Thursday, September 24, 2009

ఇడుపులపాయకు ఇరుముడులు

[అనంతపురం నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ఇరుముడి కట్టుకొని, వై.యస్.దీక్ష, మాలా ధరించి ఇడుపుల పాయలోని వై.యస్. సమాధిని దర్శించారన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
శివదీక్ష, భవానీ దీక్షల్లాగా ఇరుముడి కట్టుకొని ఇడుపులపాయపోయారట కొందరు కార్యకర్తలు! వై.యస్. క్రైస్తవుడు కదా! క్రైస్తవ సంప్రదాయం ప్రకారమే అతడి భౌతిక దేహాన్ని, దహనం కాకుండా ఖననం చేసి, సమాధి చేసారు కదా! తమ భక్తిని ప్రకటించుకోవాలంటే క్రైస్తవ సంప్రదాయం ప్రకారమే ఏదో ఒకటి చేసుకోకుండా, హిందూ దేవుళ్ళకి చేసినట్లు ఇరుముడి కట్టుకొని దీక్ష తీసుకోవటం ఏమిటి బావా? మరీ ఎకసెక్కంలా లేదూ?

సుబ్బారావు:
ఎకసెక్కం సంగతలా ఉంచు మరదలా! నాకో సందేహం! శివదీక్షో, భవానీ దీక్షో అంటే దైవసంబంధం గనుక అబద్దాలాడ కూడదు, మద్యమాంసాలు ముట్టకూడదు, ఇతరుల్ని బాధించకూడదు గట్రా నియమనిష్టలుంటాయి. మరి ఈ రాజకీయనాయకుడి దీక్ష ధరించిన వాళ్ళు, బ్రతికుండగా అతడు చేసినవన్నీ చేస్తారా? అంటే ఎదురు తిరిగిన వాణ్ణి అణగదొక్కటం, ఇంకా ఎదురు తిరిగితే, కేకే వంటి వారి కొడుకుల్ని కేసుల్లో ఇరుక్కునేటట్లు చేయడం వంటివన్న మాట.

సుబ్బలష్షిమి:
!!!

Tuesday, September 22, 2009

లక్ష ఇందిరమ్మ ఇళ్ళు రద్దయినా ఆగని గుండెలు!

[ఒక్క కర్నూలు జిల్లాలోనే లక్ష ఇందిరమ్మ ఇళ్ళు రద్దు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
మొన్న వై.యస్.రాజశేఖర్ రెడ్డి మృతిచెందినప్పుడు, నెలకి 200/-రూ. ల వృద్దాప్య పింఛను, వికలాంగ పింఛన్లు రావేమోనని, ఇందిరమ్మ ఇళ్ళూ, ఆరోగ్యశ్రీ కార్డులూ వంటి పధకాలు ఆగిపోతాయోమోనని బెంగతో గుండెలాగి అంతమంది మరణించారు కదా బావా! ఇప్పుడు ఏకంగా ఒక్క జిల్లాలోనే లక్ష ఇందిరమ్మ ఇళ్ళు రద్దయ్యాయట. ఇక రాష్ట్రమంతా అయితే, ఎన్ని లక్షల ఇళ్ళో? మరి ఇప్పుడు ఎంతమంది గుండెలాగి పోతాయో బావా?

సుబ్బారావు:
అప్పుడంటే మీడియాకి అవసరం కాబట్టి, రాష్ట్రంలో, ఎందుకైనా మరణించనీ, మరణించిన వారంతా వై.యస్.అభిమానులైపోయారు, మరణాలన్నీ బెంగతో గుండెలాగి పోయినవై పోయాయి గానీ, ఇప్పుడలా కాదు గదా మరదలా?

సుబ్బలష్షిమి:
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్లుందే తప్ప, ఎందులోనూ నిజం లేనట్లుంది బావా!

Sunday, September 20, 2009

విమానంలో సాధారణ తరగతిని ..... అంటే, మరి రైల్లోనో?

[విమానంలో సాధారణ తరగతి ప్రయాణీకులని cattle class [పశువుల మంద తరగతి] అన్న వ్యాఖ్యని అంగీకరించీ, అదే పదాన్ని ఉపయోగించీ కేంద్ర సహాయమంత్రి శశి ధరూర్ వివాదంలో చిక్కుకున్నాడన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! విమానంలో సాధారణ తరగతి ప్రయాణీకులని ఆధునిక ఆంగ్లభాషలో ‘పశువుల మంద’ తరగతి అంటారట తెలుసా? సామాన్యులంటే అంత చులకనా?

సుబ్బారావు:
విమానంలో సాధారణ ప్రయాణీకుల్నే పశువుల మంద అంటున్నారంటే ఇక రైళ్ళల్లో సాధారణ ప్రయాణీకుల్ని సూకరాల[పందుల] గుంపు అంటారేమో! అయినా రోజుకి లక్షా, అరలక్షా చెల్లిస్తూ, బహునక్షత్రాల హోటళ్ళలో బస చేయగల మంత్రుపుంగవులు వాళ్ళు! ఏమయినా అనగలరు.

సుబ్బలష్షిమి:
మనప్రధాని కూడా శశిధరూర్ అన్న వ్యాఖ్యని సమర్ధిస్తూ ’అదొక జోక్’ అన్నాడట బావా!

సుబ్బారావు:
ఈవీయం లు వచ్చాక ఓట్లతో కూడా అవసరం లేదయ్యె! ఇక సామాన్యుడితో పనేముంటుంది చెప్పు! అందునా దొడ్డిదారిన ప్రధాని అయిన వాడికి సామాన్యులు జోక్ లాగే కన్పిస్తారు మరదలా!

Friday, September 18, 2009

'ఎదుటివాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి'

[రాష్ట్ర డీజిపీలు, ఇతర పోలీసు ఉన్నతోద్యోగుల సమావేశాల ముగింపు సందర్భంలో, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, పాక్ నుండి అధికసంఖ్యలో చొరబాటుదారులు భారత్ లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని, హెచ్చరిక చేసిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
పాక్ నుండి చొరబాటుదారులు వాస్తవాధీన రేఖ, మొదలైన ప్రదేశాల ద్వారా భారత్ లోనికి ప్రవేశిస్తున్నారట. పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని భారత్ ప్రధాని హెచ్చరిస్తున్నాడు. ఇతరులకి ఇన్ని జాగ్రత్తలు చెబుతున్న ఈయన, ఆమధ్య ఈజిప్టు వెళ్ళి, హడావుడిగా, పాక్ ప్రధాని జిలానీతో, స్వంత ఏజండాతో మరీ చెట్టాపట్టాలెందుకు వేసుకుని వచ్చినట్లు బావా?

సుబ్బారావు:
ఇతరులకి ఇన్ని హెచ్చరికలు చెబుతున్న సదరు ప్రధాని గారి అధ్వర్యంలోని యూపిఏ ప్రభుత్వం, ఢిల్లీమీదుగా లాహోర్ నుండి ఢాకా దాకా రైలుబండిని నడపాలని పాక్ కి ప్రతిపాదనలు ఎందుకు పంపినట్లు? ఆ ప్రతిపాదనకి పాకిస్తాన్ పరమానందంగా అంగీకారం తెలిపిందని పాకిస్తాన్ ’డాన్’ పత్రిక అందట. నీకు తెలియదా?

సుబ్బలష్షిమి:
అందుకేనేమో బావా! ‘ఎదుటివాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అన్నాడు వెనకటికి ఓ సినీకవి.

Monday, September 14, 2009

పంచెకట్టుకున్నంత మాత్రానా ప్రజానాయకులైపోతారా?

[ముఖ్యమంత్రి రోశయ్య బూట్లు వేసుకువచ్చారన్న,ఈనాడు ’ఇదీ సంగతి’ వంటి కార్టూన్ల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ముఖ్యమంత్రి రోశయ్య, మరణించిన ముఖ్యమంత్రి వై.యస్.ఆర్. లాగానే షూ వేసుకుంటున్నాడట. అతడిలాగానే ఇతడూ పంచెకట్టుకునే ప్రజానాయకుడు కూడా కదా!

సుబ్బారావు:
బాగుంది మరదలా! చీర కట్టుకున్నంత మాత్రాన ఇటలీ గాంధీ ఇందిరాగాంధీ అయిపోతుందా?, పంచెకట్టుకుని బూట్లు వేసుకున్నంత మాత్రాన వై.యస్సార్లూ, రోశయ్యలూ పీవీజీలు అయిపోతారా?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! పులితోలు కప్పుకున్నంత మాత్రానా గాడిద పులై పోదని, గాలివీచి పులితోలు ఎగిరిపోగానే చావు దెబ్బలు తిన్నదనీ, చిన్నప్పుడు పంచతంత్రంలో చదివినట్లు గుర్తు!

Saturday, September 12, 2009

దేశాన్ని ఎవరు అమ్మగలరు? కే.కే. చెప్పాడు!

“123 మంది, 133 మంది వంటి సంఖ్యలతో అధిష్టాటాన్ని పోల్చుకోకూడదు. సోనియా నిర్ణయం కంటే 122 మంది శాసనసభ్యుల మద్దతు ఎక్కువా?” – కె.కేశవరావు .

“మెజారిటీ ఉందని ‘దేశాన్ని అమ్మేద్దాం’ అని తీర్మానం చేసి దేశాన్ని అమ్మేద్దామా?” అని పి.సి.సి. మాజీ అధ్యక్షుడు కె.కేశవరావు తీవ్రంగా వ్యాఖ్యానించారు – వార్త నేపధ్యంలో.

సుబ్బలష్షిమి:
ఈ కాకాలు, కే.కే.లు గట్రాల ప్రకటనలు చూస్తే జుగుప్స కలుగుతోంది బావా!

సుబ్బారావు:
జుగుప్స సంగతి పక్కన బెట్టు మరదలా! ఎం.ఎల్.ఏ.లూ, ఎం.పీ.లు ఎంతమంది అయినా సరే, మెజారిటీ ఉందని తీర్మానాలూ చేసి దేశాన్ని అమ్మలేరు. కానీ పార్టీ అధిష్టానం అయిన ఆ ’ఒక్కవ్యక్తి’ మాత్రం దేశాన్ని అమ్మేయ వచ్చని, అమ్మేయగలదని చెప్పకనే చెప్పాడు కదా కే.కేశవరావు?

సుబ్బలష్షిమి:
నిజమే బావా!

Friday, September 11, 2009

అన్నింటితో పాటు ముఖ్యమంత్రులకి కరువొచ్చింది!

[చనిపోయిన ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమించాలన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠాన దేవతకి తేలని సమస్య అయిపోయిందట. టీనా ఫ్యాక్టర్ [There is no alternative] తలెత్తింది. – వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమి విడ్డూరం బావా? ఇంతా చేసి ఇంటెనకాల చచ్చారన్నట్లు, నూటపాతికేళ్ళ కాంగ్రెస్ పార్టీకి, ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాలధర్మం చెందితే, ఆ స్థానానికి ఇంకెవరూ దొరకనంత కరువొచ్చిందా?

సుబ్బారావు:
అదే నాకూ అంతుచిక్కడం లేదు మరదలా! ఇప్పటికి, ఈ రాష్ట్రంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఎక్కిదిగలేదు? అదేం మాయాదారి కరువో! బియ్యం, పప్పులకే గాక, ముఖ్యమంత్రి అభ్యర్ధులకి కూడా కరువొచ్చిందేమో మరి!

Wednesday, September 2, 2009

హారతి గైకొనవో జస్వంత్ సింగ్ - పాకిస్తాన్

[పాకిస్తాన్ పత్రికలు జస్వంత్ సింగ్ ని ప్రశంసల వర్షంలో ముంచెత్తుతున్నాయని, పాక్ ప్రజలు అతడి పేరిట ‘ఖవ్వాలి’ వంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నారనీ వార్తల నేపధ్యంలో…..]

సుబ్బలష్షిమి:
బావా! మహమ్మద్ ఆలీ జిన్నాని పొగుడుతూ, నెహ్రూ,పటేల్ లని దేశవిభజనకి బాధ్యుల్ని చేస్తూ, జస్వంత్ సింగ్ పుస్తకం వ్రాసినందుకు పాక్ పత్రికలు అతణ్ణి పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నాయట. పాక్ ప్రజలు తమ జాతిపితని పొగిడిన జస్వంత్ సింగ్ ని పొగుడుతూ, పాటలు వ్రాసి పాడుతున్నారట. విన్నావా?

సుబ్బారావు:
అందులో వింతేముంది మరదలా! హిందువులలో, భారతీయులలో అనైక్యతనీ, ముస్లింలలో పాకిస్తానీయులలో ఐక్యతనీ మీడియా ఏనాడో సృష్టించింది, పెంచిపోషించింది. తమ జాతిపిత పట్ల, తమ మాతృదేశం పట్ల భక్తిని పాకిస్తానీలు కలిగి ఉంటే, భారతీయులు తమ దేశాన్ని తామే ’బ్లడీ ఇండియా’ అంటారనీ, గాంధీ, నెహ్రులని బూతులు తిడతారని, ఒకప్పుడు అంతర్జాతీయ మీడియా ‘డెమో’ చేసి మరీ చూపించింది. ఇప్పటికీ అలాంటి భారతీయుల్ని మన చుట్టూ ఎంతో మందిని చూస్తున్నది కూడా నిజమేకదా?

సుబ్బలష్షిమి:
నిజమేలే బావా! మొగుడు ముం…. అంటే ముష్టికొచ్చిన వాడు కూడా ముం…. అంటాడని ఊరికే అన్నారా పెద్దలు?