Friday, October 30, 2009

జువానిత్ క్యాస్ట్రో ….. తాటి చెట్టెందుకు ఎక్కావూ అంటే .....

కష్టమైనా.. తప్పలేదు!
కుటుంబంతో తెగదెంపులపై జువానితా
మిమామీ: 'కుటుంబ అనుబంధాలు కాపాడుకోవాలో, లేక అమెరికా గూఢచారిగా పని చేయాలో.. ఏదో ఒకటి తేల్చుకోవడం చాలా కష్టమైన విషయం.. కానీ అన్యాయ పాల నను సహించడం కంటే, కుటుంబ సంబంధాలను వదలుకోవడం నాకు పెద్ద కష్టంగా అనిపించలేదు'.. అని క్యూబా కమ్యూనిస్టు యోధులు ఫిడెల్‌ కాస్ట్రో, రౌల్‌ కాస్ట్రోల సోదరి జువానితా కాస్ట్రో(76) చెప్పారు. క్యూబాకు బద్ధశత్రువైన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏలో పనిచేసినట్లు ఆమె ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని మియాలో ఉంటున్న ఆమె ఈఎఫ్‌ఈ పత్రికకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పై విధంగా స్పందించారు…… సాక్షి ఆన్ లైన్ ఎడిషన్ వార్త నేపధ్యంలో.

సుబ్బలష్షిమి:
ఈ వార్త చూశావా బావా? క్యూబాలో, అన్న ఫిడేల్ క్యాస్ట్రో అన్యాయ పాలన నచ్చక, సి.ఐ.ఏ. ఏజంటుగా మారిందట అతడి సోదరి జువానిత్ క్యాస్ట్రో. నాకు తెలియక అడుగుతాను బావా! అన్న అన్యాయ పాలన నచ్చనప్పుడు, దేశంలో ఉండి అన్యాయ పాలనకి వ్యతిరేకంగా పోరాడాలిగానీ, విదేశానికి ఏజంటుగా పనిచేస్తారా? విదేశీ ఏజంటుగా పనిచేసి, అదే విదేశంలో నాలుగు దశాబ్ధాలుగా ఎంచక్కా విశ్రాంత ప్రవాస జీవనం గడుపుతారా? పైగా ఈ గూఢచారిణి, కుటుంబసంబంధాలు సి.ఐ.ఏ. సంబంధాలలో ఏదో ఒకటే ఎంచుకోవలసి వచ్చినప్పుడు, సి.ఐ.ఏ.తో సంబంధాలనే ఎంచుకుందట! పైగా దీనికి ’అన్యాయ పాలన నచ్చకపోవటం’ అన్న కారణం చెబుతూఉంది.

సుబ్బారావు:
తాటి చెట్టెందుకు ఎక్కావూ అంటే దూడగడ్డికోసం గానీ, కల్లుముంత కోసం కాదంటారని, మన పెద్దలు సామెత చెప్పేది, ఇలాంటి వాళ్ళని చూసే మరదలా!

Wednesday, October 21, 2009

ఇక సాష్టాంగ నమస్కారం పెట్టడం ఎప్పుడొస్తుందో?


[శ్వేత సౌధంలో దీపావళి సంబరాల్లో జ్యోతి వెలిగిస్తూ స్వయంగా పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా అధ్యక్ష భవనంలో జరిగిన దీపావళి సంబరాల్లో అధ్యక్షుడు ఒబామా స్వయంగా పాల్గొన్నాడు. జ్యోతి వెలిగిస్తూ భారతీయ సాంప్రదాయంలో దండం కూడా పెట్టాడు. ఫోటో వచ్చింది చూశావా బావా!

సుబ్బారావు:
చూశాను మరదలా! మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ఒబామాకి దణ్ణం పెట్టడం వచ్చింది. ఇక సాష్టాంగ నమస్కారం పెట్టడం ఎప్పుడొస్తుందో?

Friday, October 16, 2009

మంది ఎక్కువైతే మజ్జిగ చిక్కబడుతుందా?

[దేశంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్ టీవీ ఛానెల్సూ, FM రేడియోలు రానున్నాయనీ, అందుకు ప్రభుత్వం పెద్దఎత్తున సహకరించనున్నదనీ కేంద్రమంత్రి అంబికాసోనీ ప్రకటన. అదే ఒరవడిలో ఊపందుకున్న ప్రైవేటు టీవీ ఛానెళ్ళ ప్రారంభాలు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఇప్పటికే టీవీ ఛానెళ్ళు ఎక్కువైపోయి, పోటీ పెరిగి పోయి, డబ్బులు రావటం లేదనీ, అంచేత కొన్ని టీవీల వాళ్ళు వరద బాధితుల కోసం అంటూ విరాళాలు పోగుచేసి వాటితో తమ అప్పులు తీర్చుకుంటున్నారనీ ఓ మాట బయటకి వచ్చింది. ఇలా టీవీ ఛానెళ్ళు ఎక్కువైపోవటంతో పాతుకుపోయిన పత్రికాధిపతులు కూడా పోటీ నెదుర్కోలేక కుదేలవుతున్నారన్న మాట ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది. మరి ఏం బావుకుందామని పొలోమంటూ ఇన్ని కొత్త టీవీ ఛానెళ్ళు వస్తున్నాయి?

సుబ్బారావు:
బహుశః ప్రజలందరు తమ ఛానెళ్ళ అబద్దాలను నమ్మటం లేదు కాబట్టి ‘సంఖ్య’ని పెంచుకుంటూ ఉండవచ్చు, లేదా రానున్న రోజులన్నీ సంచనాలేనని వాళ్ళ సిక్స్ సెన్సో లేక కర్ణపిశాచో చెప్పి ఉంటుంది మరదలా! లేకపోతే మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడుతుందని వాళ్ళకి మాత్రం తెలియదా?

Monday, October 12, 2009

కేసీఆర్ కు తత్త్వం బోధపడి, వేదాంతం గుర్తుకు వచ్చినట్లుంది!

[తెరాస అధినేత కేసీఆర్ నోట వేదాంతం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! నోరు తెరిస్తే బండతిట్లు, కఠినమైన పదాలూ తప్ప పలకని కేసీఆర్, వేదాంతం మాట్లాడుతున్నాడట! ఇదేం వింత?

సుబ్బారావు:
మొన్న కేసీఆర్ పాలమూరు వెళ్థామని, హెలికాప్టర్ లో ప్రయాణిస్తుంటే, గాలిలో కాసిన్ని ఇబ్బందులు తతెత్తాయట మరదలా! దెబ్బతో తత్త్వం బోధపడి, వేదాంతం గుర్తుకువచ్చినట్లుంది!

Friday, October 9, 2009

హెలికాప్టర్ లోకి వాసనలు, వరదనీరు వస్తాయా?

[వరదప్రాంతాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపిఏ కుర్చీవ్యక్తి సోనియాగాంధీల ఏరియల్ సర్వే – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నేనెప్పుడూ గమనిస్తుంటాను, వరదలూ, తుఫానులూ వచ్చినప్పుడు, రాష్ట్రప్రభుత్వాలేమో వేలకోట్లు సాయమడుగుతాయి. కేంద్రమేమో అందులో ఐదోవంతో, పదో వంతో ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. ఎందుకలా?

సుబ్బారావు:
అంతే మదరలా! అదే కార్పోరేటు కంపెనీలు నష్టాల బారిన పడితే ప్యాకేజీలు ఉదారంగా ఇచ్చేస్తారు. మరి వాళ్ళు తమ అనుంగు సన్నిహితులయ్యె! అదీగాక ఆకాశంలో నుండి వరద ప్రాంతాలని దర్శిస్తే ఏం తెలుస్తుంది? వరద బురదలో నడుస్తూ, దుర్గంధం ఎలా ఉంటుందో చూస్తే, బాధితుల గోడు వింటే ప్రజల కష్టాలేమిటో తెలుస్తాయి గానీ! హెలికాప్టర్ లోకి వాసనలు, వరదనీరూ రావు కదా?

Wednesday, October 7, 2009

క్రికెట్టే ముద్దు – వార్తలు వద్దు

[భారతదేశంలో 13 కోట్ల టీవీ సెట్లూ, దాదాపు 65 కోట్ల టీవీ పేక్షకులూ ఉన్నారు. 8.5 కోట్ల కేబుల్ కనెక్షన్లూ, 2 కోట్ల డిటిహెచ్ సెట్ లూ ఉన్నాయి. దాదాపు 10 కోట్లకు పైగా కేవలం దూరదర్శన్ ని చూసే ప్రేక్షకులు ఉన్నారు. అయితే, వార్తలు కూడా వదిలేసి డిడి కేవలం క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాలకే పరిమితమైపోయిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
వరద వార్తలూ, ప్రజల ఆర్తనాదాలు కూడా వదిలేసి, ఈ డిడి వాళ్ళేమిటి బావా, [దాదాపు] కేవలం క్రికెట్ ప్రత్యక్షప్రసారాలే పనిగా పెట్టుకున్నారు? కనీసం విరామంలో నన్నా వార్తాలు ప్రసారం చేస్తారేమోనని చూశా! అప్పుడూ క్రికెట్ గురించి, ఆటగాళ్ళ గురించీ….. సమీక్షలూ, భుజాలెగరేస్తూ నవ్వులూ, వ్యాఖ్యానాలూ చేస్తున్నారు. ఇదేం విపరీతం బావా? వాళ్ళకు వాణిజ్యప్రకటనల డబ్బులే తప్ప ఇంకేం పట్టవా?

సుబ్బారావు:
వాణిజ్యప్రకటనల డబ్బులన్న మాట పైకి మరదలా! వార్తలు చూపిస్తే ప్రజలకి నిజాలు, పరిస్థితులు అర్ధమైపోతాయేమోననీ, ప్రభుత్వాలపట్ల వ్యతిరేకత పెరుగుతుందేమోనని ప్రభుత్వాలకి భయమై ఉంటుంది. ఎటూ ప్రైవేటు టీవీ ఛానెళ్ళు అబద్దాల ప్రచారం చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ టీవీ ఛానెలు డిడి, నిజాలు చెప్పే పనిలేకుండా వార్తలు ఎత్తేసుకుంటోంది.

సుబ్బలష్షిమి:
అందుకా, భారత్ ఆడని క్రికెట్ మ్యాచ్ లని కూడా ప్రత్యక్షప్రసారం చేస్తోన్నారు? బహుశః డిడి అబద్దాలు ప్రచారిస్తే శాఖాపరమైన విచారణలు గట్రాగట్రా వస్తాయి కాబట్టి, ఏకంగా వార్తప్రసారాలే ఎత్తేస్తున్నారన్న మాట!

Tuesday, October 6, 2009

భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎక్కడ? వరదల్లో కొట్టుకు పోలేదు కదా!

[పోతిరెడ్డిపాడు జలాశయం కోసం, శ్రీశైల జలాశయపు కనీస నీటి మట్టాన్ని పెంచటం వల్లే, కర్నూలు నగరాన్ని వరద ముంచెత్తిందన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వరదలిలా రాష్ట్రాన్ని ముంచెత్తుతుంటే భారీ ప్రాజెక్టులూ, నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అడ్రసు లేడేమిటి? వై.యస్. బ్రతికుండగా, చీటికి మాటికి టీవీ వార్తల్లో కనపడి, వై.యస్. చెప్పిన ప్రతి విషయానికి ’తాన అంటే తందాన’ చెప్పే వాడు కదా?

సుబ్బారావు:
తమ వ్యక్తిగత ప్రతిష్ఠ, వ్యక్తిగత లబ్ధికోసం, వై.యస్. తో కలిసి, పోతిరెడ్డిపాడుని ప్రముఖంగా చూపించేందుకు శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టాన్ని పెంచారు. ఇంజనీర్ల బదులు ఈ రాజకీయనాయకులే సాంకేతిక నిర్ణయాలు తీసేసుకున్నారట తెలుసా? దాంతో ఇప్పుడు వరద నీరు వెనక్కి తన్ని, నగరాలు నీట మునిగాయి. ఏం చేస్తాడు మరి?

సుబ్బలష్షిమి:
ఓ రకంగా చెప్పాలంటే వై.యస్. చచ్చిబ్రతికి పోయాడన్న మాట! ఇక ఈ పొన్నాల లక్ష్మయ్య వంటి భక్త మంత్రులకి, బయటికొస్తే ప్రజలెక్కడ శాపనార్ధాలు పెడతారోనని భయం వేసి లోపల కూర్చున్నారన్న మాట.

~~~~~~