Friday, February 27, 2009

52. పాక్ విషయంలో బుష్ అయినా ఒబామా అయినా ఒకటే

[పాక్ సైనికులకి అమెరికా శిక్షణ నిస్తుంది – ఒబామా ప్రకటన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
శ్వేత సౌధంలో అడుగుపెట్టి నెల తిరక్కుండానే ఒబామా పాక్ ని నెత్తికెత్తికొని గారాబం చేస్తున్నాడు. ఈయన్ని నల్ల వజ్రమనీ, నల్ల సూరీడనీ, మనకీ కావాలొక ఒబామా అని ఊదరబెట్టారేంటి బావా?

సుబ్బారావు:
ఇంకా అర్ధం కాలేదా మరదలా? పాకిస్తాన్ ని అలా బహిరంగంగా నెత్తికెత్తుకునే వాళ్ళు కావాలి కాబట్టి అలా ఊదర బెట్టారన్న మాట!

సుబ్బలష్షిమి:
వాకర్ బుష్, బరాక్ ఒబామా పేరేదైనా చేసేది మాత్రం ఒకటే నన్నమాట.

************

Thursday, February 26, 2009

ఆడపిల్లల్ని ’పడేయటం’ ఎలా

[ఆడపిల్లల్ని ’పడేయటం’ ఎలా అంటూ 9 ఏళ్ళ అలెక్ గ్రెవిన్ ఓ పుస్తకం వ్రాసాడు. అది హాట్ కేక్ లా New York Times best seller గా అమ్ముడుపోతోంది – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
తొమ్మిదేళ్ళ కుర్రాడు ఆడపిల్లల్ని పడేయటం అన్న పుస్తకం వ్రాయటం ఎలా సాధ్యం బావా?

సుబ్బారావు:
ఆ, ఏముంది! చదువుకోవలసిన వయస్సులో ‘నచ్చావులే’, ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’లాంటి ఇంగ్లీషు సినిమాలు చూసి రాసుంటాడు. చదువుకొనే వయస్సులో ఇవేం పనులని తల్లితండ్రులు, టీచర్లూ నాలుగు పీకటానికి అక్కడి చట్టాలు అడ్డం వస్తాయి కదా?

సుబ్బలష్షిమి:
అయితే మన దేశంలోకి కూడా అలాంటి చట్టాలు తెస్తున్నారు కదా! అప్పుడు మన దేశంలో కూడా అలాంటి పుస్తకాలు రాసే బాల మేధావులు వస్తారన్న మాట!

సుబ్బారావు:
పిల్లలు అలా చెడిపోవాలనే కదా అలాంటి చట్టాలు, సినిమాలు వచ్చేది! పిల్లలు బాగుపడితే దేశం బాగుపడిపోదూ?

*********

Tuesday, February 24, 2009

50. నిజాం సైనికులకు స్థలాల క్రమబద్దీకరణ

[నిజాం సైనికులకు స్థలాల క్రమబద్దీకరణ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, నాకు తెలియక అడుగుతాను, స్వాతంత్ర సమరయోధులకీ, తెలంగాణా విమోచన పోరాట యోధులకీ పింఛన్లు కూడా ఇవ్వకుండా కాళ్ళమీద పడేలా చూసుకుంటున్న నేటి రాష్ట్ర సర్కారు – మాజీ నిజాం సైనికులకి, వారి వారసులకు గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ స్థలాలు క్రమబద్దీకరించిందట. ఎందుకంటావు?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా? స్వాతంత్ర సమరయోధులూ, తెలంగాణా పోరాట యోధులు భారతదేశం కోసం పోరాడారు. అందుకే వాళ్ళకి పింఛన్లు కూడా పుట్టవు. అదే మాజీ నిజాం సైనికులు [రజాకార్లు] అయితే, నిజాం [హైదరాబాదు] సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలిపేందుకు పోరాడారు. మరి వారికీ వీరికీ తేడా లేదా? అందుకే వీరికి ప్రభుత్వ భూములు కట్టబెడుతున్నారు.

సుబ్బలష్షిమి:
చూస్తే ఇప్పటికీ నిజాం రాజ్యమే ఉన్నట్లుంది బావా. అనవసరంగా ప్రజాస్వామ్యమని మనం పొంగిపోయి భంగ పడుతున్నట్లున్నాం.
***********

Monday, February 23, 2009

49. వడ్డించే వాడు మనవాడయితే ఎక్కడ ఉన్నా అన్నీ అందుతాయి

[ప్రభుత్వం, ఈనాడు పత్రికకి భారీ ఎత్తున ప్రకటనలు ఇస్తూన్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా నాదో సందేహం! ముఖ్యమంత్రి వై.యస్. తనకి నచ్చినట్లు రూల్స్ మార్చుకుంటాడని, తనకి నచ్చని వాళ్ళని సాధించటానికి రూల్స్ అన్ని తుంగలో తొక్కేస్తాడని మాట ఉంది కదా! మరి ఈనాడు పత్రిక ప్రకటనల విషయంలో ఎందుకని రూల్స్ అన్ని తుంగలో తొక్కడం లేదంటావు?

సుబ్బారావు:
అంతే మరదలా! మాటల్లో కొట్లాట, చేతల్లో సాయం అన్నమాట. లేకపోతే రామోజీ రావుని ఆర్దికంగా ఆదుకొనేదెట్లా?

సుబ్బలష్షిమి:
దీన్నే అంటారేమో, ‘వడ్డించే వాడు మనవాడయితే ఎక్కడ ఉన్నా అన్నీ అందుతాయని!’

*****************

48. అవును నిజమే, ఆయన మనసే మహాశివుడు! కాకపోతే నాటకాల శివుడు!

["నా మనసే మహాశివుడు", "అలోచించగలిగే సాహసం, ఆరంభించగల సామర్ధ్యం, పూర్తిచేయగల నేర్పు" అన్న వై.యస్. ప్రకటన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా ఈరోజు వై.యస్. ప్రకటన చూసావా? ఆయన మనసే మహాశివుడట.

సుబ్బారావు:
అవునూ నిజమే, అయన మనసే మహాశివుడు! కాకపోతే నాటకాల శివుడు! ఎందుకంటే తన కొడుక్కి, తనకి కావలసిన వాళ్ళకి దోచిపెట్టటానికి ఎంతటి బాధలయిన సహిస్తాడు, తనకి నచ్చని వాళ్ళని సాధించటానికి ఎంతటి విధ్యంసం అయిన సృష్టిస్తాడు. అలా అలోచించగలిగే సాహసం, ఆరంభించగల సామర్ధ్యం, పూర్తిచేయగల నేర్పు ఆయనకే సొంతం. నిజమే మాట్లాడాడు కదా? ఎవరికి కావలసిన అర్ధం వాళ్ళు తీసుకోవాలి, తెలిసిందా మరదలా!

**********

Saturday, February 21, 2009

47. దొరక్కుండా మ్యాచ్ ఫిక్సింగ్ ఎలా చేయాలి?

[మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కాంగ్రెస్ లో చేరిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మాజీ క్రికెట్ కెప్టెన్ అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరాడట. ఇక కాంగ్రెస్ వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్ ల్లాంటివి రాజకీయాల్లో ఎలా చేయాలో నేర్పుతాడు కాబోలు.

సుబ్బారావు:
ఓసి పిచ్చిదానా! అతడి కంటే ఘనుడు ఆచంట మల్లన్న! అజారుద్దీన్ కాంగ్రెస్ వాళ్ళకి రాజకీయాల్లో మ్యాచ్ ఫిక్సింగులు ఎలా చెయ్యాలో నేర్పడు. కాంగ్రెస్ వాళ్ళే మ్యాచ్ ఫిక్సింగులు పట్టుబడకుండా ఎలా చెయ్యాలో, పట్టుబడ్డాక కూడా దాన్ని ఎలా ఒప్పుగా చూపాలో అజారుద్దీన్ కి నేర్పిస్తారు.

**********

Friday, February 20, 2009

46. ఎంత సహకారం, ఎంత సహాయం – 50% పెంచిన పత్రికా ప్రకటనల రేట్లు

[పత్రికలలో ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల రేటు నాలుగు నెలల క్రితం 24% పెంచి, ఇప్పుడు 10% పెంపుకు సిఫార్సు, మొత్తంగా ఇప్పటివరకూ 50% పెంచినట్లు ప్రకటించిన సమాచార శాఖ సహాయమంత్రి ఆనంద్ శర్మ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
చూశావా బావా! ప్రభుత్వాలు పత్రికల్లో ప్రకటనలిస్తే చెల్లించాల్సిన రేటు సగానికి సగం పెంచారట?


సుబ్బరావు:
అవునుమరి. పత్రికల సహకారం లేకపోతే ప్రభుత్వాలు ప్రజలని ఎలా దోచుకుంటాయి? ఆ సహకారానికి బదులుగా ఈ సహాయం చేస్తున్నాయి. అంతే!

సుబ్బలష్షిమి:
అయితే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకోవడం అనడానికి ఇది మరో తాజా ఉదాహరణన్న మాట.

************

45. పౌరసత్వం కోసం సైన్యంలో చేరితే దేశభక్తి ఎటు చేరుతుంది?

[అమెరికా సైన్యంలో చేరిన ఇతరదేశీయులకి శాశ్వత పౌరసత్వం ఇస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించారన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఒక పాకిస్తాన్ యువకుడు, అమెరికా సైన్యంలో చేరి శాశ్వత పౌరసత్వం పొందాడనుకో! అమెరికా పాకిస్తాన్ మీదికి యుద్దానికి వెళ్ళిందనుకో. అప్పుడా సైనికుడు ఎవరివైపు పోరాడుతాడు? శరీరంతో అమెరికా తరుపునా, మనస్సుతో పాకిస్తాన్ తరుపునా పోరాడతాడా? అతడి దేశభక్తి ఎటువైపు ఉంటుంది? అమెరికా వైపా? పాకిస్తాన్ వైపా?

సుబ్బారావు:
బాబోయ్ మరదలా! భేతాళుడు విక్రమార్కుణ్ణి అడిగినట్లు ఇంత సంక్లిష్టప్రశ్నలు నన్నడుగుతావా? వీటికి జవాబులు విక్రమార్కుడు చెప్పాల్సిందే గాని నాలాంటి సామాన్యుడెక్కడ చెప్పగలడూ?

************

Thursday, February 19, 2009

44. మురికి వాడల పిల్లల్ని ఉపయోగించుకుంటాంగానీ, ఉద్దరిస్తామా?

[ఆస్కార్ ఉత్సవాలకు ముంబై మురికివాడల పిల్లలు దూరం – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇంతకీ ఈ ’స్లమ్ డాగ్’ గొడవేమిటి బావా?

సుబ్బరావు:
తప్పు! అలా కుక్కా గిక్కా అనకూడదు. ఆ మాటకర్థం మట్టిలో మాణిక్యం అనిట.


సుబ్బలష్షిమి:
సరేలే! ఆ సినిమాతో మిలియన్ల డాలర్లు సంపాదిస్తూ కూడా ఆ సినిమా నిర్మాతలు అందులో నటించిన బాలనటుల చేతిలో నామామాత్రం డబ్బు ఇచ్చారట గదా!

సుబ్బారావు:
ఛ!ఛ! అన్నీ అలా నెగిటివ్ దృష్టితో చూడ కూడదు మరదలా! ఇప్పుడు వాళ్ళ తల్లితండ్రులు రోగగ్రస్తులై ఉండనీ, ఇప్పుడు వాళ్ళ బ్రతుకు ఎలాగైనా ఉండనీ, రేపు వాళ్ళు చదువుకొని బాగుపడ్డాక, వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చాక, అనూహ్యమైన మొత్తం వాళ్ళకిచ్చేందుకు ఓ సంస్థలో డబ్బు జమచేస్తామని నిర్మాతలు చెప్పడం లేదూ?

సుబ్బలష్షిమి:
చెబుతున్నారు సరే! ఇంతకీ బ్యాంక్ లో డబ్బు వేసి పత్రాలు చేతికిచ్చారా?

సుబ్బరావు:
అదిగో మళ్ళా! అలా అనుమానించకూడదన్నానా?

*************

Wednesday, February 18, 2009

43. కులాలు లేకపోతే కుల రాజకీయాలు ఎలా నడిపేటట్లు?

[తల్లితండ్రులది కులాంతర వివాహమైతే పిల్లలు రెండింటిలో ఓ కులాన్ని ఎంచుకోవచ్చు – కేంద్రమంత్రి మీరా కుమార్ స్పష్టీకరణ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
కులాంతర వివాహాన్ని ప్రోత్సహించిందే సమాజంలో కులవ్యవస్థని రూపుమాపేందుకు అన్నారు. మళ్ళీ ఇదేమిటి బావా?

సుబ్బరావు:
కులాలు లేకపోతే కుల రాజకీయాలు ఎలా నడిపేటట్లు?

*************

42 .బడ్జెట్ ప్రసంగం మధ్యలో ఎం.పి. అస్వస్థత

[లోకసభలో 16/02/09 న బడ్జెట్ ప్రసంగం మధ్యలో జేడీ[ఎస్] ఎం.పి. వీరేంద్రకుమార్ శ్వాసతీసుకోవటంలో ఇబ్బందిపడుతూ అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రికి తరలించాలన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బరావు:
విన్నావా మరదలా! లోకసభలో బడ్జెట్ ప్రసంగం నడుస్తుండగా ఓ ఎం.పి. గారు జబ్బుపడి ఆసుపత్రి పాలయ్యారట.

సుబ్బలష్షిమి:
రోజూ అబద్దాలు వినడానికి అలవాటు పడిన వాళ్ళే బడ్జెట్ ప్రసంగం విని జబ్బున పడితే ఇక మనలాంటి వాళ్ళ గతేమిటి బావా?

***********

Tuesday, February 17, 2009

41. మీడియా ప్రచారం సానియాకే ఎందుకు?

[సానియాకేం తీసిపోయాను – సైనా నెహ్వాల్, మరో సానియా నవుతాను – అనస్తేషియా, బాట్మింటన్ క్రీడాకారిణి వార్తల నేపధ్యంలో….]

సుబ్బలష్షిమి:
ఈ అమ్మాయెవరో అనస్తేషియా[రష్యా పేరు] అట. తాత భారతీయుడు, నానమ్మ స్విస్, తండ్రి బ్రిటను, తల్లి జపనీస్. తాను ఇండియా తరుపున ఆడాలను కుంటుందంట. మరో సానియాని అవుతానంటూ హైదరాబాదు వచ్చి ప్రకటించిదేమిటి బావా?

సుబ్బారావు:
అంటే నేను ‘లాబియింగూ, కొరియర్’ లాంటి పనులు చేసి పెడతాను, కెరీర్ ఇమ్మంటూ కనబడని క్రీడారంగ ‘గాడ్ ఫాదర్’ లకు దరఖాస్తు చేస్తోందన్న మాట.

సుబ్బలష్షిమి:
అదెలాగా?

సుబ్బారావు:
క్రొత్తగా సినిమాల్లోకి వచ్చిన తారలు ‘కధ డిమాండ్ చేస్తే తాము నగ్నంగా నటించటానికైనా, ముద్దుసీన్లకైనా రెడీ’ అంటూ ప్రకటనలిస్తారే, అలాగ! లాబియింగ్, కొరియర్ షిప్పు చేసే క్రీడాకారులకి గెలవక పోయినా మీడియా కవరేజి ఇస్తుంది. అలాక్కాని వాళ్ళు గెలిచినా మీడియా ప్రచారం ఇవ్వదు. అదీ సంగతి!

సుబ్బలష్షిమి: !!!!!!!!

40. కక్కుర్తి బెర్తులే కొంపముంచాయట

[ఫిబ్రవరి 13,09 న జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఎక్కువ మంది ప్రయాణికులు గాయపడటానికి కారణం రైలు పెట్టెలో దారి వెంబడి నిలువునా ఉండే రెండుబెర్తుల స్థానే కక్కుర్తితో మూడు బెర్తులు పెట్టటమే నన్న వార్తలు నేపధ్యంలో….]

సుబ్బలష్షిమి:
కక్కుర్తి రైల్వేశాఖది అయితే మూల్యం ప్రయాణికులు చెల్లించుకున్నారట, విన్నావా బావా! ఈ కక్కుర్తి బెర్తుల మూలంగా ఎమర్జన్సీ డోర్ తీయటం కష్టమైందట.

సుబ్బారావు:
బెర్తులు బిగించింది రైల్వేశాఖ. నష్టపడింది ప్రజలు. ఇదంతా పట్టదు రైల్వేమంత్రి శ్రీమాన్ లాలూ గారికి. ఆయన రైల్వేని తాను ఎలా లాభాల బాట పట్టించాడో విదేశీయులకి సైతం పాఠాలు చెప్పడంలో, స్వదేశీయులకి 90,000 కోట్లు లాభాలు గురించి చెప్పడంలో మహా బిజీ మరి!

******

Monday, February 16, 2009

39. మెకానిక్ షెడ్ లో తేలిన జలాంతర్గామి రాకెట్

[జలాంతర్గామి వేగంగా వెళ్ళేందుకు వాడే పరికరం – కాంచీ పురంలోని ఎల్ అండ్ టి సంస్థ తయారు చేసిందీ, ముంబై కి పంపవలసిందీ, నౌకదళంలో గట్టి భద్రత మధ్య ఉండాల్సిందీ – అయిన సదరు పరికరం మెకానిక్ షెడ్ లో తేలిందన్న వార్తల నేపధ్యంలో. ]

సుబ్బలష్షిమి:
చూశావా బావా ఈ ఘోరం? జలాంతర్గామి పరికరము. సేలం లోని మారుమూల ప్రాంతం కరుప్పూరులో మెకానిక్ షెడ్ లో తేలిందట. పోనీ చిన్నచితకది కాదు, 25 అడుగుల పొడవూ, 4 అడుగుల వెడల్పూ, 2 టన్నుల బరువూ ఉందట. నౌకదళంలో ఉండాల్సింది మెకానిక్ షెడ్ లో ఎలా తేలినట్లు? కొంపదీసి ఎల్.టి.టి.ఇ. జలాంతర్గామిల కోసమా?

సుబ్బారావు:
ఛ! అన్నింటిని అనుమానించకూడదు. ఏముందీ? పాత ఇనుపసామాన్ల వాడికి వేసినట్లు కిలోల లెక్కన అమ్మేసారు అనుకోవాలి.

*************

Sunday, February 15, 2009

38.బెంగుళూరు పేలుళ్ళు జరిపింది ఆకతాయిలంట

[బెంగుళూరు పేలుళ్ళు జరిపింది ఆకతాయిలంటూ కర్ణాటక పోలీసులు తేల్చి పారేసిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
విడ్డూరం గాకపోతే ఆకతాయిలు బెంగుళూరులో బాంబుపేలుళ్ళు జరిపి, ఆ తర్వాత కాశ్మీరులో ఎన్ కౌంటరులో ఛస్తారా బావా? మరీ పోలీసులు మన చెవిలో పుష్పం పెట్టడం కాదూ ఇది?

సుబ్బారావు:
అదేం కాదు మరదలా! ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయి అంటాడు ఘటోత్కజుడు ’మాయాబజార్’ సినిమాలో. అలాగ, ఈ పోలీసులు పాక్ తీవ్రవాదులకి కొత్తపేరు ఆకతాయిలని పెట్టిఉంటారు.

సుబ్బలష్షిమి:
తీవ్రవాద సంస్థలు ఏవి వీటి వెనుక లేవని తేల్చేసారు కూడా బావా!

సుబ్బారావు:
ఛ! తప్పు! అలా అన్నీ అనుమానించకూడదు, తెలుసా?

*************

37. ఎలక్షన్ సైకలాజికల్ డిజార్డర్ సిండ్రోం

[బహిరంగ సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, భావోద్వేగాలకి గురై కన్నీరు పెడుతున్న వివిధ పార్టీనేతల గురించిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఈమధ్య తరుచుగా రాజకీయ పార్టీల నాయకులు సభల్లో మాట్లాడుతూ, ఉపన్యాసాల మధ్య హఠాత్తుగా భావోద్వేగాలకు గురై కన్నీరు పెడుతున్నారట!

సుబ్బారావు:
బహుశః ప్రజలని చూస్తుంటే – ఇంతింత పెట్టుబడి పెడుతున్నాం, తీరా ఎన్నికల్లో ఈ ఓటర్లు ఏంకొంప ముంచుతారో అని భయమేసి ఏడుపొస్తుందేమో మరదలా?

సుబ్బాలష్షిమి:
అంతేలే బావా! ఎలక్షన్ ముందు వాళ్ళు ఏడుస్తారు, ఎలక్షన్ తరువాత ఐదు సంవత్సరాలు మనల్ని ఏడిపిస్తారు. దీన్నే ఎలక్షన్ సైకలాజికల్ డిజార్డర్ సిండ్రోం అంటారు కాబోలు.

**********

Saturday, February 14, 2009

13 ఏళ్ళకే తండ్రి – 14 ఏళ్ళకే తల్లి

[చిన్నారి తల్లితండ్రులు – బ్రిటన్ లో సంచలనం వార్తల నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా ఇది విన్నావా? బ్రిటన్లో 13 ఏళ్ళ పిల్లాడు తండ్రి అయ్యాడట, 14 ఏళ్ళ వాడి గర్లఫ్రెండ్ సోమవారం ఓ ఆడపిల్లకు జన్మనిచ్చిందట.

సుబ్బారావు :
వార్నీ. 13 ఏళ్ళ తండ్రి,, 14 ఏళ్ళ తల్లి, వాళ్ళకి రోజుల పాపాయి!

సుబ్బలష్షిమి :
బహుశః వాళ్ళుకూడా ‘నచ్చావులే’, ‘చిత్రం’, ‘మనసంతా నువ్వే’ లాంటి చిన్నవయస్సు ప్రేమ కథల సినిమాలు చూసి ఉంటారు బావా!

సుబ్బరావు :
అంతేనేమో! బ్రిటన్ లో తునీగా తునీగా అని ఇంగ్లీషులో పాడుకుంటూ ఉంటారు కాబోలు.

**********

Thursday, February 12, 2009

26,000 కంపెనీల్లో ఇద్దరు ఆల్ కంపెనీ డైరెక్టర్లు

[మనదేశంలో పెట్టుబడి పెట్తిన 26,000 మారిషస్ కంపెనీల్లో అక్కడి ఇద్దరు ప్రముఖవ్యక్తులు డైరెక్టర్లుగా ఉండటాన్ని కొంతకాలం క్రితం కేంద్రప్రభుత్వ ఆర్ధికశాఖ గమనించి దిగ్ర్భాంతికి గురైంది, వార్త నేపధ్యంలో - ఈనాడు , ఫిబ్రవరి10, 2009]


సుబ్బలష్షిమి:

మనదేశంలో పెట్టుబడి పెట్టిన 26,000 మారిషస్ కంపెనీల్లో అక్కడి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు డైరెక్టర్లుగా ఉండటాన్ని గమనించి కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ దిగ్ర్భాంతి కి గురైందట! తెలుసా బావా?


సుబ్బారావు:

బయటపడినప్పుడే కదా మరదలా దిగ్ర్భాంతికి గురయ్యేది? రేపు ఒక వ్యక్తే అన్నీ చేయగలడని బయటపడినా ఇంతే! దిగ్ర్భాంతి పడాల్సిందే!


**********


Wednesday, February 11, 2009

34. ఐదేళ్ళ కోసారి రీప్లే

[తె.దే.పా. నాయకులు తాము అధికారంలోకి రాగానే వై.ఎస్. అవినీతి ని బయటపెడతామని, అధికార దుర్వినియోగం పై కేసులు పెడతామని అంటున్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఒకవేళ అధికారంలోకి తెదేపా వస్తే వై.ఎస్. అక్రమాలని బయట పెడతారా? వై.ఎస్. మీద కేసులు పెడతారా?

సుబ్బారావు:
ఓసి పిచ్చిదానా! ఇవే మాటలు ఐదు సంవత్సరాల క్రితం వై.ఎస్. చెప్పాడు. చంద్రబాబు నాయుడి పై ఒక్క కేసు పెట్టలేదు. ఒక్క అవినీతి బయట పెట్టలేదు. అధికారం కోసం వాళ్ళు అట్లా చెప్తారు, అంతే!

సుబ్బలష్షిమి:
మనం మాత్రం పిచ్చివాళ్ళలాగా వాళ్ళ మాటలు నమ్మి ఓట్లు వేస్తామన్న మాట!

**********

Saturday, February 7, 2009

33. అభయ హస్తం – భస్మాసుర హస్తం – వెరసి శూన్య హస్తాలు

[‘అభయహస్తంఅంటూ వై.ఎస్. అడ్వర్టయిజ్ మెంట్సు దానిపై అది భస్మాసుర హస్తంఅంటూ చంద్రబాబు విమర్శల నేపధ్యంలో ]


సుబ్బలష్షిమి:

బావా! కాంగ్రెసు పెద్దమనిషేమో అభయ హస్తంఅంటాడు. తెదేపా పెద్ద మనిషేమో కాదు అది భస్మాసుర హస్తంఅంటాడు. ఇంతకీ అది ఏ హస్తం బావా?


సుబ్బారావు:

అది ఏ హస్తమైనా ఈ ఇద్దరి వెనుకా ఉన్నది మాత్రం విదేశీ హస్తాలు’, వీళ్ళు ప్రజలకిచ్చేది శూన్య హస్తాలు’, అంతే మరదలా!


****************


Friday, February 6, 2009

32. బావ కాస్తా వియ్యంకుడయ్యేసరికి వెన్నుపోటు కూడా వెన్నుదన్నుగా మారిందా?

ఎన్.టి.ఆర్. తె.దే.పా. ని నాదెండ్ల భాస్కర రావు చేసింది వెన్నుపోటు గానీ చంద్రబాబు చేసింది వెన్నుపోటు కాదు, వెన్నుదన్ను – బాలకృష్ణ, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బాలకృష్ణకి చంద్రబాబు వియ్యంకుడయ్యేసరికి వెన్నుపోటు కాస్తా వెన్నుదన్నుగా మారిపోయిందా బావా?

సుబ్బారావు:
అంటే వెన్నుపోటుకీ, వెన్నుదన్నుకీ తేడా లేదు కాబోలు మరదలా!

సుబ్బలష్షిమి:
‘వర్గం మారితే వైషమ్యం మారుతుంది’ అన్న కారల్ మార్క్స్ కొటేషన్ విన్నాను గానీ బంధుత్వం మారితే నిర్వచనాలు మారతాయని ఎప్పుడూ వినలేదు బావా!

సుబ్బారావు:
అయితే ఇప్పుడు విను మరదలా!

*************

Thursday, February 5, 2009

31. సింహగర్జనల అద్వానీ మెత్తటి విమర్శలు

[వై.ఎస్.ది అవినీతి సర్కారు, యూ.పి.ఏ. అసమర్ధ ప్రభుత్వం – విజయవాడ విజయ సంకల్ప సభలో అద్వానీ విమర్శ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అయితే వై.ఎస్. అవినీతితో విరగ సంపాదించుకొంటుంటే కాంగ్రెస్ అధిష్టానం, యూ.పి.ఏ. ప్రభుత్వం అసమర్ధంగా చూస్తూ కూర్చుందా? యూ.పి.ఏ. ప్రభుత్వాన్ని ఎంత ముద్దుముద్దుగా విమర్శిస్తున్నాడు? ఒకప్పటి సింహ గర్జనల అద్వానీయేనా ఈయన?

సుబ్బారావు:
నిజమే మరదలా! నాకూ ఆశ్చర్యంగానే ఉంది. వై.ఎస్. దండుకున్నదాంట్లోంచి పైకి వాటాలు పోతే చూస్తూ ఊర్కుంటారేమో! కానీ ఈ ప్రతిపక్షనేత ఇంత మెత్తగా విమర్శించడం ఏమిటి?

సుబ్బలష్షిమి:
అయితే అద్వానీకీ, సోనియా గాంధీ అంటే భయమన్నా ఉండాలి లేదా ఇద్దరూ తోడు దొంగలై క్రిందవాడి పై నెడూతూ, తాము మాత్రం నీతిమంతులమని పిక్చరన్నా ఇస్తూ ఉండాలి!

******

30. నాయనా బాలకృష్ణా, ఒక్కసారి పాక్ పై కన్నెర్ర చెయ్యి

[నేను కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ అంతం – బాలకృష్ణ , వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బాలకృష్ణ కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ అంతమై పోయిద్దట, తెలుసా బావా?

సుబ్బారావు:
అంతకంటే ముందో, లేదంటో కాంగ్రెస్ తర్వాతో బాలకృష్ణ పాకిస్తాన్ కేసి కన్నెర్ర చేస్తే ఎంచక్కా పాకిస్తాన్ అంతమైపోయిద్ది కదా? దెబ్బతో ప్రపంచానికి పట్టిన పీడా వదిలిద్ది!

**********

Wednesday, February 4, 2009

29. పదే పదే బాత్ రూమ్ కి………. నవీన్ చావ్లా

[‘పదే పదే బాత్ రూమ్ కి’ ఎన్నికల సంఘం సమావేశాల మధ్యలో మాటిమాటికి బాత్ రూం కి వెళ్ళి కమీషనర్ నవీన్ చావ్లా సమాచారం బయటకి చేరవేసారని ఛీఫ్ కమీషనర్ గోపాలస్వామి ఆరోపిస్తున్న వార్తల నేపధ్యంలో ......]

సుబ్బలష్షిమి:
అంతపెద్ద పదవుల్లో ఉండి, బాత్ రూం కెళ్ళి సమాచారం బయటకి ’లీక్’ చేస్తారా బావా?

సుబ్బారావు:
ఓసి పిచ్చి మరదలా! లోపలి కెళ్ళి తలుపుకి గొళ్ళెం వేసాక ఎవరేం చేస్తారో ఎవరికి తెలుసు? ఎవరూ ఋజువు చేయలేరు కదా!

********

Tuesday, February 3, 2009

28. ఎవరికి ఎవరు డూప్

[బాబ్రీ మసీదు కళ్యాణ్ సింగ్ కూల్చలేదు. శివ సేన, ఆర్.ఎస్.ఎస్. లు కూల్చి వేశారు’ -అంటూ ఓ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్యూలో ములాయం సింగ్ పేర్కొన్నాడన్న వార్తలు నేపధ్యంలో ......]

సుబ్బలష్షిమి:
బావా! 1992 డిసెంబరు 6 కు ముందు కోర్టుకీ అఫిడవిట్లు, ప్రధానమంత్రికి కమిట్ మెంట్ లేఖలూ ఇచ్చి మరీ, ఆఖరి క్షణంలో చేతులెత్తేసి ’మసీదుకూల్చడం’ అన్న అంకాన్ని జయప్రదం చేసింది కళ్యాణ్ సింగ్ కాదా బావా? అప్పుడు యూ.పీ. ముఖ్యమంత్రి ఆయనే కదా?

సుబ్బారావు:
అవునూ!

సుబ్బలష్షిమి:
మరి ములాయం సింగ్ ’బాబ్రీ మసీదుని కళ్యాణ్ సింగ్ కూల్చలేదు, శివసేన, RSS కూల్చాయి’ అంటాడేమిటి?

సుబ్బారావు:
బహుశః ములాయం ఉద్దేశంలో ఈ కళ్యాణ్ సింగ్, అప్పటి ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ ఒక్కరు కాదు కాబోలు.

సుబ్బాలష్షిమి:
అంటే. ఆ కళ్యాణ్ సింగ్ కి ఈ కళ్యాణ్ సింగ్ డూపా లేక ఈయనకి ఆయన డూపా?

సుబ్బారావు:
ఎవరి కెవరోగానీ అందరూ కలిసి మనకి మాత్రం కొడుతుంది డూపే మరదలా!

*********

Monday, February 2, 2009

27. తొడలు చరుస్తున్న రాజకీయ దుర్యోధనులు

[రోడ్ ’షో’ లలో తొడగొట్టి, మీసాలు మెలేస్తున్న ’తారా’జకీయ నాయకుల వార్తల నేపధ్యంలో ......]

సుబ్బలష్షిమి:
బావా! ఈ హీరోలూ, రాజకీయ నాయకులూ ఇలా రోడ్ షోలతో తొడగొడుతున్నారు, మీసాలు మెలేస్తున్నారేమిటి?

సుబ్బారావు:
భారతంలో దుర్యోధనుడు ఇలా తొడగొట్టి మీసాలు మెలేసేవాడట. ఓ రోజు వ్యాసమహర్షి ధృతరాష్ట్రడికి ధర్మబోధ చేస్తుంటే దుర్యోధనుడు కాళ్ళు నేలకేసి కొడుతూ తొడ చరచ్తూ కూర్చున్నాడట. ఆ ధోరణికి వ్యాసమహర్షి దుర్యోధనుణ్ణి ’ఆ తోడలు విరిగే, యుద్ధంలో మరణిస్తావు’ అని శపించాడట.

సుబ్బలష్షిమి:
ఓహో! అంటే ’తొడ గొట్టటం’ అన్నది దుర్యోధనుడి లక్షణమా! అయితే ఈనాటి రాజకీయల్లో దుర్యోధనులు తప్ప పాండవులు ఎక్కడా లేనట్లున్నారు బావా!

*********

26. సీను మారిన టిక్కెట్ట్ లేని రాజకీయ సినిమాలు

[సినీ నటుడు బాలకృష్ణ రోడ్ షో వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ సినిమా నట రాజకీయ నాయకుడు బాలకృష్ణేమో ’నేను కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ అంతం’ అని గర్జిస్తూ రోడ్ షో లు చేసుకుంటూ పోతున్నాడు. పోలీసులేమో రూల్స్ అతిక్రమణ కేసులు పెట్టుకుంటూ పోతున్నారు, చూశావా బావా!

సుబ్బారావు:
ఆ! బాలకృష్ణకు కేసులు కొత్తేమిటి మరదలా! ఆయనింట్లో బెల్లంకొండ సురేష్ మీద తుపాకీ కాల్పులు కేసే మాఫీ చేయించేసుకున్నాడు. ఈ చిన్న కేసులు ఓ లెక్కా!

**********

[రోడ్ షో లలో ప్రరాప చిరంజీవి, తెదేపా బాలకృష్ణలు రూల్స్ అతిక్రమిస్తూన్నారంటూ ప్రభుత్వం, పోలీసులు కేసులు పెడుతున్న నేపధ్యంలో...]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఇలా పోలీసులు రోడ్ షో చేస్తున్న ఇతర పార్టీ నాయకుల మీద కేసులు పెట్టుకుంటూ పోతున్నారు?

సుబ్బరావు:
తాను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నాడట వెనకటికో పెద్దమనిషి. అలా ఈ ముఖ్యమంత్రికి తాను ఏరూల్స్ తుంగలో తొక్కినా ఎవ్వరూ మాట్లాడ కూడదు గానీ తాను మాత్రం రోడ్ షో అతిక్రమాల్ని కూడా విడిచిపెట్టకుండా కేసులు బనాయిస్తాడన్న మాట.

సుబ్బాలష్షిమి:
నిజమే బావా! రోజుకో ‘సీను మారుతూ’ ఈ రాజకీయాలు మనకి టిక్కెట్టు లేని సినిమాలు చూపిస్తున్నాయి.

*******