Thursday, December 31, 2009

చిన్నరాష్ట్రాలైతే ఎంత అభివృద్ధి!

[చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి అంటున్న రాజకీయనేతలూ, పార్టీలు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చిన్నరాష్ట్రాలు తీవ్రవాదుల నిలయాలుగా మారిపోతున్నాయి. చిన్నరాష్ట్రాల్లో చీటికీ మాటికీ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. మధుకోడాల వంటి ముఖ్యమంత్రులు ఆర్ధిక నేరాలలో దొరికిపోతున్నారు. అయినా గానీ, చిన్నరాష్ట్రాల తోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు రాజకీయ నాయకులు. ఇదేం విచిత్రం బావా?

సుబ్బారావు:
ఇందులో విచిత్రం ఏముంది మరదలా! ఇప్పుడు జార్ఖండ్ లో చూడరాదా? ఒక ముఖ్యమంత్రీ, ఇద్దరు ఉపముఖ్యమంత్రులూ తయారయ్యారు. చిన్న రాష్ట్రాలైతే ప్రతీ రాజకీయ నాయకుడూ జీవిత కాలంలో ఒక్కసారైనా ముఖ్యమంత్రో, ఉపముఖ్యమంత్రో, అధమ పక్షం మంత్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది అభివృద్ధీ కాదా?

సుబ్బలష్షిమి:
ఓహో! అభివృద్ధి అంటే ప్రజలకి కాదు, రాజకీయ నాయకులకన్న మాట!

పడ్డాననుకున్నారా? పిల్లిమొగ్గలేసాను గానీ!

[క్రిస్మస్ రోజున డెట్రాయిట్ కు వెళ్తున్న అమెరికా విమానాన్ని పేల్చివేసేందుకు, నైజీరియాకు చెందిన ముతల్లాబ్, ఆల్ ఖైదా కుట్రపన్నాయని సీఐఏకు ముందే తెలుసు. భద్రతా లోపాలపై ఒబామా ఆగ్రహం - వార్తనేపధ్యం]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? చీమ చిటుక్కుమన్నా తెలుసుకోగలిగే సీఐఏ కి, అమెరికా విమానం పేల్చివేత కుట్ర కూడా ముందే తెలుసట. అయినా, మానవ వ్యవస్థాగత లోపాల కారణంగా నివారించలేకపోయారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

సుబ్బారావు:
విజయా వారి అలనాటి ’మాయాబజార్’ సినిమాలో ఘటోత్కచుని అనుచరులు ఉత్తర కుమారుడి రధసారధిని ఆటపట్టిస్తారు. వేసి ఉన్నాయనుకున్న తలుపుల్ని గుద్దేసి, సరిగ్గా అప్పుడే అవి బార్లా తెరుచుకోవటంతో బాలకృష్ణ[అంజిగాడు] కాస్తా పొర్లగింతలు పెట్టేస్తాడు. కానీ శాస్త్రీ శర్మలతో బింకంగా దబాయిస్తాడు. సరిగ్గా అలాగే ఉంది అమెరికా అధ్యక్షుల వారి ఆగ్రహ ప్రహసనం!

సుబ్బలష్షిమి:
అంటే "పడ్డాననుకున్నారా? పిల్లిమొగ్గలేసానంతే!" అన్నట్లన్నమాట!

Wednesday, December 30, 2009

నిద్రపోయే వాణ్ణి లేపగలం గానీ "నేను నిద్రపోతున్నానూ" అంటూ గావుకేకలు వేసే వాణ్ణి ఎలా లేపగలం?

[1. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి 9 ఏళ్ళు. దాదాపు సంవత్సర కాలపు గవర్నర్ పాలన తర్వాత, ఈ రోజు శిబూ సోరెన్ ముఖ్యమంత్రిగా 7 వ ప్రభుత్వం ఏర్పడబోతోంది.
2. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం - రాజకీయ నేతలు, భాజపా వంటి పార్టీలు. - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా ఈ రాజకీయ నాయకులూ, పార్టీలూ ఓ ప్రక్క చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం అంటున్నారు. మరో ప్రక్క చూస్తే, చిన్న రాష్ట్రాలు మావోయిస్టుల వంటి తీవ్రవాదుల అడ్డాలుగా మారిపోయాయి. సుస్థిరప్రభుత్వాలు కరువవుతున్నాయి. జార్ఖండ్ రాష్ట్రంలో, అది ఏర్పడిన 9 ఏళ్ళల్లో ఏడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయట తెలుసా?

సుబ్బారావు:
అదే విచిత్రం మరదలా! విడివిడిగా ఉన్న పుల్లల్ని విరవడం తేలిక, కట్టగడితే గట్టిగా ఉంటాయన్న నిజం, చిన్న పిల్లలకి కూడా తెలుసు గానీ, మన రాజకీయ పార్టీలకీ, నేతలకీ మాత్రం తెలియదు.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! నిద్రపోయే వాణ్ణి లేపగలం గానీ, "నేను నిద్రపోతున్నానూ" అంటూ గావుకేకలు వేసే వాణ్ణి ఎలా లేపగలం?

భూమి గుండ్రంగా ఉంది అని ఇలాక్కూడా నిరూపించబడింది

[సోనియాగాంధీని విదేశీ అని కొందరు వ్యాఖ్యానించటం తొందరపాటు తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు ఏ ఓ హ్యూమ్ కూడా భారతీయుడు కాదని గుర్తుంచుకోవాలి - రోశయ్య వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? కాంగ్రెస్ ని స్థాపించింది విదేశీయులేననీ, అందుచేత ప్రస్తుత అధ్యక్షురాలిని విదేశీ అనకూడదని సెలవిచ్చాడు ఈ గుమాస్తా ముఖ్యమంత్రి!

సుబ్బారావు:
నిజమే మరదలా! కాంగ్రెస్ పార్టీ విదేశీయులచే స్థాపించబడి, స్వదేశీయుల చేత దేశభక్తుల చేత నడపబడి, మళ్ళీ విదేశీల చేతికే వెళ్ళింది. అంతే!

సుబ్బలష్షిమి:
అంటే భూమి గుండ్రంగా ఉంది అని ఇలాక్కూడా నిరూపించబడిందన్న మాట!

Sunday, December 27, 2009

న్యాయానికి అధిష్టాన దేవతలు

[హర్యానా రాష్ట్ర మాజీ డీజీపీ రాధోడ్ Vs రుచిక కేసులో అతడికి ఆరునెలలు శిక్ష విధించిన వార్త, ఆంధ్రప్రదేశ్ కోర్టు రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్.డి. తివారీ శృంగార కార్యకలాపాల వార్తా ప్రసారాల కేసుపై స్టే ఇచ్చిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మనదేశంలో కోర్టు తీర్పులూ, న్యాయమూర్తులు దినకరన్ ల వ్యవహారం చూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. కోర్టుల తీరు ఇలా ఉంటే మన సినిమాలలో న్యాయమూర్తులంతా న్యాయదేవతలైనట్లు, దేవుడి తీర్పు లేవో ఇచ్చినట్లు చూపిస్తారు. హీరోలు నానా ఆగచాట్లు పడి, ఉద్యోగాలు, స్టేటస్, కుటుంబం అన్నిటినీ పోగొట్టుకుని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని, చావుతప్పి కన్నుపోయినట్లయిగా చివరాఖరికి విలన్లని కోర్టుకి అప్పచెప్పి నిట్టూర్పులు విడుస్తుంటారు కదా బావా?

సుబ్బారావు:
ఓసి నా అమాయకపు మరదలా! మనదేశంలో కోర్టుల్ని చూసే కళ్ళు తేలేస్తున్నావు. పాకిస్తాన్ లో కోర్టులు అక్కడి ప్రభుత్వాలనే ఎదిరిస్తూ, మన కంటే బలంగా ఉన్నాయి తెలుసా?

సుబ్బలష్షిమి:
అయితే మన దేశపు కోర్టుల్లో న్యాయమూర్తులు న్యాయదేవతలైతే, పాకిస్తాన్ కోర్టుల్లో న్యాయమూర్తులు న్యాయానికి అధిష్టాన దేవతలన్నమాట!

Tuesday, December 22, 2009

అప్పటిది తెల్లరాణి పెత్తనం - ఇప్పటిది తెల్లనారి పెత్తనం!

[ఈ దేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం అర్ధరాత్రి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు గురించి ప్రకటిస్తే తప్పేమిటన్న కేసీఆర్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! ఈ దేశానికి అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించారు. అలాంటప్పుడు కేంద్రం అర్ధరాత్రి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రకటిస్తే తప్పేమిటి అంటున్నాడు కేసీఆర్!

సుబ్బారావు:
తప్పని అనటం లేదు మరదలా! అప్పుడు అర్ధరాత్రి స్వాతంత్ర ప్రకటన చేసిన బ్రిటీషు ప్రభుత్వానికీ, ఇప్పుడు అర్థరాత్రి రాష్ట్ర విభజన ప్రారంభ ప్రకటన చేసిన యూపీఏ ప్రభుత్వానికి తేడా లేదంటున్నారు, అంతే!

సుబ్బలష్షిమి:
అవును బావా! అప్పటిది తెల్లరాణి పెత్తనం. ఇప్పటిది తెల్లనారి పెత్తనం! ప్యాకింగ్ మారిన ప్రజాదోపిడి అంతే!

Monday, December 21, 2009

ఇలాంటి సిద్దాంతాలు చేసే వాళ్ళకే నోబెల్ బహుమతులు వస్తాయా?

[ప్రైవేట్ ట్యూషన్ ల మూలంగా విద్యార్ధులలో అంతరాలు పెరుగుతున్నాయన్న అమర్త్యసేన్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రముఖ ఆర్ధికవేత్త అమర్త్యసేన్, పిల్లలకి తల్లిదండ్రులు ప్రైవేటు ట్యూషన్ లు చెప్పించటం వల్ల విద్యార్ధులలో అంతరాలు పెరుగుతున్నాయంటున్నాడు. ఇదే విచిత్రం బావా! కార్పోరేట్ విద్యాసంస్థలూ, పేదవాడికి అందని విద్య - ఇవేవీ కారణం కాదన్నమాట! ఇంకా నయం, చదువుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలకి చదువుచెప్పటం వల్లనే విద్యార్ధులలో అంతరాలు పెరుగుతున్నాయన లేదు!

సుబ్బారావు:
అందుకే కదా మరి మరదలా! అతడికి నోబెల్ బహుమతి వచ్చింది.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఇలాంటి సిద్దాంతాలు చేసేవాళ్ళకే అలాంటి బహుమతులు వస్తాయన్న మాట. ఒబామాకి శాంతి బహుమతి రావటం చూశాక ఇది మరింత అర్ధమౌతోంది బావా!

’చద్దన్నం తిన్నమ్మ మగనాకలి ఎరగదు’

[పార్లమెంట్ క్యాంటిన్ లో చౌకధరలో భోజనం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇది చదివావా బావా! పార్లమెంట్ క్యాంటిన్ లో పన్నెండు రూపాయలకే పుల్ మీల్స్ ట. చికెన్ బిరియానీ 34/- రూ.లే. చేపల పులుసు 17/- రూపాయలేనట!

సుబ్బారావు:
అందుకేనేమో మరదలా! నిత్యావసర సరుకుల ధరలు చుక్కల్ని దాటి ఎటో వెళ్ళిపోయినా రాజకీయ నాయకులకి పట్టటం లేదు.

సుబ్బలష్షిమి:
దీన్నే ’చద్దన్నం తిన్నమ్మ మగనాకలి ఎరగదు’ అంటారు బావా పెద్దలు!

Saturday, December 19, 2009

సినిమా అవకాశాల కోసం ముంబై వచ్చిన కసబ్

[నన్ను పోలీసులు కేసులో ఇరికించారు - కసబ్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? ముంబై ముట్టడిలో పట్టుబడ్డ కసబ్, తాను అమాయకుడిననీ, ఏకే 47 ఎలా ఉంటుందో కూడా తనకి తెలియదనీ, సినిమా అవకాశాల కోసం 20 రోజుల క్రితం ముంబై వచ్చిన తనని పోలీసులు ఈ కేసులో ఇరికించారనీ కోర్టులో చెబుతున్నాడు.

సుబ్బారావు:
అంతేమరి మరదలా! అప్జల్ గురుకి ఉరిశిక్ష వేయకుండా, నళిని తనని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా, వారిమీద ప్రేమకురిపిస్తున్న యూపీఏ పెద్దమ్మని చూశాక కసబ్ కైనా దన్ను వస్తుంది. మాట మార్చడానికి కావలసినంత దమ్ము వస్తుంది.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! అంతిమాధికారం ఉన్నవాళ్ళ ఆశీర్వాదబలం మరి!

Friday, December 18, 2009

భళ్ళున కుండ పగిలినట్లుంది

[లోకసత్తా నాయకుడి ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవేదన - వార్త నేపధ్యంలో]
సుబ్బలష్షిమి:
బావా! లోక్ సత్తా నాయకుడు జె.పి. ముందు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవేదన వెళ్ళగక్కాడట. మనస్సు విప్పి బాధలు పంచుకున్నట్లున్నాడు.

సుబ్బారావు:
రాజకీయాల్లోకి రాకముందు, పూర్వాశ్రమంలో ఇద్దరూ బ్యూరాక్రాట్లే కదా మరదలా! ’ఆ రోజులే నయం. ఆఫీసు వర్కు అయిపోతే ఏ బాధ్యాత లేదు. ఏదైనా అయితే పైవాడి మీదికో, క్రింది వాడి మీదికో తోసేసి రెడ్ టేపిజం జరిపేస్తే రోజులు హాయిగా గడిచిపోయేవి. ఇప్పుడు అన్నిటికి తానే బాధ్యుడుగా ఉండవలసివస్తున్నది’ అన్పించిందేమో?

సుబ్బలష్షిమి:
’గతించిన కాలమే మిన్న రాబోయే రోజుల కన్న’ అన్న కవి వాక్యాన్ని, ’గతించిన కాలమే మిన్న నడుస్తున్న రోజుల కన్నా’ అని మార్చి చదువుకుంటారేమో!

Thursday, December 17, 2009

ప్రచార పర్వంలో స్నానఘట్టాలు

[దీక్షాశిబిరం సమీపంలో లగడపాటి స్నానం - ఫోటో ప్రచురించిన ఈనాడు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈనాడు వారికిదేం వ్యామోహం బావా! అప్పటి ఎన్టీఆర్ కాలం నుండి చూస్తున్నాను. రోడ్డుప్రక్కనో, దీక్షా శిబిరాల ప్రక్కనో స్నానం చేస్తున్న, నాయకుల అర్ధ నగ్నఫోటోలు ప్రచురిస్తారేం? పర్యటనలన్నాకా, దీక్షలన్నాక, ఆ దగ్గరలోనే కాలకృత్యాలూ, స్నానపానాలు తప్పవు కదా!ఇదేం వార్తప్రచారాలు బావా?

సుబ్బారావు:
అప్పటి ఎన్టీఆర్ విషయంలో అదే ప్రధమం మరదలా! అందునా అతడు సినిమా నటుడు! ఏం చేసినా సంచలనమే అన్నట్లు అప్పట్లో ఈనాడు ప్రచారించింది. అదే మంత్రం కేసీఆర్ కీ అనువర్తించి అతడి స్నానపు ఫోటోలూ ప్రచురించింది. కాకపోతే ఆ ఫోటోల్లో కేసీఆర్ బక్క శరీరం చూస్తే అంతిమ స్నానపు ఘట్టంలా ఉందని వ్యాఖ్యలు రేగటంతో ఆపారు. ఇప్పుడు లగడపాటి వంతు!

సుబ్బలష్షిమి:
ఏమైనా ఇది వార్తలు ప్రచురించే తీరేనా బావా? మనో వికారం గాకపోతే!

Monday, December 14, 2009

అత్తమీద కోపం దుత్తమీద చూపించటం

[సోనియా రాయబరేలి పర్యటనలో అధికారుల మీద ఆగ్రహం వ్యక్తపరిచింది - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ అధిష్టానం నిశ్శబ్ద్ధంగా గమనిస్తోందట బావా!

సుబ్బారావు:
అధిష్టానం నిశ్శబ్ధంగా ఎక్కడ గమనిస్తోంది మరదలా! స్వంత నియోజక వర్గం రాయబరేలీ వెళ్ళి, కాలువలు ఎండాయనీ, విద్యార్ధుల మధ్యాహ్న భోజనం నాసిగా ఉందనీ అధికారులు మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది గదా?

సుబ్బలష్షిమి:
అయితే అత్తమీది కోపం దుత్తమీద చూపించటం అన్న సామెత కూడా గుర్తుకు తెచ్చుకోవాలి బావా!

సుబ్బారావు:
కర్నూలు వరదబాధితుల ప్రాంతంలో, నేలమీద పర్యటిస్తే, ఈ సోనియాకు ’అసలు కోపం’ అంటే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది, మరదలా!

వంకలేనమ్మ డొంకపట్టుకుని ఓ డొంకా నీకెన్ని వంక[ర]లే అని ఏడ్చిందట

[రెండురోజుల్లో అధిష్టానం ప్రకటన - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా ఈ వార్త విను. "ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ అధిష్టానం నిశ్శబ్ద్ధంగా గమనిస్తోంది. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్ర, శనివారాలు ఢిల్లీలో లేకపోవడం, ఆదివారం సెలవు కావడంతో రోజు వారీ కసరత్తుకు ఆటంకం కలిగింది" - ఇదీ వార్త. బావా! నాకు తెలియక అడుగుతాను, రాష్ట్రం ఇలా రావణ కాష్టంలా తగలడుతుంటే తీరిగ్గా సెలవు పుచ్చుకుంటారా? అదే పుట్టిన రోజు కానుకలు ఇవ్వడానికైతే పనిగంటలు పట్టించుకోకుండా అర్ధరాత్రి దాకా భేటీలు, ప్రకటనలు చేసారు గదా?

సుబ్బారావు:
అంతే మరదలా! తమకి అవసరం అయినప్పుడు అవసరమైనట్లు చేస్తారు. మొన్న తెలంగాణా వాళ్ళు బస్సులు, ఆస్తులు తగలబెట్టేదాకా చూసారు. ఇప్పుడు సమైక్యాంధ్ర వాళ్ళు కూడా బస్సులు, ఆస్తులు తగలబెట్టెదాకా చూసి, తరువాత తీరిగ్గా ఆలోచిస్తారనుకుంటా. రోజులు దొర్లించేందుకు సెలవులు ’వంక’ అన్నమాట.

సుబ్బలష్షిమి:
దీన్నే ’వంకలేనమ్మ డొంకపట్టుకుని ఓ డొంకా నీకెన్ని వంక[ర]లే అని ఏడ్చిందంటారు’కదా బావా!

Sunday, December 13, 2009

ముఖ్యమంత్రి కుర్చీనా? గుమాస్తా కుర్చీనా?

[అధిష్టానం చెప్పిందే చేస్తున్నాను. నా చేతుల్లో ఏమీ లేదు - రోశయ్య వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఈ ముఖ్యమంత్రి రోశయ్య నోరెత్తితే చాలు ’అధిష్ట్ఘానం చెప్పిందే చేశాను. నా చేతల్లో ఏమీ లేదు. చేతుల్లోనూ ఏమీ లేదు’ అంటాడు. పైగా ’క్రమశిక్షణ గల కార్యకర్తనీ, అధిష్టానం అజ్ఞ శిరోధార్యం’ అంటాడు.

సుబ్బారావు:
అవును మరదలా! ఈ పాటి గుమాస్తా గిరి చేయటానికి ముఖ్యమంత్రి అన్న పదవేందుకు? సుదీర్ఘ రాజకీయానుభవం, వయస్సు గట్రా అర్హతలెందుకు?

సుబ్బలష్షిమి:
అయితే ముఖ్యమంత్రి కుర్చీలో ఓ ఎల్.డీ.సీ.నో యూ.డీ.సీ.నో కూర్చున్నా సరిపోతుందన్న మాట.

Saturday, December 12, 2009

మింగ మంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం....

[తెలంగాణా కావాలని కొందరూ, సమైక్యాంధ్ర ఉండాలని కొందరూ ఘర్షణలు పడుతున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలని కొందరూ, సమైక్యాంధ్ర కావాలని మరి కొందరూ ఘర్షణలు పడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా గొడవే, ఇవ్వకపోయినా గొడవే. కేంద్రం ఏం చేస్తుందంటావూ?

సుబ్బారావు:
ఈ పరిస్థితి కేవలం మన ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే పరిమితం కాలేదు మరదలా! దేశమంతా చుట్టుకుంది. అంతేకాదు మన ప్రధాని ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా సమస్యని పరిష్కరిస్తానన్నాడు.

సుబ్బలష్షిమి:
అంటే కప్పకి, పాముకి కూడా మనోభావాలు దెబ్బతినకుండా పరిష్కరిస్తాడా బావా! అయితే చూడాల్సిందే అది ఎలా ఉంటుందో!

ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను

[తొందరపాటు నిర్ణయం తీసుకోం - ప్రధాని మన్మోహన్ సింగ్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలంగాణా విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోం అంటున్నాడు ప్రధానమంత్రి. మరి బుధవారం అర్ధరాత్రి హోంమంత్రి చిదంబరం అధిష్టానదేవత సోనియా తరుపున ప్రకటించిన నిర్ణయం ఏమిటి బావా? తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం అమోదించమని ప్రకటించి, తర్వాత దాన్ని తీర్మానం ప్రవేశపెట్టమనటంగా మార్చారని ముఖ్యమంత్రి రోశయ్య చెబుతున్నాడు కదా! ఈ మతలబు అర్ధం ఏమిటి?

సుబ్బారావు:
తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ అంటూ షురూ చేశాక... ఇక తొందరపాటు, నెమ్మదిపాటు, గ్రహపాటు ఏముంటాయి మరదలా! నిజానికి అన్నిటి లాగే దీన్లోనూ రెడ్ టేపిజం ఆట ఆడుకోవచ్చులే అనుకుని షురూ చేసినట్లున్నారు. ఇరుక్కుపోయారు.

సుబ్బలష్షిమి:
చిన్నప్పడు విన్న ’ఎరక్కపోయి వచ్చాను. ఇరుక్కుపోయాను’ అన్న అక్కినేని నాగేశ్వరరావు సినిమా పాట గుర్తొస్తోంది బావా!

పుట్టిన రోజు కానుకలు - కేకు ముక్కల్లా రాష్ట్రాలు

[కాంగ్రెస్ అధిష్టానం సోనియా తన పుట్టిన రోజు కానుకగా తెలంగాణా రాష్ట్రం ఇస్తుంది - అన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ రోజు ప్రణబ్ ముఖర్జీ పుట్టినరోజట. అతడి పుట్టిన రోజు కానుకగా - కాంగ్రెస్ అధిష్టానం, ఓ నలుగురితో కూర్చుని ఈ అర్ధరాత్రికి పశ్చిమ బెంగాల్ నుండి గూర్ఖాలాండ్ ని విడగొట్టి ఇచ్చేస్తే సరిపోతుంది కదూ! వాళ్ళూ వాళ్ళూ తన్నుకుంటారు గదా! పుట్టిన రోజు వినోదం కూడా బాగా వస్తుంది.

సుబ్బారావు:
అదొక్కటే ఎందుకు మరదలా! శరద్ పవార్ పుట్టినరోజు కానుకగా విదర్భానీ, లాలూ పుట్టిన రోజు కానుకగా మిధిలాంచల్ నీ, రాహుల్ గాంధీ పుట్టినరోజు కానుకగా ఉత్తరప్రదేశ్ నుంచి బుందేల్ ఖండ్, పశ్చిమోత్తర ప్రదేశ్, హరిత ప్రదేశ్ లనీ, కరుణానిధి పుట్టిన రోజు కానుకగా ఉత్తర దక్షిణ తమిళనాడుల్నీ .... ఇలా వరసబెట్టి... పిల్లల పుట్టిన రోజులకి కేకు ముక్కల్నీ, చాకెలెట్లనీ కానుకగా ఇచ్చినట్లు ఇచ్చేస్తే సరి!

సుబ్బలష్షిమి:
చివరికి నాయకుల జాగీర్ దార్ అయిపోయిందన్న మాట మన జన్మభూమి!

Friday, December 11, 2009

తాంబులాలు ఇచ్చాను, తన్నుకు చావండి....

[రాజకీయ కల్లోలం - 48గంటల్లో తెలంగాణా వాదులు, సమైక్యాంధ్ర వాదులు రోడ్లకెక్కి కొట్టుకునే స్థితి దాకా ఉద్యమాలు రేగటం, బంద్ లూ, యూనివర్సిటీ విద్యార్ధుల ఊరేగింపుల నేపధ్యంలో...]

సుబ్బలష్షిమి:
బావా! పదిహేనురోజుల క్రితం వరకూ కూడా ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం... ’ఢిల్లీని గెలిచిన బక్కమనిషి’ దీక్షా దక్షతలతోనూ, అచ్చం ఇంగ్లాండు వాడిలాగే అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.... తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం ఆమోదించమన్న ప్రకటన చేయటంతో, నిప్పుల గుండమై పోయింది. ఏమిటిది బావా?

సుబ్బారావు:
ఏముంది మరదలా! ఇంగ్లాండు వాడిపాలన అయినా, ఇటలీ వ్యక్తి పాలన అయినా, పైపైన ప్యాకింగు మారిందే గానీ లోపలి సరుకు అదే కదా! విభజించి పాలించమన్న కణిక నీతే మరోసారి ప్రయోగింపబడుతోంది.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అఖండ భారతం, ఇండియా పాకిస్తాన్ లుగా విడిపోయినప్పుడు జరిగిన మతఘర్షణలకి, ప్రాతిపదిక ఆర్ధిక కారణాలే అన్నది, చరిత్రకారులు, వాళ్ళ పుస్తకాలు కప్పిపుచ్చినా, పునరావృతం అవుతున్న పరిస్థితులు అదే తెలియచెపుతున్నాయి బావా!

సుబ్బారావు:
దీన్నే మరదలా, ’తాంబులాలు ఇచ్చాను, తన్నుకు చావండి’ అన్నాడు మన అగ్నిహోత్రావధానులు!

Thursday, December 10, 2009

భారతదేశంలో, భారతీయులమని చెప్పే ముస్లింలు ఎంతమంది?

[భారత్ - పాక్ సంబంధాలు - ’లోగుట్టు’ శీర్షికలో ’అపనమ్మకాలే అడ్డుతెరలు’ అనే వ్యాసంలో, ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ - పాక్ జనాభాలోని ప్రతి పదిమందిలో ఒకరికి మాత్రమే మాత్రమే పాక్ ప్రభుత్వం పట్ల గురి ఉన్నట్లు నీల్సన్ పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. పాక్ ప్రజల్లో అత్యధికులు ముందుగా తాము ముస్లిములమని, ఆ తరువాతనే పాకిస్థానీయులమని భావిస్తున్నట్లు ఆ సర్వేలో వెల్లడయింది. ఆ దేశంలో ఇస్లామిక్ భావనలు మరింత ప్రబలతున్నాయనడానికి ఇది నిదర్శనం..... అని వ్రాసిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చదివావా? పాకిస్తాన్ లో ప్రతి పదిమందిలో తొమ్మిది మంది, ముందు తాము ముస్లింలమనీ తర్వాతే పాకిస్తానీయులమనీ భావిస్తారట.

సుబ్బారావు:
అందులో వింతేముంది మరదలా! మత ప్రాతిపదికన చీలిపోయిన పాకిస్తాన్ లో, ప్రజలు అలా ఉండటంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, గౌరవం ఉన్నాయంటూ మన దేశంలో ఉండిపోయిన, పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ముస్లింలలో కూడా, అత్యధికులు ముందు తాము ముస్లింలమని భావిస్తున్నారన్న విషయం మనకి తెలిసిందే. MIM నేతల్ని చూసినా, వందేమాతర గీతం పాడేది లేదని తెగేసి చెప్తున్న ముస్లింలని చూసినా ఇది బాగానే అర్ధమౌతోంది. భారతీయతని గౌరవించమన్న విషయం పాకిస్తాన్ చీలేటప్పుడే చెప్పి ఉంటే బాగుండేది. బలం పుంజుకున్న తర్వాత చెప్తున్నారు.’భారతదేశంలో, భారతీయులమని చెప్పే ముస్లింలు ఎంతమంది?’ అన్న లెక్కలు తేల్చే అధ్యయానాలే ఏ సంస్థలూ చేయటం లేదు, చేసినా నిజాల లెక్కలని పత్రికలు ప్రచురించటమూ లేదు. అంతే!

సుబ్బలష్షిమి:
నిజమేలే బావా! ఒక దశలో భారత్ ముస్లింలలో కొందరు, ’అజారుద్దీన్ సెంచరీ చేయాలి, పాకిస్తాన్ మ్యాచ్ గెలవాలి’ అన్నారని కూడా విన్నాము. మతం మానవత్వాన్ని మరిచిపోయాక ఇక దేశం మాత్రం ఏంగుర్తుంటుంది?

Tuesday, December 8, 2009

కేసీఆర్ ని, మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ AIIMS కు తరలిస్తే....ఏమౌతుంది?

[కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్న రీత్యా దీక్ష విరమించాలని సూచించిన నిమ్స్ వైద్యులు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఆరోగ్యరీత్యా దీక్ష విరమించాలని కేసీఆర్ ని నిమ్స్ వైద్యులు సూచించారట, విన్నావా? మెరుగైన వైద్యం కోసం మొన్న ఖమ్మం ఆసుపత్రి నుండి హైదరాబాద్ నిమ్స్ కి కేసీఆర్ ని తరలించారు కదా! ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం నిమ్స్ నుండి ఢిల్లీ ’AIIMS' కు మారిస్తే, ఒకవేళ మారిస్తే... ఏమౌతుందంటావూ?

సుబ్బారావు:
కేసీఆర్ ఆరోగ్యం ఏమవుతుందో నాకు తెలియదు గానీ, పత్రికలు ’ఢిల్లీకి మారిన సీను’ అని శీర్షికలు పెట్టుకోవచ్చు, టీవీలు కొత్త చర్చలు జరుపుకోవచ్చు. ఢిల్లీ హోటళ్ళకీ, విమాన యాన సంస్థలకీ, టెలికాం సంస్థలకీ, రైల్వేలకీ ఇబ్బడిముబ్బడిగా వ్యాపారం మాత్రం నడుస్తుంది మరదలా!

సుబ్బలష్షిమి:
మరీ అన్నీ అలా వ్యాపార దృష్టితో చూడవచ్చా బావా!

సుబ్బారావు:
ఓసి అమాయకపు మరదలా! ఇప్పుడు ఉద్యమాలు కూడా రాజకీయ వ్యాపారాలైన చోట వ్యాపారం కానిదేది చెప్పు? అలాగ్గాక ఈ రాజకీయ నేతలకి నిజాయితీ ఉండి ఉంటే, ఉద్యమం ఏదైనా, దాని తీరే వేరుగా ఉండేది మరదలా!

Monday, December 7, 2009

తెలంగాణా జిల్లాలకే కాదు దేశమంతటా సెలవులు ఇవ్వాల్సిందే!

[తెలంగాణా జిల్లాలలోని కళాశాలలకి మాత్రమే సెలవులు ప్రకటించటంతో EAMCET, AIEEE వంటి ఉమ్మడి ప్రవేశపరీక్షలకు సిద్దంకావటంలో ఆంధ్రా, రాయల సీమలలోని విద్యార్ధులతో తెలంగాణా విద్యార్ధులు సరిగా పోటీ పడలేరనీ, అందుచేత ఆంధ్రా, రాయలసీమ జిల్లాలలోని కళాశాలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించాలని తెలంగాణా ప్రైవేట్ కళాశాలల యాజమాన్య సంఘ ఆధ్యక్షుడు శశిధర రెడ్డి (త్రివేణి కళాశాల డైరక్టరు, సూర్యాపేట) డిమాండ్ చేశాడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! EAMCET, AIEEE లకి సిద్దం కావడంలో విద్యార్ధులలో వ్యత్యాసాలొస్తాయట. అందుచేత తెలంగాణా జిల్లాలతో పాటు మొత్తం రాష్ట్రంలోని కళాశాలన్నిటికీ సెలవులు ప్రకటించాలని డిమాండు చేస్తున్నారు తెలంగాణా ప్రైవేటు కళాశాలల యజమానులు.

సుబ్బారావు:
అయ్యో! వాళ్ళింకా బాగా ఆలోచించాల్సింది మరదలా! ఎంసెట్ మన రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. మరి AIEEE, IIT వంటి ఉమ్మడి ప్రవేశ పరీక్షల మాటేమిటి? అందుచేత, పనిలో పనిగా తెలంగాణా జిల్లాలతో పాటు, మొత్తం దేశమంతటా, అన్ని కళాశాలలకీ సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తే బాగుండేదే!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! పాపం! వాళ్ళకింకా అంత బుర్ర వెలిగినట్లు లేదు!

Friday, December 4, 2009

భారతదేశంలోని పత్రికలన్నింటినీ కేవలం ఐదు సంస్థలే శాసిస్తున్నాయా?

[వరల్డ్ ఎడిటర్స్ ఫోరంలో భారతదేశంలోని పత్రికలన్నింటినీ కేవలం ఐదు సంస్థలే శాసిస్తున్నాయని ఆరోపించిన తెహల్కా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! దేశంలోని పత్రికలన్నింటినీ కేవలం 5 సంస్థలే శాసిస్తున్నాయట!

సుబ్బారావు:
ఇప్పటికి ఇది బయటికి వచ్చింది. దేశంలోని పత్రికలన్నింటినీ శాసిస్తుందనీ అయిదో పదో సంస్థలు కాదు, వాటి నాయకుడెవరన్నది తేలాలి. అదెప్పటికి తేలాలో మరదలా!

సుబ్బలష్షిమి:
ఎప్పుడైనా నిజం నిలకడ మీదే తేలుతుందిలే బావా!

Thursday, December 3, 2009

శాస్త్రవేత్తల ఆవిష్కరణలన్నీ భవిష్యత్తు వ్యాపార సూత్రాల కోసమా?

[పింగాణీ, గాజు పాత్రల పై ఉండే సూక్ష్మక్రిముల కంటే, రాగి పాత్రలపై ఉండే సూక్ష్మక్రిములు చాలా చాలా తక్కువనీ, రాగి పాత్రల వాడకమే మంచిదంటున్న శాస్త్రవేత్తలు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఆహారాన్ని, నీటిని, రాగిపాత్రలలో పెట్టి వాడుకోవటం ఆరోగ్యరీత్యా మంచిదని మన పూర్వీకులు చెబితే… అవేవీ పట్టించుకోకుండానే, భారతీయులవి మూఢనమ్మకాలనీ, ’మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండ’ అని భారతీయులంటారనీ, తెగ గేలి చేసారు. మళ్ళీ ఇప్పుడు మన పూర్వీకులు అన్న వాటినే, శాస్త్రవేత్తలు ’కొత్తగా పరిశోధనలు’ చేసి కనుక్కుంటున్నారు. ఇదేం వింత బావా?

సుబ్బారావు:
అంతే మరదలా! మన పూర్వీకులు చెప్పినవీ, అప్పటికి ప్రజల వాడకంలో ఉన్నవీ ’తుస్సు’ అంటూ పాతవాటి స్థానే గాజు, పింగాణి వంటి కొత్త వస్తువుల్ని తెచ్చి అప్పుడు వ్యాపారం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పాతవే ’నికార్సు’ అంటూ, గాజు పింగాణి వంటి వాటి స్థానే మళ్ళీ రాగిపాత్రలు గట్రా తెచ్చి మరోమారు వ్యాపారం చేసుకుంటారు.

సుబ్బారావు:
అయితే, ఈ శాస్త్రవేత్తల ఆవిష్కరణలన్నీ భవిష్యత్తు వ్యాపార సూత్రాల కోసమా, బావా?

వడ్డించేవాడు మన వాడైతే చాలు,………

[పొరుగు దేశాలతో బాగుంటేనే భారత్ లో ఐటీ వృద్ధి. పాక్ తో సత్సంబంధాలూ మరీ ముఖ్యం – వరల్డ్ ఎడిటర్స్ ఫోరం సదస్సులో ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ వెల్లడి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారత్ లో ఐటీ వృద్ధి చెందాలంటే, పొరుగుదేశాలతో, మరి ముఖ్యంగా పాకిస్తాన్ తో బాగుండాలట. విన్నావా?

సుబ్బారావు:
విన్నాను మరదలా! ’పాకిస్తాన్ లో దారిద్ర్యాన్ని తొలిగించకపోతే ఉగ్రవాదం పెరిగిపోతుంద’ అంటూ అమెరికా పాకిస్తాన్ కు డబ్బు ప్రవహింప చేస్తుంది. ఇచ్చిన డబ్బుల్ని పాకిస్తాన్ ఉగ్రవాదం కోసమే వాడుకుంటుందని నిరూపణ అయినా, తిడుతూనే డబ్బులిస్తున్నారు. ఇక రేపో ఎల్లుండో ఐటీ వృద్ధి కోసం భారతదేశం కూడా పాకిస్తాన్ కు పైసలిస్తుందేమో లే! చూద్దాం!!

సుబ్బలష్షిమి:
అందుకే అంటారేమో బావా, పెద్దలు! ’వడ్డించే వాడు మన వాడైతే చాలు, బంతిలో మూలన కూర్చున్న అన్నీ అందుతాయనీ’ పైకి ఏ మాటలు చెబితేనేం లే, చేతలు ముఖ్యం గానీ?

Wednesday, December 2, 2009

బుష్ గుట్టు పెరుమాళ్ళకెరుక

[2001 లోనే లాడెన్ స్థావరాన్ని అమెరికా సైన్యం చుట్టుముట్టిందనీ, కావాలనే సైన్యం వెనక్కి వచ్చేయగా, లాడెన్, అతడి మందిమార్బలంతో పాకిస్తాన్ కు చేరుకున్నాడని అమెరికా అంతర్జాతీయ వ్యవహారాలు చూసే సెనెట్ కమిటీ నివేదిక వచ్చిందన్న – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా! 2001 సెప్టెంబరు లో WTC కూల్చిన తర్వాత మూడు నెలలకే, అమెరికా సైన్యాలు తోరాబోరా గుహల్లోని లాడెన్ స్థావరాన్ని చుట్టుముట్టాయట. అయినా గానీ ఎందుకో వెనక్కి వచ్చేసి, లాడెన్ సురక్షితంగా పాక్ చేరుకునే వెసులుబాటు ఇచ్చారట. ఇదేమి వింత బావా!

సుబ్బారావు:
అంతే మరదలా! అప్పుడే లాడెన్ ను పట్టేసుకుంటే యుద్ధం ఎలా కొనసాగించేటట్లు? యుద్ధం కొనసాగించక పోతే ఆయుధ కంపెనీలకి, పెట్రో దేశాలకీ వ్యాపారాలు ఎలా వృద్ధి అవుతాయి? అంతేగాక అప్పటి అమెరికా అధ్యక్షుడు బుష్ మాత్రం ఏం చేస్తాడనీ, పై నుండి వచ్చిన ఆదేశాలు శిరసావహించక?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ‘లోగుట్టు పెరుమాళ్ళకెరుక ’ అన్నట్లు బుష్ కి ఇంకెవరు బాసో ఎవరికి తెలుసు?