Sunday, March 29, 2009

80. వ్యాపారంగా ఉగ్రవాదం

[పాక్ లోని జమ్రుద్ పట్టణంలో మసీదులో ఆత్మాహుతిదాడి, 50 మంది దుర్మరణం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పాకిస్తాన్ లో ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగి, 50 మంది మరణించారు, 100 మంది గాయపడ్డారట. విన్నావా?

సుబ్బారావు:
అవును. అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
బావా నాకో సందేహం! తమ మతస్థుల మీద, అదీ ప్రార్ధనాస్థలంలో ప్రార్ధనలు చేస్తుండగా, దాడులు చేసిన ఉగ్రవాదసంస్థలు, మొన్న నవాజ్ షరఫ్ చేసిన లాహోర్ లాంగ్ మార్చ్ ని ఎందుకు వదిలిపెట్టాయి? అప్పుడు దాడిచేస్తే ఎక్కువమంది చనిపోతారు, మరింత పెద్దగగ్గోలు అంతర్జాతీయంగా అవుతుంది కదా!

సుబ్బారావు:
బహుశః నవాజ్ షరీఫ్, లాహోర్ లాంగ్ మార్చ్ లో, అలాంటి దాడులు జరగకుండా, ముందుగా ఉగ్రవాదసంస్థలతో డీల్ కొనుక్కొని ఉంటాడు మరదలా! ఇవాళా రేపూ, రాజకీయాల్లాగే ఉగ్రవాదం కూడా ఆర్ధిక మూలాలా మీదే నడుస్తోంది.

*****************

79. రావలసింది రాజకీయ మాంద్యమే

[ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో ధరల లెక్క తప్పుతోంది – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ఆర్ధికమాంద్యం వచ్చేసరికి, మన ప్రభుత్వాలు చెబుతున్న ‘ధరల సూచీ, ద్రవ్యోల్బణం లెక్కలకీ’, జీవితంలో ప్రజలు అనుభవిస్తున్న వాస్తవ ధరలకీ పొంతన లేకపోవడం వెలుగులోకి వచ్చిందట.

సుబ్బారావు:
ఈ లెక్కన ఏ రాజకీయ మాంద్యం వస్తే, ఈ రాజకీయనాయకులు చెబుతున్న అబద్దపు ప్రచారములోని అసలు నిజాలు వెలుగులోకి వస్తాయో కదా?

************

Saturday, March 28, 2009

78. పదికి ఏడేం ఖర్మ, పదికి పది మార్కులు వేసుకోవచ్చు

[తన ప్రభుత్వానికి పదికి ఏడు మార్కులు వేసుకుంటానన్న మనోహ్మన్ సింగ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ప్రధానమంత్రి మనోహ్మన్ సింగ్ తన ప్రభుత్వానికి పదికి ఏడు మార్కులు వేసుకుంటానన్నాడట.

సుబ్బారావు:
పదికి ఏడేం ఖర్మ! పదికి పదీ వేసుకోవచ్చు. ఎందుకంటే తనని ప్రధానమంత్రిని చేసిన బలమూ, ఆ రూపేణా ఛలాయించిన అధికారము, రెండు పదీ, జనపధ్ వే కదా!

********

77. బికినీల్లో మంత్రులు

[ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీ మంత్రివర్గంలో, టివీ యాంకర్ విదేశాంగ శాఖ చేపట్టబోతున్న వార్త నేపధ్యంలో]సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా! ఫ్రాన్స్ అధ్యక్షుడు తన మంత్రివర్గంలోకి టివీ యాంకర్ ని తీసుకుంటున్నాట్ట. ఆవిడ ఎక్కువగా బికినీల్లో కనిపించటానికి మక్కువ చూపిస్తుందట.

సుబ్బారావు:
ఓర్నాయనో! ఇక మనల్ని ఆదేవుడే రక్షించాలి. ఇదే అభివృద్ది మంత్రం అనుకుంటూ ఇండియాలో కూడా అనుసరిస్తారేమో? ఇప్పటికే మహత్మాగాంధీల్లాంటి దేశనాయకుల స్థానే దురాత్మ గాంధీల్లాంటి నాయకులు పుట్టుకొచ్చారు. రేపు బికినీలతో భయపెట్టే మల్లికా శెరావత్ లూ, మొమైత్ ఖాన్ లు మన మంత్రులౌతారేమో!

************

Friday, March 27, 2009

76. రాతలు కాదు రోతలు

[జూనియర్ ఎన్టీఆర్ జన హృదయ విజేత – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ పేపరొళ్ళు కొంతమంది రాజకీయ నాయకులకీ, నటీనటులకీ జన హృదయ విజేతలనీ, ప్రజల ఆరాధ్య దేవతలనీ బిరుదులిస్తుంటారు. ఏ ప్రామాణికాల మీద అలా బిరుదులిస్తారు?

సుబ్బారావు:
ఓసి పిచ్చి మరదలా! ప్రామాణికాలా పాడా! మీడియా నందంటే నంది, పందింటే పంది. మొన్న పుట్టి, నిన్న కళ్ళు తెరచిన వాళ్ళని, పరిణతిగల రాజకీయనాయకుడు అని పేపరొళ్ళు అంటే – కామోసనుకొని కళ్ళు మూసుకోవాలన్న మాట. ‘చెప్పింది విను. లాజిక్కులడక్కు’ అన్నట్లుంటాయి వాళ్ళ రాతలు.

సుబ్బలష్షిమి:
అయితే అవి రాతలు కాదు బావా, ఒట్టి రోతలు.

**********

Thursday, March 26, 2009

75. తెల్ల ముత్యాలకీ, నల్ల వజ్రానికీ తేడా ఏమిటి?

[బరాక్ ఒబామా ఆటో కంపెనీలకీ, AIG లాంటి కంపెనీలకి బెయిల్ అవుట్లూ, ఆఫ్గాన్ కు సైన్యాలు, పాక్ కి ఇస్తోన్న సహాయాలు – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
గతంలో, అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాకర్ బుష్ చేసినవే కదా బావా, ఇప్పటి అధ్యక్షుడు ఒబామా చేస్తోన్న పనులు కూడా?

సుబ్బారావు:
అవును మరదలా! నిశ్చయంగా అవే.

సుబ్బలష్షిమి:
అయితే మరి ఆ తెల్ల ముత్యాలకీ, ఈ నల్ల వజ్రానికీ తేడా ఏమిటి బావా?

సుబ్బారావు:
తెల్ల ముత్యం ఇదే పరిష్కారం అంటూ నిక్కచ్చిగా చేసేది, నల్లవజ్రం నేనేమీ చెయ్యలేకపోతున్నాను అంటూ తిట్టుకుంటూ అదే చేస్తోంది, అంతే తేడా!

సుబ్బలష్షిమి:
అయితే రంగుమాత్రమే తేడానా బావా!

*****************

74. రాజకీయ వ్యాపారానికి అందమైన పాజిటివ్ కాప్షన్ ’ప్రజాసేవ’

[అన్ని రాజకీయ పార్టీల్లో అసమ్మతి సెగలు, తిరుగుబాటు పొగల వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
చూశావా బావా! దాదాపు అన్ని పార్టీల్లోనూ అసమ్మతి, అసంతృప్తి అంటూ కొట్టుకుంటున్నారట. ప్రజాసేవ చేయటానికి ఇంత పోటినా!

సుబ్బరావు:
ప్రజా సేవా పిండాకూడా! ఇంత భారీగా, కోట్లలో లాభాలొచ్చే వ్యాపారం మరేదీ లేదు. అందుకే అంతగా, అన్నిపార్టీల్లోనూ కొట్టుకు ఛస్తున్నారు.

సుబ్బలష్షిమి:
ఓహో! అధిక లాభాలొచ్చే రాజకీయ వ్యాపారానికి అందమైన పాజిటివ్ కాప్షన్ ’ప్రజాసేవ’ అన్నమాట. బాగుంది బావా!

*************

73. నిఘంటువులు చెప్పలేని కొత్తర్ధాలు : మిరియాల ప్రదీప్ కు ఉగాది కానుక

[మన్మోహన్ సంకల్ప బలం అణుఒప్పందంలో చూడలేదా? - ప్రధానికి రాహుల్ గాంధీ మద్దతు, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2008 లో అణుఒప్పందం కోసం మన్మోహన్ సింగ్ ‘బుష్ కి ముఖం ఎలా చూపించను’ అంటూ కుమిలిపోయి, హడావుడి పడిపోయి, అమెరికాకి పరుగున పోయిన నేపధ్యంలో, నాకైతే అతడి ఆత్రం కనబడింది గానీ సంకల్పబలం కనబడలేదు. ఇంతకీ సంకల్పబలం అంటే ఏమిటి బావా?

సుబ్బారావు:
ఏమో మరదలా! ఈ పేపరు వాళ్ళ వ్రాతలు, రాజకీయ వేషగాళ్ళ వ్యాఖ్యానాలు చదివి అన్ని పదాల అర్ధాలు, నిర్వచనాలు మరిచిపోయాను. ఎవరన్నా ఈ కొత్త అర్ధాలతో, కొత్త నిఘంటువు వ్రాస్తే బాగుణ్ణు.

******

ఈ టపాకాయ మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్ కు నా ఉగాది కానుక. Te2EnDict. నిఘంటువు విడుదల సందర్భంగా నా శుభాకాంక్షలు.

సూచన: వెయ్యిమంది ప్రదీప్ లయినా పేపర్ల వ్రాతల్లోనూ, రాజకీయ నాయకుల మాటాల్లోనూ వాడే పదాలకు స్థిరమైన కొత్త నిర్వచనాలు, అర్ధాలతో నిఘంటువులు కూర్చలేరు గాక కూర్చలేరు.

***********

Friday, March 20, 2009

72. స్లమ్ డాగ్ మిలియనీర్ – టెంట్ సిటీ బిలియనీర్

[అమెరికాలో ’టెంట్ సిటి’లు వెలుస్తున్నాయన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా లాంటి దేశాల్లో, ఆర్ధిక మాంద్యం రీత్యా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు నదీతీరాల్లో టెంట్లు వేసుకొని ఉంటున్నారట. స్వచ్చంద సంస్థలు ఆహారపదార్ధాలు అందించటానికి వస్తే ఎగబడుతున్నారట. నిజమేనా బావా?

సుబ్బారావు:
ఆకలి ఎవరికైనా ఒకటే కదా మరదలా! అలా గుడారాలు వేసుకున్న ప్రాంతాల్ని ’టెంట్ సిటీ’లని పిలుస్తున్నారట. నేను వార్తల్లో చదివాను.

సుబ్బలష్షిమి:
మనదేశంలో అయితే స్లమ్ ఏరియాలంటారు, వాళ్ళ దేశాల్లో అయితే టెంట్ సిటీలంటారన్నమాట. అయితే ఇక స్లమ్ డాగ్ మిలియనీర్ లాంటి సినిమాలు తీయడానికి ఇండియా రానక్కర్లేదు. టెంట్ సిటీ బిలియనీర్ లంటూ – అక్కడే సినిమాలు తీసుకోవచ్చు. కదా బావా?

****************

Thursday, March 19, 2009

71.బూతు పత్రికలా, వార్త పత్రికలా?సుబ్బలష్షిమి:
ఎంత జుట్టు సౌందర్యం గురించో, ఆరోగ్యం గురించో వ్రాయాలన్నా మరీ ఇంతగా, నగ్నంగా వీపు ప్రదర్శిస్తున్న ఫోటో వేయాలా బావా?

సుబ్బారావు:
అవును, నేనూ గమనిస్తూనే ఉన్నాను మరదలా! వంక దొరికితే చాలు, ఈ పేపరు వాళ్ళు బట్టల్లేని ఫోటోలే వేస్తున్నారు. ఒకప్పుడు, కొన్ని బూతు పత్రికల్ని పెద్దలు చూడకుండా దిండు క్రింద దాచుకొని చదివే వాళ్ళట కుర్రకారు. ఇప్పుడు వార్తాపత్రికల్ని కూడా పిల్లలెక్కడ చూస్తారోనని దిండు క్రింద దాచాల్సి వచ్చేలా ఉంది.

**********************

70. ఇదెవరి మనో వికారం?సుబ్బలష్షిమి:
బావా! ఈ ఫోటో, దానిపై వ్యాఖ్య చూశావా?

సుబ్బారావు:
చూశాను మరదలా! చిన్నపిల్లలు, ఒకరినొకరు కొట్టుకుంటారు, జుట్టు పీక్కుంటారు, గిల్లుకుంటారు, ఒకోసారి ముద్దు చేసుకుంటారు. పెద్దలు తమని ముద్దు చెయ్యాటాన్ని వాళ్ళు అనుకరిస్తారు.

సుబ్బలష్షిమి:
అటువంటి ఫోటోకి ఇలాంటి వ్యాఖ్యా వ్రాసేది? అమ్మమాట తప్ప అన్యమెరగని అడ్డాల బిడ్డలకి, ఆడామగా తేడా తెలుస్తుందా? శృంగార భావనలు తెలుస్తాయా? ఇది ఎవరి మనోవికారం బావా?

సుబ్బారావు:
నిశ్చయంగా మీడియా మనోవికారమే మరదలా!

************

Wednesday, March 18, 2009

69. చెట్టుముందా విత్తుముందా

[ర్యాలీలకు, రాజకీయసభలకు కూలీ+బిర్యానీ+సారా సీసా ఇచ్చి జనాలని సమీకరిస్తున్నారన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, ఇలా రాజకీయసభలకి, ర్యాలీలకి జనాన్ని డబ్బులూ, బిర్యానీ పాకెట్లు గట్రా ఇచ్చి తీసుకొస్తున్నారట. ఓటుకు కూడా వందలూ, వేలూ ఇచ్చి కొనుక్కుంటారట కదా?

సుబ్బారావు:
అవును మరదలా! ఇలాగే సాగితే ’నువ్వేమన్నా ఊరికే ఓటేసావా? డబ్బిచ్చి ఓట్లేయించుకున్నాను. మరి ఇప్పుడు పెట్టుబడి, దాని మీద లాభం తిరిగి సంపాదించుకోవద్దా? అందుకే దోచుకుతింటాను’ - అంటారేమో రాజకీయనాయకులు. అలాగే ’నువ్వెటూ గెలిచాక ఏమేలూ చేయవు. కనీసం ఇప్పుడన్నా ఓటుకు నోట్లు ఇవ్వు’ అంటారేమో కొందరు ఓటర్లు.

సుబ్బలష్షిమి:
వెరసి చెట్టుముందా విత్తుముందా అవుతుందా బావా? ఇదేం ప్రజాస్వామ్యం?

**********

Monday, March 16, 2009

68. ఆశ బోతుతనమా లేక ఆత్మగౌరవం లేకపోవడమా?

[టమాటాలకు ధరపలకక ఊరికే పంచిన రైతుల వార్తనేపధ్యంలో ]సుబ్బలష్షిమి:
ఈవార్త చూశావా బావా! కిలో 35 పైసల కంటే ధర పలకలేదని రైతులు ఉచితంగా టమోటాలు పంచిపెట్టారట. జనం చూడు బకెట్లు, పెద్దపెద్దగోతాలూ తెచ్చుకొని తీసికెళ్ళుతున్నారు!

సుబ్బారావు:
ఇలా చూస్తే రైతుని దోచుకోవడానికి రాజకీయనాయకులూ, కార్పోరేట్ విత్తనాలు, ఎరువుల కంపెనీలు, దళారీలే కాదు, జనాలు కూడా రెడీగానే ఉన్నట్లున్నారు మరదలా! మార్కెట్లో 40 రూపాయలు పోసి టమోటాలు కొన్న రోజులున్నాయి. ఇప్పుడు మార్కెట్లో 3 నుండి 4 రూపాయలు పలుకుతున్నాయి. కనీసం అందులో సగం రేటన్నా రైతులకిచ్చి టమాటాలు బకెట్ల కొద్దీ గాకపోతే గంపల కొద్దీ తీసుకోవచ్చు గదా! రైతుకేమైనా టమాటాలు పెట్టుబడి పెట్టకుండా, శ్రమపడకుండా ఊరికే వచ్చాయా? ఒకప్పుడు ఊరికే ఇస్తే తీసుకోవటం అంటే నామోషీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అన్ని ’ఉచితం’ అన్నది అలవాటైపోయినట్లుంది.

సుబ్బలష్షిమి:
అవును బావా! మినీ లారీల్లో, ఆటోల్లో తెచ్చిన ఖర్చు కూడా రాకుండా రైతుల్ని దళారిలే దోచుకుంటున్నారనుకున్నాను ఇప్పటి దాకా! చూస్తే ఎవరూ తక్కువ తినలేదనిపిస్తుంది. జనాల్లో ఉన్నది ఆశబోతుతనమా, ఆత్మ గౌరవం లేకపోవటమా?

***********

67. నేను చేస్తే లౌక్యం, నువ్వు చేస్తే మోసం

[మూడో ఫ్రంటా…….. ఇది నాలుగోసారి – కరుణానిధి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా ఈ వార్త విన్నావా? మూడో ఫ్రంటు ఏర్పడటం ఇది నాలుగోసారి అంటూ కరుణానిధి ఎద్దేవా చేస్తున్నాడు. అదే ఫ్రంటులో తానూ ఉండి ఉంటే ‘ఇక కాస్కోండి! కేంద్రంలో ప్రత్యామ్నాయం ఏర్పడిపోయింది’ అని ఉండివాడు కదా!

సుబ్బారావు:
ఖచ్చితంగా మరదలా! ఇలాంటి వాళ్ళని చూసే ‘నేను చేస్తే లౌక్యం, నువ్వు చేస్తే మోసం’ అన్నసామెత పుట్టింది.

**************

Friday, March 13, 2009

66. నేతలంతా ముందే చేతులెత్తేసారు

[మహాకూటమి, తృతీయ కూటమి నేతలంతా చేతులెత్తి పట్టుకొని ఫోటోలకి ఫోజులిస్తున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, నాకో డౌటు! మహాకూటమి, తృతీయ కూటమి అంటూ ఈ రాజకీయనాయకులంతా వేదిక మీద వరుసగా నిలబడి చేతులెత్తుతారెందుకు?

సుబ్బారావు:
చేతులెత్తేయటం అంటే ’నేను ఏం చెయ్యలేను’ అన్న అర్ధంలో ఉపయోగిస్తారని పెద్దలంటారు! అంటే ఈనాయకులంతా ముందే చెప్పేస్తున్నారన్న మాట, ప్రజలకి, ఎన్నికల తర్వాత ప్రజలకోసం తామేమీ చేయలేమని.

సుబ్బలష్షిమి:
అయితే రాజకీయనాయకులంతా నిజమే చెబుతున్నట్లు కదా బావా? మరి పాపం, అన్యాయంగా, వాళ్ళు చెప్పేదంతా అబద్దాలే అంటారేమిటి అందరూ?

*************

65. ఇల్లలకగానే పండగయినట్లుకాదు

[ఇంతవరకూ ఏపార్టీ కూడా నికరంగా తమ అభ్యర్ధుల జాబితా ప్రకటించని నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడో మూడో తారీఖున వచ్చింది కదా! ఇప్పటికి 10 రోజులైనా ఇంకా ఏరాజకీయ పార్టీ కూడా నిర్ధిష్టంగా తమ అభ్యర్ధుల జాబితాలేదేమిటి?

సుబ్బారావు:
జాబితా ప్రకటించగానే అసంతృప్తుల బెడద, తిరుగుబాటు అభ్యర్ధుల వరద, పార్టీలు మారే కప్పగెంతుల బురద మెదలౌతుంది కదా మరదలా! ఆ తలనొప్పిని తప్పించుకునేందుకు దాదాపు అన్ని పార్టీలు నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదికి కొంచెం ముందు ప్రకటించాలను కుంటున్నట్లున్నాయి.

సుబ్బలష్షిమి:
ఓహో అదా సంగతి! ‘ఇల్లలకగానే పండగయినట్లు కాదన్న’ సామెత ఇప్పుడు రాజకీయ పార్టీల దాకా వచ్చిందన్నమాట.

************

Wednesday, March 11, 2009

64. రాజకీయసినిమాలో వేణుమాధవ్

[ఉగ్రవాదానికి యుద్ధమే సమాధానం – చిదంబరం ప్రకటన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ముంబైదాడులు జరిగి వందరోజుల దాటినా ఉత్తుత్తి మాటలతో రోజులు వెళ్ళబుచ్చి, ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చాక, తీరిగ్గా, మహా పౌరుషంగా భవిష్యత్తులో ఉగ్రవాద దాడులకు యుద్ధంతోనే సమాధానం చెబుతామని ‘కారైక్కుడి’లో పేర్కొన్నాడట చిదంబరం. విన్నావా బావా!

సుబ్బారావు:
బహుశః మన సినిమాల్లో వేణుమాధవ్ పూనిఉంటాడు మరదలా ఈ గృహామంత్రికి. ’సినిమా వేణుమాధవ్ కి తానేం తీసిపోయాను’ అనుకొని ఉంటాడు.

***********

Tuesday, March 10, 2009

63. చచ్చినోడి కళ్ళు చారెడంటారు

[మహానటి సావిత్రి బొమ్మతో తపాలా బిళ్ళ విడుదల – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మహానటి సావిత్రి బొమ్మతో తపాలా బిళ్ళ విడుదలైందట. ’తపాలా బాల’ అంటూ సావిత్రిని గొప్పగా కీర్తిస్తూ పత్రికలలో వచ్చాయి చదివావా?

సుబ్బారావు:
సావిత్రి గురించిన కథనాలు చదవకుండా ఎలా ఉంటాను? చదివాను. అయితే ఏం?

సుబ్బలష్షిమి:
ఇప్పుడింతగా ఆవిడ కళ్ళు చారడనీ, నటన బారెడనీ కీర్తిస్తున్నారే, మరి 1980 లో, ఆవిడ సంవత్సరం పాటు కోమాలో పడుండగా, ఒక్క పేపరంటే ఒక్కరూ ‘ఇదేమిటి జెమినీ గణేశా!’ అనలేదు. ఎంతగా తెగతెంపులయినా ఒకప్పుడు పెళ్ళి చేసుకున్న, ఆస్తులిచ్చిన భార్యే గదా! ఒక్క పత్రికా అతణ్ణి బాధ్యుణ్ణి చెయ్యలేదు. పోనీ గదాని భుజ్ భూకంప బాధితుల కోసమో, కడలూరు సునామీ బాధితుల కోసమో విరాళాలు వసూలు చేసి ఇళ్ళు కట్టించినట్లుగా ఎంతో కొంత విరాళాలన్నా వసూలు చేసి సహాయమూ చెయ్యలేదు. తోటి నటీనటులు ఏ సహాయమూ చెయ్యలేదు. దారుణమైన యాతనపడి, ‘పోయింది’ కదా ఆ మహానటి?

సుబ్బారావు:
అంతే మరదలా! చచ్చినోడి కళ్ళు చారెడంటారు.

***********

62. ఏ ఉగ్రవాద సంస్థయినా, ఏ దేశపు అంతర్గత వ్యవహారంలోనైనా జోక్యం చేసుకోవచ్చు

[కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుంటే మరిన్నీ కార్గిల్ లు – ముషారప్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ముషారప్ ఢిల్లీ వచ్చి ఇండియా టుడే మీడియా సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్నాడట. కాశ్మీర్ సమస్య పరిష్కారం కాకుంటే మరిన్ని కార్గిల్ యుద్ధాలు తప్పవంటున్నాడట. కాశ్మీరీల సమస్యపై భావోద్వేగ సంబంధం గల వందల కొద్దీ ముజాహిదీన్లు, స్వేచ్ఛాయుత జిహాదీ సంస్థలు పాకిస్తాన్ సమాజంలో ఉన్నాయని పేర్కొన్నాడట.

సుబ్బారావు:
వారెవ్వా! గొప్ప పైకారణం [over leaf reason] పుట్టించుకున్నారన్నమాట. ఇక ఈ భావోద్వేగ సంబంధం పేరుతో ఏ ఉగ్రవాద సంస్థయినా, ఏ దేశపు అంతర్గత వ్యవహారంలోనైనా జోక్యం చేసుకోవచ్చు. బ్రహ్మండమైన ఐడియా కదా మరదలా?

*************

Monday, March 9, 2009

61. హత్యల గురించి ప్రకటించటానికి అతడే అర్హుడు

[మళ్ళీ కాంగ్రెస్ వస్తే పట్టపగలే హత్యలు – బాలకృష్ణ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
విన్నావా బావా! మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే పట్టపగలే నడివీధుల్లో హత్యలు జరుగుతాయి, కాబట్టి కాంగ్రెస్ కి ఓటేయవద్దు, తెదేపాకి వెయ్యమంటున్నాడట నటుడు బాలకృష్ణ.

సుబ్బారావు:
బాలకృష్ణ మాత్రం తక్కువ తిన్నాడా? తన ఇంట్లో బెల్లంకొండ సురేష్ మీద హత్యాప్రయత్నం ఎవరు చేశారో, పనివాళ్ళ హత్యలు ఎందుకు జరిగాయో ఎవరికీ తెలీదు. ఎంచక్కా కోర్టులో కేసులు వీగిపోయాయి.

సుబ్బలష్షిమి:
అంటే ఇలాంటి ప్రకటన చెయ్యటానికి ఆయనే అర్హుడంటావా బావా! ఎంతైనా స్వానుభవం కదా!

***************

Friday, March 6, 2009

60. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు

[కలర్ టివీలు, నెలనెలా డబ్బులు – జనాకర్షక పధకాల్ని ప్రకటించిన చంద్రబాబు వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ళు అన్నిటికీ యూజర్ ఛార్జీల వసూలు చెయ్యాలని, అదే ప్రగతికి బాటనీ, ప్రపంచబ్యాంకు విధానాలన్నీ తూచాతప్పకుండా పాటించిన చంద్రబాబు ఇప్పుడు పేదలందరికీ నెల నెలా బ్యాంకు నుండి, జీతాల లెవెల్లో వెయ్యి, రెండు వేలు చెల్లిస్తానంటున్నాడు. పైగా కలర్ టివీ లిస్తాట్ట.

సుబ్బారావు:
అందుకే అంటారేమో మన పెద్దలు అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు పట్టేవాళ్ళుంటారని. చంద్రబాబు ఇదే కోవకు చెందుతాడన్న మాట.

**********

59. మహాకూటమితో గెలవాలనా? లేక ఓడిపోవలనా?

[మహా కూటమి లో సీట్లపై పీటముడి, మహాగర్జన వాయిదా వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్శిమి:
బావా! ఎన్నికల షెడ్యూలు కూడా వచ్చేసాక ఇంకా సీట్ల సర్ధుబాటు మీద సిగపట్లు మానలేదు. అందుకోసం మహాగర్జన కూడా వాయిదా చేసుకున్నారట. మహా కూటమి నేతల ప్రవర్తన వింతగా లేదూ?

సుబ్బారావు:
అవును మరదలా! మూడో తారీఖునే, తొమ్మిదో తారీఖున జరగాల్సిన మహాగర్జన వాయిదా వేసుకున్నారు. అప్పటికి కూడా తమ మధ్య సర్ధుబాటు కుదరదని ముందే తెలుసన్నట్లు. అంటే కావాలనే అనైక్యత చూపించి కాంగ్రెస్ కి పరిస్థితి అనుకూలం చేస్తున్నట్లే ఉంది.

సుబ్బలష్షిమి:
అంటే అన్నిపార్టీల మధ్య అంతర్గత సర్ధుబాటు ఉన్నట్లే గదా? ఒక పార్టీ గెలవాలన్నది పధకం అయితే మిగిలిన అన్నిపార్టీలు కావాలనే తప్పలూ, తాత్సారమూ చేస్తున్నట్లున్నాయి!

సుబ్బారావు:
మరి అందర్నీ నడిపేది ఒక్కళ్ళే అయితే అంతేగదా మరదలా! తమకి కావలసినట్లే మలచుకుంటారు. మనమే పిచ్చోళ్ళల్లాగా తెగ ఫీలియిపోయి ఓట్లేస్తుంటాం.

***********

Wednesday, March 4, 2009

58. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాట్ట

[లంక క్రికెటర్లపై దాడుల వెనుక భారత్ హస్తం, ఉగ్రవాదులు అక్కడి నుంచే వచ్చారు: పాక్ షిప్పింగ్ శాఖ సహాయమంత్రి సర్ధార్ నబిల్ అహ్మద్ ఆరోపణ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
చూశావా బావా! పాక్ లో లంక ఆటగాళ్ళు మీద దాడి వెనుక భారత్ హస్తం ఉందిట. ఉగ్రవాదులు ఇక్కడి నుండే వెళ్ళారనీ, ముంబాయి దాడులకి ప్రతిగా ఈ కుట్ర పన్నారనీ పాక్ మంత్రి అంటున్నాడు. ఇంకా నయం! 2001, సెప్టెంబర్ 11న అమెరికా WTC మీద విమాన దాడి చేసిందీ, 2007 డిసెంబర్ లో పాక్ లో బేనజీర్ ని హత్య చేసిందీ భారతీయులే అనలేదు, కదు బావా?

సుబ్బారావు:
‘బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాట్ట’ అన్న సామెత ఇలాంటి పాక్ మంత్రిని చూసే మన వాళ్ళు చెప్పిఉంటారు మరదలా!

***************

57. జ్యోతిష్య బ్రహ్మ పాక్ క్రికెట్ కెప్టెన్ యునిస్ ఖాన్

[ఆలస్యమే ప్రాణాలు కాపాడింది – పాక్ క్రికెట్ కోచ్ ఇంతికాబ్ ఆలమ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
నిర్ణీత సమయానికి 5 నిముషాలు ముందే లంక క్రికెట్ జట్టు స్టేడియంకి బయలుదేరిందట. ‘మనం తర్వాత వెళ్దాం’ అంటూ పాక్ క్రికెట్ జట్టు కెప్టెన్ యునిస్ ఖాన్ తమని ఆపాడని, లేకపోతే తాము దాడికి గురయ్యేవారమని పాక్ క్రికెట్ కోచ్ ఇంతికాబ్ ఆలమ్ చెబుతున్నాడు! విన్నావా బావా?

సుబ్బారావు:
అవును. ఆలస్యం అమృతం విషం కాదు, ఆలస్యం అమృతమే అంటున్నారట. అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
పాక్ క్రికెట్ కెప్టెన్ యూనిస్ ఖాన్ కలగన్నాడో లేక జరగబోయేది తెలిసిన జ్యోతిష్యుడో గాని మొత్తానికి జట్టుప్రాణాలు కాపాడిన దేవుడు అయ్యాడు బావా!

సుబ్బారావు:
నిజమే మరదలా! పాక్ పోలీసులు వెళ్ళి కెప్టెన్ యునస్ ఖాన్ ని కలిసి, కాల్పులు జరిపిన వారి వివరాలు జ్యోతిష్యం చెప్పించుకుంటే ఇంకా బావుంటుంది కదా!

********

56. ఎంత వారలయినా ఈ అమ్మ బలం ముందు బలాదూరే!

[శరద్ పవార్ NCP పార్టీ – కాంగ్రెస్ పార్టీల పొత్తు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అప్పుడెప్పడో సోనియా గాంధీ విదేశీయతని వ్యతిరేకిస్తూ శరద్ పవార్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి NCP పార్టీ పెట్టాడు గదా! కాంగ్రెస్ లో ఉండటానికి సోనియా గాంధీ విదేశీయత అడ్డంకిగా అన్పించినప్పుడు, మరి పొత్తుకి అడ్డంకిగా అన్పించడం లేదా?

సుబ్బారావు:
ఎంత వారలయినా ఈ అమ్మ బలం ముందు బలాదూరే!


**********

Tuesday, March 3, 2009

55. కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా ?

[ఎన్నికలయ్యాక కాంగ్రెస్, వామపక్షాలు కలిసిపోతాయి – వెంకయ్య నాయుడు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! మొన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇదే మాటన్నాడు. ఈ రోజు వెంకయ్య నాయుడూ అంటున్నాడు.


సుబ్బారావు:
ఏమని మరదలా!

సుబ్బలష్షిమి:
ఎన్నికల తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు కలిసిపోతాయట. మరి మొన్నెందుకు విడిపోయినట్లు?

సుబ్బరావు:
ఎప్పటి అవసరం అప్పుడు మరదలా! అయినా వెంకయ్యనాయుడు అలా అంటున్నాడంటే ఎన్నికల్లో హంగ్ వస్తుంది, కాంగ్రెస్ వామపక్షాలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి అని అర్ధమంటావా?

సుబ్బలష్షిమి:
భాజపా గెలిచి అధికారంలోకి వస్తే, మిగతా అన్నిపార్టీలు ప్రతిపక్షంలో ఉంటే కలిసిపోవటం ఎందుకు మరి? అంటే భాజపా గెలవబోదని ముందే జోస్యం చెప్పటం కాదా ఇది?

సుబ్బారావు:
జోస్యమే చెబుతున్నాడో, సంకేతమే ఇస్తున్నాడో ఎవరికి తెలుసు? ఏదైనా జరిగాక కదా తెలిసేది?

************

54. అవసరం ఎక్కడికైన తీసుకెళ్తుంది

[సినీనటుడు మోహన్ బాబు కుమారుడు హీరోవిష్ణు వివాహానికి హాజరైన రామోజీరావు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఒక్కప్పుడు ముఖ్యమంత్రుల చేతి నుండి నంది అవార్డులు తీసుకోవడానికి కూడా హాజరు కాని రామోజీరావు ఇప్పుడు అన్నిటికీ హాజరవుతున్నాడేం బావా?

సుబ్బారావు:
అవసరం ఎక్కడికైన తీసుకెళ్తుంది మరదలా!

*********

Monday, March 2, 2009

53. ఎప్పటికెయ్యది కారణమో ఎవ్వరి కెరుక?

[నేపాల్ రాజభవనం నరమేధంపై తాజా విచారణ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, 2001 లో నేపాల్ రాజకుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయినప్పుడు – యువరాజు, రాజదంపతుల్నీ, ఇతర కుటుంబసభ్యుల్ని, సింధియాల మేనకోడలితో తన వివాహాన్ని అంగీకరించనందున అందర్నీ కాల్చిచంపి, తానూ ఆత్మహత్యచేసుకున్నాడని కదా పత్రికలు వ్రాసాయి?

సుబ్బారావు:
అవును.

సుబ్బలష్షిమి:
మరి ఇప్పుడేమిటి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి యువరాజు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణ కమిటీ తేల్చిందని వ్రాసాయి?

సుబ్బారావు:
అందుకే కదా మళ్ళీ తాజా విచారణ చేస్తాం అంటున్నాడు ఆదేశ ప్రధాని ప్రచండ! ఎప్పటికెయ్యది కారణమో ఎవ్వరి కెరుక?

*********