Saturday, January 30, 2010

దరిద్రం జేబుకి కాదు, మనస్సుకే!

సుబ్బలష్షిమి:
అనిల్ అంబానీ, సచిన్, శంకర్ మహదేవన్, డివై పాటిల్ [త్రిపుర గవర్నర్] లు నవీ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ లో కార్లను నమోదు చేయించుకుని, కార్ సెస్ చెల్లించ లేదట. వాళ్ళకేం ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి బావా?

సుబ్బారావు:
వాళ్ళకి అర్ధిక ఇబ్బందులు జేబుకు కాదు, మనస్సుకు ఉంటుంది మరదలా!

Tuesday, January 26, 2010

రాజకీయనాయకుల సామూహిక ఏకపాత్రాభినయాలు

["బతుకమ్మలు ఆడేవాళ్ళు లెప్టిస్టులా? కేంద్రం చెప్పినా ఇప్పటి వరకూ విద్యార్ధులపై పెట్టిన కేసుల్ని ఎత్తేయలేదు. రెండుమూడువేల కేసులు పెట్టారు. విద్యార్ధులకు స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇలాగైతే విద్యార్దులని ఖతం చేసేయండి. యూనివర్శిటీలను మూసేయండి" అంటూ కాంగ్రెస్ నేత కె.కె. ఆగ్రహం చెందారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ నేత కే.కేశవ రావు ఎవరి మీద ఆగ్రహం చూపుతున్నాడు? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్నది తమ పార్టీయే కదా? ఓ ప్రక్క రాష్ట్రముఖ్యమంత్రి రోశయ్య తన చేతుల్లో ఏదీ లేదని, తను గుమాస్తా స్థాయి వాణ్ణనీ అంటున్నాడు. ఈ కే.కే. అధిష్టానం వద్ద తనకు చాలా పలుకుబడి ఉందంటూ, తెలంగాణా నాయకులందరిని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. అధిష్టానమేమో తనకు అన్ని తెలుసు అంటుంది. మరి విద్యార్ధులపై కేసులు ఎత్తేయమని చెప్పింది ఎవరు? చెయ్యనిది ఎవరు?

సుబ్బారావు:
అదంతే మరదలా! రెడ్ టేపిజపు విశృంఖల రూపం అది. సామూహికంగా రాజకీయనేతలందరూ ఏకపాత్రాభినయాలు చేస్తున్నారు. ఎవరి డైలాగులు వాళ్ళవి. విస్తుపోయి చూడ్డం ప్రజల వంతయ్యింది.

Monday, January 25, 2010

తెలంగాణాపై రోడ్ మ్యాప్

[తెలంగాణాపై రోడ్ మ్యాప్ తయారీ గురించి చిదంబరం ప్రకటనల వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చిదంబరం అఖిలపక్షం సమావేశం నిర్వహించి, అందరం కలిసి చర్చిస్తే తెలంగాణాపై రోడ్ మ్యాప్ తయారు చేయవచ్చు అంటూ ప్రకటనలు ఇస్తూ ఉంటాడు, రోడ్ మ్యాప్ అంటే ఏమిటి?

సుబ్బారావు:
ఏం లేదు మరదల! తెలంగాణా విషయాన్ని సాగదీయదలిస్తే గతుకుల రోడ్డుమీద, వేగంగా తీసుకెళ్ళదలిస్తే హైవే రోడ్డు మీద, అక్కడక్కడే తిప్పదలిస్తే రింగ్ రోడ్డు మీద! ఏం చేద్దాం అని అఖిల పక్షంలో చర్చించటమే రోడ్ మ్యాప్ తయారు చేయటం. అంతే!

Sunday, January 24, 2010

ప్రధానిని కిరాణా కోట్లో కూర్చొబెట్టాలి!

[ధరల పెరుగుదల విషయమై భాజపా పార్టీ వాళ్ళు ప్రధాని కలిసిన వార్త నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! భాజపా వాళ్ళు ప్రధానిని ధరల పెరుగుదల విషయమై కలవగా, ప్రధాని, "పప్పులు, కూరగాయలు, పంచదార తప్ప ఇంకేమీ పెగరలేద"ని అన్నారట! సుష్మాస్వరాజ్ చెబుతుంది.

సుబ్బారావు:
అది నిజమే అయితే, ప్రధానిని మన ఉళ్ళో కిరాణా కొట్లో కూర్చోబెట్టాలి. అప్పుడు తెలుస్తుంది అతడికి అన్ని వస్తువుల ధరలు పెరిగిన విషయం! దీన్నే అంటారేమో కడుపునిండినప్పుడు కడుపునిండిన మాటలని!

Wednesday, January 20, 2010

బాబా మహాత్యం

సుబ్బలష్షిమి:
బావా! మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కి పంజాబ్ గవర్నర్ పదవి వచ్చిందట గదా! అంతా సోనియా దయేనా!

సుబ్బారావు:
ఓసీ అమాయకురాలా! సోనియాని రోజూ దర్శించుకుంటూనే ఉండి ఉంటాడు. కాబట్టి సోనియా దయ ఎప్పుడూ ఉంటుంది. గవర్నర్ పదవి రావడానికి ముందు, వచ్చిన తరువాత, పుట్టపర్తి బాబాని దర్శించుకున్నాడు. కిటుకు బాబా మహాత్యంలోనూ ఉంది! అందుకే కదా VVIPలందరు బాబా చుట్టూ తిరుగుతుంటారు!

ఆదాయం తగ్గినా, సంక్షేమం ఆగదు?

సుబ్బలష్షిమి:
రోశయ్య - ఆదాయం తగ్గినా, ప్రజల సంక్షేమం ఆగదు అంటున్నాడు. ప్రభుత్వ ఆదాయం ఎక్కడ తగ్గించుకుంటున్నారు బావా? ప్రజల మీద పన్నుల రూఫేణా, ఛార్జీల రూపేణా భారీగా వడ్డిస్తున్నారు కదా?

సుబ్బలష్షిమి:
ఓసి పిచ్చి మరదలా! దాన్ని అలా అర్ధం చేసుకోకూడదు. ప్రజల ఆదాయం తగ్గినా, తమ సంక్షేమం ఆగకూడదని మంత్రులకి చెబుతున్నాడు. అదే ఇందులోని మతలబు!

ఇంత చిన్న వయస్సులో అంత పెద్ద బాధ్యతా?

సెన్సారు బోర్డు సభ్యుడిగా శిరీష్ భరద్వాజ్ నియామకం - వార్త నేపధ్యంలో

సుబ్బలష్షిమి:
బావా! శిరీష్ భరద్వాజ్ ను సెన్సారు బోర్డు సభ్యుడిగా నియమించారట. ఈ శిరీష్ భరద్వాజ్ చిరంజీవి రెండో అల్లుడేనా బావా?

సుబ్బారావు:
ఎవరికి తెలుసు మరదలా! వార్త వ్రాసిన పత్రిక వారు చెబితేనే గదా సామాన్యులకి తెలిసేది?

సుబ్బలష్షిమి:
అతడే అయితే... నిండా పాతికేళ్ళు కూడా లేని వాడికి సెన్సారు సభ్యత్వమా బావా?

సుబ్బారావు:
ఎవరితో ఎవరికి ఏ అవసరం వచ్చిందో మరదలా? అప్పుడే కదా నేరుగా పదవొచ్చి ఒడిలో వాలేది?

Tuesday, January 19, 2010

కాలం మూడితే రహస్యాలన్నీ రట్టవుతాయి మరి!


పై వార్త నేపధ్యంలో.

సుబ్బలష్షిమి:
బావా! 2009, జూన్ లో రాజ్ భవన్ భద్రతకి భారీ ఏర్పాట్లు చేశారు. బహుశః ఎన్.డి. తివారీ కామక్రీడలు బయటపడకూడదని అంత జాగ్రత్త తీసుకున్నారు కాబోలు! వ్రతం చెడ్డా ఫలితం దక్కాలంటారు పెద్దలు. పాపం! ఈ ముసలి కాముకుడికి వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కినట్లు లేదు. పదవీ ఊడింది. పరువూ పోయింది కదా బావా!?

సుబ్బారావు:
కాలం మూడినప్పుడు అంతే మరదలా! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, దాచుకున్నా గుట్టంతా రట్టయి, రహస్యాలన్నీ బట్టబయలవుతాయి.

Thursday, January 7, 2010

లండనిస్తాన్!

[అమెరికా గూఢచార సంస్థ సిఐఏ, బ్రిటన్ కి ’లండనిస్తాన్’ అని పేరుపెట్టిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బ్రిటన్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంస్థలకూ, లండన్ వేర్పాటు వాదులకూ అడ్డాగా మారడంతో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ల్లాగా, లండన్ ని లండనిస్థాన్ అని పిలిస్తే సరిపోతుందని సిఐఏ అన్నదట, తెలుసా!

సుబ్బారావు:
మొత్తానికీ ఆలస్యంగా నైనా నిజాలు బయటికొస్తున్నాయి మరదలా!

సుబ్బలష్షిమి:
అందుకే కాబోలు బావా! నిజం నిలకడ మీద తేలుతుందని పెద్దలంటారు.

ఆలికి అన్నం పెట్టటం ఊరిని ఉద్దరించటం అన్నాడట!

[14 మంది పిల్లలతో కెయిన్, డాన్ అనే బ్రిటన్ దంపతులు, బ్రిటన్ లో ప్రభుత్వ సంక్షేమ పధకాలతో ప్రయోజనాలు పొందుతున్న వార్త నేపధ్యంలో]

>>>వారానికి 700 పౌండ్లు సామాజిక సంక్షేమ ఆసరాగా లభిస్తోంది మరి! ఇద్దరు దంపతులు, వారి 14 మంది సంతానం(పెద్దాడికి తప్ప) అంతా రకరకాల సామాజిక సంక్షేమ పద్దులకింద లబ్ధి పొందుతున్నారు. ఇంటి అద్దె రాయితీల నుంచి గర్భిణీ, మాతా శిశు సంక్షేమం, బిడ్డల సంక్షేమం, విద్య వగైరా, వగైరాలే కాదు.. కెయిన్‌కు ఉద్యోగం వెదుక్కునేందుకు భృతి (3,700 పౌండ్లు) కూడా లభిస్తోంది! అన్నీ కలిసి ఏడాదికి దాదాపు 37 వేల పౌండ్లు(రూ. 27 లక్షలు). అంటే, ఏడాదంతా ఉద్యోగం చేసి సంపాదించే 51,500 పౌండ్ల స్థూల వేతనానికి సమానం. బ్రిటన్‌లో సగటు వార్షిక జీతం 21,300 పౌండ్లే! అంతకు రెట్టింపుకంటే ఎక్కువ మొత్తాన్ని సీన్‌ కెయిన్స్‌, ప్రభుత్వం ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాడు.

సుబ్బలష్షిమి:
బావా! బ్రిటన్ లో వీళ్ళెవరో కెయిన్, డాన్ దంపతులట. బోలెడు మంది పిల్లలతో, ప్రభుత్వ సంక్షేమ పధకాలతో, బ్రిటిషు సగటు వార్షిక జీతం కంటే రెట్టింపు ఆదాయం కలిగి ఉన్నారట. ఏ పనీ చేయకుండా జీవితం గడిపేస్తున్నారు తెలుసా?

సుబ్బారావు:
అంతే కాదు మరదలా! మేమేం ఊరికే కూర్చున్నామా? పిల్లల్ని కనటం, పెంచటంలో తీరిక లేకుండా ఉన్నామని దబాయిస్తున్నారు కూడాను.

సుబ్బలష్షిమి:
ఆలికి అన్నం పెట్టటం అంటే ఊరిని ఉద్దరించినట్లన్న మాట!

Wednesday, January 6, 2010

తాలిబాన్ల శాంతిదూత ఇమ్రాన్ ఖాన్!

[తాలిబాన్ల శాంతిదూతగా పాక్ మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ని ఎంచుకున్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
తాలిబాన్ల శాంతిదూతగా పాక్ మాజీ క్రికెట్ కెప్టెన్, నేటి రాజకీయ నేత ఇమ్రాన్ ఖాన్ ని ఎంచుకున్నట్లు తీవ్రవాద సంస్థలు ప్రకటించాయట. అంత సుహృద్భావ సంబంధాలూ, నమ్మకాలూ తాలిబాన్లకూ ఇతడికీ మధ్య ఉన్నాయి కాబోలు బావా?

సుబ్బారావు:
ఈ మాజీ క్రికెట్ కెప్టెన్ కి ఒకప్పుడు మీడియా ఎంతగా క్రేజూ, ఇమేజ్ సృష్టించాయో తెలుసా మరదలా!

సుబ్బలష్షిమి:
ఇలాంటి వాళ్ళందరినీ నడిపేదీ ఒకటే వ్యవస్థ అయినప్పుడు, వాళ్ళ మధ్య అంతగా నమ్మకాలూ, సంబంధాలు ఉంటాయి కాబోలు బావా! మొన్నా మధ్య నవాజ్ షరీఫ్, పాకిస్తాన్ లో లాంగ్ మార్చ్ చేస్తే తాలిబాన్లు ఒక్క బాంబుకూడా పేల్చకుండా, ఆ లాంగ్ మార్చ్ విజయవంతమయ్యేట్లు చూశారు కదా, అలాగన్నమాట! ఒకప్పుడు... స్మగ్లరూ, అడవి దొంగా అయిన వీరప్పున్ కూ, నక్కీరన్ గోపాల్ కూ, మధ్య నమ్మకాలూ, సత్సంబంధాలూ ఉన్న మాదిరిగా అన్నమాట!

పీత కష్టాలు పీతవి, పిల్లల కష్టాలు పిల్లలవి!

[గూర్ఖాలాండ్ ను ఏర్పరిస్తే దేశంలో 800 రాష్ట్రాలు - బర్ధన్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇలా చిన్న రాష్ట్రాలని ఏర్పాటు చేస్తూ పోతే తమకి Map Drawing కష్టమైపోతుందని అంటున్నారు పాఠశాల విద్యార్ధులు.

సుబ్బారావు:
అంతేమరి! పీత కష్టాలు పీతవి, పిల్లల కష్టాలు పిల్లలవి!

Tuesday, January 5, 2010

నిజమైన బహుమతి ఇరానియన్ కు కాదు, ఇటానియన్ కు ఇవ్వాలి!

[మన్మోహన్ సింగ్ క్యారికేచర్ పోటీలో ఇరానియన్ కు ప్రధమ బహుమతి - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? మన్మోహన్ సింగ్ కారికేచర్ గీసే పోటీలో ఓ ఇరానియన్ కు ప్రధమ బహుమతి వచ్చిందట తెలుసా?

సుబ్బారావు:
ఆ జడ్జీలెవరో గానీ, వాళ్ళకసలు విషయ పరిజ్ఞానం లేదు మరదలా! నిజమైన బహుమతి ఇరానియన్ కు కాదు, ఇటానియన్ కు ఇవ్వాలి.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! సోనియాకి మించిన అర్హత, ఆ విషయంలో మరెవరికీ లేదు.

ఆ జన్మబ్రహ్మచారి కురువృద్ధుడు భీష్ముడికీ, తివారీకీ పోలికా?

సుబ్బలష్షిమి:
బావా! 87 ఏళ్ళ ముసలివాడు ఈ ఎన్.డి.తివారీ. అయినా కామపు యావ తగ్గని కక్కుర్తి గలవాడు. అలాంటివాణ్ణి పట్టుకుని, పదేపదే మీడియా, కామక్రీడలని రాసలీలలని, అతడిని కురువృద్ధుడనీ వ్రాస్తోంది. కురువృద్ధుడు అంటే భీష్ముడు. ఆయన ఆ జన్మబ్రహ్మచారి. బ్రహ్మచర్యాన్ని కఠోర దీక్షగా ప్రతిన బట్టి భీష్ముడనిపించుకున్న దేవవ్రతుడు. అంతటి పుణ్యమూర్తితో, ఈ ఘోర పాపిని పోల్చటం ఎంత నీచం?

సుబ్బారావు:
ఆ కామ వికారాలని రాసలీలలనీ, అలాంటి ముసిలోళ్ళని కురువృద్ధులనీ, సెక్స్ వివాదాలని కుంభకోణాలనీ, అవినీతిని అవినీతి పురాణాలనీ, అవినీతి భాగోతాలనీ... హిందువుల పవిత్రపదాలన్నిటినీ నీచమైన పదాలకు పర్యాయాలుగా వాడటం మీడియాకి పరిపాటి మరదలా!

సుబ్బలష్షిమి:
హిందూమతానికి సంబంధించిన పదాలని, వాటి పవిత్ర భావాలని, పరమనీచమైన వాటికి పోల్చటం ద్వారా మీడియా చేస్తోంది కుట్రే బావా!

Monday, January 4, 2010

విదేశీయతని ప్రదర్శించుకుంటున్నా స్వదేశీ అనాలట!

సుబ్బలష్షిమి:
బావా! UPA కుర్చీవ్యక్తి సోనియా కుమార్తె ప్రియంకా వాద్రా తన కుమార్తెకి ఫ్రెంచి పదం మిరెయో[మెచ్చుకోదగినది అని అర్ధం] అనీ, కుమారుడికి అరబిక్ పదం రెహాన్[సువాసన అని అర్ధమట] అనీ పేర్లు పెట్టారట తెలుసా? ఆమెకి ఒక్క భారతీయ పేరూ నచ్చలేదు కాబోలు!

సుబ్బారావు:
సోనియా సంతానానికి భారతీయ పేర్లు నచ్చవు. భారతీయ భాషలు నచ్చక ఇంట్లో ఇటాలియన్ మాట్లాడుకుంటారు. ఈమెని మాత్రం ’విదేశీ అనటం తొందరపాటు చర్య’ అని మన గుమాస్తా ముఖ్యమంత్రి రోశయ్య అంటాడు. అవునంటూ డీఎస్ లూ, కేకేలూ, కాకాలూ గగ్గోలు చేస్తారు. ఏమంటాం మరదలా?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఓ వైపు 10 జనపథ్ కుటుంబం తమ విదేశీయతనీ మామూలుగా ప్రదర్శించుకుంటున్నా కూడా, ఈ స్వదేశీ భక్తులు గుడ్డి భజన మానటం లేదు.

ఈ అంటువ్యాధికి మందు కనుక్కుంటే బాగుంటుంది!

[గుండెపోటుతో కన్నడ నటుడు విష్ణువర్ధన్ మరణిస్తే అతడి అభిమానులు అల్లర్లకూ, విధ్వంసానికీ పాల్పడిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నాకు తెలియక అడుగుతానూ, ప్రతి ప్రాణికి మరణం సహజం కదా! తన 50వ ఏటా గుండెపోటుతో కన్నడ హీరో విష్ణు వర్ధన్ మరణిస్తే, అతడి అభిమానులు అల్లర్లకీ విధ్వంసానికి ఎందుకు పాల్పడినట్లు? అతడు మరణించినందుకు ఎవరి మీద వీళ్ళు అక్కసు ప్రదర్శిస్తున్నారు?

సుబ్బారావు:
కర్ణాటక పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లు జరుగుతున్నాయి కదా మరదలా! అంటు వ్యాధిలా అంటుకుని ఉంటుంది. పనిలో పని అనుకుని కానిచ్చేసి ఉంటారు.

సుబ్బలష్షిమి:
ఈ అంటువ్యాధికి మందు కనుక్కుంటే బాగుంటుంది బావా!

మొత్తానికీ సీను ఢిల్లీకి మారింది!

సుబ్బలష్షిమి:
బావా! ’మరింత మెరుగైన వైద్యం కోసం కేసీఆర్ ని ఖమ్మం ఆసుపత్రి నుండి హైదరాబాద్ నిమ్స్ కి మార్చినట్లు, నిమ్స్ నుండి ఢిల్లీ ఎయిమ్స్ కు మారిస్తే ఏమవుతుంది?’ అని డిసెంబరు 8 వ తేదీన నిన్ను అడిగాను గుర్తుందా?

సుబ్బారావు:
గుర్తుంది మరదలా! అప్పుడు ఎంచక్కా మీడియా ’ఢిల్లీకి మారిన సీను’ అని శీర్షికలు పెట్టుకోవచ్చు. విమాన యాన సంస్థలకి ఇబ్బడిముబ్బడి వ్యాపారం అని చెప్పాను. డిసెంబరు 9 వ తేదీ ఆర్ధరాత్రి కాంగ్రెస్ అధిష్టానం ’తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ షురూ’ అంటూ ప్రకటనా ఇచ్చింది. ఇప్పుడేమిటి?

సుబ్బలష్షిమి:
కారణం ఏదైతేనేం, ఇప్పుడదే అయ్యింది బావా! పోటాపోటిగా తెలంగాణా, సీమాంధ్ర నేతలు ఢిల్లీకి పోతున్నారట. శంషాబాద్ విమానాశ్రయం కిటకిటలాడుతుందట. టిక్కెట్లు దొరకని పరిస్థితి అని వార్తలొస్తున్నాయి.

సుబ్బారావు:
నిజమే సుమా! మొత్తానికి సీను ఢిల్లీకి మారింది మరదలా!

అప్పుడప్పుడూ అలవోకగా నిజాలు!

[రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్.డీ.తివారీ "తెలంగాణా వాదులు కుట్రచేసి తనను సెక్సు వివాదంలో ఇరికించార"న్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ ముసలి రసికుడు ఎన్.డి.తివారీ, తనని తెలంగాణా వాదులు సెక్సు కుట్రలో ఇరికించారని అంటున్నాడు. అంత తెలివే ఉంటే ఎప్పుడో రాష్ట్రం సాధించుకునేవాళ్ళం అంటూ కాంగ్రెస్ వృద్దనేత విహెచ్ వ్యంగ్యోక్తి వేసాడు. చూశావా!

సుబ్బారావు:
ఏదేమైనా వీహెచ్ మాత్రం నిజమే చెప్పాడు సుమా!

సుబ్బలష్షిమి:
అప్పుడప్పుడూ అలా నిజాలు కూడా చెబుతారు కాబోలు బావా ఈ రాజకీయనేతలు!

Sunday, January 3, 2010

తోపుడి బండి - భవిష్యత్తులో అలా జరిగిన ఆశ్చర్యం లేదు!

[గత ఏడాది గణతంత్ర దినోత్సవాల్లో, సాహస బాలల్ని ఏనుగు మీద బదులు జీపుల్లో ఊరేగించిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రతీ సంవత్సరం, దేశంలోని పిల్లలందరికీ ప్రోత్సాహాన్నీ, స్పూర్తినీ ఇచ్చేందుకు, సాహస బాలల్ని ఏనుగు మీద ఊరేగిస్తారు కదా! ’అలా పిల్లల్ని ఎందుకు ఉత్సాహపరచాలి?’ అనుకున్నారో ఏమో, గత ఏడాది యూపీఏ ప్రభుత్వం సాహస బాలల్ని జీపులో ఊరేగించింది, తెలుసా?

సుబ్బారావు:
సంతోషించు మరదలా! ఏ తోపుడు బండి మీదో ఎక్కించి ఊరేగించలేదు.

సుబ్బలష్షిమి:
భవిష్యత్తులో అలా జరిగిన ఆశ్చర్యం లేదు బావా!

Friday, January 1, 2010

అమ్మలెవరూ చీరలు కట్టటం లేదు

[టీవీ వాణిజ్య ప్రకటనల్లో, పత్రికల మహిళా శీర్షికల్లో అమ్మలందరూ పాంట్లూ, షర్టులూ వేస్తున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య టీవీల్లో ఎక్కువగా, ఏ వాణిజ్య ప్రకటనలో చూసినా, పత్రికలలో మహిళా శీర్షికలలో చూసినా అమ్మలెవరూ చీరలూ, చుడీదార్లూ ధరించి కనబడటం లేదు. పాంట్లూ, షర్టులూ లేదా మిడ్డీలు వేసుకున్న ఫోటోలే ఉంటున్నాయి. చివరికి ’పార్టీవేర్’ లంటూ పత్రికల్లో పరిచయం చేసే దుస్తులు కూడా మోకాళ్ళ పైకి ఉండీ, చేతుల్లేని గౌనులే ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే స్నానాల గది నుండి తువ్వాలో, లంగానో చుట్టుకొచ్చినట్లున్న డ్రస్సులు ప్రదర్శిస్తున్నారు. ఇవేం వింత పోకడలు బావా!

సుబ్బారావు:
వింతేమీ లేదు మరదలా! కార్పోరేట్ దిగ్గజాలు, మీడియా మదగజాలూ - అందరూ కలిసి భారతీయ సంస్కృతిని ధ్వంసం చేయాలనీ, విదేశీ సంస్కృతిని మన నెత్తిన రుద్దాలనీ చేస్తున్న ప్రయత్నంలో ఇదీ ఓ భాగం. అందుకే వాణిజ్య ప్రకటనలన్నీ అలాగే ఉంటున్నాయి.

సుబ్బలష్షిమి:
ఉన్న సంస్కృతిని ఊడగొట్టుకుని, లేనిది అతుకులేసుకుని, త్రిశంకు స్వర్గంలోకి ప్రయాణమన్న మాట!

అప్పుడెన్ని బుగ్గకార్లో!

[జార్ఖండ్ లో శిబూసోరెన్ ముఖ్యమంత్రి, మరిద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చిన్నరాష్ట్రం జార్ఖండ్ లో ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రులట తెలుసా?

సుబ్బారావు:
మరదే మరదలా! ఇప్పుడు మన రాష్ట్రాన్ని కూడా... ఆంధ్రా, గ్రేటర్ సీమ, తెలంగాణా, హైదరాబాద్ అంటూ నాలుగో అయిదో ముక్కలుగా కాకుండా ఏకంగా ఒక్కో జిల్లాని ఒక్కో రాష్ట్రంగా చేసేస్తే సరి! ఒకో రాష్ట్రానికి ఒక్కో ముఖ్యమంత్రి! ఇద్దరో ముగ్గురో, కుదిరితే నలుగురో ఉపముఖ్యమంత్రులు! ఇక చూస్కో నాసామి రంగా! మొత్తం తెలుగుగడ్డపైన ఓ పాతికమంది ముఖ్యమంత్రులూ, ఓ వందమంది ఉపముఖ్యమంత్రులూ ఉంటారు.

సుబ్బలష్షిమి:
అప్పుడెంచక్కా ఎటు పోయినా బుగ్గకార్లే కదా బావా!