Wednesday, March 31, 2010

వివాహ సంబంధాలు, వివాహేతర సంబంధాలు కెరీర్ గ్రాఫ్ కు సోపానాలు

[టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వరుడు పాకిస్తాన్ క్రికెటర్ సోయబ్ మాలిక్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇన్ని కోట్ల మంది భారతీయ యువకుల్లో సానియా మీర్జాకి వరుడే దొరకలేదు కాబోలు; పాక్ క్రికెటర్ ని పెళ్ళాడుతోంది. ఇక భవిష్యత్తులో ఇండో - పాక్ ల మధ్య శాంతి సుహృద్బావాలకి బ్రాండ్ అంబాసిడర్ గా అవతరించ నుందేమో!

సుబ్బారావు:
అలాంటి అభివృద్ది కోసమే కదా మరదలా ఇంత విశ్వమానవ ప్రేమని చాటుకునేది? అసలే ఆడపిల్ల.... పుట్టింటికీ, అత్తింటికీ మధ్య వారధి కదా! ఇక చూస్కో! పాతబస్తీ నుండి పాకిస్తాన్ దాకా నిరంతర కొరియర్ స్రవంతి!

సుబ్బలష్షిమి:
ఇలాంటి పరస్పర ప్రయోజనాలుంటాయి కాబట్టే నేమో బావా, ఆమె ఆటలో గెలిచినా ఓడినా మీడియా ఇమేజ్ కి మాత్రం ఢోకా ఉండదు. అయినా వివాహసంబంధాలు, వివాహేతర సంబంధాలు కెరీర్ గ్రాఫ్ కు సోపానాలై చాలాకాలమయిందిలే బావా!

Monday, March 29, 2010

మంచి మనోవికారం - చెడు సహజం

[>>>విశాఖపట్నంలో శ్రీరామనవమి పండుగ రోజున ఓ రామచిలక, రాముల పాదల చెంతకు వచ్చి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రాణాలు విడిచింది - వార్త నేపధ్యంలో.
>>>ఇంతక్రితం వరాహాం ఒకటి ఒక గుడి చుట్టూ ప్రదక్షణాలు తిరిగి తిరిగి స్పృహ తప్పిపడిపోయింది. జనం దానికి పూజలు, సపర్యలు చేసారు. ఆ వరాహాం మెదడులో ఏదో లోపం వలన అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతాయని మానసిక వైద్యనిపుణులు తేల్చి చెప్పారు - ఈ వార్తల నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! ఓ రామచిలక శ్రీరామనవమి పండుగ రోజున శ్రీరాముడి విగ్రహం పాదాల చెంతకు వచ్చివాలి, మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రాణాలు విడిచిందట. ఇంతక్రితం వరాహం ఒకటి గుడి చుట్టూ ప్రదక్షిణాలు అలసిపోయే దాకా చేస్తూ స్పృహ తప్పిపోయిందట. ఈ విచిత్రం ఏమిటి బావా?

సుబ్బారావు:
అది విచిత్రం కాదు మరదలా! అసలు విచిత్రం ఏమిటంటే - ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనలాంటి ఆస్థికులు, ఆ రామచిలక, వరాహాం గురించి మాట్లాడుకుంటూ ’ఆవి వాటి పూర్వజన్మ వాసనలు మోసుకొచ్చాయి, కాబట్టే దైవ సన్నిధిలో ప్రాణాలు విడిచాయి’ అని అంటాం. ఈ హేతువాదులు, ఆధునిక మానసిక మనస్తత్వ శాస్త్రం గురించి చెప్తూ, వాటి బుర్రలో కెమికల్ గడబిడ లేదా ఏదో సైకాజికల్ డిజార్డర్ అంటారు.

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! ఈ హేతువాదులు, ఆధునిక మనస్తత్వ శాస్త్ర నిపుణులు, మన శ్రీరాముడికి కూడా లౌక్యం తెలియదని, కాబట్టే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి అడవులకు వెళ్ళాడని. ధర్మం అంటూ తనని తాను కష్టాలు పెట్టుకున్నాడని, ఇదీ ఒకరకంగా తనను తాను హింసపెట్టుకోవడమేనని, దీనినే ’ధర్మా సైకాజికల్ డిజార్డర్’ అనో లేదా ’ధర్మా సిండ్రోమ్’ అనో అనగలరు బావా!

సుబ్బారావు:
అందుకే కదా మరదలా! ఈ హేతువాదులని ’హేట్ వాదులు’ అనేది. ఎందుకంటే వీళ్ళకి మంచి అంతా మనో వికారం గానూ, చెడు అంతా సహజంగాను అన్పిస్తుంది.

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటే ఇదే!

[రాజకీయాల్లో కుళ్ళును రూపుమాపుతాం. అదే భాజపా లక్ష్యం - అద్వానీ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భాజపా అగ్రనేత అద్వానీ, రాజకీయాల్లో కుళ్ళును రూపుమాపటమే లక్ష్యం అంటున్నాడు చూశావా?

సుబ్బారావు:
అందుకే కాబోలు మరదలా, వాళ్ళ హయంలో చివరికి సైనికుల శవపేటికల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారు.

సుబ్బలష్షిమి:
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటే ఇదేనేమో బావా!

ప్రాణాలతో ఉన్నందుకు పన్నులు కట్టండి!

[బస్టాండుల్లో ప్లాట్ ఫామ్ టిక్కెట్టు ప్రవేశపెట్టాలనుకుంటున్న ప్రభుత్వం వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎర్రబస్సు పేదవాడి ప్రయాణ సాధనం. సామాన్యులు వచ్చిపోయే బస్టాండుల్లో యూజర్ ఛార్జీలంటూ ప్లాట్ ఫాం టిక్కెట్టు ప్రవేశపెడతారట. ముందుగా ప్రయోగాత్మకంగా హైదరాబాదులో నట. తర్వాత మెల్లిగా విజయవాడ తిరుపతి గట్రా నగరాల్లో కూడా ప్రవేశపెడతారట. తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే పేదలు రాత్రి పూట బస్టాండులోనే నిద్రపోతారు. అలాంటి చోట ప్రవేశ టిక్కెట్లంటే ఎంత దారుణం బావా?

సుబ్బారావు:
అప్పుడే ఆక్రోశ పడకు మరదలా! ఇప్పటికే మంగలి షాపుల్లో కుర్చీలకి పన్నులేసింది ప్రభుత్వం. అంటే జుట్టున్నందుకు పన్నన్న మాట. ఇక ముందు ముందు.... ఊపిరి పీలుస్తూ ఆక్సిజన్ ని, విడుస్తూ కార్బన్ డైయాక్సైడ్ ని ఉపయోగిస్తున్నందుకు ముక్కులకి కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు.

సుబ్బలష్షిమి:
అంటే ప్రాణాలతో ఉన్నందుకు పన్ను కట్టాలన్న మాట. నిజమేలే బావా! ఇప్పటికే వాళ్ల దృష్టిలో ప్రజలున్నది పన్నులు కట్టేందుకు, కార్పోరేట్ వ్యాపారాలు నడిచేందుకూ!

Saturday, March 27, 2010

రోశయ్యకు కాకా పడుతున్న జేసీ కాకాసుర రెడ్డి!

[మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ముఖ్యమంత్రి రోశయ్య రోజు రోజుకీ బలోపేతుడై పోతున్నాడనీ, జానెడు మూరెడు కాదు బారెడు పెరిగిపోయాడని కొంత హడావుడి చేసాడన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జేసీ దివాకర్ రెడ్డేమిటి, ముఖ్యమంత్రి రోశయ్య గురించి జానా బెత్తెల దర్జీ కొలతలు చెబుతున్నాడు?

సుబ్బారావు:
ఈ మాజీ దేవాదాయ శాఖామంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయ నిరుద్యోగి మరదలా! ఏదో కాస్త సోపు వేస్తే మంత్రి వర్గ విస్తరణలో బెర్తు దక్కకపోతుందా అని తంటాలు పడుతున్నాడు.

సుబ్బలష్షిమి:
బావా! జేసీ దివాకర్ రెడ్డికి, జేసీ కాకాసుర రెడ్డి అని పేరు పెట్టుంటే ఇంకా బాగుండేదేమో కదా?

ఉండవల్లీ.... ఇదేం పద్దతి?

[’ఉండవల్లీ.... ఇదేం పద్దతి?’ అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ కు క్లాసు పీకిన ముఖ్యమంత్రి రోశయ్య వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రోశయ్య, ఎంపీ ఉండవల్లిని, బహిరంగ లేఖలు వ్రాయటమేమిటని క్లాసు పీకాడుట. ’అందరికీ బహిరంగమయ్యాక తాను ఆ లేఖలని చదువుకోవాలా?’ అంటూ ఆగ్రహించాడట. ఈ రోశయ్య అన్ని విషయాల్లో అంతా అధిష్టానం ఇష్టం, నేను గుమాస్తా ముఖ్యమంత్రిని అంటాడు. ఇప్పుడు తాను సర్వ స్వతంత్ర ముఖ్యమంత్రి అయిపోయాడా ఏమిటి?

సుబ్బారావు:
ఎప్పటికెయ్యది అవసరమో అప్పటికా మాటా మాట్లాడుతున్నాడన్న మాట. తెలిసిందా మరదలా!

న్యాయమూర్తులు ’జస్టిస్ చౌదరిలు’ కాదు!

[2002 లో బాబ్రీ మసీదు కూల్చివేత లో కుట్రలేదని, ఆ కేసులో కోర్టు అద్వానీని మినహాయించింది - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2002 లో అద్వానీ కేంద్ర గృహమంత్రి కదా! అతడి హయాంలో.... కోర్టు, 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత లో కుట్రలేదంటూ, ఆ కేసులో అతడికి మినహాయింపునిచ్చిందంటే అర్ధమేమిటి బావా?

సుబ్బారావు:
ఏముంది మరదలా! న్యాయమూర్తులు ’జస్టిస్ చౌదరిలు’ కాదు అని. అంతే!

Friday, March 26, 2010

సుబ్బిపెళ్ళి ఎంకి చావుకొచ్చింది

[యూపీలో రాహుల్ పర్యటన భద్రతా ఏర్పాట్ల కోసం తేనె తుట్టెలను తొలగిస్తున్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా!యూపీలో మొన్న మాయావతి సభలో/ర్యాలీలో ఎవరో తేనె తుట్టెలకు నిప్పెట్టారట. అవి సభలో పాల్గొన్న వారి మీద దాడి చేసాయట. దాంతో అంతా రసాభాస అయ్యిందట. అందుచేత రాహుల్ పర్యటన కోసం అధికారులు భద్రతా చర్యల్లో భాగంగా తేనె తుట్టెలను తొలగిస్తున్నారట తెలుసా?

సుబ్బారావు:
మొత్తానికీ ఈ రాజకీయ నాయకులు, ప్రజల్నే కాదు తేనె తుట్టెలను కూడా బ్రతకనివ్వటం లేదన్న మాట. దీన్నే అంటారు ’సుబ్బిపెళ్ళి ఎంకి చావుకొచ్చింది’ అని.

గొంగట్లో తింటూ వెంట్రుకలేరటం దండగ

[స్క్వాడ్ సిబ్బందిపై పదవ తరగతి విద్యార్ధులు దాడి - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! విశాఖ పట్టణం జిల్లాలో, పదవ తరగతి విద్యార్ధులు మాస్ కాపీయింగ్ చేస్తూంటే పట్టుకుని, డిబార్ చేసినందుకు స్క్వాడ్ సిబ్బందిపై విద్యార్ధులు దాడి చేసారట తెలుసా? ఇందులో తప్పెవరిది బావా?
* బడుల్లో సంవత్సరమంతా ఏదో అయిపోయిందన్నట్లు చదువులు చెప్పే బడులవా?
* ఇంటర్నల్ పరీక్షలలో కాపీలు కొడుతున్నా పట్టించుకోని ప్రైవేటు, ప్రభుత్వ టీచర్లదా?
* పరీక్షల్లో కాపీలు కొట్టి అయినా పాసయి పోతే చాలనుకునే విద్యార్ధులదా?

సుబ్బారావు:
ఇప్పుడు విద్యావ్యవస్థలో నడుస్తున్న తతంగమంతా, గొంగట్లో తింటూ వెంట్రుకలేరటం వంటిదే మరదలా!

వేరుకు పురుగు పడితే రెమ్మ కొమ్మలకి ఎంత వైద్యం చేస్తే ఏం లాభం?

[ఎం.ఎఫ్.హుస్సేన్ చిత్రం 5.08 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయిందన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ ముస్లిం వృద్ద చిత్రకారుడి బొమ్మ 5 కోట్ల రూపాయల పైచిలుకు అమ్ముడుపోయిందట. ఆ మాడ్రన్ ఆర్ట్ ని అంత ధరకు కొనే కళాపిపాసులెవరు బావా?

సుబ్బారావు:
కళాపిపాసులా తొక్కా? బుర్జ్ ఖలీఫాలో ప్లాట్ కొనమని ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ లకి వాళ్ళ గాడ్ ఫాదర్ లు అజ్ఞ ఇచ్చారనుకో మరదలా! మీడియా ద్వారా అంత సీనూ, కెరీరూ, ’కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న అగ్ర తారలన్న’ ప్రచారమూ ఇచ్చినందుకు ప్రతిఫలంగా, సదరు తారలు, లోపల ఏడ్చుకున్నా, పైకి పళ్ళికిలిస్తూ ప్లాట్లు కొనాల్సిందే! ఆ విధంగా చెప్పిన చోటికి డబ్బు ఫ్లో చేస్తారన్న మాట. అలాగే ఇదీను!

సుబ్బలష్షిమి:
అంటే ఎవరికి ఈ గాడ్ ఫాదర్ లు అసైన్ మెంట్ ఇస్తే వాళ్ళు ’కళాపిపాసులం’ అంటూ సదరు రంగులు పోసిన కాన్వాసుని కోట్ల రూపాయలు చెల్లించి కొంటారన్న మాట. అంతగా డబ్బు ప్లో చేస్తారు కాబట్టే, ఈ వృద్ద చిత్రకారుడు 80 కోట్లమంది హిందువులకీ, నూరు కోట్ల మంది భారతీయులకీ ఆగ్రహం కలుగుతుందన్నా పట్టించుకోకుండా.... హిందూ దేవతల బొమ్మల్నీ, భారత మాత బొమ్మన్నీ నగ్నంగా చిత్రించటానికి వెనుకాడలేదన్న మాట.

సుబ్బారావు:
అంతే మరదలా! ఎక్కడో చోట షెల్టర్ కూడా ఇప్పించారు కదా మరి!? కాబట్టి తన్ని తగలెయ్యాల్సింది అలాంటి వాళ్ళ గాడ్ ఫాదర్ ని. అప్పుడు ఎం.ఎఫ్.హుస్సేన్ లాంటి వాళ్ళు వళ్ళు దగ్గర బెట్టుకుంటారు.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! వేరుకు పురుగు పడితే రెమ్మ కొమ్మలకి ఎంత వైద్యం చేస్తే ఏం లాభం?

సోనియా పలుకుబడి తగ్గిందా, గంగాభవాని పలుకుబడి పెరిగిందా?

[సోనియాని కలిసి, మహిళాబిల్లు ఆమోదంపై అభినందనలు తెలిపిన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవాని - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:వేచి చూద్దాం మరదలా, ఇంకేమయినా అవసరాలు ఉండే కలిసిందో, లేక ఎవరి పలుకుబడి పెరిగిందో, ఎవరి పలుకుబడి తగ్గిందో?
బావా! ఒకప్పుడు తెలంగాణా సీనియర్ నేతలు.... కాకా వీహెచ్ గట్రాలకు కూడా సోనియాని కలవటం కుదిరేది కాదు. అధినేత్రి అప్పాయింట్ మెంట్ కోసం, ఈ వృద్దనేతలంతా అగలారుస్తూ ఢిల్లీలో పడిగాపులు పడి నిరాశతో వెనుదిరిగిన రోజుల్లో, వై.యస్. అలవోకగా కలిసి వచ్చేవాడు. దాన్నే చూపిస్తూ ఈనాడు సైతం ఢిల్లీలో వై.యస్. హవా గురించి వార్తలు వ్రాసేది. ఇప్పుడేమిటి బావా! గంగాభవానీలు కూడా సోనియాని కలిసి వస్తున్నారు? అంటే అధినేత్రి పలుకుబడి తగ్గిందా లేక గంగాభవానీల పలుకుబడి పెరిగిందా, బావా?

సుబ్బారావు:
వేచి చూద్దాం మరదలా, ఇంకేమయినా అవసరాలు ఉండే కలిసిందో, లేక ఎవరి పలుకుబడి పెరిగిందో, ఎవరి పలుకుబడి తగ్గిందో?

Thursday, March 25, 2010

దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనిది ఎప్పటికి దక్కదు

[అనంతపురం డివిజన్ అటవీ అధికారి కల్లోల్ బిస్వాస్ గాలి జనార్ధన రెడ్డికి అనుకూలంగా పని చేసి ప్రస్తుతానికి వరంగల్ జిల్లాకు బదిలీ, భవిష్యత్తులో సస్పెన్షన్ వేటు ? - వార్త నేపధ్యంలో.]

సుబ్బలష్షిమి:
బావా! ఈనాడు భోగట్టా ప్రకారం, ఈ బిస్వాస్ కల్లోల్ గత ఏడాది నిబంధనల ముకుతాడు వేసి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యాజమాన్యాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. గాలి జనార్ధన రెడ్డి కూడా పైఅధికారుల ద్వారా అతడిని ముప్పతిప్పులు పెట్టాడు. చివరికి ఇద్దరు రాజీ పడినట్లు ఉన్నారు. అందుకే గాలి జనార్ధన రెడ్డికి అనుకూలంగా, ప్రభుత్వానికి చెప్పకుండా ఖనిజం రవాణాకు ఓఎంసీకి అనుమతిస్తూ నిర్ణయాలు తీసుకున్నందుకు ఆగ్రహించిన ప్రభుత్వం అతడిని వరంగల్ జిల్లాకు బదిలీ చేసింది. ఇప్పటికే వాటి మీద సిబిఐ విచారణ కూడా నడుస్తుందట. భవిష్యత్తులో కల్లోల్ బిస్వాస్ సస్పెన్షన్ అవుతాడని ఓ వార్త కూడా.

సుబ్బారావు:
అంతే మరదలా! ఎంత పొర్లాడిన అంటుకున్నంతే అంటుకుంటుందని సామెత! రజనీకాంత్ స్టైల్లో చెబితే ’దక్కేది ఎప్పటికైనా దక్కుతుంది, దక్కనిది ఎప్పటికి దక్కదు.’

Tuesday, March 23, 2010

దొంగ చేతికి తాళాలివ్వట మంటే?

[పాస్ పోర్టు జారీ కార్యకలాపాలను ప్రైవేట్ పరం చేయవద్దని ఉద్యోగుల సంఘం డిమాండ్ - వార్తనేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పాస్ పోర్టు జారీ కార్యకలాపాలను ప్రైవేట్ పరం చేయవద్దని, విదేశీ వ్యవహారాల శాఖకు వీటి వలననే అత్యధిక ఆదాయం వస్తోందని అఖిల భారత పాస్ పోర్ట్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది. ప్రైవేట్ పరం చేస్తే ఏమవుతుంది బావా?

సుబ్బారావు:
ఏముంటుంది మరదలా! ప్రైవేట్ పరం చేస్తే కేంద్రమంత్రులు డబ్బు దండుకోవచ్చు. ఉగ్రవాదులకు, నేరస్తులకు పాస్ పోర్టులు మరింత సులభంగా ఇప్పించవచ్చు. తేడా పాడా వస్తే ప్రైవేట్ ఉద్యోగిని బాధ్యుణ్ణి చేస్తూ బలి పశువు చేయవచ్చు.

సుబ్బలష్షిమి:
వెరసి దీనిని ప్రైవేట్ పరం చేయటమంటే, మొత్తంగా దొంగ చేతికి తాళాలివ్వటమన్న మాట!

Monday, March 22, 2010

దీన్నే అనొచ్చు అమెరికా బొత్సాయణం!

[>>>పాకిస్తాన్ తో అణుఒప్పందం ఉండదు - భారత్ లో అమెరికా రాయబారి.
>>>అమెరికా - పాకిస్తాన్ మధ్య అణుఒప్పందానికి సంబంధించి మార్చి 24 న ఇరు దేశాల ప్రతినిధులు వ్యూహాత్మక చర్చలు జరపనున్నట్లు తెలిపిన పాకిస్తాన్ లో అమెరికా రాయబారి అన్నెపీటర్సన్. - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పాకిస్తాన్ తో అణుఒప్పందం గురించి, పాకిస్తాన్ లో అమెరికా రాయబారి ఒకమాట, ఇండియాలో అమెరికా రాయబారి మరో మాట చెప్తున్నారు. ఇదేమిటి బావా? అచ్చంగా బొత్స సత్యనారాయణ, అతడి భార్య రాష్ట్రవిభజన మీద చేరో మాటా చెప్పి ఆనక కాదన్నట్లు, మాట్లాడుతున్నారు ఈ అమెరికా రాయబారులు?

సుబ్బారావు:
అదే మరి, గల్లీ నుండి అంతర్జాతీయం దాకా ఒకే స్ట్రాటజీ ఉండటమంటే! దీన్నే అనచ్చు మరదలా! అమెరికా బొత్సాయణం అని!

క్రింద ఉద్యోగుల స్థాయిలో లాలూచీ పడితే ఊర్కుంటారేంటి?

[నెల్లూరు లో ఇంటర్ పేపర్ లీక్ వార్త నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! నెల్లూరులో ఇంటర్ పేపర్ లీక్ అయ్యిందట. ప్రైవేట్ కాలేజీ వాళ్ళు ఈ లీక్ చేసారట. ప్రభుత్వం వెంటనే పకడ్బందీగా విచారణ చేసి పట్టుకుందట? మన పోలీసులు ఎంత వేగంగా దర్యాప్తు చేసారు బావా?

సుబ్బారావు:
ఓసి అమాయక మరదలా! క్రింద ఉద్యోగుల స్థాయిలో లాలూచీ పడితే ఊర్కుంటారేంటి? పైనున్న కార్యదర్శులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అధిష్టానాలు ఏమవ్వాలి? అవినీతి కూడా వ్యవస్థీకృతంగా ఏవరి వాటాలు వాళ్ళకిచ్చి జరుపుకోవాలి, అంతే!

ఇవే కాకుండా ఇంకా ఏం జరిగే అవకాశం ఉందో తెలుసా మీకు?

[మా కుటుంబంలో భేదాభిప్రాయాలు లేవు - బొత్స సత్యనారాయణ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రాష్ట్రవిభజనకు సంబంధించి తమ కుటుంబంలో భేదాభిప్రాయాలు లేవని, తాను గతంలో చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని బొత్ససత్యనారాయణ చెప్తున్నాడు. తన వ్యాఖ్యలతో ఎంపీ ఝూన్సీ [బొత్స సత్యనారాయణ భార్య] కూడా ఏకీభవించారని తెలిపాడు. మరయితే ఆయన భార్య అప్పుడు విభేదించింది కదా? ఇప్పుడు అలాంటివేమీ లేవని చెప్తున్నాడు. అయితే ఏం జరిగి ఉంటుంది బావా?

సుబ్బారావు:
భార్యని ఒప్పించటానికి ఏమయినా జరిగే అవకాశం ఉంది మరదలా!
1. గృహ హింసతో ఒప్పించి ఉండవచ్చు.
2. తన మాట వినకపోతే, ఆస్థిలో వాటా రాదని బెదిరించి ఉండవచ్చు.
3. విభజన జరిగితే తమకి వచ్చే లాభాలు చెప్పి ఉండవచ్చు.
4. కుటుంబ పరువు పోతుంది కాబట్టి నా మాట వినమని బతిమాలి ఉండవచ్చు.
5. తరువాతసారికి ఎంపీ టిక్కెట్టు ఇప్పించను జాగ్రత్త సుమా అని ఉండవచ్చు.
6. తన భార్య ఎవరి చేత చెబితే వింటుందో వాళ్ళ చేత చెప్పించి ఉండవచ్చు.
7. ఇవేవీ కాకుండా "నువ్వు ఒకవైపు, నేను ఒకవైపు ఉండి జనాల్ని భలే ఫూల్స్ చేశాం, ఇక చాల్లే అనుకుని ఉండవచ్చు.

సుబ్బలష్షిమి:
బావా! చాలు చాలు! ఇవే కాకుండా ఇంకా ఏమయినా జరిగే అవకాశం ఉందేమో, మన బ్లాగుమిత్రులు చెప్తారేమో చూద్దాం.

Saturday, March 20, 2010

ఇలాంటి ప్రబుద్దుడిని ఏం చేయాలి?

[మంత్రి పదవి వచ్చినట్లు కలలు వస్తున్నాయి, మంత్రి పదవి ఇస్తానంటే రోమ్ కెళ్ళి క్రైస్తవం పుచ్చుకుంటా - శ్రీశైలం ఎం.ఎల్.ఏ. ఏరాసు ప్రతాప్ రెడ్డి. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! శక్తిపీఠమూ, జ్యోతిర్లింగమూ అయిన పుణ్యక్షేత్రం శ్రీశైలం. మహానంది గొప్ప పుణ్యక్షేత్రం. ఈ రెండూ కలిసి ఉన్న నియోజక వర్గం శ్రీశైలం. అలాంటి నియోజక వర్గానికి ఎం.ఎల్.ఏ. ఏరాసు ప్రతాప్ రెడ్డి, మంత్రి పదవి ఇస్తానంటే రోమ్ కెళ్ళి క్రైస్తవం పుచ్చుకుంటానని చెప్తున్నాడు. ఇలాంటి వాడిని ఏం చేయాలి బావా?

సుబ్బారావు:
మన బ్లాగు మిత్రులు ఏమంటారో అడుగుదాం మరదలా?

రెండు రూపాయలకే ఒక సినిమా సీడీ

[సినిమా పైరసీల నివారణకు ప్రభుత్వం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మనకేమో సినిమాలు పైరసీతో బాగా అలవాటు చేసారు. ఇప్పుడు, పైరసీ మీద ప్రభుత్వం కఠిన చర్యలో, ఉక్కుపాదమో, ఐరన్ లెగ్గో పెడతానంటుంది కదా! అప్పుడు భవిష్యత్తులో జనాల పరిస్థితి ఏమిటి బావా?

సుబ్బారావు:
ఏముంది మరదలా! భవిష్యత్తులో.... ఓట్లకోసం కిలో రెండు రూపాయల బియ్యంలాగా, ఏదో ఒక పార్టీ రెండు రూపాయలకే ఒక సినిమా సీడీ అంటూ నినాదం ఎత్తుకుంటుంది. దాంతో ప్రజలందరూ ఆ పార్టీకి బ్రహ్మరధం పట్టి దాన్ని అధికారంలోకి తీసుకొస్తారు. అంతే!

Tuesday, March 16, 2010

రామోజీరావు గురించి చర్చించాలంటే, అతణ్ణి ఎంపీని చెయ్యాలా?

[1996 లో పురాతన దేవతా విగ్రహాలను విదేశాలకు తరలిస్తూ రామోజీరావు పట్టుబడినా, 14 ఏళ్ళ గడిచి, ఆరుప్రభుత్వాలు నడిచినా ఇంతవరకూ అతడి మీద చర్య తీసుకోలేదేమని ఉండవల్లి అరుణ్ కుమార్ లోకసభలో లేవనెత్తిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈనాడు రామోజీరావు 1996 లో పురాతన విగ్రహాలని విదేశాలకి తరలిస్తూ పట్టుబడ్డాడట. చర్యతీసుకోలేదేమని అడిగితే ఇతడెవరో తథాగత శతపతి అట, సభలో లేని వాళ్ల గురించి చర్చించకూడదన్నాడట. నాకు తెలియకడుగుతాను, నేరగాళ్ళ గురించి సభలో చర్చించ కూడదా బావా? అలా చర్చించాలంటే సదరు నేరగాళ్ళు సభలో ఉండాలా?

సుబ్బారావు:
అదే నాకూ వింతగా ఉంది మరదలా! ఈ లెక్కన కసబ్ ల గురించీ, అఫ్జల్ గురుల గురించీ కూడా సభలో చర్చించకూడదేమో! లేదా వాళ్ల గురించి చర్చించాలంటే వాళ్ళనీ ఎంపీలుగా ఎన్నుకొని పార్లమెంటుకు పంపించాలేమో!

సుబ్బలష్షిమి:
అయితే రామోజీరావు గురించి చర్చించాలంటే రామోజీరావుని కూడా ఎంపీని చేసేయ్యలంటావా బావా? అయినా సభల్లో ఉన్న అత్యధికులు నేర చరితులే కదా!

Friday, March 12, 2010

అన్నదాత కాదు, ఆస్థుల దాతా సుఖీభవ అనాలి!

[పార్టీ ఎంపీలకు సోనియా విందు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రాజ్యసభలో మహిళాబిల్లు ఆమోదం పొందినందుకు సోనియా పార్టీ ఎంపీలకు విందు ఇచ్చిందట. చివరలో, ఆమె వెళ్ళిపోతున్నప్పుడు, ఎంపీల సతీమణులు ’అన్నదాతా! సుఖీభవ’ అని దీవించటంతో ఆమె సంతోషం వ్యక్తం చేసిందని ఈనాడు పత్రిక వ్రాసింది. ఓ ప్రక్క ’అన్నదాత’ల నడ్డి విరుస్తుంటే, ఆమెను పట్టుకుని ’అన్నదాతా’ అంటున్నారేం బావా?

సుబ్బారావు:
మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీల సతీమణులు మరదలా! కోట్లు దోచుకోనిస్తున్న సోనియా, వాళ్ళపాలిట అన్నదాతే కాదు, ఆస్తుల దాత కూడా మరి!

డబ్బు మూటలు రాబట్టి, పందేరం చేసే ఉన్నతోద్యోగి ఎవరికైనా ఆప్తుడే మరి!

[ఏపీపీఎస్ సీ(APPSC) రాజకీయ ఉపాధి కమీషన్ లా తయారయ్యింది.
ఏపీపీఎస్ సీ ఉద్యోగ ఇంటర్యూలలో మార్కుల అవకతవకల గురించి - వార్తల నేపధ్యంలో.]

సుబ్బలష్షిమి:
బావా! ఈ APPSC ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి, గతంలో 2000 - 01ల నుండే JNTU కు వైస్ ఛాన్సలర్ గా, ఎంసెట్ కన్వీనర్ గా పనిచేశాడు. ఎంసెట్ ర్యాంకుల అవకతవకల్లో కార్పోరేట్ కాలేజీల దగ్గర నుండి భారీగా సొమ్ము రాబట్టి, మంత్రి, ముఖ్యమంత్రులకి కూడా సరఫరా చేసేవాడనీ, నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బాగా కావలసిన వాడనీ అన్నారు. ఇప్పుడేమిటి, ఇతడు వై.యస్.కి సన్నిహితుడని పత్రికలు వ్రాస్తున్నాయి?

సుబ్బారావు:
బహుశః ఇద్దరికీ సన్నిహితుడై ఉంటాడు మరదలా! లేదా సీట్లో ఎవరుంటే వారికి సన్నిహితుడై ఉంటాడు.

సుబ్బలష్షిమి:
అంతేలే, బావా! డబ్బు మూటలు రాబట్టి, పందేరం చేసే ఉన్నతోద్యోగి కదా! ఎవరికైనా ఆప్తుడే అవుతాడు మరి!

Thursday, March 11, 2010

ఆవు చేలో మేస్తూ, దూడని పస్తుండమంటుంది

[తప్పనిసరిగా ఒటింగ్ ఉండాలి : అద్వానీ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అద్వానీ తన బ్లాగులో "సమాజంలో దిగువ స్థాయి వర్గాలతో పోలిస్తే చదువుకున్నవారిలో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటోందని" వ్రాసాడట. అందుకని తప్పనిసరిగా ఓటింగ్ ఉండాలంటున్నాడు.

సుబ్బారావు:
ఆ దిగువ స్థాయి వర్గాలకి ఓటు కు నోటు ఇవ్వకపోతే.... ఆ ఓటింగ్ కూడా ఉండదు మరదలా! అయినా వాళ్ళు ప్రజా సేవ తప్పనిసరిగా చేయరు గానీ, మనం మాత్రం తప్పనిసరిగా ఓటింగ్ చేసేటట్లు చట్టం చేస్తారట.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఆవు చేలో మేస్తూ, దూడని పస్తుండమంటుంది.

Tuesday, March 9, 2010

స్వదేశీ మహిళల పట్ల చులకన, విదేశీ మహిళ పట్ల భయభక్తులు!

[మహిళా బిల్లు విషయమై యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన ఎస్పీ, ఆర్జేడీ పార్టీల నేతలు మూలాయం, లాలూ ప్రసాద్ యాదవ్ లు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
అణు ఒప్పందం విషయంలో 2008లో ఎర్రపార్టీలు యూపీఏ కి మద్దతు ఉపసంహరించారు. అప్పుడు ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉంటే పరుగెత్తు కుంటూ వచ్చి మరీ మద్దతిచ్చారు. మరీ సమాజ్ వాదీ అప్పటి నేత అమర్ సింగ్ అయితే - అమెరికా నుండి ఆఘమేఘాల మీద వచ్చి మద్దతిప్పించాడు. ఇప్పుడు తమ మద్దతు ఉన్నా, లేకపోయినా, ప్రభుత్వానికి ఢోకాలేని స్థితిలో మద్దతు ఉపసంహరించామంటూ నానా గల్లంతు చేస్తున్నారు. అసలేమిటీ తంతు బావా?

సుబ్బారావు:
ఏముంది మరదలా! రాజకీయ మ్యాచ్ ఫిక్సుంగుల్లో రక్షణ నియమాలు [safety measures]. ఎటుపోయి ఎటు వచ్చినా తమ కెరీర్ కి, తమ ప్రభుత్వాలకి, ఇబ్బంది రాకుండా చూసుకుని నాటకాలాడతారు. అంతే!

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! ఈ యాదవ్ ద్వయానికి సామాన్య స్వదేశీ మహిళల పట్ల చులకన, విదేశీ మహిళ పట్ల భయభక్తులు. అందుకే అప్పుడు అంతగా మద్దతు ఇచ్చి మరీ సోనియా ప్రభుత్వాన్ని రక్షించారు.

శేఖర్ కమ్ములకి మీడియా మాయాజాలం తెలియదా?

[శేఖర్ కమ్ముల దర్శకత్వంలోని ’లీడర్’ సినిమా నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా!లీడర్ సినిమాలో... ఎంత సేపూ రాజకీయనాయకులూ, ఉద్యోగులూ మాత్రమే అవినీతి పరులు, అక్కడికి మీడియా మాత్రం మహా పత్తిత్తు అన్నట్లు చూపారేమిటి?

సుబ్బారావు:
భలే దానివే మరదలా! అవినీతికి ఆరంభకులూ, అండదండలూ మీడియానే అంటే, దెబ్బకి తమ సినిమా మటాష్ అయిపోతుందని శేఖర్ కమ్ములకి మాత్రం తెలియదనుకున్నావా?

అన్నదానాలు చేస్తే అన్నీ ఓకేనా!?

[>>>ఉత్తర ప్రదేశ్ లో కృపాలు మహారాజ్ అనే స్వామిజీ ఆశ్రమంలో, తన భార్యకు శ్రాద్దం పెట్టే సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తుంటారు. పేదలకు స్టీల్ కంచం, పది రూపాయల నగదు, ఒక లడ్డూ, చేతి రూమాలు పంచి పెడతారని నిర్వాహకులు ప్రకటించారు. ఆ సందర్భంలో తొక్కిసలాట జరిగి 71 మంది చనిపోయారు.

>>>ఆ స్వామీజీ మీద కూడా లైంగిక వేధింపులు, ఆశ్రమంలో అవకతవకలు గట్రా ఆరోపణలు ఉన్నాయి. - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ బాబా ఎవరో.... అన్నదానం, వస్తుదానం చేస్తానంటే పదివేల మంది గుమిగుడారట. తొక్కిసలాటలో 71 మంది చనిపోయారు. సదరు బాబా ఆశ్రమంలో అక్రమాలుకూ కొదవేం లేదు.

సుబ్బారావు:
అప్పుడెప్పుడో ’అమ్మఒడి’ బ్లాగులో ’ఇస్కాన్’ అవకతవకల గురించి వ్రాస్తే... కొందరు జ్ఞాత, అజ్ఞాత వ్యాఖ్యాతలు "వాళ్ళు కనీసం పేదలకి అన్నదానం చేస్తున్నారు. వాళ్ళనీ విమర్శించకుండా వదలరా మీరు?" అన్నారు. ఓ ప్రక్క సమాజాన్ని నాశనం చేస్తూ, మరోప్రక్క సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న ఫోజు పెడితే చాలు’, అన్నీ బాగానే ఉన్నాయి’ అనుకునేంత కాలం ఇలాంటి బాబాలు ఉంటూనే ఉంటారు మరదలా!

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! వస్తుదానం అంటూ ఆ బాబా ఇచ్చేదేమీటో తెలుసా? ఓ స్టీల్ కంచం, పది రూపాయల నగదు, ఒక లడ్డూ, చేతి రూమాలు. వాటి కోసమే అంతమంది వచ్చారంటే ఆ యూపీలో పేదరికం ఏ స్థాయిలో ఉండాలి బావా!? ఆ మాయావతి భారీ విగ్రహాల స్థాపనకి అయ్యే కోట్ల రూపాయల వెచ్చించినా అక్కడ పేదలందరికీ ఇలాంటి వస్తుదానాలు ఇంకా ఎక్కువగానే చేయవచ్చేమో కదా?

సుబ్బారావు:
ఈ మాయావతి ప్రధాని కావాలనుకున్నది. ప్రధానే అయ్యింటే దేశప్రజల పరిస్థితి ఒక్కసారి ఊహించు మరదలా!? దేశమంతా ఎన్ని విగ్రహాలో!!

Monday, March 8, 2010

కాకుల్ని కొట్టి గద్దలకి పెట్టటం అంటే ఇదేనేమో!

[వ్యవసాయ భూముల్లో 20 సెంట్ల వరకు (దాదాపు వెయ్యి చదరపు గజాలు) కొనుగోలు చేస్తే దానికి ఇంటి స్థలం ధరను లెక్కగడతారు. అంటే ఒక చిన్నరైతు కూరగాయల సాగుకోసం కొద్దిపాటి విస్తీర్ణం కొనుక్కొన్నా ఇంటి స్థలం లెక్కన స్టాంపు రుసుం చెల్లించాలి. దీనివల్ల స్థలాన్ని ఎంతకు కొంటామో స్టాంపు రుసుం రూపేణా అంతే మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఏర్పడుతుంది. ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, సెజ్ లు, ఐటీ పార్కుల సమీపంలో ఉన్న భూముల విలువలను పెంచుతారు. - ఏప్రియల్ నుండి భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచనున్నారన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రభుత్వం, భూముల మార్కెటు విలువను భారీగా పెంచేస్తుందట తెలుసా! దాంతో భూముల క్రయవిక్రయాలలో రిజిస్ట్రేషన్ ఫీజు బాగా పెరుగుతుందట. ఇప్పుడు భూమిపై కొనుగోలుదారుడు 9.5 శాతం స్టాంపు రుసుం చొప్పున 9,500 రూ. కడుతుండగా, కొత్త విలువ వచ్చాక 23,750 రూ. చెల్లించాల్సి వస్తుందట.

సుబ్బారావు:
అదే కార్పోరేట్ కంపెనీల కోసం సేజ్ లను, ఎకరా రూపాయి నుండి వందరూపాయలు ధరకు వేలాది ఎకరాలు కట్టబెట్టేసారు మరదలా!

సుబ్బలష్షిమి:
కాకుల్ని కొట్టి గద్దలకి పెట్టటం అంటే ఇదేనేమో బావా!

Friday, March 5, 2010

ప్రజలని వెర్రి వెంగళప్పలనుకోవటం లో మాత్రం వీళ్ళు ఘనులు

[రాష్ట్ర విభజనకు బొత్స సతీమణి ఝాన్సీ ’నో’ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భర్త రాష్ట్ర విభజనే మేలు అంటాడు. భార్య కాదు అంటుంది. మంత్రి ఇంట్లోనే చీలిక అని పత్రిక వ్రాస్తుంది. అసలింతకీ ఏం జరుగుతోంది?

సుబ్బారావు:
అంతా కలిసి జనం చెవుల్లో పువ్వులు పెట్టటం జరుగుతోంది మరదలా! గతంలో సింధియాల కుటుంబం వంటి వాళ్ళు తలా ఒక పార్టీలో ఉండేవాళ్ళు. ఆ విధంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తమకి ఢోకా లేకుండా చూసుకునే వాళ్ళు. అదే తతంగం బొత్స కుటుంబానిది కూడా!

సుబ్బలష్షిమి:
మొత్తానికి ప్రజలని వెర్రి వెంగళప్పలనుకోవటం లో మాత్రం వీళ్ళు ఘనులనుకుంటాను బావా!

ఒకప్పుడు మంగలి వాళ్ళు చేసిందే ఇప్పుడు నిత్యానందం చేస్తున్నాడు

[తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన నిత్యానంద[స్వామే కాదు, పరమహంస కూడానట!] మీద ఆరోపణల గురించి,
>>>తమిళనాడులోని తిరువణ్ణామలైకు చెందిన నిత్యానంద అసలు పేరు రాజశేఖరన్. శరీరంలో ఎక్కడ తాకితే ఎలాంటి స్పందన ఉంటుందో ఈయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని ప్రతీతి. ఈ విద్య నేర్చుకోవడానికే విదేశీయులు క్యూ కడుతుంటారని చెబుతారు. ఇందుకు భారీగా ఫీజులు కూడా వసూలు చేసినట్లు సమాచారం. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నిత్యానంద స్వామిజీ అనబడే ఈ మగానుభావుడు సినీ నటితో రొమాన్సు చేస్తూ టీవీ కెమెరాలకి దొరికి పోయాడు. శరీరంలో ఎక్కడ తాకితే ఎలాంటి స్పందన ఉంటుందో ఈయనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదట. ఈ విద్య నేర్చుకోవడానికి విదేశీయులు, సినీతారలు ఇతడికి శిష్యులవుతున్నారట. తెలుసా?

సుబ్బారావు:
అంతే కదా మరదలా! సినీ తారలకి ఈ పట్లు తెలిస్తేనే కదా సినిమాలు వచ్చేది. అందుకోసం ఇలాంటి వాళ్ళని ఆశ్రయిస్తారు. నిజానికి ఈ విద్య, ఇప్పుడు మసాజ్ సెంటర్లలలో ఉపయోగిస్తున్నదే. ఒకప్పుడు [చాణిక్యుడి కాలంలో] మంగలి వాళ్ళద్వారా శత్రురాజుల నుండి రహస్యాలు కనుక్కోవటానికి, గూఢచర్యంలో ఉపయోగించేవాళ్ళు! కాకపోతే ఈ విద్య కాలక్రమంలో మరుగున పడింది. అదే విద్య నిత్యానందాన్ని ఇప్పుడు స్వామిజీ నీ చేసింది. అంతే తేడా!

సుబ్బలష్షిమి:
అంటే ఈ విద్య ఇంకా కొంతమంది దగ్గర సజీవంగానే ఉందన్నమాట, కదా బావా!

పైఈఈఈ స్థాయి వాళ్ళ ని క్రింది స్థాయి వాళ్ళు ఏమీ అనకూడదట!

[నాకు ప్రజలని భయపెట్టటం ఇష్టం. ఎప్పటికైనా భయపెడతాను - సినీ నిర్మాత, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - ఈనాడు ఇంటర్యూలో]

సుబ్బలష్షిమి:
బావా! సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ, ప్రజలని ఎప్పటికైనా భయపెడతాను అంటూ ఇచ్చిన ఈనాడు ఇంటర్యూలో, సినిమాల ప్రభావం జనాల మీద అసలుండనే ఉండదు అంటున్నాడు. నిజమా బావా?

సుబ్బారావు:
అదే నిజమైతే.... మన చిన్నప్పటి నుండీ చూస్తున్నాం మరదలా, ప్రేమనగర్ చీరలూ, వాణిశ్రీ జాకెట్లు అంటూ వ్యాపారాలు చేయటం! ఇప్పటికీ పోకిరి చొక్కాలు, సంక్రాంతి చీరలు, కొత్త బైకులూ, కొత్త బ్రాండులూ సినిమాల ద్వారా, సినిమా హీరో హీరోయిన్లని బ్రాండ్ అంబాసిడర్ లుగా పెట్టి వ్యాపారాలు పెంచుకోవటం లేదూ! చివరికి పుట్టిన రోజు కొవ్వొత్తులూ, అలాంటి సాంప్రదాయాలు కూడా, ఓ ప్రక్క సినిమాల ద్వారా ప్రజల్లోకి ఇంజక్ట్ చేస్తూ, మరో ప్రక్క సినిమాల ప్రభావం ప్రజల మీద లేదనటం అంటే పచ్చి మోసమే అది!

సుబ్బలష్షిమి:
మోసం కాదు బావా! వాళ్ళు పైస్థాయిలో ఉన్నారట. ప్రజలు క్రింది స్థాయిలో ఉన్నారట. కాబట్టి పైఈఈ...ఈ స్థాయి వాళ్ళని, మనం ఏమనకూడదని ఓ ’దొంగ అజ్ఞాత బ్లాగరు’ ’అమ్మఒడి’ బ్లాగులో అంటున్నాడు తెలుసా!

సుబ్బారావు:
నిజమే! వాళ్ళు ఏంచేసినా, ఎలా దోపిడి చేసినా ప్రజలు ఏమీ అనకూడదు కదా!

Thursday, March 4, 2010

ఇప్పుడు ఓడలు బండ్లయి పోయినట్లున్నాయి

[చిన్ననటులని, చిన్న నిర్మాతలని, పెద్ద నిర్మాతలు వేధిస్తున్నారంటూ... రామోజీరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజులపై, మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించిన సినీనటుడు రాజా, నిర్మాత కళ్యాణ్ కొల్లి - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సినిమా హీరో రాజా, మరో చిన్న సినిమాల నిర్మాత, తమని సినీరంగంలో పెద్దలు తొక్కేస్తున్నారంటూ, మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అది తమ పరిధిలోకి వస్తుందో రాదో చూసి స్పందిస్తామని సుభాషణ్ రెడ్డి చెప్పాడట. తెలుసా?

సుబ్బారావు:
ఆ చిన్న కళాకారులూ, నిర్మాతలూ.... రామోజీరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజ్ వంటి నిర్మాతలని ఆరోపిస్తున్నారు మరదలా! అందునా రామోజీరావుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తే మానవహక్కుల కమీషన్ కేసు తీసుకుంటుందేమిటి?

సుబ్బలష్షిమి:
రామోజీరావు దాకా ఎందుకు బావా! తెలంగాణా ఐకాస కన్వీనరు కోదండ రాం నే ఏమీ అన్లేక పోతుంటే! ఒకప్పుడు మానవహక్కుల సంఘాలు కేంద్రప్రభుత్వాలనే కట్టడి చేశాయి గానీ.... పాపం, ఇప్పుడు ఓడలు బండ్లయి పోయినట్లున్నాయి.

చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి వేశ్యాగృహలు

[ఉత్తరాంధ్ర ప్రజల వెనకబాటు తనం గురించి మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మంత్రి బొత్స సత్యనారాయణకి హఠాత్తుగా ఉత్తరాంధ్ర ప్రజల వెనక బాటుతనం గుర్తొచ్చిందేమిటి?

సుబ్బారావు:
అతడు ఎం.ఎల్.ఏ., మంత్రి! అతడి భార్య ఎంపీ. అతడి కుటుంబం నుండి నలుగురు రాజకీయ పదవుల్లో ఉన్నారు. ప్రక్కవాడికి అవకాశం లేకుండా ఆ ప్రాంత ఎంపీ, ఎం.ఎల్.ఏ గట్రా పదవులన్నీ తామే తీసుకున్న ఇతడు, ప్రజల వెనకబాటు తనం గురించి మాట్లాడటం! అదీ వింత!

సుబ్బలష్షిమి:
చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి వేశ్యాగృహలు అంటే ఇదేనేమో బావా!

తాను చేస్తే శృంగారం ఇతరులు చేస్తే వ్యభిచారం!

[>>>జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ అన్నిపార్టీల రాజీనామాలు చేయాలని తెలంగాణా ఐక్యకార్యాచరణ సమితి పిలుపు ఇచ్చినా స్పందించకుండా, రాజీనామా చేయకుండా ఉండిపోయిన వారిని దొంగలు, చేతగానివాళ్ళుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభివర్ణించారు. "వాళ్ళు ఇప్పటికే మమ్మల్ని మోసం చేశారు. రెండు పార్టీల వారూ గడ్డకు పడి మమ్మల్ని బావిలో నూకేశారు" అని ఆరోపించారు.

>>కేసీఆర్, విజయశాంతిల రాజీనామాలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... తాము అన్నిబాంబులు ఒకేసారి పేల్చబోమని, ఏది ఎప్పుడు పేల్చాలో తమకు తెలుసంటూ సమాధానం దాటవేశారు. - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ కేసీఆర్ ది నాలుకా తాటిపట్టా? ఓ వైపు తెలంగాణా కోసం రాజీనామాలు చేయని వాళ్ళని దొంగలు, చేతగాని వాళ్ళు అంటున్నాడు. అదే తన రాజీనామా విషయానికి కొచ్చేసరికి, ఎప్పుడే బాంబు పేల్చాలో తనకి తెలుసు అంటున్నాడు. ఇదేమీ రాజకీయ నట విశ్వరూపం బావా?

సుబ్బారావు:
తాను చేస్తే శృంగారం ఇతరులు చేస్తే వ్యభిచారం అంటే ఇదే మరదలా! ఇంతక్రితం ఇలాగే మంత్రిపదవులు వదలమంటే, సంతోష్ రెడ్డి.... కేసీఆర్ మంత్రిపదవి వదలని విషయాన్ని ఎత్తి చూపాడు. అంతే! పార్టీ నుండి బయటకు రావలసి వచ్చింది. ఇంతగా బహిర్గత మౌతున్న నిజాలనీ, రాజకీయ నాయకుల నిజ స్వరూపాలనీ ప్రజలు చూసి తీరాల్సిందే!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఈ కేసీఆర్, ఎంపీ సీటు వదల లేడుగానీ.... ప్రాణాలు వదిలేస్తానంటూ సెలైన్ బాటిళ్ళు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తూ ఎంత గోల చేశాడు? మీడియా కూడా ’తానా అంటే తందానా’ అంది!