోశయ్య, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ పెరిగి, ప్రజాసేవ చేయటం కోసం తోసుకు తోసుకు వస్తున్నారటగా బావా?

సుబ్బారావు:
అలాగ్గాక, కాంగ్రెస్ లో ఉంటే దోచుకు తినటానికి కావలసినన్ని దారులు ఉన్నాయనీ, అందుకే టిక్కెట్లు కోసం తోసుకు తోసుకు వస్తున్నారనీ…. నిజం చెబుతారా ఎవరైనా? మరీ నీకు లౌక్యం తెలియదు మరదలా!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఎంత నీచమైన పనికైనా పాజిటివ్ కాప్షన్లు పెట్టడం… ఇవాళా, రేపూ రాజకీయనాయకులూ, కార్పోరేట్ దిగ్గజాలూ చేస్తూన్నదే, మనం చూస్తూన్నదే!

Wednesday, November 11, 2009

జిజియా పన్నులాంటివి మాత్రమే మిగిలి ఉన్నాయి!

[ప్రపంచబ్యాంకు నిర్దేశాలననుసరించి చిరువ్యాపారుల మీద కత్తి ఝుళిపించనున్న కేంద్రప్రభుత్వం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ దారుణం చదివావా బావా? పుట్ పాత్ ల మీద బ్రతికే బడుగు జీవుల చిరువ్యాపారులను కట్టడి చేయనుంది కేంద్రప్రభుత్వం! ఇలా పేదసాదల కడుపులు కొడితేనే కదా కార్పోరేట్ వ్యాపారాలు ఇబ్బడిముబ్బడి అయ్యేది?

సుబ్బారావు:
అప్పుడే ఏం చూశావు మరదలా? ఇంకొన్నిరోజులు పోతే సామాన్యులు ఊపిరి పీల్చినందుకు కూడా పైసలు కట్టాల్సిందే అంటుంది కేంద్రప్రభుత్వం.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! జిజియా పన్ను విధించిన ఔరంగజేబు మంచి వాడు అన్పించాలంటే, వీళ్ళు ఇలాంటిపన్నులే విధించాలి మరి!

Monday, November 2, 2009

కాంగ్రెస్ అధిష్టానాన్ని, రామోజీరావు ఎప్పుడు కలిసాడు?

[జగన్ సీ.ఎం. కాకుండా చంద్రబాబునాయుడు, రామోజీరావు కుట్ర పన్నారని, మాజీమంత్రి కొండా సురేఖ భర్త, ఎమెల్సీ, కొండా మురళి ఆరోపణ – సాక్షి వార్త నేపధ్యంలో!]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా? మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి, ‘జగన్ సీ.ఎం. కాకుండా చంద్రబాబు, రామోజీరావు కుట్రపన్నుతున్నా’రంటాడు. సీ.ఎం. పదవి ఇచ్చేదీ, ఇవ్వనిదీ కాంగ్రెస్ అధిష్టానమైన సోనియాగాంధీ కదా? ఆమెని రామోజీరావు ఎప్పుడు కలిసాడు? ఎలా ప్రభావితం చేసాడు?

సుబ్బారావు:
చూద్దాం మరదలా! మరి, అంతమాట కొండా మురళి అంటేనూ, సాక్షి పత్రిక ప్రచురిస్తేనూ….. ప్రతిపక్షాలూ, తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకులు గమ్మునున్నారెందుకూ? "ఏమిటిది? మోకాలికీ బోడిగుండుకీ ఎలా ముడిపెడతున్నావూ? మాట అనగానే సరా? ఏదీ నీ దగ్గర ఆధారాలుంటే చూపెట్టు!” అనటం లేదేం?

సుబ్బలష్షిమి:
అదేకదా బావా! ఎంతయినా తెగేదాకా లాగటం అంటే ఎవరికైనా భయమే!