Monday, November 23, 2009

రామోజీ ‘నాన్ స్టాప్’ జడ టపాకాయలు

[రామోజీరావు, సుమన్ బాబుకు శుభాకాంక్షలు చెబుతూ……
>>>మా అబ్బాయి సుమన్ నిర్మించిన ’నాన్ స్టాప్’ చిత్రం పాటల్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. సుమన్ బహుముఖ కళారూపాల్లో ప్రజ్ఞను అనేక విధాలుగా చూపాడు. ఇప్పుడు సినిమాల్లో తన శక్తి, సత్తా చూపించడానికి సిద్దమయ్యాడు. ’నాన్ స్టాప్’గా ప్రజల ఆదరణ పొందాలి.

>>>నాలాంటి వారికి నవ్వే అవకాశాలు చాలా తక్కువ. ఈ చిత్రం అందరినీ మనసారా నవ్విస్తుందని ఆశిస్తున్నాను. – అన్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఈ సినిమా వార్త చదివావా బావా! ఈనాడు రామోజీరావు తన కుమారుడు సుమన్ బహుకళా ప్రపూర్ణుడంటున్నాడు!

సుబ్బారావు:
మరి ఎందుకు ఈటీవీ నుండి సుమన్ బాబును బయటకు గెంటేసాడట?

సుబ్బలష్షిమి:
తన లాంటి వాళ్ళకు నవ్వే అవకాశాలు తక్కువగా ఉంటాయట!

సుబ్బారావు:
బహుశ మన హాస్యనటుల హాస్యం నచ్చదేమో! అయితే సుమన్ బాబు ‘నాన్ స్టాప్ కామెడీ’ని ప్రతీక్షణం చూస్తూ కూర్చుంటే సరి!

సుబ్బలష్షిమి:
సరిగ్గా పోయిన ఏడాది నవంబరు 21 వ తేదీన, తండ్రితో తనకున్న గొడవల గురించి, సుమన్, సాక్షి పత్రికకి ఇంటర్యూ ఇచ్చాడు. సరిగ్గా సంవత్సరం తరువాత, [నవంబరు 21, 09 వతేదీన] తన ’నాన్ స్టాప్’ సినిమా పాటల సీడీని తండ్రి చేత విడుదల చేయించాడు. రామోజీ రామాయణం పేరిట వచ్చిన ఆ ఇంటర్యూ చదివినప్పటి నుండీ బావా, నాకో సందేహం ?

సుబ్బారావు:
ఇంకెందుకాలస్యం? అడుగు!

సుబ్బలష్షిమి:
ఆ ఇంటర్యూలో “ఎందుకో తెలీదు. నాన్న గారికి మొదటి నుండీ నా పనితీరూ, నా రాతలు నచ్చేవి కాదు. మరి అది మా వృత్తి కాదనో, అలా రాయడం మూలంగా బిజినెస్ దెబ్బతింటుందనో తెలీదు. నిత్యం నన్ను ఏదో ఒకటి అనేవారు. తనకేం కావాలో చెప్పెవారు కాదు. నేను చేసింది నచ్చేది కాదు” అన్నాడు సుమన్[బాబు] , వాళ్ళ వృత్తి అంటే ఏమిటి బావా?

సుబ్బారావు:
బహుశః వార్తలూ, సంపాదకీయాలూ వ్రాయటం, దాని ద్వారా రాజకీయ వ్యాపారం చేయటం, పచ్చళ్ళు తయారుచేయటం వంటివి అయి ఉంటాయి మరదలా! ఏమైనా శ్రీహరి స్వరాలూ, కృష్ణుడి లాంటి పౌరణిక పాత్రలూ వేయటం మాత్రం అయి ఉండదు.

సుబ్బలష్షిమి:
ఇంకో సందేహం బావా! అదే ఇంటర్యూలో…..”అలా అందరి ముందర నన్ను ఎన్నిసార్లు అవమానించారో చెప్పలేను. అడుగు తీసి అడుగు వేయాలంటే భయం. ఏంచేస్తే ఎక్కడ కోపమోస్తుందోనన్న భయం. ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో, ఎప్పుడొచ్చి ఆయన నా మీద విరుచుకుపడతారో అని భయం. నేనేం తప్పుచేశానని నన్ను అన్ని మాటలంటున్నారు అని ఆలోచించేవాడిని. అర్ధమయ్యేది కాదు. 15 ఏళ్ళ తర్వాత కూడా నాది అదే పరిస్థితి” అన్నాడు సుమన్. 15 ఏళ్ళ తర్వాత అని 2008 లో అన్నాడంటే….అతడు చెపుతున్న స్థితి అతడికి ప్రారంభమైంది 1993లో అయి ఉండాలి. ఈ టీవీ పుట్టింది 1995 లో. మరి అప్పటికి అతడి ఏ రాతలు నచ్చక రామోజీ రావుకి కోపం వస్తుంది?

సుబ్బారావు:
ఓర్నాయనో మరదలా! సందేహాలంటూ ఏకంగా చిక్కుప్రశ్నలే వేస్తున్నావు. నీ చిక్కు ప్రశ్నలకు సమాధానం రామోజీరావే ఇవ్వగలడు.

సుబ్బలష్షిమి:
సరే వదిలెయ్ బావా! ఇంకొక్క సందేహం తీర్చు. సాక్షి ఇంటర్యూలో సుమన్ “ ఏ కైక ఏ రూపంలో వచ్చి ఏం కోరిందో…. నన్ను వనవాసాలకి పంపారు” అని తండ్రి గురించి అన్నాడు. దశరధుడి కంటే ముగ్గురు భార్యలున్నారు గనక, కౌసల్యా నందనుడిపైన వివక్ష చూపమని కైక కోరింది. మరి రామోజీ రావుకి ఉంది ఒక భార్యే కదా? మరి సుమనేమిటి ఇలా అంటాడు?

సుబ్బారావు:
ఏ కైక ఏ రూపంలో అంటే అర్ధమేమిటో మనకేం తెలుసు మరదలా!

సుబ్బలష్షిమి:

అందుకేనేమో ’ఇంటి గుట్టు ఈశ్వరుడి కెరుక ‘ అంటారు పెద్దలు. బావా! చివరగా ఒక ప్రశ్న! రామోజీ ఫిల్మ్ సిటి భూముల్లో 1300 వందల ఎకరాల భూమి ముస్లిం భూములట, అవి గాలిబ్ జంగ్ వారసుల భూమి అట. ఎప్పుటికైనా ఆ భూములు జంగ్ వారసులకే చెందుతాయట. ఏ కోర్టుల కెక్కినా రామోజీరావుకి ఆ భూములు దక్కవని గోనె ప్రకాష్ రావు ‘సాక్షి’ పత్రికలో ఆరోపిస్తున్నాడు. మరి ఆ భూములలో రామోజీరావు ఫిల్మ్ సిటి ఎందుకు కట్టించాడు బావా? రామోజీరావుకి ఈ విషయం తెలియదా?

సుబ్బారావు:
రామోజీరావు కి జంగ్ లన్నా, పాత బస్తీ ముస్లిం నాయకులన్నా ప్రత్యేక అభిమానం మరదలా! బహుశ బాదరాయణ సంబంధాలు ఉండి ఉంటాయి. కాబట్టి ఆభూములకి వచ్చిన ఢోకా లేదనుకుని ఉంటాడు. కావాలంటే చూడు, పాతబస్తీలో ఎం.ఐ.ఎం. వాళ్ళు ఏం చేసినా, ఈనాడు రామోజీరావు మాత్రం, ఓవైసీ కుటుంబాన్ని ఏమీ అన డు.

సుబ్బలష్షిమి:
నిజమే బావా!

5 comments:

 1. సుమన్ బాబు సినిమానా మజాకానా. చిన్ని తెర నుండి పెద్దతెర తొ మన కర్మకాలి మనతొ ఆడుకొవాలని సుమన్ బాబు ఆశ.

  ReplyDelete
 2. WHEN i AM OPENING YOUR BLOG i AM GETTING A POPUP ..WHICH IS ANNOYING. Can you please have a look into that ?

  By the way ..you rock ...

  ReplyDelete
 3. అజ్ఞాత గారు,

  మీరు చెప్పింది నాకు అర్ధం కాలేదండి. టెక్నికల్ విషయంలో మేం పూర్. సమస్య, దానిని ఎలా పరిష్కరించుకోవాలో చెబితే పరిష్కరించుకుంటాం. సమస్యను దృష్టికి తెచ్చినందుకు నెనర్లు!

  ReplyDelete
 4. pop up ads వస్తోంది, http://www.widgeo.net/ అనే దాని వల్ల. అమ్మఒడి గారు, ఎడమ వైపున "పేలటం చూసినోళ్ళు" అనే దాని క్రింద మీరు widgeo.net వాడి కౌంటరును స్థాపించారు కదా. దానివల్ల వస్తోంది ఈ సమస్యంతా. మీరు ఆ widgeo.net వాడి కౌంటరును తీసివేసి, వేరే ఏదన్నా పెట్టండి. సమస్య పరిష్కారమవుతుంది.

  ReplyDelete
 5. నాగ ప్రసాద్ గారు,

  సలహా ఇచ్చినందుకు నెనర్లు!

  ReplyDelete