Tuesday, December 28, 2010

మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే, క్రికెట్ మ్యాచ్ ల్లో గెలుపోటములు గాకుండా, ఇంకా ఏమేం జరగొచ్చు?

సుబ్బలష్షిమి:
బావా! మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటే, క్రికెట్ మ్యాచ్ ల్లో గెలుపోటములు గాకుండా, ఇంకా ఏమేం జరగొచ్చు?

సుబ్బారావు:
కేసీఆర్ లూ, చంద్రబాబులూ వంటి వారు ఆమరణ నిరహార దీక్షలు చేయొచ్చు. అంతగా అయితే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కేస్తారన్న ధీమా ఉంటుంది గదా!

నవాబ్ షరీఫ్ లు లాహోర్ నుండి లాంగ్ మార్చ్ లు నిర్వహించొచ్చు. ఒక్క ఆత్మహుతి దాడీ, బాంబుదాడీ జరగదన్న ధీమా ఉంటుంది కదా!

వీపీ సింగ్ లు ఖలిస్తాన్ ఉద్యమం రగులుతున్న రోజుల్లో కూడా పంజాబ్ లో పర్యటనలు చేయొచ్చు. ఒక్క తూటా కూడా పేలదన్న ధీమా ఉంటుంది కదా!

అవినీతి ఆరోపణలెదుర్కుంటున్న ముఖ్యమంత్రులూ, ప్రధానమంత్రులూ, ఫలానా వారి అధ్యక్షతన గల ఫలానా కమిటీ ముందు హాజరవుతానన వచ్చు. ఇరుకున పడబోమన్న ధీమా ఉంటుంది గదా!

ప్రభుత్వ ఉద్యోగాల ఇంటర్యూలలో ఎక్కువ మార్కులు సంపాదించి ఉద్యోగాలను అందిపుచ్చుకోవచ్చు. ఏపీపీఎస్సి ఛైర్మన్ వెంకట రామిరెడ్డి నిర్వాకం అదే కదా!

ఇప్పటికివి, బయటకొస్తే ఇలాంటివి మరెన్నో!

సుబ్బలష్షిమి:
ఇవే కాదు బావా! పిల్లల చదువులతో నిమిత్తం లేకుండా స్కూళ్ళు, కాలేజీలు ర్యాంకుల అవకతవకలతో ఇమేజ్ పెంచుకోవచ్చు కూడా!

సుబ్బారావు:
నిజమే మరదలా!

Monday, December 27, 2010

ప్రజలు రాజహంసలై పోవాలన్నమాట!

[డబ్బుతో కొవ్వెక్కిన జగన్ – ‘ఈనాడు’లో డీఎల్ రవీంద్రా రెడ్డి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చంద్రబాబు, జగన్ ల నిరహార దీక్షల నేపధ్యంలో ఈనాడులో డీఎల్ రవీంద్రా రెడ్డి, చంద్రబాబు దీక్షని సమర్ధిస్తూ,

>>>డబ్బు మదం ఎగిసి పడుతుంది. డబ్బు అనే కొవ్వు పదార్ధం నీ జీవ కణాల్లో ఉంది. ఆ కొవ్వుతో… సంపాదించిన సొమ్ముతో పత్రిక పెట్టి అడ్డగోలుగా వ్రాస్తావా? నిమ్స్ వైద్యుల పనితీరునే శంకిస్తావా? ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎంఎస్ చేసి ఐఎఎస్ అయి, 11 ఏళ్ళు ఐక్యరాజ్య సమితిలో పనిచేసి వచ్చారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు అయిదుగురు నిపుణులున్నారు. కనీసం వీరి వివరణ కూడా లేకుండా చంద్రబాబు దీక్షపై ఇష్టానుసారం వ్రాస్తారా?

అంటూ మండి పడ్డాడు. నిమ్స్ వైద్యుల నిజాయితీ శంకించరాదంటు తేల్చి చెప్పాడు.
మరో వైపు అదే రోజు కేంద్రమంత్రి కపిల్ సిబాల్ వ్యాఖ్యలు చూడు…

>>>అవినీతి ఒక సామాజిక సమస్యగా మారిన విషయాన్ని మాత్రమే తాను ప్రస్తావించదలచుకున్నట్లు సిబల్ చెప్పారు. మీడియా కూడా దీనికి అతీతం కాదని, అలాగే రాజకీయవర్గం, ఉద్యోగవర్గాలు.. ఏవీ దీనికి దూరం కాదని తెలిపారు.

రాష్ట్రమంత్రి, కేంద్రమంత్రుల్లో ఎవరి మాట నమ్మాలి బావా?

సుబ్బారావు:
డబ్బు కొవ్వు, అధికార మదం తాలూకూ వ్యవహారాలు ప్రక్కన బెడితే… ‘ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధికులు అవినీతి పరులే’నన్నది మన బోటి సామాన్యులకి కూడా అనుభవపూర్వకంగా తెలిసిందే మరదలా!

ఇక ‘రాష్ట్ర, కేంద్ర మంత్రుల మాటల్లో ఎవరి మాట నమ్మాలి’ అంటావా?

పూర్వం రాజహంసలుండేవట. పాలనీ నీళ్ళనీ వేరు చేసేవట. అలాగే ప్రస్తుతం ప్రజలు కూడా నిజానిజాలని వేరు చేయగలిగితే అప్పుడు తెలియాల్సిందే!

సుబ్బలష్షిమి:
అయితే ప్రజలు రాజహంసలై పోవాలన్నమాట!

కొన్ని నిజాలు ఇప్పుడు! అన్ని నిజాలు ఎప్పుడో?

[నిఘా సంస్థలా అమెరికా మాదక ద్రవ్య విభాగం – వికీలీక్స్ వెల్లడించిన అమెరికా రహస్య దౌత్య పత్రాల నేపధ్యంలో – ఈనాడు వార్త(27 డిసెంబరు, 2010)]

సుబ్బలష్షిమి:
బావా! ప్రపంచ వ్యాప్తంగా మాదక ద్రవ్యాలని అరికట్టేందుకు ఏర్పాటైన అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) నిఘా సంస్థలా వ్యవహరిస్తోందని వికీలీక్స్ వెల్లడించిన పత్రాల ద్వారా తెలిసిందట. 63 దేశాల్లో ఉన్న 87 కార్యాలయాల ద్వారా, కొందరికి వారి రాజకీయ శతృవుల సమాచారం అంద చేయడానికీ, గూఢచర్యం నిర్వహించడానికీ డీఈఏ కార్యకలాపాలు నిర్వహించిందని వెల్లడయ్యిందట. పనామా అధ్యక్షుడి వంటి ఉదాహరణలతో సహా వికీలీక్స్ బయట పెట్టినట్లు ద న్యూయార్క్ టైమ్స్ పేర్కొందట; తెలుసా?

సుబ్బారావు:
అమెరికా మాదక ద్రవ్య విభాగం అననీ, మరో xyz అననీ, అవన్నీ పైకారణాలే(over leaf reasons) మరదలా! లోపల నడిపేది గూఢచర్యమే! ఈ విషయాన్ని ‘అమ్మఒడి’ దాదాపు రెండేళ్ళ నుండి చెప్పుకొస్తూనే ఉంది. అదే ఇప్పుడు వెల్లడౌతోంది.

సుబ్బలష్షిమి:
అవును బావా! ఇప్పుడిప్పుడే ‘కొన్ని’ నిజాలు వెల్లడౌతున్నాయి. ఇక ‘అన్ని’ నిజాలూ వెల్లడి కావటానికి ఇంకెంత కాలం పడుతుందో!?

Sunday, December 26, 2010

నిజాలు నిలకడ మీదనే కదా తేలాలి?

[లక్ష కోట్లు ఖర్చు పెట్టటానికే పుట్టాడు జగన్ – వెంకట స్వామి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ‘ముఖ్యమంత్రిగా ఉండగా వై.ఎస్.ఆర్. అవినీతితో లక్ష కోట్లు సంపాదించాడనీ, తండ్రి సంపాదించిన ఆ లక్ష కోట్లు ఖర్చు పెట్టటానికే జగన్ పుట్టాడనీ’ కాంగ్రెస్ నేత వెంకట స్వామి అంటున్నాడు, విన్నావా?

సుబ్బారావు:
శుభమ్! ఆ ముసలి రాజకీయ వేత్త, ఈ కుర్ర రాజకీయ వేత్తకి మంచి దీవెనే ఇచ్చాడు మరదలా! లక్ష కోట్లు ఖర్చయ్యాకనైనా, అసలు నిజాలేమిటో బయట పడతాయి కదా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! నిజాలు నిలకడ మీదనే కదా తేలాలి?

Friday, December 24, 2010

బహుశః ఇవి ఆత్మ రాజకీయాలై ఉంటాయి!

[జగన్ చర్యలకి వై.యస్. ఆత్మక్షోభిస్తుంది. రైతులకి ప్రభుత్వ ప్యాకేజీ చూసి వై.యస్. ఆత్మ సంతోషిస్తుంది – కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వ్యాఖ్యలు – డీడీ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వై.యస్. జగన్ మాటలూ చేతలూ చూసి వై.యస్. ఆత్మ క్షోభిస్తోందట. రైతుల కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ చూసి వై.యస్. ఆత్మ సంతోషిస్తోందట. కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వ్యాఖ్యానించాడు,

మరి అతడికి ఆత్మలతో మాట్లాడే కళేమైనా తెలుసేమో! ఇంతకీ బావా! మనం ఇప్పటి వరకూ శవ రాజకీయాలు చూశాం, సీటు రాజకీయాలు చూశాం, ఇవేం రాజకీయాలు బావా?

సుబ్బారావు:
బహుశః ఇవి ఆత్మ రాజకీయాలై ఉంటాయి మరదలా!

పేరు తలుచుకోవాటానికే భయమయిన చోట నివాళులు కూడానా!

[డిసెంబరు 23న మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతి,
మాజీ ప్రధాని పీవీజీ వర్ధంతి – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చరణ్ సింగ్… కొన్ని నెలలు ప్రధానిగా పనిచేసాడు. ఒక్కరోజు కూడా ప్రధానిగా పార్లమెంటుకు హాజరు కాని వాడిగా పేరు గాంచాడు. తొలుత కాంగ్రెస్ లో ఉండి, పిదప పార్టీలు మారినవాడు. అలాంటి వాడికి కూడా పార్లమెంట్ సెంట్రల్ హాలులో వర్ణచిత్రం ఉంటుంది. జయంతి వర్ధంతులకి ప్రస్తుత ప్రధానులు స్పీకర్లు నివాళులు అర్పిస్తారు.

మాజీ ప్రధాని పీవీజీ… జీవిత కాలం పాటు కాంగ్రెస్ కండువాని మార్చలేదు. కష్టకాలంలో ప్రధాని అయి దేశాన్ని, ప్రభుత్వాన్నీ పూర్తికాలం నడిపించాడు. ఆయనకి చిత్రపటాలూ ఉండవు, పుష్పాంజలులూ ఉండవేం బావా!?

సుబ్బారావు:
భలే చెప్పావులే మరదలా! పీవీజీ పేరు తలుచుకోవాలంటేనే యూపీఏ ఛైర్ పర్సన్ కీ, ప్రధానమంత్రికీ, కేంద్రమంత్రుల్లో మరికొందరికీ భయమూ, విద్వేషమూ! ఇక వర్ణపటానికి ఎదురుగా నిలబడి నివాళులర్పించగలగటం కూడానా!

Tuesday, December 21, 2010

సోనియా, సావిత్రి కంటే మహానటి లాగుంది!

[అవినీతిని సహించం – కాంగ్రెస్ ప్లీనరిలో పార్టీకి సోనియా దిశా నిర్దేశం – ఈనాడు (20 డిసెంబరు, 2010) వార్త.

ధరలను దించాల్సిందే – యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ సూచన – సాక్షి (21 డిసెంబరు, 2010) వార్తల నేపధ్యంలో! ]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ ప్లీనరీలో అవినీతిని సహించమంటూ సోనియా పార్టీకి దిశానిర్దేశం చేసిందట తెలుసా?

సుబ్బారావు:
అందుకే కదా మరదలా, పార్టీ నియమావళి మార్చేసి మరీ, అధ్యక్షురాలి పదవీ కాలాన్ని మూడు నుండి అయిదేళ్ళకు పెంచేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించారు!

సుబ్బలష్షిమి:
పైగా ధరలను దించాల్సిందేనంటూ యూపీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచించిందట బావా! నాకు అర్ధంగాక అడుగుతానూ, యూపీఏ లో ప్రధాన పార్టీ కాంగ్రెస్సే కదా! కేంద్రంలో అధికారంలో ఉన్న మంత్రుల్లో అత్యధికులు కాంగ్రెస్ వాళ్ళే కదా! ప్రధాన మంత్రీ కాంగ్రెస్సే కదా! మరి యూపీఏ కి సూచించిన కాంగ్రెస్ అంటే అర్ధం ఏమిటి? తమకి తామే సూచించుకున్నారా? ఇదేం రెడ్ టేపిజమ్?

సుబ్బారావు:
అసలుకే… సోనియా, మన్మోహన్ గట్రా ప్రస్తుత కాంగ్రెస్ బృందం, రెడ్ టేపిజానికి మహారాజ పోషకులు మరదలా! ఆపైన ఇలాంటి లిటిగేషన్ మాటలతో, చేతలతో దాన్ని మరింత కొత్త పుంతలు తొక్కిస్తుంటారు. అంతే!

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! నిత్యావసరాల ధరలు తగ్గించేందుకూ, నల్ల బజారును అరికట్టేందుకు రాష్ట్రాలు సహకరించటం లేదని నిందిస్తున్నారు కూడా!

సుబ్బారావు:
ఏ రాష్ట్రమో ఎందుకు మరదలా! ఆంధ్రప్రదేశ్ లోనే నల్లబజారులో సరుకులను దాచిన గిడ్డంగులను ఎర్రపార్టీ నేత చికెన్ నారాయణ ఎన్నో సార్లు తాళాలు బద్దలు కొట్టి మరీ చూపించాడు. అధికారులు కూడా ఎన్నోసార్లు దాడులు చేసి పట్టుకున్నారు. ఆ తరువాత కేసులు ఎటుపోయాయో ఎవరికీ తెలియదు. యథాప్రకారం నల్లబజారు నడుస్తూనే ఉంది. ఇంకేం చెబుతాడు ఈ ప్రధాని?

సుబ్బలష్షిమి:
మరి, పార్టీలకతీతంగా రాజకీయులు ఎన్నికల్లో నిలబడాలంటే టిక్కెట్లు కొనుక్కోవాలి. గెలవాలంటే ఓట్లతో సహా చాలా కొనుక్కోవాలి. డబ్బు బాగా ఖర్చు పెట్టాలి. గెలిచాక మంత్రిపదవులు కొనుక్కోవాలి. కీలక శాఖలు కావాలంటే మరింత ఖర్చు తప్పదు. మంత్రులయ్యాక దోచిన దాంట్లో పైకి వాటాలు పంపించాలి. అలాంటప్పుడు నిత్యావసరాలు దగ్గర నుండి అన్నిట్లోనూ నల్లబజార్లతో సహా అన్ని రకాల దోపిడిలూ చేస్తారు కదా!

అవేవీ ఆపకుండా, తమ వాటాలూ మానకుండా, మాటలకి మాత్రం ‘నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి, నల్లబజారు నియంత్రణకి రాష్ట్రాలు సహకరించటం లేదు’ అనటం, ‘అవినీతిని సహించం’ అనటం, కేవలం నటన బావా!

సుబ్బారావు:
చూడబోతే సోనియా, సావిత్రి కంటే మహానటి లాగుంది మరదలా!

Friday, December 17, 2010

స్నేహితులూ, తోబుట్టువులే జాతర బొమ్మలు!

[స్నేహితుడిని మించిన సంపాదనతోనే సంతోషం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం 13 దేశాల్లో జరిపిన సర్వే ప్రకారం, అత్యధికులు ‘తమ సంపాదన తన స్నేహితుల సంపాదన కంటే మెరుగ్గా ఉంటేనే సంతోషిస్తున్నారని’ వెల్లడయ్యిందట. డైలీ మెయిల్ ఈ వివరాలని ప్రచురించిందట, తెలుసా?

సుబ్బారావు:
అంటే ఆ అత్యధికులకి… తమ స్నేహితులే వారి జాతర బొమ్మలు కాబోలు మరదలా! స్నేహితుల పట్ల కూడా స్నేహం కంటే అసూయే ఎక్కువగా ఉండటమే కదా ఇది! అంతగా ఈర్ష్యాసూయలూ, అరిషడ్వర్గాలూ పెరిగి పోతున్నాయి కాబోలు!

సుబ్బలష్షిమి:
స్నేహితుల మధ్యే కాదు, కుటుంబ సభ్యుల మధ్య, తోడబుట్టిన వాళ్ళ మధ్య కూడా ఇలాంటి ఈర్ష్యాసూయలే ఉంటున్నాయి. చిన్నప్పుడు విన్న ‘టుంగుబుర్ర’ కథలో మాదిరిగా, ఎవరితోనైనా పోల్చుకోవటం, ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎన్వీ అంటే ఔననుకోవటం… అలవాటై పోయినట్లుంది బావా!

సుబ్బారావు:
అంతేమరి! అరిషడ్వర్గాలనీ, అహంకారాన్నీ వదిలించుకొమ్మని గాక, తగిలించుకొమ్మని… అన్నివైపుల నుండీ వినబడుతున్న, కనబడుతున్న సమాజంలో పరిణామాలు ఇలాగాక ఇంకెలా ఉంటాయి మరి!?

Thursday, December 16, 2010

అవినీతికంటే ట్యాపింగే ముఖ్యం కాదా మరి!

[ట్యాపింగే ముఖ్యం, మంత్రాంగమంతా కార్పోరేట్లదే – అద్వానీ వ్యాఖ్యల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రధానమంత్రికి అవినీతి కంటే ట్యాపింగే ముఖ్యమనీ, ప్రభుత్వాన్ని లాబీయిస్టులే శాసిస్తున్నారనీ అద్వానీ వ్యాఖ్యానించాడు, చూశావా?

సుబ్బారావు:
ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నవారికి ట్యాపింగే ముఖ్యం మరదలా! లేకపోతే – ఎవరెవరు ఎంతెంత అవినీతికి పాల్పడుతున్నారో, అందులో తమ వాటా తమకి సరిగా ముట్టజెబుతున్నారో లేదో సరి చూసుకునేదెట్లా!?

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! మంత్రుల పోర్టు పోలియోలేం ఖర్మ, వ్యాపార వేత్తలు పార్టీలలో ఏ రంగు దుస్తులు ధరించాలో కూడా సలహాలు చెప్పగలిగేంతగా లాబీయిస్టులు శాసిస్తున్నారు!

సుబ్బారావు:
లాబీయిస్టులా మజాకా!?

Wednesday, December 15, 2010

అన్నీ కాగితాల మీదే కదా!? ఏదైనా సాధ్యమే!

[దిగొచ్చిన ద్రవ్యోల్బణం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కొన్ని రకాల ఆహార పదార్ధాల ధరలు దిగి రావటంతో, ద్రవ్యోల్బణం రేటు కూడా దిగొచ్చిందట. నవంబరు నెలలో 7.48 శాతానికి క్షీణించిందట. ఇది 11 నెలల కనిష్ట స్థాయి అట, తెలుసా?

సుబ్బారావు:
ఏ రకాల ఆహార పదార్ధాల ధరలు తగ్గాయో మరదలా! బహుశ సంపన్నులు తినే ప్రత్యేక రకాల ఆహారపదార్ధాలేమో! సామాన్యులకైతే మార్కెట్ కెళ్తే మొహం తిరిగి స్పృహ తప్పి పడేలా ఉంది పరిస్థితి. ఉల్లి కేజీ ముఫై ఆరు, వెల్లుల్లి కిలో రెండువందల పాతిక, నూనె ఎనభై రూపాయలు వగైరా! బియ్యం ఎగుమతిపై ఆంక్షల ఎత్తివేత ప్రకటన రాగానే కేజీకి రెండు రూపాయలు పెరిగిందట. ఆర్ధికవేత్తలేవో లెక్కలు చెబుతారు. అర్ధం గాక బుర్ర గోక్కోవాల్సిందే జనం! మరి ఆర్ధిక వేత్తలా మజాకానా?

సుబ్బలష్షిమి:
సాధారణంగా చల్లని వాతావరణానికి కాస్త ఏపుగా పెరుగుతాయి గనుక, చలికాలంలో ఆకు కూరలు, కాయకూరల ధరలు కొంచెం తక్కువగా ఉంటాయి. అదేం చిత్రమో! ఈ సారి వేటి ధరలూ అందుబాటులో లేవు.

సుబ్బారావు:
వేటి ధరలూ అందుబాటులో లేకపోయినా, ద్రవ్యోల్బణం రేటు తగ్గుతుంది, వృద్ధి రేటు పెరుగుతుంది. అన్నీ కాగితాల మీదే కదా!? ఏదైనా సాధ్యమే!

బహుశః వ్యూహాత్మక అమాయకత్వం నటించి/నటిస్తూ ఉంటాడు!

[డబ్బు ఒకే దగ్గర పోగుపడటం అనైతికం – ప్రధాని మన్మోహన్ సింగ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ‘సామాన్యుడిని దృష్టిలో ఉంచుకొమ్మని’ ప్రధాని మన్మోహన్ సింగ్ కార్పోరేట్లకు హితవు చెప్పాడు. ‘డబ్బు ఒకే దగ్గర పోగుపడటం అనైతికం’ అని వ్యాఖ్యానించాడు కూడా! తెలుసా?

సుబ్బారావు:
ముఖేష్ అంబానీకి చట్టాలు సవరించి మరీ 30 వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చునప్పుడూ, కార్పోరేట్ దిగ్గజాలు 27 అంతస్థుల విల్లాలు నిర్మించుకుంటున్నప్పుడూ, భార్యలకు విలాసవంతమైన నౌకలూ విమానాలు గట్రా భారీ బహుమానాలు ఇచ్చుకుంటున్నప్పుడూ, తాను స్వయంగా కార్పోరేట్ కింగులకు xyz కోట్ల రూపాయల మేర పన్ను రాయితీలు కల్పించేటప్పుడూ… తెలియలేదు కాబోలు, ఈ ఆర్ధిక వేత్త కమ్ ప్రధానమంత్రి గారికి… డబ్బు ఒకే దగ్గర పోగుపడుతుందనీ, అది అనైతికమనీ!

సుబ్బలష్షిమి:
తెలియక పోదులే బావా! బహుశః వ్యూహాత్మక అమాయకత్వం నటించి/నటిస్తూ ఉంటాడు.

Tuesday, December 14, 2010

వలస వచ్చిన వారితోనే నేరాలన్నీ!

[వలస వచ్చిన ప్రజలతోనే ఢిల్లీలో నేరాలు – చిదంబరం వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వలస వచ్చిన ప్రజలతోనే ఢిల్లీలో నేరాలు జరుగుతున్నాయని చిదంబరం అంటున్నాడు. ఎన్నాళ్ళకి నిజం చెప్పాడు బావా!?.

సుబ్బారావు:
మనమూ, జనమూ అంటున్నది కూడా అదే మరదలా! ఇటలీ నుండి వలస వచ్చినామెతోనే దేశంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే!

ఇటలీ ముస్సోలినీ నుండి నేర్చుకుని వచ్చినట్లుంది!

[మన్మోహన్ కు అండదండలు – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2G స్పెక్ట్రమ్ అవినీతి విషయంలో జేపీసీ వేసే ప్రసక్తే లేదని యూపీఏ కుర్చీవ్యక్తీ, ఏఐసీసీ అధినేత్రీ సోనియా తేల్చి చెప్పిందట. అవినీతిపై భాజపా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని మండిపడిందట.

సుబ్బారావు:
భాజపా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందంటే అర్ధం – మీరు దోచుకుంటే తప్పులేదు కాని మేం దోచుకుంటే గోల చేస్తారేమని కాబోలు!

సుబ్బలష్షిమి:
అంతేగాక ప్రధాని వ్యవస్థను పలుచన చేయరాదని సుద్దులు కూడా చెప్పిందట, తెలుసా!?

సుబ్బారావు:
ఆ ప్రధానీ, ఈ కుర్చీవ్యక్తీ మాత్రం అన్ని వ్యవస్థల్నీ పలుచన చేస్తూ అడ్డంగా దోచుకుతినే అవినీతి పరులకి కొమ్ముకాస్తారు. ఇంతగా అవినీతికి ప్రభుత్వమే పాల్పడుతుండగా, ప్రధాని వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థల్నీ వీళ్ళ కంటే పలుచన చేయగల వాళ్ళు, ఇంకెవ్వరుంటారు మరదలా!?

మహా గొప్ప సుభాషితాలు చెబుతోంది ఈ అధినేత్రి! బహుశః, తెర వెనుక బ్రిటన్ ఏజంట్ గా ఉంటూ, తెర మీద ఇటలీ నియంతగా వెలిగిన ముస్సోలినీ నుండి నేర్చుకుని వచ్చుంటుంది, ఇటలీ నుండి ఇండియాకి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఇలాంటి వ్యవహార తీరుని ఉగ్గుపాలతోనే నేర్చినట్లుంది!

Monday, December 13, 2010

రాజకీయులకీ, మీడియాకీ ప్రజలు పెద్ద గజనీలనే అభిప్రాయమయ్యె!

[విశ్వసనీయత లేకుంటే… అన్నేళ్ళు ఎలా పాలించాను? నా పాలనలో ఒక్క కుంభకోణం జరగలేదు – చంద్రబాబు వ్యాఖ్యల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! విశ్వసనీయత లేకుంటే అన్నేళ్ళు ఎలా పాలించానంటున్నాడు చంద్రబాబు. అక్కడికి ప్రజల కేదో నిర్ణయాధికారం ఉన్నట్లు! అదే ఉంటే – మొన్న చంద్రబాబునీ, నిన్న వై.యస్సార్ నీ, ఈ రోజు సోనియా మన్మోహన్ లనీ సీట్లలో కూర్చోనిచ్చేవారా? ఎన్నికల్లో గెలవటానికి ఎవరి దారులు వారివయ్యె!

పైగా విశ్వసనీయతకి తననే చెప్పుకోవాలట. తన పాలనలో కుంభకోణాలు జరగలేదట.

సుబ్బారావు:
పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి పంపించాడు మరి. ఖచ్చితంగా విశ్వసనీయతకి ఇతణ్ణే చెప్పుకోవాలి. ఇక అవకతవకల గురించి అంటావా? చంద్రబాబు దోపిడి వై.యస్.ఆర్ దోపిడి ముందు బలాదూర్. అలాగే వై.యస్సార్ దోపిడి కంటే ఎక్కువ దోపిడి చేసే ముఖ్యమంత్రి వస్తే, అప్పుడు వై.యస్.ఆర్. దోపిడి కూడా చాలా తక్కువే అనేయవచ్చు.

ఈ దోపిడిలను జనం మెదళ్ళ నుండి మైమరిపించటానికి మీడియా ఎలాగూ ఉండనే ఉంది. రాజకీయులకీ, మీడియాకీ ప్రజలు పెద్ద గజనీలనే అభిప్రాయమయ్యె!

Saturday, December 11, 2010

గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లు…

[ఉద్యమాల ముసుగులో మామూళ్ళు – జేపీ,
దమ్ముంటే ఆధారాలు బయటపెట్టు – కేటీఆర్ వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! లోక్ సత్తా నేత జేపీ
>>>ఉద్యమాలు, పార్టీల ముసుగులో కొందరు బలవంతపు వసూళ్ళు చేస్తున్నారు. హింస, విధ్వంసం, రక్తపాతం, భయంతో ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు.
అన్నాడు.

జేపీ ఎవరి పేరుని ఉద్దేశించకపోయినా, ‘గుమ్మడి కాయల దొంగంటే భుజాలు తడుముకున్నట్లు…’ ఆ వ్యాఖ్యలకు స్పందిస్తూ తెరాస నేత కేసీఆర్ తనయుడు కేటీఆర్

>>>ఉద్యమాలు, పార్టీల ముసుగులో బలవంతపు వసూళ్ళు చేస్తున్నారంటూ ఆరోపించిన కుహనా మేధావికి దమ్ముంటే ఆధారాల్ని అసెంభ్లీలో ప్రవేశపట్టాలి. ఎలాంటి ఆధారాల్లేకుండా తెలంగాణాకు వ్యతిరేకంగా అడ్డగోలుగా మాట్లాడటం ఆపకపోతే హైదారాబాదులో తిరిగే పరిస్థితి ఉండదు.
అన్నాడు.

“తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడితే హైదరాబాదులో, తెలంగాణా జిల్లాల్లో ఎలా తిరుగుతారో చూస్తాం, నాలుకలు కోస్తాం”,… అంటూ బాహాటంగానే దందాగిరి చేసారు, చేస్తున్నారు కదా? ఇంకేం ఆధారాలు కావాలట? “తెలంగాణాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఖబడ్ధార్” అని బెదిరించేవాళ్ళు “చందాలివ్వక పోతే చూస్కోమల్లా?” అనరా?

సుబ్బారావు:
వాళ్ళు తెరాస వాళ్ళు మరదలా!? ఏం అనటానికైనా, ఏం చెయ్యటానికైనా తమకి హక్కుంది అనుకుంటారు. బహుశః దందాగిరి ఆ పార్టీ సంస్కృతి కావచ్చు.

సుబ్బలష్షిమి:
కాదు బావా! ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు రజాకర్ల గురువు నిజాం ఆదర్శప్రాయుడట ! అప్పుడు ఆ పార్టీ నుండి ఇలాంటి వ్యాఖ్యలు కాక ఎలాంటి వ్యాఖ్యలొస్తాయి మరి!

Tuesday, December 7, 2010

చక్రాల కుర్చీలో కూర్చొని కూడా… అధికారం వదలకుండా…

[రాజీనామా చేశాక కూడా రాజా మీద ఇంత గొడవెందుకు? , లక్షల కోట్లల్లో అవినీతి ఒక్కడే ఎలా చేయగలడు? – కరుణా నిధి వ్యాఖ్యల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి, 1.76 లక్షల కోట్ల రూపాయల అవకతవకగా హోరెత్తుతున్న 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారం మీద… ‘రాజీనామా చేశాక కూడా రాజా మీద గొడవేంటని’ విరుచుకు పడుతున్నాడు చూశావా?

సుబ్బారావు:
అంటే అందినంత సొమ్ము నొక్కేసి, ఆనక రాజీనామా చేస్తే… సరిపోతుంది కాబోలు! రాజీనామా చేశాడు కాబట్టి ఇక మింగిన సొమ్ము గురించి గోలపెట్ట కూడదన్న మాట! ఎంత గొప్ప భాష్యం చెప్పాడు మరదలా, ఈ రాజకీయ వృద్ధనేత?

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! ’లక్షల కోట్లలో అవకతవకలని రాజా ఒక్కడే ఎలా చెయ్యగలడూ?’ అని నిలదీస్తున్నాడు. ‘కాబట్టి ఆరోపణలన్నీ అబద్దాలేనని’ బుకాయిస్తున్నాడు కూడా!

సుబ్బారావు:
లక్షల కోట్లలో అక్రమాలు, రాజా ఒక్కడే చేశాడని ఎవరన్నారు మరదలా!? నీరా రాడియా వ్యవహారంలో ఎన్ని విషయాలు బయటికి రాలేదూ? తమకు అనుకూలంగా యూపీఏ ప్రభుత్వంలో మంత్రుల నియామకం నుండి, కార్పోరేట్ల అధినేతలతో మాటల దాకా! వీర్ సంఘ్వీ, బర్ఘాదత్ ల వంటి జర్నలిస్టులూ… ఇలా తిలా పాపం తలా పిడికెడు, చాలామందే పుచ్చుకున్నారు కదా!? అదేమీ తెలియనట్లు మాట్లాడుతున్నాడు సుమా, కరుణా నిధి!?

సుబ్బలష్షిమి:
మరి, చక్రాల కుర్చీలో కూర్చొని కూడా అధికారం వదలకుండా, ‘రాముడు ఇంజనీరింగ్ చేశాడా?’, ‘రాముడు తాగుబోతు!’… గట్రా కూతలు కూసే వాడు, ఇంతకంటే బాగా ఎలా మాట్లాడు గలడు బావా!

రతన్ టాటా పారిశ్రామిక వేత్తే కాదు, కొత్త భాషా వేత్త కూడా!

[నీరా రాడియాతో లబ్ధి పొందలేదు, ఎన్డీటీవీ ఇంటర్యూలో రతన్ టాటా స్పష్టీకరణ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! టెలీఫోన్ రంగంలో వ్యాపారం చేస్తున్నప్పటికీ… టాటా గారు, నీరా రాడియాతో లబ్ది పొందలేదట తెలుసా?

సుబ్బారావు:
టాటా గారు లంచాలివ్వరు మరదలా! బహుమతులిస్తారు. అలాగే బహుశః నీరా రాడియాతో ‘లబ్ది’ పొంది ఉండరు, ‘ప్రయోజనాలు’ పొంది ఉంటారు. అందునా ఆయనెంత పత్తిగింజ గారంటే… రెండేళ్ళు గడిచినా 2008 సెప్టెంబరు 26 నాటి ‘తాజ్ హోటల్ మీద పాక్ ముష్కరుల దాడి’లో, టాటా గారి తాజ్ హోటల్ గదిలో బయటపడిన టెర్రరిస్టుల కంట్రోలు రూం కి ఎవరు సహకరించారో… ఇప్పటికీ బయటకు రాకుండా మానేజ్ చేసుకుంటున్నారు.

అదీ కేంద్రప్రభుత్వంలో, అందులోని కీలక వ్యక్తులతో రతన్ టాటా గారి గాఢనుబంధం!

సుబ్బలష్షిమి:
ఇంకా పైగా, నీరా రాడియాతో తన సంభాషణలు బయట పెట్టరాదని, అది తన Right of Privacy కి భంగకరమనీ సుప్రీం కోర్టులో దావా వేసాడు తెలుసా?

సుబ్బారావు:
సాగితే అలాగే ఉంటారు మరి! అతడి హోటల్ లో బస చేసిన పాపానికి బ్రతికే హక్కు పోగొట్టుకున్నారు కొందరు. మరో ప్రక్క సమాజంలో చాలామందికి చాలా హక్కులు మృగ్యమై ఉన్నాయి. మరి ఇతడు కార్పోరేట్ దిగ్గజం కదా! అంచేత అన్ని హక్కులే ఉంటాయి. తన హోటల్ లో ఉగ్రవాదులకు కంట్రోలు రూం ఎలా ఏర్పరచబడిందో తెలిపేపాటి బాధ్యతలు కూడా ఉండవు. మరి ఇతడి నిఘంటువు ప్రత్యేకమైనది కదా!

సుబ్బలష్షిమి:
ఇంతగా తమ ఆటలు సాగనిస్తున్నారు కాబట్టే… మన్మోహన్ సింగ్ లభించడం మన అదృష్టం అంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నట్లున్నాడు బావా!

సుబ్బారావు:
మన అదృష్టం అంటే అతడి నిఘంటు అర్ధం తమ వంటి కార్పోరేట్ దిగ్గజాల అదృష్టం అని అయి ఉంటుంది మరదలా!

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే వీరి పరిభాషలో లంచాలని బహుమతులనీ, లబ్ధిని ప్రయోజనాలనీ… ఇలా వాడుక పదాలని మార్చాలన్న మాట! బాగుంది బావా, టాటా గారి నిఘంటువు!

మొత్తానికీ ఇన్నాళ్ళు ఇతణ్ణి పారిశ్రామిక వేత్తే అనుకున్నాం, గొప్ప భాషావేత్త కూడా!

Monday, December 6, 2010

పలుకుబడి లేనివాళ్ళు దొరికితే దొంగలు, ఉన్నవాళ్ళు దొరికినా కూడా దొరలే!

[షేర్ల మాయాజాలం. నాలుగు కంపెనీల ప్రమోటర్లతో డాంగీ గ్రూప్ కుమ్మక్కు. కృత్రిమంగా షేర్ల ధరలు పెంపు. ఐటీ దాడులతో బట్టబయలు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూడు.

>>> సాక్షిలో మాత్రమే వచ్చిన వార్తాంశం:[04/12]
షేర్ల మాయాజాలం!
కృత్రిమంగా ధరలను పెంచే చర్యలకు దిగారంటూ వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, మురళీ ఇండస్ట్రీస్, బ్రష్‌మాన్ ఇండియా కంపెనీ ప్రమోటర్లపై సెబీ నిషేధాన్ని విధించడంతో ఆయా కంపెనీల షేర్లన్నీ కుప్పకూలాయి. వీరంతా ఫండమెంటల్స్‌ కు మించిన స్థాయిలో షేర్ ధరను కృత్రిమంగా పెంచారన్నది అభియోగం.
[పూర్తి వార్తాంశం దిగువ చూడండి.]
~~~~~~

తమ షేర్ల ధరలు తామే పెంచుకునేందుకు సొంతంగా 10 డమ్మీ కంపెనీలు ఏర్పాటు చేసుకుందట మురళీ ఇండస్ట్రీస్! ఇంకా ఇతర కంపెనీలు డాంగీ గ్రూప్ తో ఒప్పందం కుదుర్చుకుని, ఆ ప్రకారం తమ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచుకున్నారట.

సుబ్బారావు:
అది షేర్ మార్కెట్ లో మామూలే మరదలా! దొరికితే మురళీ ఇండస్ట్రీస్ లాగా దొంగలు! దొరకక పోతే అంబానీలు, కంపానీలు, టాటాలు, బజాజ్ లు! ఒకవేళ ఈ అంబానీలు, టాటాలు దొరికినా… ప్రభుత్వం చట్టాలు మార్చి అయినా వారిని దొరలనే చేసేస్తుంది.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! రాజకీయ, ఆర్ధిక పలుకుబడి లేనివాళ్ళు దొరికితే దొంగలు, ఆవి ఉన్నవాళ్ళు దొరికినా కూడా దొరలే!

~~~~~~~
>>> సాక్షిలో మాత్రమే వచ్చిన వార్తాంశం:[04/12]
షేర్ల మాయాజాలం!
కృత్రిమంగా ధరలను పెంచే చర్యలకు దిగారంటూ వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, మురళీ ఇండస్ట్రీస్, బ్రష్‌మాన్ ఇండియా కంపెనీ ప్రమోటర్లపై సెబీ నిషేధాన్ని విధించడంతో ఆయా కంపెనీల షేర్లన్నీ కుప్పకూలాయి. వీరంతా ఫండమెంటల్స్‌ కు మించిన స్థాయిలో షేర్ ధరను కృత్రిమంగా పెంచారన్నది అభియోగం. తద్వారా ఆయా కంపెనీలు, ప్రమోటర్లను స్టాక్ ఎక్స్ఛేంజీ కార్యకలాపాల నుంచి సెబీ నిషేధించింది. నిధుల సమీకరణ ప్రయత్నాలు సఫలమయ్యేందుకు సంజయ్ డాంగీ ప్రమోట్ చేసిన డాంగీ గ్రూప్ ఈ విషయంలో ఆయా కంపెనీల ప్రమోటర్లకు సహకరించినట్లు సెబీ ధృవీకరించింది. తొలుత మురళీ ఇండస్ట్రీస్ కార్యాలయంపై ఆదాయపన్ను అధికారులు దాడి చేయడంతో ప్రమోటర్ల వ్యూహాలు బయటపడ్డాయి. స్టాక్ కార్యకలాపాల నుంచి డాంగీని సైతం సెబీ నిషేధించింది.


ఏం జరిగిందంటే?
సెబీ పరిశోధన వివరాలిలా ఉన్నాయి. 2007 ఫిబ్రవరిలో మురళీ ఇండస్ట్రీస్ ఎఫ్‌సీసీబీల ద్వారా నిధుల సమీకరణకు దిగింది. అయితే అంతకుముందుగానే షేర్ ధరను భారీగా పెంచేందుకు డాంగీతో ఒప్పందం కుదుర్చుకుంది. వెరసి ప్రమోటర్లతో కుమ్మక్కైన డాంగీ... షేర్ ధరను కృత్రిమ పద్ధతిలో పెంచుతూ పోయింది. ఇందుకు అక్టోబర్ 2006 జూన్ 2007 కాలంలో మురళీ సొంతంగా ఏర్పాటు చేసిన 10 డమ్మీ సంస్థలు సహకరించాయి. తద్వారా అధిక ధరల వద్ద షేర్లను జారీ చేయడం ద్వారా ప్రమోటర్లు భారీగా నిధులను సమీకరించగలిగారు.

తద్వారా ప్రమోటర్లు కంపెనీ స్థాయికి మించిన ధరలో షేర్లను జారీ చేయడం ద్వారా లాభపడ్డారు. దీంతో సెబీ డాంగీపై మరింత లోతుగా పరిశోధన చేసింది. ఫలితంగా పలు కంపెనీలు ఎఫ్‌సీసీబీ, ఏడీఆర్, జీడీఆర్, క్విబ్, క్విప్ తదితర మార్గాలలో నిధులను సమీకరించేందుకు డాంగీతో చేతులు కలిపినట్లు తేలింది. వీటిలో వెల్‌స్పన్ కార్పొరేషన్, ఆకృతీ సిటీ, బ్రష్‌మాన్ ఉన్నాయి. అంటే ఆయా కంపెనీలు నిధుల సమీకరణకు ముందుగానే మార్కెట్లలో కృత్రిమంగా షేర్ల ధరల పెంపునకు పాల్పడినట్లు సెబీ నిర్ధారణకు వచ్చింది. దీంతో వాటిని నిషేధించింది.

సవాల్ చేస్తాం...
సెబీ నిషేధానికి గురైన కంపెనీలు నష్ట నివారణ చర్యలు చేపట్టనున్నాయి. సెబీ ఆదేశాలను సవాలు చేసేందుకు న్యాయ సలహాలను తీసుకోనున్నట్లు ఆకృతీ సిటీ, వెల్‌స్పన్ కార్పొరేషన్ శుక్రవారం విడివిడిగా తెలియజేశాయి. సెబీ ఆదేశాలను పరిశీలించాక తగు నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు పేర్కొన్నాయి. ఈ రెండు కంపెనీలూ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నట్లు పేర్కొనడం గమనించదగ్గ అంశం.

Pasted from http://uni.medhas.org/unicode.php5?file=http%3A%2F%2Fsakshi.com%2Fmain%2F..%2Fmain%2F..%2FMain%2F..%2Fmain%2F..%2Fmain%2FSportsDetailsNormal.aspx%3Fcatid=58722%26Categoryid=7%26subcatid=36
~~~~~~

Sunday, December 5, 2010

వై.యస్. బహిఃప్రాణం నిజస్వరూపం ఇది కాబోలు!

[సలహాల రావుకు సెలవు. కేవీపీతో సహా దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులు రాజీనామాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రాష్ట్ర ప్రభుత్వానికి 40 మంది సలహాదారులున్నారట. అందులో ఎన్ని పదవులు కొత్తగా సృష్టించబడ్డాయో, ఎందరు గతించిన వై.యస్. అనుయాయూలో తెలియదు గానీ, మొత్తానికీ అతడు చాలామందికే రాజకీయ ఉపాధి కల్పించాడు.

పోతే, కేవీపీ అంటే వై.యస్,కి ప్రాణమిత్రుడు గనక సలహాదారు పదవిలో అతణ్ణి నియమించుకున్నాడు. మరి రోశయ్య ఎందుకు కొనసాగించినట్లు బావా!? అందునా ‘అధిష్టానం ముద్రే నా ముద్ర’ అనే వాడు కదా? అంటే అధిష్టానమే అతణ్ణి సలహాదారు పదవిలో కొనసాగనిచ్చిందా?

సుబ్బారావు:
రోశయ్యే కాదు మరదలా, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా అతడి రాజీనామాకు ఆదేశించాడన్న వార్తతో పాటు, ఇంకా ఆమోదించలేదన్న వార్తా ఉంది. మరో వైపు నన్ను తప్పించమని నేనే కోరానంటూ కేవీపీ చెబుతున్నాడు.

సుబ్బలష్షిమి:
ఎందుకిలా బావా?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! జనం దగ్గర ఎంత సొమ్ము రొల్లవచ్చు, ముఖ్యమంత్రి ఎంత మిగుల్చుకోవాలి, పైకి ఎంత పంపాలి గట్రా లెక్కలన్ని కేవీపీకి తెలిసినంతగా మరెవ్వరకి తెలియదని కాబోలు ! ప్రాణమిత్రుడు, అతడి కుటుంబం ఎట్లా పోతేనేం? తన భద్రత కోసం తాను, ముందు అధిష్టానం దగ్గర సాగిలబడ్డాడు. అందుచేతే ముఖ్యమంత్రులు ఎందరు మారినా సలహాల రావు పదవిలో కొనసాగుతూనే ఉన్నాడు. వై.యస్. బహిఃప్రాణం నిజస్వరూపం ఇది కాబోలు!

Saturday, December 4, 2010

సోనియా అంటే మీడియాకి అంత ప్రేమ మరి!

[మండిపోతున్న కూరగాయలు, నిత్యావసరాల ధరల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఉల్లిపాయలు కిలో ఇరవై నాలుగు రూపాయలట. కూర గాయల ధరలేవీ అందుబాటులో లేవు. నూనెల ధరలూ, నిత్యావసరాల ధరలూ అంతే! ఆకాశంలో విహరిస్తున్నాయి, ఇదేం విపరీతం బావా!?

సుబ్బారావు:
ఇది విపరీతం కాదు మరదలా, ఇటలీ మహిళ నేతృత్వం! ఒకప్పుడు ఉల్లి ధరలు పెరిగితే ఇందిరాగాంధీని చెరిగి ఆరేసింది మీడియా. చివరికి భాజపా ప్రభుత్వమూ ఉల్లి ధరలకి రెక్కలొచ్చినప్పుడు ఇబ్బందులకి గురయ్యింది. అదే ఇప్పుడు చూడు! సోనియాని మీడియా… ఇందిరనో, రాజీవ్ నో రచ్చ పెట్టినట్లు పెడుతోందా? మీదు మిక్కిలి రక్షించుకొస్తోంది.

కావాలంటే నువ్వే పరిశీలించు! 65 కోట్ల రూపాయల భోపోర్సు అవకతవక గురించి బయటికొచ్చినప్పుడు దాదాపు ప్రతీ పత్రికా, ప్రతీ పేజీలో క్రమం తప్పకుండా వ్రాసి రాజీవ్ ని ఉతికి ఆరేసారు. ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద అవినీతిగా చెప్పబడిన 1.76 లక్షల కోట్ల రూపాయల 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో… అంత రేంజ్ లో వ్రాస్తున్నారా? అసలు రోజుకో అవినీతి బయటికొస్తోంది. అయినా మీడియా దాన్ని వీలయినంత చల్లారుస్తోంది.

సుబ్బలష్షిమి:
అవున్నిజమే! ఎందుకలా బావా!?

సుబ్బారావు:
ఎందుకంటే – సోనియా అంటే మీడియాకి అంత ప్రేమ మరి!

సుబ్బలష్షిమి:
ఓహో! సోనియా మీడియాలు “ఈనాటి ఈ బంధమేనాటిదో!” అని యుగళ గీతాలు పాడుకోవచ్చన్న మాట!