Tuesday, March 8, 2011

మూడు సీట్ల కోసమో? మరింక దేని కోసమో?

[కాంగ్రెస్, డీఎంకే ల మధ్య ఎన్నికల సర్ధుబాటు విషయంలో కుదరని సయోధ్య – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో, సీట్ల సర్ధుబాటు గురించి.... కాంగ్రెస్, డీఎంకే ల మధ్య సయోధ్య బెడిసి కొట్టిందట. 63 సీట్లు అడుగుతోందట కాంగ్రెస్, డీఎంకే 60 సీట్లే ఇస్తానంటోందట. తొక్కలోది మూడు సీట్ల కోసం ఎడతెగని చర్చలు నడుస్తాయా బావా! కాంగ్రెస్ ట్రబుల్ షూటరూ, అధిష్టానపు రాజకీయ కార్యదర్శి వంటి దిగ్గజాలు దిగి రాయబారాలు నడుపుతున్నారు, తెలుసా!

సుబ్బారావు:
ముష్టి మూడు సీట్ల కోసం అంత రగడ నడవదు మరదలా! ఆ పైకారణంతో మరింక దేని గురించో రాయబారాలు నడుస్తుంటాయి. అందునా 2జీ స్పెక్ట్రం కేసులో, ఎంత గింజుకుని గిల్లార్చుకున్నా.... రాజా అరెస్టు గాక తప్పలేదు. ఇప్పుడు తీహార్ జైల్లో కూర్చుని ఊచలు లెక్క వేస్తున్నాడు.

మరోప్రక్క లాబీయిస్టు రాడియాతో, కరుణానిధి కూతురు కనిమొళి మాటా మంతీ గురించి సిబీఐ విచారణ బయటికొచ్చేట్లుంది. ఇప్పుడు కూతురి భవితవ్యం, తన భవితవ్యం ఏమిటో నని.... కరుణానిధి, కాంగ్రెస్ అధిష్టానం, యూపీఏ కుర్చీవ్యక్తికి పీక మీద కత్తి పెట్టాడు. ఏ కన్ను లేదా కాలు వదులుకోవాలో తేల్చుకోలేక సతమతం అవుతోంది కాంగ్రెస్!
అందుకే అంత సుదీర్ఘంగా నడుస్తున్నాయి మంతనాలు.

సుబ్బలష్షిమి:
అదా సంగతి! మొత్తానికి రాజకీయం రంజుగా నడుస్తున్నట్లుంది బావా!

No comments:

Post a Comment