Saturday, November 20, 2010

అన్నీ తినేసి ఆఖరి పప్ప చూపించి అత్తా ఇదేమిటంటే?

[అవినీతి వల్ల ప్రమాదంలో విలువలు – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జరిగిన సదస్సులో ఇటలీ మహిళ సోనియా, మన దేశంలో అవినీతి వల్ల విలువలు ప్రమాదంలో పడ్డాయని విచారం వ్యక్తం చేసిందట. అవునవునంటూ మన్మోహన్ సింగ్ యితోధికంగా విచారించాడట తెలుసా!

సుబ్బారావు:
అక్కడికి ఆ అవినీతిలో తమ వాటా ఏమిలేనట్లూ, అసలు తమ ప్రమేయమే లేనట్లు… ఏం నీతులు చెబుతున్నారు మరదలా వీళ్ళు?

సుబ్బలష్షిమి:
‘అన్నీతినేసి ఆఖరి పప్పు చూపించి అత్తా ఇదేమిటందట’ వెనకటికి ఓ నంగనాచి కోడలు! వీళ్ళ వ్యవహారమూ అలాగే ఉంది.

సుబ్బారావు:
అదేం కథ మరదలా!

సుబ్బలష్షిమి:
వెనకటికి… ఓ కోడలు అత్తగారింటికి కొత్తగా కాపురానికొచ్చిందట. వంటింట్లో అత్తగారు ఓ చిన్న జాడీనిండా జీడిపప్పులు పెట్టుకుందట. ఈ కోడలు అత్తగారు చూడకుండా… అటుపోతూ ఓ పప్పు, ఇటు పోతూ ఓ పప్పు తినేసిందట. రెండ్రోజుల తర్వాత అత్తగారు ఖాళీ జాడీ చూసుకుని ‘జీడి పప్పు లేమయ్యాయబ్బా! కోడలు గానీ తినేసిందా! కొత్త పిల్ల! ఎలా అడగటం!’ అని మొహమాట పడుతూ, అదే సమయంలో అనుమాన పడుతూ అటు ఇటూ తచ్చట్లాడిందట. అదంతా గమనించిన కోడలు పిల్ల, మర్నాడు ఇల్లూడుస్తుండగా కసువులో పడి ఉన్న ఓ జీడిపప్పు తెచ్చి అత్తకి చూపిస్తూ “అత్తా! ఇదేం పప్పు?” అనడిగిందట, అమాయకంగా ముఖం పెట్టి!
అది చూసి అత్తగారు “అయ్యో! అమాయకప్పిల్ల! అనవసరంగా ఈమె ననుమానించాను” అనుకుందట. కోడలు తన తెలివికి తానే మురిసి ముక్కచెక్కలయ్యిందట. ఇదీ కథ!

సుబ్బారావు:
అంటే ఈ సోనియా కూడా తన తెలివికి తానే లోలోపల మురిసి ముక్కచెక్కలవుతుందంటావా?

3 comments:

  1. :)
    మీరు అవుట్లుక్ కథనం మీద పోస్ట్ రాస్తే బావుంటుంది.

    ReplyDelete
  2. అబ్బాయి రాహుల్‍గూడా బీహార్‍లో అవినీతివల్ల ప్రజలకందాల్సినవి అందలేదని తెగ బాధపడిపోయాడు.

    ReplyDelete
  3. రాజేష్ గారు, చిలమకూరు విజయ మోహన్ గారు: నెనర్లండి!

    ReplyDelete