Wednesday, November 24, 2010

సీవీసీ గా థామస్ లాంటి వాళ్ళని ఎంచుకునేది ఇలాంటి ప్రయోజనాల కోసమే!

[సీ.వి.సీ.గా అవినీతి పరుణ్ణి ఎలా ఎంపిక చేశారంటూ… సుప్రీంకోర్టు వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సీవీసీగా నియమించబడిన థామస్ మీద స్వయంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయట. అలాంటి వాణ్ణి ఎందుకు ఎంచుకున్నట్లు?

సుబ్బారావు:
ఎందుకేమిటి మరదలా! ఎన్నికల కమీషన్ కి నవీన్ చావ్లా మాదిరిగా… సీవీసీలకీ, సీబిఐలకీ అనుయాయులనే వేసుకుంటే, చెప్పినట్లు చేస్తారు మరి! కాబట్టే కదా, 2జీ స్పెక్ట్రమ్ అవినీతి 1.76 లక్షల కోట్లని కాగ్ ఇచ్చిన నివేదికని కాదని, 22వేల కోట్లుగా చెప్పిన సీవీసీ నివేదికనే అంగీకరించింది సీబిఐ!? అలాంటి ప్రయోజనాల కోసమే అవినీతిపరులైన అధికారులని కీలక స్థానాల్లోకి తెచ్చుకుంటుంది యూపీఏ ప్రభుత్వం! మరి కుర్చీలో ఉంది ఎవరనుకున్నావ్?

సుబ్బలష్షిమి:
ఇంతకీ పార్లమెంట్ సమావేశాలు జరక్కుండా జేపీసీ నియామకం గురించి అటు ప్రభుత్వమూ, ఇటు ప్రతిపక్షాలూ తెగేదాకా తాడు లాక్కుంటున్నట్లుగా రచ్చ చేస్తున్నాయెందుకు బావా?

సుబ్బారావు:
అసలుకే హరాయించుకున్నది రమారమి 1.76 లక్షల కోట్లని అంచనాలొస్తున్నాయయ్యె! ఇక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేస్తే… అందులో అన్ని పార్టీల నాయకుల్నీ నియమించాలి. ఆనక వాటాలు పంచాలి. అందుకే తెగేదాకా లాక్కునే రచ్చ!

సుబ్బలష్షిమి:
అదా విషయం!? అయితే ఇవన్నీ పంపకాల పేచీలన్న మాట! ఇలాంటి చోట…అవినీతిలో కరిగిన సొమ్ముని తిరిగి రాబట్టే యోచన ఎన్నేళ్ళకి రావాలో!?

No comments:

Post a Comment