Friday, February 11, 2011

మఖలో పుట్టి పుబ్బలో మరణించాక కూడా గోల దేనికి?

[కాంగ్రెస్ లో ప్రరాపా విలీన ప్రక్రియకి 45 రోజులు పడుతుంది. ఆ తర్వాత భారీగా విలీన సభ నిర్వహిస్తామని, చిరంజీవి చేసిన ప్రకటన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మఖలో పుట్టి, పుబ్బలో మరణించిన ప్రజారాజ్యం పార్టీ… కాంగ్రెస్ లో విలీనమయ్యింది కదా! ‘ఇక నుండీ చిరంజీవి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడంటూ’ వీరప్ప మొయిలీ ప్రకటించేసాడు కూడా! కాంగ్రెస్ అధినేత్రితో భేటీ అయిన గంట వ్యవధిలో, పార్టీని గుంటలో పెట్టి గంట వాయించేసాడు గదా చిరంజీవి!?

మరి ఇప్పుడదేదో ‘సుదీర్ఘ ప్రక్రియ’ అన్నట్లు నానా రచ్చ చేస్తూ… విలీన ప్రక్రియకి 45 రోజులు, తర్వాత విలీన సభ భారీగా నిర్వహిస్తాం, గట్రా ప్రకటనలిస్తున్నాడేమిటి?

సుబ్బారావు:
పార్టీ చచ్చిపోయింది గదా మరదలా! ఏదో రచ్చ చేస్తూ వార్తల్లో ఉండకపోతే, తమ మనుగడ చచ్చిపోతుందని హైరానా పడుతున్నాడు.

లేకపోతే అదేమైనా అమెరికా వైట్ హౌస్ లో అధికార మార్పిడా, రెండు నెలలు పట్టడానికి?

సుబ్బలష్షిమి:
అదే గదా మరి! అదేదో మహానది, సాగర సంగమం అన్నట్లు? తెగ గోల చేస్తున్నారు.

సుబ్బారావు:
భలే చెప్పావు మరదలా! ప్రరాపాల్లాంటి పార్టీలు మహానదులు కాదు, మూసీనదులు. కాంగ్రెస్ అవినీతి కాలుష్య కాసారం మరి! వాటిని తక్కువ చేసి మాట్లాడకు!

Wednesday, February 9, 2011

వీటిని సొల్లు రాజకీయాలు అనవచ్చన్న మాట!

[గుంటూరు జిల్లా చిలకలూరి పేట బహిరంగ సభలో తెదేపా అధినేత చంద్రబాబు, కాంగ్రెస్, వై.ఎస్.జగన్, సోనియా, చిరంజీవి, ప్రధాన మంత్రి లపై విమర్శలు చేసిన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు… కాంగ్రెస్ నీ, అందులో విలీనమైన చిరంజీవినీ విమర్శిస్తూ… ‘ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు’ పెట్టారని విమర్శించాడు, బాగానే ఉంది.

అయితే అదే సందర్భంలో…

>>>రూ. 8 లక్షల పెట్టుబడి పెట్టి రూ.1200 కోట్లతో సాక్షి పత్రికను నడుపుతున్నారు. ఇండియా సిమెంట్ షేర్ రూ.100 ఉంటే, వీళ్ళ షేర్ మాత్రం రూ.1450 పలుకుతోంది. వీటిపై ప్రధాని ప్రేక్షక పాత్ర వహించటం దురదృష్టకరం.

అన్నాడు చూశావా?

జగన్ కంపెనీ షేర్ల ధరేం ఖర్మ, చంద్రబాబు కి గాడ్ ఫాదరూ, కింగ్ మేకరూ, మార్గదర్శీ అయిన రామోజీరావు షేరు కూడా… కంఫానీ నిధుల పుణ్యమాని, ఒక్కొటి 5 లక్షల పైచిలుకు పలికింది కదా! అప్పుడూ ప్రధాని ప్రేక్షక పాత్రే వహించాడు కదా! ఆ విషయం మాట్లాడడేం ఇతడు? ఇలాంటి అవినీతిపరులకు, అన్ని అవకాశాలు కల్పిస్తున్న రాజ్యాంగంలోని లొసుగుల గురించీ మాట్లాడడు.

సుబ్బారావు:
అబ్బా! ఎక్కడైనా బావా గానీ, వంగతోట దగ్గర మాత్రం కాదన్నాడట! అదే ఇతడి తీరు కూడా! రామోజీరావు కంపానీ కంపుల వంటివి మాట్లాడితే, తన లెక్కల తొక్కలూ బయటికి వస్తాయి మరి! అందుకే…ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చుకుంటూ, ఉనికి కాపాడుకుంటూ, బ్రతకాలని ప్రయత్నిస్తున్నాడు. అంతే!

సుబ్బలష్షిమి:
అయితే వీటిని సొల్లు రాజకీయాలు అనవచ్చన్న మాట! ఆ కోవకే చెందుతాయి, అవినీతి గురించి మాట్లాడుతున్న సోనియా సుపుత్రుడు రాహుల్ రాజకీయాలు కూడా!

Friday, February 4, 2011

మాటలకీ చేతలకీ పొంతన ఎంత? రోల్స్ రాయల్స్ కారంత!

[ప్రరాపా అధినేత చిరంజీవి ఇటీవల 5 కోట్ల రూపాయల విలువ చేసే రోల్స్ రాయిల్స్ కారు కొన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, ఇటీవల 5కోట్ల రూపాయల విలువ చేసే అత్యంత విలాసవంతమైన రోల్స్ రాయిల్స్ కారుని కొన్నాడు. సిరిసంపదల ప్రదర్శన పట్ల ఎంత మోజు ఈ ప్రజా నాయకుడికి? ఇంకా ఇతడు ప్రజల కష్టాలూ కన్నీళ్ళ గురించి ఉపన్యాసాలిస్తాడు. రిక్షాలోంచి సరుకులు, రెండు చేతుల్లో మోసుకొచ్చిన తనకి, కష్టాలెలా ఉంటాయో తెలుసని స్వయం కితాబులిచ్చుకుంటాడు.

సుబ్బారావు:
అతడు సినిమా నటుడిగా ఉన్నప్పుడు ఎంత సంపాదించుకున్నా, సంపాదించుకున్న దాంతో ఎన్ని విలాసాలు పోయినా, సౌఖ్యాలనుభవించినా… ఎవరూ పట్టించుకోరు మరదలా! అప్పుడది అతని వ్యక్తిగత వ్యవహారం అనుకునే వాళ్ళు. రాజకీయాల్లోకి వచ్చాక, అతడి మాటలకీ చేతలకీ… పొంతన పరిశీలిస్తారు కదా!

ఏం చేస్తాం? విలాస పురుషులు ప్రజానాయకులై పోయారు. ఈ విలాసాల పట్ల మోజులున్న వాళ్ళకి, అవి పోతాయంటే ఎంతటి రాజీ అయినా పడతారు మరదలా!

సుబ్బలష్షిమి:
అదే కదా, ఇప్పుడు చిరంజీవి నిరూపించుకుంటున్నది? ప్రజల సహన పరిమితి, గుడ్డి అభిమానపు పరిధీ…ఎంత మేరకు ఉన్నాయో వేచి చూడాల్సిందే బావా!?

Thursday, February 3, 2011

తాను పెట్టిన కళ్ళద్దాలలోంచే, ప్రజలు ప్రపంచాన్ని చూడాలన్నది మీడియా ఆకాంక్ష!

[ఇద్దరూ తమిళ తంబిలే! ఒకరు చోరుడు (రాజా), మరొకరు యోధుడు (సుబ్రమణ్య స్వామి) – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే పెద్దదైన 2జీ స్ప్రెక్ట్రం అవినీతి వ్యవహారానికి కారకుడైన రాజా చోరుడని (ఈనాడు) మీడియా ఉటంకించింది. అది పచ్చి నిజం! పోతే… దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి, తీవ్రంగా పోరాడిన సుబ్రమణ్య స్వామిని యోధుడని కితాబులిచ్చింది, చూసావా?

సుబ్బారావు:
అవును, మరదలా! ఒకప్పుడూ… ఈ సుబ్రమణ్య స్వామి, ఏదోక వ్యవహారాన్ని బయటకి తీసేవాడు. అయితే, అప్పట్లో మీడియా, ప్రత్యేకించి ఈనాడు, ఇతడికి `అంతర్జాతీయ విదూషకుడ’ని కితాబులిచ్చింది. ఇప్పుడు అవసరాలు మారాయో లేక పరిస్థితులు ముంచుకొచ్చాయో గానీ, యోధుడంటోంది.

సుబ్బలష్షిమి:
బహుశః పరిస్థితులే పీకల మీదికి వచ్చి ఉంటాయి బావా! లేకపోతే మీడియా… తాను గోల చేయదలుచుకున్న వ్యవహారాలనే బయటకి తెస్తుంది తప్ప,తమ వారికి తలనొప్పి తెచ్చే వ్యవహారాలని, తాను వెలికీ తీయదూ, వేరెవరైనా వెలికి తీసినా… వాళ్ళని విదూషకులనో, మానసిక రోగులనో ప్రచారిస్తుంది. ఎన్ని సార్లు ఇలాంటివి చూడలేదు?

సుబ్బారావు:
అంతే మరదలా! తాను పెట్టిన కళ్ళద్దాలలోంచే, ప్రజలు ప్రపంచాన్ని చూడాలన్నది మీడియా ఆకాంక్ష!

పోపయితే పసరు కక్కిస్తాడు. బాబా అయితే విభూతి, తాయెత్తులు ఇస్తాడు!

[నా మీద చేతబడి చేసారు – యడ్యూరప్ప వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప… పదవిలోకి వచ్చినప్పటి నుండీ తనకి కష్టాలే ఎదురౌతున్నాయనీ, తనని చంపేందుకు చేతబడి చేస్తున్నారని ఆరోపించాడు. దానికి విరుగుడుగా తాంత్రికుల సలహా మేరకు నగ్నంగా నిద్రలూ, నగ్నంగా సూర్యనమస్కారాలూ’ గట్రాలు చేస్తున్నారని పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి తెలుసా?

సుబ్బారావు:
ఇంకేం? నేరుగా అటు వాటికన్ కో, ఇటు పుట్టపర్తికో వెళ్తే సరి! పోపయితే పసరు కక్కిస్తాడు. బాబా అయితే విభూతి, తాయెత్తులు ఇస్తాడు,

సుబ్బలష్షిమి:
అది కాదు బావా! ఇవేవీ పత్రికల దృష్టిలో ‘మతి స్థిమితం తప్పటం’ గాదు, ‘స్ల్పిట్ పర్సనాలిటిలూ, స్క్రిజోఫినియాలూ, xyz డిజార్డర్ లూ, ABCD సిండ్రోములూ’ కావు. ఎవరైనా నిజాలు చెబితే మాత్రం… వాళ్ళని, మానసిక రోగులనేయటానికి సదా సిద్దంగా ఉంటారు.

సుబ్బారావు:
అంతే మరి! నిజాలు బయటికొస్తే తమకీ, తమ వాళ్ళకీ ఎంత ప్రమాదం!?

Wednesday, February 2, 2011

ఏ పుట్టలో ఏ పాముందో!

[ఈజిప్టులో హోస్నీ ముబారక్ కు వ్యతిరేకంగా ప్రజానిరసనల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈజిప్టులో 30 ఏళ్ళుగా అధికారం చెలాయిస్తున్న నియంత హోస్నీ ముబారక్ కి వ్యతిరేకంగా జనం తిరగబడ్డారు. నిన్న ‘అతడు సీటు దిగి పోవాలంటూ’ కైరో లోని లిబరేషన్ స్క్వేర్ వద్ద జరిగిన నిరసన సభ ఫోటో ఈనాడు లో వచ్చింది, చూడు,


ఈ ఫోటోలో నీకు వేలాది మంది ప్రజలు కనిపిస్తున్నారా బావా? ‘ఈనాడు’ యాజమాన్యానికి కనిపిస్తున్నారు. చంద్రబాబు, చిరంజీవి, కేసీఆర్ సభలకి వచ్చిన జనం వేలల్లో ఉంటే – ‘ఈనాడు’ లక్ష అంటుంది, లక్ష ఉంటే పది లక్షలంటుంది. తనకి నచ్చని నాయకుల సభలకి జనం వచ్చినా… పల్చగా ఉన్న వైపు నుండి ఫోటో తీసి ‘ఇదిగిదిగో సభ బోసి పోయింది’ అంటుంది.
‘సరే! ఈ స్థానిక పత్రిక తనకి నచ్చిన వాళ్ళ గురించి… నచ్చినట్లు, నచ్చని వాళ్ళ గురించి… నచ్చనట్లు ప్రచారిస్తుంది’ అనుకుని ఊరుకుంటున్నారు జనం. అవునా, కాదా చెప్పు!

సుబ్బారావు:
అవును, అయితే!

సుబ్బలష్షిమి:
మరీ…మన దేశంలో జాతీయ స్థాయి కూడా కాదు, ప్రాంతీయ స్థాయి పత్రిక ‘ఈనాడు’కి… ప్రపంచంలో ఎక్కడో ఈజిప్టులో జనం…ఎవరో ఓ నియంత హోస్నీ ముబారక్ మీద తిరగబడితే…అంత నొప్పేమిటి బావా! ‘లక్షల మంది’ని ‘వేలాది జనం’ అనేంత నొప్పి?

సుబ్బారావు:
అదే గమ్మత్తు మరదలా! ఈ మారుమూల పచ్చళ్ళ వ్యాపారీ, స్థానిక పత్రికాధిపతీ అయిన రామోజీరావుకి… ‘అంతర్జాతీయ సంఘటనలలో కొన్నిటికి గుఁయ్ మనేంత, కొన్నింటికీ హోరుమనేంత’ సంబంధాలుంటాయి. ఆ లింకేమిటో!?

సుబ్బలష్షిమి:
నిజంగా గమ్మత్తే బావా! అందుకే పెద్దలు ‘ఏ పుట్టలో ఏ పాముందో!’ అంటారు కాబోలు! బయటి కొచ్చినప్పుడు గానీ తెలియదు లోగుట్టేమిటో!?

దొంగే... ‘ఎదుటి వాళ్ళని దొంగా దొంగా పట్టుకోండి’ అని అరుస్తున్నట్లుంది!

[పాపపు సొమ్ము కోసం పరుగులొద్దు – దేశ ప్రజలకు సోనియా పిలుపు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! న్యూఢిల్లీలో నిన్న(ఫిబ్రవరి 01, 2011) చౌదరి రణభీర్ సింగ్ స్మారక తపాలా బిళ్ళను ఆవిష్కరిస్తూ, కాంగ్రెస్ అధిష్టానం సోనియా…

అధికారం, పాపపు సొమ్ముకోసం సాగుతున్న పరుగు పందెం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ పరుగు పందెం ఒక పరిధి దాటితే కేవలం దురాశగానే మిగిలి పోతుందని హెచ్చరించింది.

ప్రజలు ధనవంతులు అయ్యేందుకు, ఉన్నత పదవులు సంపాదించేందుకు గుడ్డిగా పరుగులెడుతున్నారు అని వ్యాఖ్యానించింది, తెలుసా!

సుబ్బారావు:
భేష్ మరదలా! ఓ ప్రక్క ప్రజలు ఉల్లిపాయలు కొనలేక కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నారు. పప్పూ బియ్యం కొనలేక చతికిల బడుతున్నారు. పిల్లల్ని చదివించుకోలేక బావురు మంటున్నారు.

ఈవిడ గారికేమో…ప్రజలు ధనవంతులు అయ్యేందుకు, ఉన్నత పదవులు సంపాదించేందుకు గుడ్డిగా పరుగు లెడుతున్నట్లు కనబడుతోంది.

సుబ్బలష్షిమి:
బహుశః తనూ, తన బృందం చేస్తున్న పనులని ప్రజలకి అనువర్తిస్తోంది కాబోలు బావా! దొంగే... ‘ఎదుటి వాళ్ళని దొంగా దొంగా పట్టుకోండి’ అని అరుస్తున్నట్లుంది కదూ!