Wednesday, March 2, 2011

అందుకే బంగారం ధర ఇంతగా మండి పోతున్నది!?

[నాల్కో సీఎండీ శ్రీవాస్తవ, అరెస్టు, సస్పెన్షన్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రభుత్వ రంగ జాతీయ అల్యూమినియం కంపెనీ (నాల్కో) సీఎండీ శ్రీవాస్తవ, పది కిలోల బంగారం, 29 లక్షల రూపాయల నగదు…. లంచంగా పుచ్చుకుంటూ పట్టుబడ్డాడట. అతడితో పాటు మరో అధికారి కూడా పట్టుబడ్డాడు. చిత్రమేమిటంటే – ఈ ఇద్దరు అధికారులకి కూడా, వారి భార్యలే లాబీయిస్టులుగా పనిచేసారట, తెలుసా బావా!

సుబ్బారావు:
నీరా రాడియాల పాటి తామూ చేయలేమా అనుకొని ఉంటారు మరదలా, ఛాందినీ శ్రీవాస్తవలు! మనం చాలా చోట్ల ప్రభుత్వ అధికారుల అటెండర్లు “ఆఫీసర్ గారి ఇంటికెళ్ళి, అమ్మగారిని కలవండి. మీ పని అయిపోతుంది” అని కార్యార్ధులకి సలహాలివ్వటం చూస్తూనే ఉంటాం కదా!

సుబ్బలష్షిమి:
గమ్మత్తేమిటంటే – తన భర్త తప్పేం లేదనీ, ఆయన అమాయకుడనీ..... పాపం చాందినీ కోర్టుహాల్లో కన్నీళ్ళు పెట్టుకుందట. అతడూ తను అమాయకుణ్ణి అన్నాడట, తెలుసా!

సుబ్బారావు:
తాటి చెట్టు మీద పట్టుబడిన ప్రతివాడూ, దూడగడ్డి కోసమే ఎక్కానంటాడు మరదలా! వినేవాడుంటే చేతిలోని కల్లుముంతని కూడా, దూడగడ్డిగా బుకాయించనూ గలరు.

సుబ్బలష్షిమి:
అయినా ఎకాఎకీ కోట్లలో లంచం తీసుకున్నారంటే..... ఎన్ని కోట్ల అక్రమాలకు పాల్పడి ఉండాలి బావా!? అధికారుల లెవెల్ 10 కిలోల బంగారాలైతే, మంత్రులూ, ఎంపీలూ ఎంఎల్ ఏ ల లెవెల్ ఎంతుండాలి? ఇక అధిష్టానాల లెవెల్ కి ఎంత బంగారం ఉండాలి?

సుబ్బారావు:
బహుశః అందుకే బంగారం ధర ఇంతగా మండి పోతున్నది మరదలా!

No comments:

Post a Comment