Monday, November 29, 2010

కుటుంబంలో చిచ్చు పెట్టటం సోనియాకి ఉగ్గుపాలతో అబ్బిన విద్య!

[కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికీ, చట్ట సభల్లో తమ సీట్లకీ రాజీనామా సమర్పించిన వై.యస్. జగన్, అతని తల్లి విజయలక్ష్మి ఈ సందర్భంలో కాంగ్రెస్ అధిష్టానం సోనియాకి బహిరంగ లేఖ విడుదల చేసిన జగన్ –వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కొత్త ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోకి జగన్ బాబాయి వై.యస్. వివేకానంద రెడ్డి ప్రవేశించనున్నాడనే వార్తల నేపధ్యంలో… జగన్, అతడి తల్లీ, పార్టీకీ, తమ పదవులకీ రాజీనామా చేశారు. ఆ సందర్భంలో జగన్… సోనియాకి ఐదు పేజీల బహిరంగ లేఖ విడుదల చేసాడు.

అందులో… ‘పదవుల ఆశ చూపించి తమ కుటుంబంలో చిచ్చుపెట్ట తగునా?’ అని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నాడు, చూశావా?

సుబ్బారావు:
పాపం జగన్! అసలా సోనియా స్వంత కుటుంబంలోనే చిచ్చు పెట్టిందని మరిచిపోయినట్లున్నాడు. కోడలి నంటూ ఇటలీ నుండి ఇందిరాగాంధీ ఇంటిలోకి దిగబడ్డాక, వరసగా మరిది, అత్త, భర్త అందరకీ చిచ్చు పెట్టేసింది. ఆ విధంగా అడ్డంకులన్నీ తొలగి పోయాక, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏకైక దిక్కుగా అవతరించి, చక్రం తిప్పుతోంది మరి!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! కుటుంబంలో చిచ్చు పెట్టటం సోనియాకి ఉగ్గుపాలతో అబ్బిన విద్య!

అయితే ఇంటర్ నెట్టే ఈ అబద్దాల రాయుళ్ళ ఇంటికి నిప్పు పెట్టిందన్న మాట!

[వికీలీక్స్ రహస్యాలను నమ్మొద్దు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వికీలీక్స్ వెబ్ సైట్… ఇప్పటికే, ఇరాక్ పై అమెరికా యుధ్దానికి సంబంధించి అనేక రహస్య పత్రాలని బయటపెట్టింది. అది అమెరికా ప్రభుత్వానికి చాలా తలనొప్పి కలిగించిందట. దరిమిలా ఇప్పుడు వికీలీక్స్, మరో వారంలో అమెరికాకు ప్రపంచ దేశాలతో గల సంబంధాల గురించి కీలక పత్రాలను ప్రదర్శిస్తానని ప్రకటించిందట.

కాబట్టి అప్రమత్తంగా వ్యవహారించాలని, వాటిని నమ్మవద్దని భారత్ కు అమెరికా ప్రభుత్వం సూచిస్తోంది, చూశావా?

సుబ్బారావు:
మరి, ఇలాంటి ‘లీకు’లు, ‘ఎక్స్ పోజ్’ లు ఉంటాయని తెలియక గతంలో మీడియాను చూసుకొని చాలా ఎగిరెగిరి పడ్డారు మరదలా! ఇప్పుడా రహస్యాలన్నీ బయటి కొస్తున్నాయి కాబట్టి, నమ్మొద్దంటున్నారు.

ఇప్పటి వరకూ తమకి అనుకూలంగా ప్రపంచ ప్రధాన మీడియా అబద్దాలు ప్రచారిస్తే ఏం లేదు గానీ, ఇప్పుడు ఇంటర్ నెట్ మీడియా నిజాలు ప్రచారిస్తే మాత్రం నమ్మొద్దని మొత్తుకుంటున్నారు.

‘అవి అబద్ధాలు వాటిని నమ్మొద్దని’ ఓ మాట, ‘ముప్పు కాబట్టి బయటపెట్టొద్దని’ మరో మాట! పైగా ఈ రోజు ఆ రహస్య పత్రాలు బయట పెడితే చాలామంది ప్రాణాలకి ముప్పు ఏర్పడుతుందనీ, అందులో అమాయకులూ ఉన్నారనీ, అంచేత బయట పెట్టొద్దని, వికీలీక్స్ ని అమెరికా కోరుతోంది. అదీ గమ్మత్తు!

సుబ్బలష్షిమి:
అయితే ఇంటర్ నెట్టే ఈ అబద్దాల రాయుళ్ళ ఇంటికి నిప్పు పెట్టిందన్న మాట!

మొత్తానికి, పుట్టలోంచి పాముల్లా… నిజాలు బయటి కొస్తున్నాయి!

[ఎస్. జైపాల్ రెడ్డి Vs. వై.యస్. జగన్ ల విమర్శల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎస్. జైపాల్ రెడ్డి, వై.యస్. జగన్ క్రమశిక్షణ మీరు తున్నాడన్నాడట. ఆ నేపధ్యంలో చెలరేగిన విమర్శలలో… ఎస్. జైపాల్ రెడ్డి గురించి ఆసక్తికరమైన అంశాలు మరోసారి ప్రచారంలో కొచ్చాయి.

గతంలో చాలా పార్టీలు మారిన జైపాల్ రెడ్డి, కాంగ్రెసేతర ప్రభుత్వాల హయాంలో కేంద్రమంత్రిగా కూడా పనిచేసాడు. కాంగ్రెస్ కు ప్రతిపక్షంగా ఉన్నరోజుల్లో, బోఫోర్సు వ్యవహారమై ‘రాజీవ్ గాంధీ జేబులు కొట్టే దొంగ కన్నా హీనంగా ఉన్నాడనీ, అతణ్ణి ఉరి తీయాలనీ’ అన్నాడట.

అలాంటి విమర్శలు చేసిన వాణ్ణి, ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ గా మీడియా కితాబులందుకున్న వాణ్ణి, పక్కా కాంగ్రెస్ వ్యతిరేకిని… కాంగ్రెస్ అధ్యక్షురాలు 1998లో పగ్గాలు చేపట్టిన వెంటనే చేరదీసి, 1999 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టిచ్చింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే, మంత్రి పదవులూ ఇచ్చింది. ఆమెకి జైపాల్ రెడ్డి పై ఎందుకింత అభిమానమో?

సుబ్బారావు:
రాజీవ్ గాంధీని ఉరితీసి చంపాలన్నాడు కదా మరదలా, అందుకై ఉంటుంది! అతణ్ణొక్కణ్ణేనా? 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైనప్పుడు ఘటనా స్థలంలోనే ఉన్న, హంతక ముఠాకి సహకరించిందన్న ఆరోపణలున్న జయంతీ నటరాజన్ ని కూడా దరిజేర్చుకుంది కదా!

అసలు కరుణానిధి అయితే, ఎల్.టి.టి.ఇ.కి గొప్ప మద్దతుదారు. ఎల్.టి.టి.ఇ. స్వయంగా రాజీవ్ గాంధీ హత్యకు బాధ్యత ప్రకటించుకుంది. అలాంటి వాడితో పొత్తు పెట్టుకుని మరీ, తన ‘పతి భక్తి’ నిరూపించుకుంది కదా ఈ ఇటలీ మహిళ!?

సుబ్బలష్షిమి:
ఇదంతా వ్యూహాత్మకంగా ఇప్పుడు గుర్తుకొచ్చినట్లుంది బావా… మొన్న ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్ కీ, నిన్న వి.హెచ్.పి. నేత ఆశోక్ సింఘాల్ కి! అందుకే… సుదర్శన్ ‘సోనియా సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తున్నారు. ఇందిరా రాజీవ్ ల హత్యలలో ఆమె కుట్ర ఉంది’ అనంటే, అశోక్ సింఘాల్ ‘సోనియా రాజీవ్ భార్యగా భారత్ రాలేదు. ప్రత్యేక ఉద్దేశంతోనే వచ్చింది. హిందూ మత నాశనం కోసమే పనిచేస్తుంది’ అంటున్నాడు.

సుబ్బారావు:
పాపం! ఆలస్యంగా సత్యం గ్రహింపు కొచ్చిందో, నోరు తెరిచే అవకాశం ఇప్పుడొచ్చిందో మరదలా!

సుబ్బలష్షిమి:
మొత్తానికీ, పుట్టలోంచి పాముల్లా… నిజాలు బయటికొస్తున్నాయి బావా!

Sunday, November 28, 2010

అందుకా ఈ నంగనాచి తుంగబుర్ర కబుర్లన్నీ!?

[సోనియా, రాహుల్ పార్లమెంట్ భత్యం తీసుకోరు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఏ కారణాల వల్లనైనా పార్లమెంటు పనిచెయ్యని రోజుల్లో తమ భత్యాలు తీసుకోరాదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రాహుల్ నిర్ణయించుకున్నారట. మరో 80 మంది ఎంపీలు కూడా అదే బాట అనుసరిస్తారట. అది ‘తప్పుదోవ పట్టించే జిమ్మిక్కు’ అంటోంది భాజపా! ఎందుకలా?

సుబ్బారావు:
2జి స్పెక్ట్రమ్ అవకతవకల గురించి జేపీసీ కి, భాజపాతో పాటు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి మరదలా! ఆ గొడవకి పార్లమెంట్ స్తంభిస్తోంది. ప్రజల్లో పలచనైన తమ ఇమేజ్ పెంచుకోవటానికీ ఈ ప్రయత్నమంతా కాంగ్రెస్ అధిష్టానం చేస్తున్నది! దండుకున్న అవినీతి సొమ్ముతో పోల్చుకుంటే పోయే భత్యం ఎంతని!

సుబ్బలష్షిమి:
పోనీ ప్రతిపక్షాలు అడిగినట్లు జేపీసీ వేస్తే పోయే కదా బావా?

సుబ్బారావు:
భలే దానివే మరదలా! జేపీసీ వేస్తే ప్రధానిని కూడా విచారించ వచ్చు. అంతేగాక ఈ మొత్తం విషయాన్ని మూసుకోవటానికి ప్రతిపక్షాలకు కూడా వాటాలివ్వవలసి వస్తుంది.

సుబ్బలష్షిమి:
అందుకా ఈ నంగనాచి తుంగబుర్ర కబుర్లన్నీ!?

Saturday, November 27, 2010

అవినీతిపై ద్వంద్వ వైఖరి వీడండి – దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదే కాబోలు!

[అవినీతిపై ద్వంద్వ వైఖరి వీడండి – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్ అధినేత్రి సోనియా, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ…
“అవినీతి విషయంపై ప్రతిపక్ష భాజపా ద్వంద్వ వైఖరి అవలంభిస్తోంది.
అవినీతి విషయంలో తీవ్రమైన ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ ఎన్నడూ జాప్యం చేయలేదు.
ప్రధాని చిత్తశుద్ధిని ప్రశ్నించలేం.” అన్నది తెలుసా?

సుబ్బారావు:
ఇంత కంటే గురివింద గింజ నైజం మరొకటుండదు మరదలా! వై.యస్. బ్రతికి ఉన్న రోజుల్లో… అతడు రాష్ట్రాన్ని దోచి సూట్ కేసులు కొద్దీ రోజు వారీ వసూళ్ళు ఢిల్లీకి పంపాడంటూ, ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. పుస్తకాలు కూడా ప్రచురించాయి. అదేం పట్టించు కోకుండా అతణ్ణి ‘మార్గదర్శి, దార్శినికుడు’ అంది. అతడి అవినీతి గురించి అతడి మరణానంతరం వార్తలు బయటికొస్తున్నాయి.

ఇక కామన్వెల్త్ వ్యవహారంలో కంపు కంపు అయినా, కల్మాడీ గురించి కిమ్మన లేదు. రెండేళ్ళుగా సాగిన 2జి స్పెక్ట్రమ్ ఆరోపణలకి నిన్నమొన్నగానీ రాజాని పదవి దించలేదు. ఇప్పటికీ ఆ రగడతో పార్లమెంటు పనిచేసిన రోజు లేదు.
ఇంకా ‘ఈమె’… అవినీతిని కాంగ్రెస్ సహించదనీ, చర్యలు తీసుకోవడంలో జాప్యం చెయ్యదనీ అంటోందంటే … ద్వంద్వ వైఖరికి పెద్దమ్మన్న మాటే!

సుబ్బలష్షిమి:
దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదే కాబోలు బావా!

Friday, November 26, 2010

ప్రాజెక్టులు మింగేవాడికి కొండచిలువ ఒక లెక్కా?

[మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిలోకి కొండచిలువ పిల్ల ప్రవేశించిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారీ నీటిపారుదల శాఖా మంత్రి, పొన్నాల లక్ష్మయ్య ఇంటిలోకి కొండచిలువ పిల్ల వచ్చిందట తెలుసా?

సుబ్బారావు:
పాపం! అదేదో… తాను మేకల్నైనా మింగేసే జాతికి చెందిన దాన్ననుకుని తెగ తిప్పుకుంటూ వెళ్ళిందేమో! దానికి తెలియదు పొన్నాల లాంటి మంత్రులు తననీ మింగేయగలరని!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ప్రాజెక్టుల్లో కోట్లు మింగిన వాడికి, తొక్కలో కొండచిలువ పిల్లొక లెక్కా! ఏనుగులు తినేవాడికి పీనుగులు పిండా కూడు అన్నట్లుంటుంది!

Wednesday, November 24, 2010

సీవీసీ గా థామస్ లాంటి వాళ్ళని ఎంచుకునేది ఇలాంటి ప్రయోజనాల కోసమే!

[సీ.వి.సీ.గా అవినీతి పరుణ్ణి ఎలా ఎంపిక చేశారంటూ… సుప్రీంకోర్టు వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సీవీసీగా నియమించబడిన థామస్ మీద స్వయంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయట. అలాంటి వాణ్ణి ఎందుకు ఎంచుకున్నట్లు?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! ఎన్నికల కమీషన్ కి నవీన్ చావ్లా మాదిరిగా… సీవీసీలకీ, సీబిఐలకీ అనుయాయులనే వేసుకుంటే, చెప్పినట్లు చేస్తారు మరి! కాబట్టే కదా, 2జీ స్పెక్ట్రమ్ అవినీతి 1.76 లక్షల కోట్లని కాగ్ ఇచ్చిన నివేదికని కాదని, 22వేల కోట్లుగా చెప్పిన సీవీసీ నివేదికనే అంగీకరించింది సీబిఐ!? అలాంటి ప్రయోజనాల కోసమే అవినీతిపరులైన అధికారులని కీలక స్థానాల్లోకి తెచ్చుకుంటుంది యూపీఏ ప్రభుత్వం! మరి కుర్చీలో ఉంది ఎవరనుకున్నావ్?

సుబ్బలష్షిమి:
ఇంతకీ పార్లమెంట్ సమావేశాలు జరక్కుండా జేపీసీ నియామకం గురించి అటు ప్రభుత్వమూ, ఇటు ప్రతిపక్షాలూ తెగేదాకా తాడు లాక్కుంటున్నట్లుగా రచ్చ చేస్తున్నాయెందుకు బావా?

సుబ్బారావు:
అసలుకే హరాయించుకున్నది రమారమి 1.76 లక్షల కోట్లని అంచనాలొస్తున్నాయయ్యె! ఇక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేస్తే… అందులో అన్ని పార్టీల నాయకుల్నీ నియమించాలి. ఆనక వాటాలు పంచాలి. అందుకే తెగేదాకా లాక్కునే రచ్చ!

సుబ్బలష్షిమి:
అదా విషయం!? అయితే ఇవన్నీ పంపకాల పేచీలన్న మాట! ఇలాంటి చోట…అవినీతిలో కరిగిన సొమ్ముని తిరిగి రాబట్టే యోచన ఎన్నేళ్ళకి రావాలో!?

అతడు అమాయకుడను కుంటే మనం అమాయకులమే!

[2జి స్పెక్ట్రమ్ నేపధ్యంలో 1.76 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అంచనాలు బయటికొస్తుంటే, ‘అందులో ప్రధానమంత్రికి ఏ పాపం తెలియదని’ కొందరూ, ‘మీడియా ప్రధాని పేరు అనవసరంగా లాగిందని’ సుప్రీంకోర్టూ వెనకేసుకొస్తున్న నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఓ ప్రక్క 2జి స్పెక్ట్రమ్ వ్యవహారంలో లక్షా డెబ్భై ఆరు వేల కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలొస్తుంటే ప్రధానమంత్రికి ఏ పాపం తెలియదట, తెలుసా? మరీ అంత అమాయకత్వమా?

సుబ్బారావు:
తన క్రింద వాళ్లు లక్షల కోట్ల రూపాయలు మింగుతూ ఉంటే… నిష్ర్కియగా కూర్చున్నాడంటే, వాటాలు పుచ్చుకున్న అవినీతి పరుడన్నా అయి ఉండాలి. లేదా ఏమీ చెయ్యలేని అసమర్ధుడన్నా అయి ఉండాలి మరదలా! ఇవి రెండూ గాకుండా అతడు అమాయకుడను కుంటే… అలాంటి అమాయకుల్ని ఎవరూ కాపాడలేరు!

Tuesday, November 23, 2010

రాడియాని లాగితే బయటి కొచ్చేది మీడియానే మరి!

[మంత్రిత్వ శాఖల కేటాయింపు దగ్గరి నుండీ 2జి స్పెక్ట్రమ్ దాకా అన్నీ లాబీయింగే! చక్రం తిప్పిన జర్నలిస్టులు – కేంద్ర బిందువు నీరా రాడియా – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! టేపులు బయటపడి కంపు కంపైన 2జి స్పెక్ట్రమ్ విషయంలో, నీరా రాడియా నెట్ వర్క్ గురించి… జాతీయ మీడియా నామమాత్రపు కవరేజి తో ఎందుకు సరిపెట్టినట్లు? ఈనాడు కూడా అందుకు అతీతం కాదు! ఈ వ్యూహాత్మక మౌనం ఎందుకై ఉండాలి?

సుబ్బారావు:
ఏముంది మరదలా? ప్రధాన కుట్రదారులు వేసుకున్నదే మీడియా ముసుగైనప్పుడు, నీరా రాడియాని లాగితే బయటికొచ్చేది మీడియా మూలాలే మరి! ఇప్పటికే… రెండేళ్ళ క్రితం ముంబై ముట్టడి గట్రా సంఘటనలతో వెలిగిపోయిన బర్ఖాదత్ లూ, సంఘ్వీలు బయటికొస్తున్నారు కదా! అందుకే జాతీయ పత్రికలు గమ్మున కూర్చున్నాయి. ఇక్కడ తెలియటం లేదా, అన్నిటిని ఆడిస్తున్నది ఒకే వ్యవస్థ అన్నది!?

సుబ్బలష్షిమి:
నిజం బావా! ఇంకా తెలుగు మీడియానే మరికాస్త చైతన్యాన్ని చూపించిందట. అన్నిటి కంటే ఇంటర్ నెట్ మీడియానే సరిగ్గా స్పందించిందంటూ వార్తా పత్రికలే వ్రాసుకున్నాయి!

భలే కలరింగ్ ఇచ్చుకుంటున్నాడే రామోజీరావు, సోనియాకి!

[ఆగ్రహం…అయినా నిగ్రహం. జగన్ పై ఇదీ అధిష్టానం వైఖరి, రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదని నిర్ణయం – `ఈనాడు' వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వై.యస్. జగన్ కు చెందిన సాక్షి టీవీలో సోనియాకి… స్విస్ బ్యాంకుల్లో వ్యక్తిగత ఖాతాలున్నాయనీ, ఆమె ప్రజలని ఆకట్టుకునేలా ప్రసంగించేంత వక్త కాదనీ, ఆమెకి ఇతరత్రా నైపుణ్యాలేవీ లేవనీ, ఆమె ‘రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కాదు అయినా గానీ ప్రభుత్వాన్నీ రాజకీయాలనీ శాసిస్తోందని’ కథనాలు ప్రసారం చేయబడ్డాయట. దాని మీదట సాక్షి సంస్థల ముంగిట సోనియా అనుయయూలు ధర్నాలు చేస్తే, జగన్ అభిమానులు ప్రతిధర్నాలు చేస్తున్నారు.

ఈ నేపధ్యంలో…జగన్ పట్ల అధిష్టానం [అంటే సోనియా] ఆగ్రహం వచ్చినా నిగ్రహించుకుంటోందట, రెచ్చగొట్టినా రెచ్చిపోకూడదని నిర్ణయించుకుందట, ఎందుకంటావూ?

సుబ్బారావు:
రెచ్చిపోతే పుచ్చిపోతుందని అధిష్టానానికీ తెలుసు మరి! కాబట్టి, సహనం తెచ్చుకోక… పీక మీదికి తెచ్చుకుంటుందా? సంవత్సరం నుండి నిగ్రహంతోనే ఉన్నది మరి! ఈ విషయమై దాదాపు సంవత్సరం క్రితమే ‘అమ్మఒడి’ వివరించింది కూడా!

[226. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 01 [ద్విముఖ వ్యూహం][Oct. 10, 2009]
http://ammaodi.blogspot.com/2009/10/blog-post_10.html ]

సుబ్బలష్షిమి:
మొత్తానికీ, భలే కలరింగ్ ఇచ్చుకుంటున్నాడన్న మాట రామోజీరావు తన అనుంగు అనుయాయురాలు సోనియాకి!
~~~~~

Monday, November 22, 2010

సోనియా తెల్లకాకి అట! నిజమే!?

[జగన్ పై కొందరి కుట్ర – అంబటి ఆరోపణ . ఇందిరను రాకాసి అన్నప్పుడేం చేశారని ప్రశ్న - నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జగన్ పై కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ… అంబటి రాంబాబు ‘ఇందిరను రాకాసి అన్నప్పుడేం చేసారని’ ప్రశ్నిస్తున్నాడు. ఇంకా…

>>>సాక్షి, (11/27/10) : పేజీ నెం.౦6.
>>>‘సాక్షి’కథనంపై రాద్ధాంతం చేస్తున్న వీ.హెచ్. ఒన్, టూ, త్రీ, ఫోర్ వంటి నాయకులు గతంలో నిత్యం కాంగ్రెస్ పై నిప్పులు కక్కే ఓ ప్రముఖ పత్రికలో ఇందిర, రాజీవ్ లకు వ్యతిరేకంగా వార్తలు వచ్చినప్పుడు ఏం చేశారని అంబటి సూటిగా ప్రశ్నించారు. ‘ఇందిర రాకాసి’… ‘సోనియా తెల్లకాకి’… ‘బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ జేబులు కొట్టే వారికన్నా హీనంగా వ్యవహరించారు’ వంటి రాతలు రాసినప్పుడు, వీరు ఎక్కడ చేతులు ముడుచుకుని కూర్చున్నారని నిలదీశారు.

వైయస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఇదే పత్రిక యాజమాన్యం ఆర్ధిక అక్రమాలకు పాల్పడినందుకు క్రిమినల్ కేసులు పెడితే పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగిందంటూ వీహెచ్ స్వయంగా ఘోషించిన విషయం మరిచారా? హనుమంతరావు ఏమిటో, ఆయన వ్యవహారం ఏమిటో ప్రజలకు బాగా తెలుసని అంబటి ఎద్దేవా చేశారు. అంతెందుకు…అదే పత్రిక(ఈనాడు) ఆదివారం సంచికలో ‘(అ)ధర్మోరక్షితి, రక్షితః’ శీర్షికన కథనం ప్రచురిస్తే, వీహెచ్ వంటి వారు ఎందుకు నిరసనలు వ్యక్తం చేయలేదని ఆయన ఆ ప్రతిని చూపిస్తూ నిలదీశారు.
~~~~~

ఎంతగా ఒళ్ళుమండినా మరీ ఎక్కడ చేతులు ముడుచుకు కూర్చున్నారనేంత బండ భాషేమిటి బావా?

సుబ్బారావు:
ఆగ్రహం హద్దులు దాటినప్పుడు అసలు ప్రవర్తనలు బయటికి వస్తాయిలే మరదలా!
ఇంతకీ… ఈనాడు రామోజీరావు ‘సోనియాని తెల్లకాకి’ అని కూడా గతంలో వ్రాసాడన్న మాట! ఈ తెల్లకాకి భాష గురించి అమ్మఒడిలో ఈ ఏడాది ఏప్రిల్ లో

[343. తెల్లకాకులని ఎప్పుడైనా చూసారా? [ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? – 40] [April 03, 2010]
http://ammaodi.blogspot.com/2010/04/40.html ]
వ్రాసినప్పుడు… ఓ వ్యాఖ్యాత ‘హార్మోన్ల అసమతుల్యత వల్ల, కాకులు తెల్లగా ఉండొచ్చని’ ఉద్ఘాటించాడు.
మరి ఈ ఇటలీ సోనియాకి… ఏ హార్మోన్లు అసమతుల్యంగా ఉన్నాయని ఈనాడు ఉవాచించిందో!

సుబ్బలష్షిమి:
ఆ రోజుటి అవసరం కొద్దీ, ఈనాడు అలాంటి కాకి భాష మాట్లాడి ఉంటుంది బావా! అది ‘రామోజీరావు మార్క్ జర్నలిజం’ మరి!

ఉండవల్లి నిరూపించాడు, పొంగులేటి నిరూపిస్తాడు!

[సోనియా సీఐఏ ఏజంటని సుదర్శన్ వ్యాఖ్యకు నిరసనగా ముఖ్యమంత్రి రోశయ్య ధర్నా,
సుదర్శన్ మీద కేసు వేస్తానని పొంగులేటి సుధాకర్ హెచ్చరిక – వార్త నేపధ్యంలో! ]

సుబ్బలష్షిమి:
బావా! ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్… సోనియాని సీఐఏ ఏజంటనీ, ఇందిరా, రాజీవ్ ల హత్యలో ఆమె కుట్ర ఉందనీ వ్యాఖ్యానించినందుకు నిరసనగా, ముఖ్యమంత్రి రోశయ్య రోడ్డెక్కి ధర్నా చేశాడట, తెలుసా? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు తమవే అయిన చోట, సుదర్శన్ వ్యాఖ్యలు అసత్యాలే అయితే… కోర్టు కేసు వెయ్యడమో, పార్లమెంటు లో చర్చించి చర్యలు తీసుకోవటమో, ఇంకా మరేదైనా చర్యలు తీసుకోవటమో చెయ్యాలి గానీ… ధర్నాల డ్రామాలు వెయ్యడమేమిటి బావా!?

సుబ్బారావు:
భలే చెప్పావు మరదలా!? కోర్టు కేసులో , పార్లమెంటులో చర్చలో, మరో చర్యలో తీసుకుంటే… సుదర్శన్ వ్యాఖ్యలకి ఋజువులు బయటపడ్డాయనుకో! అప్పుడెంత ప్రమాదం? అంచేత… పరోక్షంగా సుదర్శన్ వంటి వాళ్ళ నోళ్ళని మూసేసే చర్యలూ, (అంటే అందితే జుట్టూ, అందకుంటే కాళ్ళుపట్టుకోవడమన్న మాట) ప్రత్యక్షంగా విషయాన్ని ప్రక్కదారి పట్టించి సాధారణం చేసే ధర్నాల వంటి డ్రామాలూ చేస్తుంటారు, అంతే! అయినా కాంగ్రెస్ కార్యదర్శి పొంగులేటి సుధాకర్, సుదర్శన్ మీద కోర్టులో కేసు వేస్తానన్నాడులే! చూద్దాం!

సుబ్బలష్షిమి:
ఆఁ ! 2006 లో ఉండవల్లి అరుణ్ కుమార్… వారంలోగా ‘రామోజీరావుని దేశద్రోహిగా నిరూపిస్తా’నన్నాడు. ఇప్పటికీ వారం పూర్తి కాలేదు పాపం! ఇక ఈ పొంగులేటి సుధాకర్ ఎన్నేళ్ళు తీసుకుంటాడో సుదర్శన్ మీద కేసు వెయ్యటానికి!?

Sunday, November 21, 2010

పత్తి విత్తనంలా మాట్లాడటం అంటే ఇదేమరి!

[ఓ మంత్రి నన్ను 15కోట్లు లంచం అడిగాడు – బాంబు పేల్చిన రతన్ టాటా – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రతన్ టాటాని ఓ మంత్రి 15 కోట్ల రూపాయలు లంచం ఆడిగాడట. అలాంటి పనులు అతడి కిష్టం లేక, పౌరవిమాన యాన రంగంలోకి టాటా గ్రూపు ప్రవేశించ లేదట. ఇంతగా అవినీతి ఒక భాగం అయి పోయిన ఈ సమాజంలో, ఇతడెంతో నికార్సుగా వ్యాపారం చేస్తున్నాడు కాబోలు బావా! అలాగైతే ప్రపంచ ప్రభావశీల వ్యక్తుల్లో సోనియా, మన్మోహన్ ల కంటే ఇతడే ప్రముఖ స్థానంలో ఉండాలి మరి!

సుబ్బారావు:
రతన్ టాటా మరీ పత్తి విత్తనంలా మాట్లాడుతున్నాడు మరదలా! దాదాపు 2 శతాబ్దాల క్రితమే, బ్రిటీషు వాళ్ళ హయాంలోనే, ఇతడి వంశీయులు ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. అసలుకే… అవినీతికీ, లంచగొండి తనానికీ పుట్టిల్లు వంటిది బ్రిటన్! ఆ విషయం బాపూజీ ఆత్మకథలో, బారిష్టరు చదువుల ప్రకరణాన్ని చదివినా, తేటతెల్లమవుతుంది.
అలాంటి చోట… అసలు లంచాలే ఇవ్వకుండా ఈ రతన్ టాటా విస్తార వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతున్నానంటే, జనాల చెవిలో రఫ్లేషియా పెట్టడమే! మరోవైపు రతన్ టాటా, నీరా రాడియా ల సంభాషణలతో సహా, టాటా ఎవరికి ‘ఎంతెంత’ బహుమతులు ఆఫర్ చేసారో మీడియాలో వార్తలు చిలువలు పలువులుగా వస్తున్నాయి. బహుశః ఇతడు ‘లంచాలివ్వడు, బహుమతులిస్తాడు’ కాబోలు.

సుబ్బలష్షిమి:
ఇంతకీ పత్తి విత్తనంలా మాట్లాడటం అంటే ఏమిటి, బావా?

సుబ్బారావు:
పత్తి విత్తనం నల్లగా ఉన్నప్పటికీ, తన చుట్టూ విచ్చుకొని ఉన్న పత్తిని చూపిస్తూ “చూడు నేనెంత తెల్లగా ఉన్నానో” అంటుందిట. అదీ సంగతి!

Saturday, November 20, 2010

అన్నీ తినేసి ఆఖరి పప్ప చూపించి అత్తా ఇదేమిటంటే?

[అవినీతి వల్ల ప్రమాదంలో విలువలు – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జరిగిన సదస్సులో ఇటలీ మహిళ సోనియా, మన దేశంలో అవినీతి వల్ల విలువలు ప్రమాదంలో పడ్డాయని విచారం వ్యక్తం చేసిందట. అవునవునంటూ మన్మోహన్ సింగ్ యితోధికంగా విచారించాడట తెలుసా!

సుబ్బారావు:
అక్కడికి ఆ అవినీతిలో తమ వాటా ఏమిలేనట్లూ, అసలు తమ ప్రమేయమే లేనట్లు… ఏం నీతులు చెబుతున్నారు మరదలా వీళ్ళు?

సుబ్బలష్షిమి:
‘అన్నీతినేసి ఆఖరి పప్పు చూపించి అత్తా ఇదేమిటందట’ వెనకటికి ఓ నంగనాచి కోడలు! వీళ్ళ వ్యవహారమూ అలాగే ఉంది.

సుబ్బారావు:
అదేం కథ మరదలా!

సుబ్బలష్షిమి:
వెనకటికి… ఓ కోడలు అత్తగారింటికి కొత్తగా కాపురానికొచ్చిందట. వంటింట్లో అత్తగారు ఓ చిన్న జాడీనిండా జీడిపప్పులు పెట్టుకుందట. ఈ కోడలు అత్తగారు చూడకుండా… అటుపోతూ ఓ పప్పు, ఇటు పోతూ ఓ పప్పు తినేసిందట. రెండ్రోజుల తర్వాత అత్తగారు ఖాళీ జాడీ చూసుకుని ‘జీడి పప్పు లేమయ్యాయబ్బా! కోడలు గానీ తినేసిందా! కొత్త పిల్ల! ఎలా అడగటం!’ అని మొహమాట పడుతూ, అదే సమయంలో అనుమాన పడుతూ అటు ఇటూ తచ్చట్లాడిందట. అదంతా గమనించిన కోడలు పిల్ల, మర్నాడు ఇల్లూడుస్తుండగా కసువులో పడి ఉన్న ఓ జీడిపప్పు తెచ్చి అత్తకి చూపిస్తూ “అత్తా! ఇదేం పప్పు?” అనడిగిందట, అమాయకంగా ముఖం పెట్టి!
అది చూసి అత్తగారు “అయ్యో! అమాయకప్పిల్ల! అనవసరంగా ఈమె ననుమానించాను” అనుకుందట. కోడలు తన తెలివికి తానే మురిసి ముక్కచెక్కలయ్యిందట. ఇదీ కథ!

సుబ్బారావు:
అంటే ఈ సోనియా కూడా తన తెలివికి తానే లోలోపల మురిసి ముక్కచెక్కలవుతుందంటావా?

Friday, November 19, 2010

వాళ్ళూ వీళ్ళూ... అందరూ ప్రభావశీలురే మరి!

[ప్రపంచ ప్రభావశీలుర జాబితాలో మన్మోహన్ సింగ్, సోనియా, ఒసామా బిన్ లాడెన్... గట్రాల పేర్లు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఫోర్డ్స్ పత్రిక విడుదల చేసిన ప్రపంచ ప్రభావ శీల వ్యక్తులలో మన్మోహన్ సింగ్, సోనియాల వంటి వాళ్ళ పేర్లతో బాటు ఒసామా బిన్ లాడెన్ ల వంటి వాళ్ళ పేర్లూ ఉన్నాయట, తెలుసా?

సుబ్బారావు:
వాళ్ళకీ వీళ్ళకీ తేడా ఏముందిలే మరదలా! మన్మోహన్, సోనియాల వంటి వాళ్ళు ‘ప్రజల కోసం’ అనే వంక పెట్టుకుని ప్రజాస్వామ్యబద్దంగా, అనధికారికంగా ప్రజలని ఆర్ధికంగా, మానసికంగా చావగొడుతుంటే, బిన్ లాడెన్‌ల వంటి వాళ్ళు ‘మతం కోసం’ అనే వంక పెట్టుకుని తీవ్రవాద సహితంగా, ఆయుధాలు పట్టి మరీ ప్రజలని భౌతికంగా చావగొడుతున్నారు.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! వాళ్ళూ వీళ్ళూ... అందరూ ప్రభావశీలురే మరి!

Tuesday, November 16, 2010

కంతలున్న వారి చింతలు ఇతరులకేం తెలుస్తోంది?

[సోనియాని విమర్శించి సుదర్శన్ తన స్థాయిని తగ్గించుకున్నాడంటూ గోవిందాచార్య వ్యాఖ్యానించాడన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సోనియా సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తోందనీ, ఇందిరా, రాజీవ్ ల హత్యల్లో ఆమె కుట్ర ఉందనీ వ్యాఖ్యానించి, సుదర్శన్ తన స్థాయిని తగ్గించుకున్నాడట! అలాగని గోవిందాచార్య అంటున్నాడు. ఎందుకోమరి!?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూ, మరో వైపు తనను తాను సన్యాసినిగా ప్రకటించుకున్న ఉమాభారతి, గతంలో తాను గోవిందాచార్యను వివాహమాడాలనుకున్నానంటూ కొన్ని లోగుట్లు బయటపెట్టింది. అలాంటి లోగుట్లు ఇతడికెన్ని ఉన్నాయో! సోనియాని సమర్ధించకపోతే... ఆమె, ఆమె వెనకనున్న ఏజన్సీ... ‘తన కన్నాలెన్ని బయట పెడతారో?’ నన్న ముందు జాగ్రత్త పడుతుండవచ్చు!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! కంతలున్న వారి చింతలు ఇతరులకేం తెలుస్తాయి? సోనియాని విమర్శిస్తే స్థాయి తగ్గినట్లే నన్నమాట. విమర్శించకపోతే వీళ్ళ గుట్టుమట్లు ప్రజలకి ఎలా తెలుస్తాయి మరి?

Monday, November 15, 2010

బహుశః ఆ సుదర్శన్ ‘అమ్మఒడి’ చదివి ఉంటాడేమో!?

[ఆర్.ఎస్.ఎస్. మాజీ ఛీఫ్ సుదర్శన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాపై చేసిన విమర్శల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఆర్.ఎస్.ఎస్. మాజీ అధినేత, కాంగ్రెస్ ప్రస్తుత అధినేత్రి సోనియాని, ఆమె సీఐఏ ఏజంటులా వ్యవహరిస్తోందనీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హత్యల్లో ఆమె కుట్ర ఉందనీ వ్యాఖ్యానించాడు, చూశావా!?

సుబ్బారావు:
ఆ విషయం ‘అమ్మఒడి’ దాదాపు రెండేళ్ళ క్రితమే చెప్పింది కదా మరదలా! బహుశః ఆ సుదర్శన్ ‘అమ్మఒడి’ చదివి ఉంటాడేమో!? నిగ్రహం నిలుపుకోలేక అనేసి ఉంటాడు. లేదా ఆత్మహత్యా సదృశ్య ఎసైన్‌మెంట్ రీత్యా మాట్లాడి ఉంటాడు, మరదలా!?

సుబ్బలష్షిమి:
అది నిజమే అయినా, కాంగ్రెసోళ్ళు తెగ గింజుకుంటున్నారు, బావా!

[ 35. ఈ అమ్మకింత బలం – ఇంత శక్తి ఎలా వచ్చాయబ్బా? – 1 [Jan.06, 2009]
http://ammaodi.blogspot.com/2009/01/1.html

36. ఈ అమ్మకింత బలం – ఇంత శక్తి ఎలా వచ్చాయబ్బా ? – 2 [Jan.07, 2009]
http://ammaodi.blogspot.com/2009/01/2_07.html ]

Wednesday, November 10, 2010

పెయిడ్ న్యూస్ లాగా బ్లాగ్లోకంలో అజ్ఞాతల పెయిడ్ కామెంట్స్!

[తెలంగాణా, కేసీఆర్ ల మీద... ఏ టపా వచ్చినా, వ్యాఖ్యలు వ్రాసే అజ్ఞాతల హడావుడి నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తెలంగాణా, కేసీఆర్... అనే మాటలు కనబడితే చాలు, ఆయా టపాలలో ఏం వ్రాసారోనన్న దానితో నిమిత్తం లేకుండా, కొందరు అజ్ఞాతలు అసంబద్దపు వ్యాఖ్యలు వ్రాస్తుంటారు. కొందరైతే అసహ్యకరంగా తిడుతూ కూడా వ్రాస్తుంటారు. ఎందుకలాగ?

సుబ్బారావు:
దాన్నే ‘ఛీదర పెట్టటం’ అంటారు మరదలా! ‘తెలంగాణా, కేసీఆర్’ లకి వ్యతిరేకంగా ఎవరూ వ్రాయకూడదన్నది వాళ్ళ టార్గెట్! బహుశః అలాంటి అజ్ఞాతలకి అదే ప్రత్యేక విధి కావచ్చు. అందునా అజ్ఞాత అనగానే వళ్ళు విరుచుకునే విశృంఖలత్వం ఉంటుంది. ఎవరిని ఏమైనా అనవచ్చు అన్నది వాళ్ళ ధీమా మరి! ఎటూ తెరాస సిద్ధాంత కర్తలూ, రాద్ధాంత కర్తలూ... తమని వ్యతిరేకిస్తున్నవాళ్ళ మీద అమలు చేస్తోంది ఈ ‘ఛీదర పెట్టే’ స్ట్రాటజీనే కదా!

సుబ్బలష్షిమి:
ఓహో! అంటే - పత్రికల్లో, టీవీల్లో... ‘పెయిడ్ న్యూస్’ లాగా, బ్లాగ్లోకంలో... ఇలాంటి అజ్ఞాతలు వ్రాసేవి ‘పెయిడ్ కామెంట్స్’ అన్నమాట!

Tuesday, November 9, 2010

సరదాగా ఒబామా స్వగతం!

[బలం పోయే... హజం పోయే! అమెరికా అధిపత్యం సడలిందని అంగీకరించిన ఒబామా వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీ వచ్చినప్పుడు చేసిన వ్యాఖ్యానాలకి, సరదాగా కొన్ని స్వగతాలు చెప్పనా?అంటే... ఒబామా పైకి అన్నమాటల నేపధ్యంలో లోపల ఏమనుకొని ఉంటాడో... అని!

సుబ్బారావు:
మరెందుకు ఆలస్యం!? కానీయ్!

సుబ్బలష్షిమి:
ఒబామా పైకి:
అమెరికా అధిపత్యం సడలిందని అంగీకరిస్తున్నాను.

స్వగతం:
[అంగీకరించక ఛస్తానా? అవతల మా దేశంలో కొంపలు కూలుతుంటే!? ఎన్నికల్లో ఓడిపోతుంటిని మరి! ఉద్యోగాలు ఊడిపోతున్నాయయ్యె!]

పైకి:
ఆసియాతోనే కోలుకుంటామని ఆశాభావం.

స్వగతం:
[అప్పట్లో అలాంటి ఆశలు భారత్ అమెరికా మీద పెట్టుకుంటే, నెత్తిన మరో బండ వేయ చూసామే గానీ, చిగురంత సాయం కూడా చేయలేదు. ఇప్పుడు కానికాలం వచ్చి, భారత్ కొచ్చి, ఇవన్నీ మాట్లాడుతున్నాను.]

పైకి:
భారత్ రక్షణాత్మక వైఖరిని అమెరికన్లు అంగీకరించరని స్పష్టీకరణ.

స్వగతం:
[అప్పట్లో ఇలాంటి సవాలక్ష ‘రక్షణాత్మక వైఖరి’ కారణాలే చెప్పాం. అప్పుడు భారతీయులు అంగీకరించారేమిటి?]

పైకి:
ఎన్నికల్లో ఓటమి నేపధ్యంలో విధానాల్లో మార్పులుంటాయి.

స్వగతం:
[ఉండబట్టే గదా, భారత్ వచ్చి మరీ... ‘నమస్తే ఇండియా’ అంటూ అడుగుతున్నాను. డాన్సులు చేసి సంబంధాలు గట్టి పర్చుకుంటున్నాను.]

పైకి:
భారత్ ఎదుగుతున్న శక్తి కాదు, ఇప్పటికే ఎదిగిన శక్తి.

స్వగతం:
[నిజం ఒప్పుకోకపోతే నా వీపూ, దేశపు వీపూ విమానం మోత మోగుతుందని ఒప్పుకుంటున్నాను గానీ, గతంలోలాగే మా ఆటగే గనక సాగుతుంటేనా...?]

పైకి:
భారత్-అమెరికా ప్రజల అభివృద్ధికి ఈ రెండు దేశాల భాగస్వామ్యం అనంత అవకాశాలను కల్పిస్తుంది.

స్వగతం:
[వసుదేవుడంతటి వాడే గాడిదల కాళ్ళు పట్టుకున్నాడని భారతీయుల సామెతట! కొంచెం సేపు నేను వసుదేవుడనుకుంటా!]

పైకి:
భారతీయ మార్కెట్లలో అమెరికన్లకు మరిన్ని అవకాశాలు ఉండాలని కోరుకుంటున్నాం. మా దగ్గర మేలైన వస్తువులున్నాయి. మీదగ్గరా ఉన్నాయి. వ్యాపారం ఉభయతారకంగా ఉంటుంది. వాణిజ్యం అనేది ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలి. ఏకపక్షంగా ఉంటే అది చెడ్డ ఒప్పందమని అమెరికన్లు భావిస్తారు.

స్వగతం:
[ఒకప్పుడు ఇవే అభ్యర్ధనలు భారత్ మమ్మల్ని చేస్తే సహకరించకపోగా, వీలయినన్ని రాళ్ళు విస్తారంగా విసిరాం. దేవుడా! దేవుడా! ఇప్పుడవన్నీ భారతీయులకి గుర్తు రాకుండా చూడు తండ్రి!]

పైకి:
పెరుగుతున్న నిరుద్యోగంతో ఆమెరికన్లు నిస్పృహకు గురయ్యారు. ఆర్ధిక మందగమనంపై నిరాశ చెందుతున్నారు.

స్వగతం:
[ఒకప్పుడు అదే నిరాశకి భారతీయులు గురయ్యారు. మాకేమైనా పట్టిందా? ఎద్దుపుండు కాకికి రుచి అన్నట్లు గడిపాం. దాంతో ఎగిరిన ఎద్దులా ఇప్పుడు గంత మోయాల్సి వచ్చింది. దీన్నే అంటారేమో చేసిన కర్మ అనుభవించటం అని!]

పైకి:
హింసను సమర్ధించుకోడానికి కొందరు ఇస్లాంకు వక్రభాష్యం చెబుతున్నారు. వారిని ఒంటరివారిని చేయడమే మనముందున్న పెద్దసవాలు. తీవ్రవాదాన్ని తుడిచిపెట్టటంలో పాకిస్తాన్ చురుగ్గా వ్యవహరించడం లేదు.

స్వగతం:
[అవసరమై ఇప్పిడిలా మాట్లాడుతున్నాను గానీ, చేతల్లో ఇప్పటికీ మాకు పాకిస్తానే ప్రియమైనది. అందుకే కదా దానికి యుద్దవిమానాలు ఇస్తున్నాం, డాలర్ల వరద ప్రవహింప చేస్తున్నాం? భారత్ నేతలు మన్మోహన్, సోనియాలు మనకి మస్తు అనుకూలమే గానీ... నిన్న ముంబైలో చూడలా, విద్యార్ధులే గూబగుఁయ్యి మనేలా... ‘పాకిస్తాన్ ని తీవ్రవాద దేశంగా ఎందుకు ప్రకటించలేదు?’ అని నిలదీసారు. భారతీయ భావితరాన్ని మభ్యపెట్టటానికి తలప్రాణం తోకకి వస్తోంది.]

ఇంకా చాలా ఉన్నాయి గానీ, ఇప్పటికింతే బావా! ఎలా ఉంది?

సుబ్బారావు:
ఎలా ఉందో, బ్లాగు మిత్రుల్నే అడుగుదాం మరదలా!

Monday, November 8, 2010

కేసీఆర్ ‘బంగారు గుడ్లు పెట్టే బాతుని కోసుకు తినే వెర్రివాడు’ కాదు మరి!

[ఫిబ్రవరిలో బిల్లు పెట్టాల్సిందే - కేసీఆర్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! డిసెంబరు 31తర్వాత ‘ఇక చూస్కోండి, జజ్జనక జనారే’ అంటూ గావుకేకలు వేసిన కేసీఆర్... ఇప్పుడేమిటీ ‘ఫిబ్రవరిలో పార్లమెంటులో తెలంగాణా బిల్లు’ పెట్టాలంటున్నాడు?

సుబ్బారావు:
మరి!? అతడి రాజకీయ కెరీరే తెలంగాణా ఉద్యమం! అలాంటప్పుడు దాన్ని సహజంగా సాగదీస్తాడు కానీ, అంతు తేల్చుకుంటాడేమిటీ, జనాల అమాయకత్వం కానీ!

సుబ్బలష్షిమి:
నిజమేలే బావా! కేసీఆర్ ‘బంగారు గుడ్లు పెట్టే బాతుని కోసుకు తినే’ వెర్రివాడు కాదు గదా!?

‘వడ్డించేవాళ్ళు మన వాళ్ళయితే ఎక్కడైనా, ఎంతైనా మెక్కొచ్చు!’

[వీహెచ్ మనవడు ఆకుల విక్రం అధినేతృత్వంలోని ఎస్‌కేఎస్ మైక్రోఋణ సంస్థ, పబ్లిక్ ఇష్యూకు వెళ్ళిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎస్‌కేఎస్ మైక్రో ఋణసంస్థ, పబ్లిక్ ఇష్యూకు వెళ్ళి, షేర్లు మార్కెట్ లోకి జారీ చేసిందట తెలుసా? బ్యాంకుల నుండి ఋణాలు తీసుకొని, వాటినే ప్రజలకి సూక్ష్మఋణాలుగా ఇచ్చాయట కొన్ని మైక్రోసంస్థలు. కొన్ని, ప్రజల నుండి నిధులు సమీకరించటానికి షేర్ల వ్యాపారంలోకి అడుగుపెట్టాయి. ఎంత వింత బావా!?

సుబ్బారావు:
అంతే మరి మరదలా! బ్యాంకుల్లో ఉండేది ప్రజల సొమ్మే! దాన్ని తక్కువ వడ్డీకి తీసుకున్న మైక్రో సంస్థలు, ఆ సొమ్మునే అత్యంత అధిక వడ్డీకి మళ్ళీ ప్రజలకే సూక్ష్మ ఋణాలిచ్చి, నరాలు పిండి మరీ వసూలు చేసుకుంటున్నాయి. ఆపైన మళ్ళీ షేర్ మార్కెట్ లోకి అడుగుపెట్టి ఇంకా ప్రజల నుండి నిధులు సేకరించే పనిలో పడ్డారు. అదే మరి, ప్రభుత్వ అండా దండా ఉంటే... దోపిడి ఉండే తీరు!

సుబ్బలష్షిమి:
‘వడ్డించేవాళ్ళు మన వాళ్ళయితే ఎక్కడైనా, ఎంతైనా మెక్కొచ్చు’ అంటే ఇదేనన్న మాట.

Sunday, November 7, 2010

‘ఎగిరిన ఎద్దు గంత మోస్తుందంటే’ ఇదేనన్నమాట!

[ఒబామా సతీ సమేతంగా భారత్ పర్యటన - ముంబైలో బస చేసిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అమెరికా అధ్యక్షుడు, సతీమణి మిషెల్ సమేతంగా, భారత్ పర్యటనకు వచ్చాడు కదా! ముంబై విశ్వవిద్యాలయంలో మిషెల్, పిల్లలతో తొక్కుడు బిళ్ళా, చెమ్మా చెక్కా ఆడింది ‘రంగ్ దే బసంతి’ అంటూ నాట్యమూ చేసింది, చూశావా?

సుబ్బారావు:
అలా చేస్తున్నప్పుడు... శ్వేత సౌధానికి ‘అదెప్పుడో అన్నట్లో, విన్నట్లో’ గుర్తొచ్చి ఉండాలి, మరదలా! ఇందిరాగాంధీ... ‘భారతీయ గిరిజన మహిళలతో కలిసి నాట్యం చేసేదనీ, అది రాజకీయాధికారం నిలబెట్టుకునేందుకు, పట్టు కోసం , కేరీర్ కోసం... ఆమె చేసిన నాట్యం’ అని... అప్పట్లో ఆమెరికన్ పత్రికలూ, శ్వేత సౌధమూ, తెగ ఎగసెక్కాలు చేసాయి మరదలా!

మరి ఇప్పుడు భారత్ తో సత్సంబంధాలతో 50 వేల ఉద్యోగాలొస్తాయనో, మరొకందుకనో... అమెరికా అధ్యక్షుడు ఒబామా "నమస్తే! సాల్ ముబారక్! దీవాలీ!" గట్రా హిందీమాటలతో ఫీట్లు, మిషెల్ స్టెప్పులూ వేస్తున్నప్పుడు... అవి గతంలో ‘అన్నవో, విన్నవో’ అని శ్వేత సౌధానికి గుర్తొస్తుంది కదా మరి!?

సుబ్బలష్షిమి:
ఓహో! అయితే బావా ‘ఎగిరిన ఎద్దు గంత మోస్తుందంటే’ ఇదేనన్నమాట!

Thursday, November 4, 2010

వందిచ్చాక ఒకటికి వంకలెందుకన్నట్లు!

[మాదక ద్రవ్యాల కంటే మద్యమే హానికరమని తేల్చిన శాస్త్ర పరిశోధనలు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ‘హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల కంటే, మద్యమే హానికరమని’ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మరీ తేల్చారట! మరయితే, ప్రభుత్వం మద్య దుకాణాలు ఎత్తేస్తుందా, లేక హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాల దుకాణాలు కూడా తెరుస్తుందా?

సుబ్బారావు:
ఇంకేం మరదలా! ఎటూ శాస్త్రజ్ఞులు ‘మద్యం కంటే హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాలే తక్కువ ప్రమాదం’ అంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం కావాలి కాబట్టి, ‘మాదకద్రవ్యాల కంటే ప్రమాదకరమైన మద్యాన్నే అధికారికంగా అమ్మగా లేనిది, మాదక ద్రవ్యాలనెందుకు వదిలిపెట్టటం?’ అని... దానికో పోర్ట్ పోలియోని, మంత్రిని, పాలనా విభాగాన్ని నిర్వహించవచ్చు! గొలుసు మద్య దుకాణాల్లా, గొలుసు హెరాయిన్ దుకాణాలు, కొకైన్ దుకాణాలూ... వేలం పాటలు నిర్వహించి మరీ మంజూరు చేయవచ్చు.

అప్పుడు రాష్ట ఖజానాకి, మంత్రుల ఖతాలకీ మరిన్ని నిధులొస్తాయి. ఇక కొత్తమంత్రిత్వశాఖకి, మంత్రిపదవికి ఆశావహులు క్యూకట్టవచ్చు.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! వందిచ్చాక ఒకటికి వంకలెందుకన్నట్లు, మద్యం పంచాక మాదకద్రవ్యాలకి అడ్డేమిటి?

Wednesday, November 3, 2010

చరిత్రదేముంది? చించేస్తే చిరిగి పోతుంది!

[ఆదర్శ... వ్యవహారంలో ప్లాట్లు పొందిన రాజకీయులూ, వారి బంధువులూ తమ ఆదాయాన్ని పదీపాతిక వేలని చూపించారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఓసారి దిగువ వార్త చదువు.

>>>ఆదర్శ్‌లో ఫ్లాట్లు పొందిన పేద నేతలు!
న్యూఢిల్లీ, నవంబరు 1: ముంబైలోని అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో కొలాబా ఒకటి. అందులోనే వెలిసింది వివాదాస్పద 'ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ' నిర్మించిన 31 అంతస్థుల భవంతి. ఒక్కోఫ్లాటు విలువ పదికోట్లకు పైనే! కానీ... ఈ ఫ్లాట్లు సొంతం చేసుకున్న నాయకులు మాత్రం మధ్య తరగతి జీవులు! వీరు తమ నెలవారీ ఆదాయం రూ.20వేలు లేదా అంతకంటే తక్కువే అని కాగితాల్లో చూపించారు.

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు తన నెలసరి ఆదాయం రూ.20వేలుగా చూపించి ఒక ఫ్లాటు పొందాడు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ కన్హయ్యలాల్ గిద్వానీ కుటుంబ సభ్యులకు ఆదర్శ్ బిల్డింగ్‌లో మూడు ఫ్లాట్లు లభించాయి. గిద్వానీ తన నెలసరి ఆదాయం రూ.30వేలుగా చూపించారు. ఆయన ఇద్దరు కుమారులు తమ ఆదాయం రూ.12,500 అని ఒకరు, రూ.11,500 అని ఒకరు పేర్కొన్నారు.


ఇక్కడ ఫ్లాట్లు పొందిన ఎన్సీపీ ఎమ్మెల్సీ జితేంద్ర అవద్ తమ ఆదాయం రూ.25వేలుగా చూపించారు. అదే పార్టీకి చెందిన ఎంపీ శ్రీనివాస్ పాటిల్ తాను నెలకు రూ.12,500 మాత్రమే సంపాదిస్తున్నట్లు చెప్పారు. ఇది ఎంపీగా ఆయన పొందే ఫోన్ అలవెన్స్‌కంటే తక్కువే కావడం గమనార్హం.
~~~~
చూశావా బావా! ఎంత ధీమాగా... కాగితాల మీద సైతం, తమ ఆదాయాలు తగ్గించి చూపారో! కనీసం తమ టెలిఫోన్ అలవెన్సుగా ప్రభుత్వం చెల్లించేంత సొమ్ముకూడా, తమకు ఆదాయం లేదన్నంత పచ్చి అబద్దాల లెక్కలు!?

సుబ్బారావు:
కాగితాల దేముంది మరదలా! చించిస్తే చిరిగి పోతాయి. సాక్షాత్తూ చరిత్రే... చింపేస్తే చిరిగిపోతుందంటాడు బ్రహ్మానందం ‘ఆదుర్స్’సినిమాలో! నిజానికి చరిత్ర అలాగే వక్రీకరించబడింది. బహుశః ఈ రాజకీయులూ, వారి బంధుగీయులూ కూడా అలాగే అనుకుని ఉంటారు!

Tuesday, November 2, 2010

స్వగతంలో అనుకోవాల్సిన మాట, పైకనేసాడన్న మాట!

[రాష్ట్రం ఆరేళ్ళలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది - చంద్రబాబు వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఆరేళ్ళలో ముప్పై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని అంటున్నాడు, చూశావా!

సుబ్బారావు:
రాష్ట్రం ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళిందో గానీ, చంద్రబాబు పరిస్థితి మాత్రం అంతే అయినట్లుంది, మరదలా!

సుబ్బలష్షిమి:
అంటే స్వగతంలో అనుకోవాల్సిన మాట, పైకనేసాడన్న మాట.

Monday, November 1, 2010

ఆవు చేలో, దూడగట్టున...? - అవినీతి రికార్డ్ పెరగదా మరి!?

[అవినీతి విషయంలో మనదేశం త్వరిగతిని అభివృద్ధి చెందుతుందన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తాజాగా అంతర్జాతీయ అవినీతి సూచిక (కరప్షన్ ఫర్ సెష్షన్ ఇండెక్స్ - సీపీ ఇండెక్స్)నివేదిక విడుదల చేసిందట. దాని ప్రకారం అవినీతిలో మనదేశం శరవేగంతో ముందుకు పోతోందట. 2004లో 106 దేశాల్లో భారత్‌ది 55వ స్థానం, 2006లో 163 దేశాల్లో 70వ స్థానం కాగా, గతేడాది... 175 దేశాలలో 84వ స్థానానికి వచ్చిందట. ఏడాదిలో మరో మూడు పాయింట్లు దిగజారి, 87 స్థానానికి చేరిందని ఆ నివేదిక చెబుతోంది, తెలుసా?

సుబ్బారావు:
మరి!? ప్రభుత్వ కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఎవరనుకున్నావ్? సోనియానా, మజాకానా? ‘కామన్వెల్త్ అవినీతి మొర్రో’మని అంత గగ్గోలైనా కల్మాడీ దగ్గర నుండి ఎవరికీ ఏ ఢోకా రాలేదు చూశావా!? ‘కమిటీ వేసింది కదా?’ అంటావా... అప్పటికి ఎవరు పాపాల భైరవుడవుతారో ఎవరికి తెలుసు? ముంబై ముట్టడి నాడు అసమర్దుడని గోలపెడితే నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్‌ముఖ్‌ని సిఎం సీటు దింపి, తరువాత కేంద్ర మంత్రిపదవి ఇచ్చింది. నాటి కేంద్రగృహ మంత్రి శివరాజ్ పాటిల్ ని అప్పటికి పదవి దింపి ఆనక గవర్నర్ గిరి కట్టబెట్టింది. ఇప్పుడు కార్గిల్ అమరవీరులకు కేటాయించిన ప్లాట్లు విషయంలో చవాన్ ను దింపేయాల్సి వస్తే మరో బెర్తు కేటాయిస్తుంది! అదీ ఇటలీ మహిళ పాలన!! ఇక పెరగదా అవినీతి రికార్డ్!?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఆవు చేలో మేస్తుంటే దూడగట్టున మేస్తుందా అంటారు పెద్దలు! పైవాళ్ళని బట్టే క్రింది వాళ్ళు!