Saturday, October 30, 2010

అంగారక గ్రహంపైకి ఎవరిని పంపాలి?

[అంగారక గ్రహంపై స్థిర నివాసం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అంగారక గ్రహంపై వ్యోమగాములు స్థిర నివాసం ఏర్పరుచుకుంటారట. వాళ్ళని భూమి పైకి తీసుకురావటం ఖర్చుతో కూడుకున్నదని, కొన్నేళ్ళ పాటు భూమి నుండి ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులూ పంపాలని, క్రమంగా వాళ్ళు స్వయంపోషకంగా తయారుకావాలన్న ప్రణాళిక చేపట్టారట, తెలుసా?

సుబ్బారావు:
సుబ్బరం! అసలు పంపాల్సింది వ్యోమగాముల్ని కాదు మరదలా! భూమ్మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి పరులందరినీ అంగారక గ్రహం పంపేసి, స్వయంపోషకంగా బ్రతకమంటే సరి! అప్పుడు భూమి, సగానికి సగం ఖాళీ అయిపోతుంది.

సుబ్బలష్షిమి:
అబ్బ, ఎంతాశ బావా నీకు? అయినా బావా, నాకో అనుమానం! అప్పుడు అంగారక గ్రహం కూడా అవినీతిమయమూ, కాలుష్యమయమూ అయిపోతుందేమో!

సుబ్బారావు:
అందుకు సందేహమేముంది! సలక్షణంగా అంతే!

Friday, October 29, 2010

మరి బుకర్ ప్రైజ్‌లు ఊరకే వస్తాయా?

[కాశ్మీర్, భారత్ లో భాగం కాదన్న అరుంధతీ రాయ్ - వార్తాంశంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రసిద్ధ రచయిత్రి, ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ గ్రహీత... అరుంధతీ రాయ్ ‘కాశ్మీర్, భారత్ లో భాగం కాదన్న’దట. చర్య తీసుకుంటే ఆమె వ్యాఖ్యకి మరింత ప్రచారం వస్తుంది కాబట్టీ, ఒబామా భారత్ పర్యటన ముందు అలాంటి పరిణామాలని ఆహ్వానించలేరు కాబట్టీ - ‘ఆమె మీదా ఏ చర్యా తీసుకోలేమనీ’ కేంద్రప్రభుత్వం తెగేసి చెప్పింది, చూశావా!

సుబ్బారావు:
మరేమనుకున్నావ్ మరదలా! ఎంతగా భారతదేశానికి, భారతీయతకి, భారతీయులకి వ్యతిరేకంగా ఉంటే... అంతగా ప్రపంచ ప్రఖ్యాతీ, ప్రతిష్ఠాత్మక అవార్డులూ వస్తాయి మరి! కాబట్టే... ప్రభుత్వం కూడా చర్య తీసుకోకుండా ఉండేందుకు కారణాలు వెదుక్కుంటోంది! పధకం ప్రకారం ప్రవర్తించే వ్యక్తులే పైస్థాయి దాకా వస్తే... పరిస్థితి ఇలాగే ఉంటుంది!

సుబ్బలష్షిమి:
నిజమే బావా! భారత్ కి వ్యతిరేకంగా పనిచేసిన భారతీయులకి అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతోంది! అది చూపి ఇక్కడి మీడియా కీర్తిస్తుంది. ‘కామమ్మ మొగుడు అంటే కామోసు అనుకోవాలి’ జనం!

Thursday, October 28, 2010

‘సానుకూల దృక్పధం’ అంటే ఇదన్న మాట!

[సివిల్స్...తీరు మారిన ప్రిలిమ్స్ -సాక్షి విద్య శీర్షిక నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసి వెళ్ళిన స్మితా సబర్వల్ అనే ఐఎఎస్ అధికారిణి, సివిల్స్ విధానం మీద తన అభిప్రాయం చెబుతూ, సివిల్స్ కు తయారయ్యే అభ్యర్ధులకి సూచనలిస్తోంది. ఈవిడ 2001లో సివిల్స్ ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించిందిట. ఈవిడ భర్త ఐపీఎస్ అధికారి. ఓసారి కర్నూలు జిల్లా సంచికలో ఈవిడ ఇంటర్యూ చదివాం, గుర్తుందా!

సుబ్బారావు:
గుర్తుంది, అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
ఈవిడ సానుకూల దృక్పధం(positive thinking) ఎంతటిదో తెలుసా బావా? గతేడాది కర్నూలు వరదల్లో కొంపా గోడూ సర్వం కోల్పోయిన బాధితులకు పంపిన వాటిల్లో 50బస్తాల బియ్యాన్ని పరీక్షిస్తే... అందులో 47 బస్తాల దాకా.... 50కిలోలకు బదులు 45-46 కేజీలే ఉన్నాయి. రెడ్ హాండెడ్ గా పట్టుబడిన ఈ సంఘటన, అప్పటి అవినీతికి ఓ మచ్చుతునకన్న మాట!

అదే విషయం నిలదీస్తూ, ఈ జాయింట్ కలెక్టర్ ని అప్పట్లో విలేఖర్లు నిలదీస్తే... ఈవిడ ‘అది వ్యతిరేక ఆలోచన(Negitive thinking) విధానమంటూ’..."మీరు తరుగుపడిన ఆ 47బస్తాలనే చూస్తున్నారు, సరైన కొలత ఉన్న 3బస్తాలనెందుకు చూడరు? ఇలా తప్పుబడుతూ పోతే, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయలేరు" అంది. అప్పట్లో కర్నూలు జిల్లా సంచికలో వచ్చిన వార్త అది!

వరద బాధితుల కడుపు నింపేందుకు పంపిన తక్షణ ‘సాయం’లోనే... అంత ‘మాయం’ చేయగల సదరు ప్రభుత్వ ఉద్యోగుల చేతివాటం... ఇక శాశ్వత సాయంలో ఎలా ఉంటుందో... ఇప్పటికీ బాగుపడని కర్నూలు వరదబాధితుల బ్రతుకు చిత్రమే చెబుతుంది కదా!?

అంతలా తమ పనితీరు సమర్ధించుకున్న ఈ సివిల్స్ మాజీ టాపర్, ఇప్పుడు కాబోయే సివిల్స్ టాపర్లకు సలహాలిస్తోంది. అసలు ఈవిడకు సివిల్స్ లో 4వ ర్యాంకు ఎలా వచ్చింది బావా?

సుబ్బారావు:
బహుశః ఈ ‘సానుకూల దృక్పధం’తోనే సంపాదించి ఉంటుంది మరదలా!

Friday, October 22, 2010

రాజకీయ నాయకులే పరస్పర దర్పణాలు!

[పరస్పర నిందారోపణలతో చంద్రబాబు, రోశయ్యలు - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రోశయ్య, చంద్రబాబులు ఒకళ్ళనొకళ్ళు విరగ విమర్సించుకుంటున్నారు చూశావా!?

చెన్నారెడ్డిని తెగ విమర్శించి, తనకి మంత్రి పదవి ఇవ్వగానే...‘చెన్నారెడ్డి జిందాబాద్’ అంటూ రోశయ్య ప్రశంసించాడనీ,
అలాగే... కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలో ‘వై.యస్. ఒక చీడ పురుగు’ అంటూ తీర్మానాలు చేసి, కేంద్రానికి ఫిర్యాదు లేఖలు వ్రాసి, ఢిల్లీకి మోసాడనీ, అదే... వై.యస్. ముఖ్యమంత్రై తనకి ఆర్ధికమంత్రి పదవి ఇవ్వగానే... ‘వై.యస్. వంటి గొప్పనేత ఎవరూ లేరనీ’, తాను నడక ప్రారంభించే సరికే వై.యస్. గమ్యం చేరి ఉండేంత గొప్పనేత’ అంటూ కితాబు లిచ్చేసాడనీ.. అంతగా అవకాశ వాదమూ, స్వార్ధ పరత్వమూ మూర్తీభవించిన వాడు రోశయ్య... అని చంద్రబాబు రోశయ్యని విమర్శించాడు.

బదులుగా - చంద్రబాబు బ్రతికి చెడ్డవాడని తాను దయ దలుస్తున్నాననీ, ఇంటా బయటా కష్టాల్లో ఉండి ఏదో వాగుతున్నాడని సహిస్తున్నాననీ, చంద్రబాబులా తాను నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాలేదనీ... రోశయ్య చంద్రబాబుని చెరిగి పారేసాడు.

మొత్తానికీ రోశయ్య, చంద్రబాబులు... పరస్పరారోపణలతో ఒకళ్ళ నైజాన్ని మరోకరు చక్కగా వెల్లడిస్తున్నారు బావా!

సుబ్బారావు:
రోశయ్య, చంద్రబాబులనేముంది మరదలా! రాజకీయనాయకులందరూ... ఒకరి నైజాన్ని మరొకరు, దర్పణంలా ప్రదర్శిస్తున్నారు. ఇంకెన్ని రాజకీయ దర్పణాలు బయటికొస్తాయో వేచి చూడాల్సిందే! మన రాజకీయ నాయకుల శీలరాహిత్యం ఎంతటిదో అంధ అభిమానులు అర్ధం చేసుకోవాల్సిందే!

Thursday, October 21, 2010

‘ఆపరేషన్ ఆకర్ష’ అన్నా... ‘ఆపరేషన్ కమల’ అన్నా...

[యడ్యూరప్ప ఇల్లు ముట్టడి వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చదివావా?
>>>ఈనాడు 20అక్టోబరు, 2010, తొలిపేజీ

సుస్థిర ప్రభుత్వ స్థాపన పేరిట కర్ణాటకలో భాజపా మరోమారు ‘ఆపరేషన్ కమల’ చేపడుతోందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ శాసనసభ్యులను ప్రలోభపరచుకునేందుకు కోట్లరూపాయలు కుమ్మరిస్తున్నారని ఆరోపిస్తూ వారు మంగళ వారం రాత్రి బెంగుళూరులోని ముఖ్యమంత్రి యడ్యూరప్ప నివాసాన్ని ఆకస్మికంగా ముట్టడించి నిరసనకు దిగారు.
~~~~~~~~
ఒకప్పుడు తన భర్తతో మరో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంటే, తానువెళ్ళి ఆ ఉంపుడుగత్తెతో ఇలాగే కొట్లాడేది సదరు ఇల్లాలు. అప్పుడా ఉంపుడు గత్తె అలవోకగా "చేతనైతే నీ భర్తని చెప్పు చేతల్లో పెట్టుకో! అంతేగానీ, నా దగ్గర కొచ్చి అరుస్తావేం?" అనేదని... విన్నాం, చదివాం, చివరికి సినిమాల్లో కూడా చూశాం!

సరిగ్గా... ఇప్పుడదే రాజకీయాల్లో చూస్తున్నాం!
‘ఆపరేషన్ ఆకర్ష’ అన్నా... ‘ఆపరేషన్ కమల’ అన్నా... ఏ పార్టీ అయినా... చేస్తోంది ఈ వ్యభిచారమే కదా బావా!

సుబ్బారావు:
అందులో సందేహమేముంది మరదలా!? అచ్చంగా ఇల్లాలు-ఉంపుడుగత్తెల సంభాషణ లాగే... ఏ పార్టీ అయినా... తమ ఎంఎల్‌ఏలనీ, ఎంపీలనీ అదుపులో ఉంచుకోలేక, ఎదుటి పార్టీ ఆపరేషన్ల మీద పడి ఏడుస్తోంది. డబ్బూ, లజ్జారాహిత్యమే రాజకీయమై పోయాక, ఆ వ్యభిచారం ఇంత జుగుస్సాపూరితంగానే ఉంటుంది మరి!

Tuesday, October 19, 2010

చావు ముంచుకొచ్చినప్పుడు నేను లక్ష చెబుతాను, నువ్వయ్యన్నీ నమ్మకూడదు!

[ఆరువేల కోట్లతో బీహార్ ముఖచిత్రమే మార్చేయవచ్చు - ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విమర్శ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో, ప్రధాని మన్మోహన్ సింగ్... నితీష్ కుమార్ ని విమర్శిస్తూ ‘బీహార్ కి ఆరువేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు ఇచ్చామనీ, వాటికిప్పుడు రాష్ట్రప్రభుత్వం లెక్కలు కూడా చెప్పటం లేదనీ, ఆ ఆరువేల కోట్లతో రాష్ట్ర ముఖచిత్రమే మార్చేయవచ్చని వ్యాఖ్యానించాడు తెలుసా?

సుబ్బారావు:
అలాగైతే... తామే వెనకేసుకొచ్చిన రాజా, స్పెక్ట్రమ్ నిర్వాకంలో 60 వేల కోట్ల రూపాయలతో, వై.యస్. అక్రమార్జన 70వేల కోట్ల పై చిలుకుతో కలిపి, మొత్తం భారతదేశపు ముఖచిత్రమే కాదు, పక్కనున్న పాకిస్తాన్ ముఖచిత్రం కూడా మార్చేయవచ్చు. ఇక స్విస్ లో ఉన్న భారతీయుల నల్ల ధనంతో... సగం భూగోళపు ముఖచిత్రం మార్చేయవచ్చు. ప్రయత్నిస్తే పోలా... ఈ ప్రధానమంత్రీ, ఆ యూపీఏ కుర్చీ వ్యక్తీ?

సుబ్బలష్షిమి:
"చావు ముంచుకొచ్చినప్పుడు నేను లక్ష చెబుతాను. నువ్వయ్యన్నీ నమ్మకూడదు" అంటాడు... గోలీమార్ సినిమాలో హీరో! అట్లాగే... ఎన్నికలప్పుడు రాజకీయ నేతలు లక్ష చెబుతారు, జనమయ్యన్నీ నమ్మకూడదు, మరదలా!

Friday, October 15, 2010

ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికెగురు తుందట!

[కామన్వెల్త్ క్రీడల ముగింపు వేడుకల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కామన్వెల్త్ క్రీడల ఆరంభపు సంరంభం అదిరిపోయింది. ముగింపు ఉత్సవం మురిగిపోయిందేం బావా?

సుబ్బారావు:
అదేమరి మరదలా! ఆరంభం భారతీయ ఆత్మని చూపించింది. ఘన వారసత్వ సంపదయైన సంస్కృతిని ఆవిష్కరించింది. ఆరోజే... చివరి ప్రదర్శన కొచ్చేసరికి అర్ధనగ్న చీరలతో అక్కడి నుండి ఎక్కడికి ప్రయాణించారో చెప్పేసారు కదా! దాన్నే నిన్న కొనసాగించారు.

ప్రస్తుత రాజకీయనేతలకి... అసలు మానవత్వం తెలిస్తే కదా, విశ్వ మానవ ప్రేమని ప్రదర్శించేందుకు?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికెగురు తుందట!

Wednesday, October 13, 2010

`రామోజీ రహస్యాలపై నోరెత్తరేం?' అనే కంటే సహ చట్టం క్రింద అడగొచ్చుగా!

[పన్ను మీదా కుట్రే. జగన్ పద్దతిగా పన్ను కట్టటమే నేరంగా పత్రికల్లో వార్తలు, టీవీల్లో స్టోరీలు. రామోజీ రహస్యాలపై నోరెత్తరేం? -సాక్షి కథనం నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వై.యస్.జగన్ భారతీ సిమెంట్స్‌లో తన వాటాను అమ్మడంతో వచ్చిన ఆదాయంలో, చట్టప్రకారం 20%, అంటే 84 కోట్ల రూపాయలు ఆదాయపన్ను అడ్వాన్సుగా కట్టాడట. దాని మీద రామోజీరావు+చంద్రబాబు&కో కలిసి, పచ్చ నాటకం ఆడుతున్నారని జగన్ తన సాక్షి పత్రికలో వ్రాసుకున్నాడు.

‘రామోజీ రహస్యాలపై నోరెత్తరేం?’ శీర్షిక క్రింద

>>>సాక్షి, 13 అక్టోబరు,2010; 2వ పేజీ
ఎల్లో సిండికేట్ సూత్రధారి రామోజీరావు పుట్టెడు నష్టాల్లో ఉన్న తన గ్రూపు కంపెనీల్లో వాటాలను రెండేళ్ళ కిందట విక్రయించారు. 100 రూపాయల విలువగల ఒకో షేరును ఏకంగా 5,28,830/-రూపాయల చొప్పున విక్రయించారు. తద్వారా రెండు విడతలుగా రూ.1700 కోట్లు సమీకరించారు. రామోజీ తన వ్యక్తిగత వాటాను విక్రయించారు కాబట్టి చట్టప్రకారం 20శాతం అంటే... రూ.340 కోట్లు ఆదాయపు పన్నురూపంలో చెల్లించి ఉండాలి. దీన్ని ఏ ఇతరత్రా నష్టాల్లో సర్ధుబాటు చేశారో... లేకుంటే తక్కువ మొత్తమే వచ్చిందని చెప్పి తక్కువ పన్నుకట్టారో.. లేదంటే ఈ డీల్ బయటకు ఎవరికీ తెలియదు కదా అని పన్ను ఎగ్గొట్టారో... ఏ సంగతి బయటప్రపంచానికి తెలియదు. ఎందుకంటే రామోజీ కోటలో ప్రతిదీ రహస్యమే. పన్ను ఎగవేతకు సంబంధించి ఆయనపై ఎన్ని ఆరోపణలొచ్చినా బాబు కిమ్మనకుండా ఉంటారు తప్ప నిజం చెప్పండని నిలదీయరు. ఎందుకంటే అదంతా వారి ‘సొంత’వ్యవహారం. నష్టాల్లో ఉన్న కంపెనీ వాటాల్ని భారీ ప్రిమియానికి అమ్ముకుని పన్ను ఎగ్గొట్టిన రామోజీ చేసింది మాత్రం కరెక్టు. మరీ ఇంత సిగ్గుమాలినతనమా బాబూ...?

బావా, పత్రికలో ఇంత గోల పెట్టేబదులు... ఎటూ రామోజీరావు సహ చట్టాన్ని భుజానేసుకుని ముందడుగు వేస్తున్నానంటాడు కదా!... అదే బాటలో ‘సహచట్టం’ క్రింద రామోజీరావు పన్ను కట్టాడో, ఎగ్గొట్టాడో అడగవచ్చు కదా!? అప్పుడు సాక్ష్యాలతో సహా, రహస్యాలు బయటికి వస్తాయి కదా!?

సుబ్బారావు:
ఎంత అమాయకురాలివి మరదలా! అంత లోతుగా రహస్యాలు లాగుతారేంటి? ఏదో పత్రికలో పైపైన అలా అంటారంతే! లేకపోతే తమ రహస్యాల గోచీలనీ, ఎదుటి వాళ్ళు అలాగే లాగుతారు కదా? అదీగాక... సహచట్టం క్రింద అడిగినా ప్రభుత్వం ఏ రహస్యాలనైనా బయటపెడుతుందను కున్నావా? ఏదో సొల్లు సంగతులు తప్ప, కీలకమైన విషయాలైతే... ఏదో ఒక వంక చూపిస్తుంది తప్ప, చచ్చినా సమాచారం ఇవ్వదు గాక ఇవ్వదు.

సుబ్బలష్షిమి:
అంతేనా? ‘సహ చట్టం ఆహా ఒహో!’ అంటే... అవునేమో అనుకున్నాను బావా!

Saturday, October 9, 2010

ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు అంటే ఇదే కాబోలు!

[ నేను మళ్ళీ సీఎం నవుతాను - చంద్రబాబు, మూడు రోజుల తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా! - సాక్షి, ఆంధ్రజ్యోతి వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! నేనే మళ్ళీ సీఎం నౌతానంటున్నాడు చంద్రబాబు. ఓ ప్రక్క, తెలంగాణా నుండి తెదేపాని, తెరాస కాంగ్రెస్‌లు కలిసి వెళ్ళగొట్టి పారేస్తున్నాయి. మరో ప్రక్క, కోస్తా రాయల సీమల్లో వై.యస్. తనయుడు, తండ్రి ఇచ్చిపోయిన కోట్లు కుమ్మరించైనా పట్టుపెంచుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మరి ఏమనుకొని చంద్రబాబు సీఎం నౌతానంటున్నాడు బావా! చూడబోతే... ఎన్నికలు రాకుండానే ఆశల పల్లకీలు, ఊహల ఉయ్యాలలూ ఎక్కేసినట్లున్నాడు!

సుబ్బారావు:
ఊహలా పాడా! ఆమాత్రం ఆశలు పెట్టకపోతే, తమ్ముళ్ళంతా తలోదారి అయిపోతారని, ఆపాటి కట్టడి మాటలు మాట్లాడుతున్నాడు మరదలా!

సుబ్బలష్షిమి:
ఆశకు అంతులేదు, గోచీకి దరిద్రం లేదు అంటే ఇదే కాబోలు!

Friday, October 8, 2010

హిందుత్వాన్ని భ్రష్టుపట్టించడానికే కదా దేవాదాయ శాఖ ఉంది!?

[ఇద్దరు భార్యల ఈవోపై చర్య తీసుకోండి. హైకోర్టులో శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం బోర్డు సభ్యుడి పిటిషన్. ప్రభుత్వానికి, ఈవోకు నోటిసులు జారీ చేసిన హైకోర్టు - వార్త నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! శ్రీకాళహస్తి ఈవో శ్రీరామచంద్రమూర్తి[!] అట. అతడు ఇద్దరు భార్యలతో పూజలు నిర్వహిస్తున్న ఫోటోతో సహా వార్త వచ్చింది. రెండో పెళ్ళి కోసం, ఇస్లాం స్వీకరించినట్లు ఆరోపణ కూడా ఉంది. చట్టవిరుద్ధంగా, బహుభార్యత్వం కలిగి ఉన్న వ్యక్తిని, దేవాలయ కార్య నిర్వహణాధికారిగా నియమించడాన్ని సవాలు చేస్తూ, బోర్డు సభ్యుడొకరు కోర్టు నాశ్రయించాడు.

అయినా దేవాదాయ శాఖకి అందరూ ఇలాంటి వాళ్ళే దొరుకు తారేం బావా?

సుబ్బారావు:
అవినీతిలో అందరికంటే ఆరాకులు ఎక్కువే చదివారు మరదలా, దేవాదాయ శాఖలో ఉన్నతాధికార్ల దగ్గర నుండి అటెండరు స్థాయి దాకా అధికశాతం మంది! శ్రీశైలంలో మందు చిందూ వేస్తూ, ఆలయ ఉద్యోగులు దొరికి పోయారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శృంగారం వెలగ బెడుతూ కెమెరాకి దొరికి పోయారు ఓ ఉద్యోగినీ, మరో ఉద్యోగి!

ఎక్కడన్నా పాపం చేస్తే, పోగొట్టుకోవడానికి పుణ్యక్షేత్రాలని దర్శిస్తారట. అలాంటిది... సాక్షాత్తూ పుణ్యక్షేత్రాల్లోనే, టన్నుల కొద్దీ పాపాన్ని, నిర్భీతిగా మూటగట్టుకుంటూ ఉంటారు, ఈ శాఖ ఉద్యోగులు.

హిందూమతం అంటే అందరికీ చులకనే కదా! అదీగాక, హిందుత్వాన్ని భ్రష్టుపట్టించడానికే కదా దేవాదాయ శాఖ ఉంది!?

రాత్రిళ్ళు మందేసి మంతనాలాడ్డంతోనే తెల్లారి పోతుందేమో!

[క్షేత్రస్థాయిలో నేతలూ పనిచేయాలి - పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు - సాక్షి పత్రిక వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో, నేతలు క్షేత్ర స్థాయిలో పనిచేయాలంటూ ఓ ప్రక్క చంద్రబాబు ఉపన్యాసం ఇస్తుండగా, మరో ప్రక్క ఆ పార్టీ నేతలు కునికి పాట్లు(శుభ్రంగా నిద్రపోతున్నారు) పడుతున్నారు తెలుసా? ఆ పార్టీ, ఈ పార్టీ అని లేకుండా, ఈ రాజకీయ నాయకులు చట్టసభల్లోనూ నిద్రపోతారు, పార్టీ సభల్లోనూ నిద్రపోతారేం బావా!? రాత్రిపూట నిద్రలు పోరా?

సుబ్బారావు:
రాత్రిళ్ళు మందేసి మంతనాలాడ్డంతోనే తెల్లారి పోతుందేమో మరదలా! అందుకే పగలు, "ఆఁ ఈ సొల్లు దేముంది లెద్దూ" అనుకొని సభల్లో నిద్రపోతుంటారు.

ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి - డోంట్ కేర్!

[కాంగ్రెస్‌లో బంధుప్రీతికీ తావు లేదన్న కాంగ్రెస్ యువనేత రాహుల్ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, కాంగ్రెస్‌లో బంధుప్రీతికి తావులేదట, తెలుసా? అందుకే కాబోలు - కాంగ్రెస్ అధ్యక్షురాలి ఇంట్లో ఇద్దరు ఎంపీలున్నారు. అందులో ఒకరు పార్టీ అధ్యక్షురాలైతే, మరొకరు పార్టీ ప్రధాన కార్యదర్శి.

సుబ్బారావు:
అంతే కాదు మరదలా! కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరి ఇంట్లో ముగ్గురు నలుగురు ఎంపీలో, ఎమ్‌ఎల్‌ఎ లో, ఛైర్మన్ లో ఉన్నారు. బొత్స ఇంట్లో నలుగురు, కాకా ఇంట్లో ఇద్దరు కొడుకులు, అల్లుడు. ఇక వై.యస్. బంధువర్గంలో అయితే నలుగురో ఐదుగురో పదవులలో ఉన్నారు. పవార్ ఇంట్లో ఇద్దరు ఎంపీలు. ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ లో దాదాపుగా ప్రతీ సభ్యుని ఇంట్లో రకరకాల పదవులు సంపాదించుకున్న వారు ఉన్నారు కదా!

సుబ్బలష్షిమి:
అంతే బావా! అందుకే "ఎదుటి వాళ్ళకి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి" అన్నాడు ఓ సినీ కవి! కాబట్టి డోంట్ కేర్ అనుకొని ఉంటాడు ఈ యువనేత రాహుల్!

సాగితే మారాజు, సాగకపోతే తరాజు!

[భవిష్యత్ కోసం భారత్, చైనాలతో పోటీ పడాలి - ఒబామా వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య అమెరికా అధ్యక్షుడు ఒబామా తరచుగా, తమ విద్యార్ధులు చదువుల్లో రాణించాలనీ, భారత్ చైనాలతో పోటీ పడాలనీ చెబుతున్నాడు. అగ్రరాజ్యం అనుకొని విర్రవీగే అమెరికా అధ్యక్షుల వారు, అన్యాపదేశంగా తమ వాస్తవ పరిస్థితిని ఒప్పేసుకుంటున్నట్లున్నారు బావా!

సుబ్బారావు:
ఏం చేస్తాడు మరదలా! సాగితే మారాజు, సాగకపోతే తరాజు అనటం ఎవరికైనా అనావాయితేనే!

Thursday, October 7, 2010

పాచిపని పాటి ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే!


[దారి దున్నేసారు - వార్త నేపధ్యంలో, ఈనాడు 02, అక్టోబరు 2010]

సుబ్బలష్షిమి:
బావా! మురుగు నీటి కోసంగానీ, త్రాగునీటి కోసం గానీ... ఆ ఏర్పాట్లోవో ముందు చేశాకే రోడ్డు వేయవచ్చుకదా, ఈ అధికారులు!? లక్షలు ఖర్చుపెట్టి పక్కాగా సిమెంట్‌ రోడ్డో, తారు రోడ్డో వేసాక, తీరిగ్గా అప్పుడొచ్చి తవ్వి పారేస్తారు. అదేమని అడిగితే... `ఆ కాంట్రాక్టు ఒకరిది, ఈ కాంట్రాక్టు మరొకరిది' అనో `రోడ్డు తర్వాత నీటి పైపుల ఏర్పాటుకు నిధులు మంజూరయ్యాయనో' చెబుతారు.

వెరసి... ప్రజాధనం నీళ్ళలా ఖర్చవుతుంది, ఊరు బురదగుంటలా తయారౌతుంది. కాంట్రాక్టర్లు వేరైనా, నిధులు ముందు వెనుకలుగా మంజూరు చేసినా, ప్రభుత్వం దగ్గర సమన్వయం లేనప్పుడే కదా ఇలా జరిగేది? ఆపాటి బుర్ర కూడా లేకుండా పనులెందుకు చేస్తారు బావా?

సుబ్బారావు:
అదిబుర్ర లేకపోవటం కాదు మరదలా, తమ పని పట్ల నిజాయితీ, నిబద్దతా లేకపోవటం! లేదా, కమీషన్ల కోసం ఇలా దుంపనాశనం చేయటం! లేకపోతే... పాచిపని చేసేటప్పుడు కూడా... ముందు వాకిలి ఊడ్చి కళ్ళాపి జల్లి ఆ తర్వాత ముగ్గు వేస్తారు. అంతేగానీ, ముందు ముగ్గు వేసి, ఆ తర్వాత ఊడ్చి నీళ్ళు చల్లరు గదా! ఆ పాటి ఇంగింత జ్ఞానం కూడా లేదంటే ఇంకేమంటాం చెప్పు!

Wednesday, October 6, 2010

అలాగంటే... కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవటం ఖాయం!

[బాకావీరులూ... భాజపాలో చేరండి. కాంగ్రెస్‌లో వ్యక్తిపూజకు స్థానం లేదు - రాహుల్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కాంగ్రెస్‌లో బంధుప్రీతికీ, వ్యక్తి పూజకూ తావులేదట, ఆ పార్టీ ప్రధానకార్యదర్శి రాహుల్ అంటున్నాడు.

సుబ్బారావు:
కాంగ్రెస్‌లో బంధుప్రీతి లేకుండానే... అధ్యక్షురాలి అబ్బాయి గారు, యెకాయెకి పార్టీ ప్రధాన కార్యదర్శి అయిపోయాడా మరదలా? మరీ... నేతిబీరకాయలో నెయ్యుందనడం గాకపోతే!

సుబ్బలష్షిమి:
అంతేనా!? వ్యక్తిపూజకు కూడా తావులేదట. బాకా వీరులందరూ భాజపాలో చేరమంటున్నాడు.

సుబ్బారావు:
అతడి అమ్మగారు పాదాభివందనాలు చేయించుకుంటుంది. తన అడుగులకు మడుగులొత్తిన వాళ్ళకే పదవులు కట్టబెడుతుంది. అందుకే కదా, ఏ రాష్ట్రంలోనైనా... రోశయ్యలాంటి వాళ్ళు "అధిష్టానం ముద్రే నా ముద్ర. అధిష్టానం ఏం చెబితే అది శిరసావహిస్తాను" అంటారు. బొత్సలు, మధుయాష్కీలు, కేకేలు "అధిష్టానాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలే! అధిష్టానానికి విధేయత చూపాలి" అని ఢంకా భజాయించి చెబుతారు. "మేం ఆ ఇంటి కుక్కలం" అన్నవాళ్ళు ఉన్నారు. దీన్ని ఏమంటారో, వ్యక్తిపూజ అని గాక?

అంచేత "కాంగ్రెస్‌లోని భజన పరులూ...! భాజపాలో చేరండి" అంటే... కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోవటం ఖాయం!

Tuesday, October 5, 2010

అప్పటి పరిస్థితులు అప్పటివి, ఇప్పటి అవసరాలు ఇప్పటివి!

[కామన్వెల్త్ క్రీడల ప్రారంభ ఉత్సవాల్లో వెల్లివిరిసిన భారతీయ సంస్కృతి నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! హిందూమతాన్ని భారతీయ సంస్కృతి నుండి వేరుచేసి చూడలేం కదా! నిన్న కామన్వెల్త్ క్రీడల ప్రారంభంలో, ఇంతగా భారతీయ సంస్కృతి గుర్తు కొచ్చిన యూపీఏ ప్రభుత్వానికీ, కుర్చీవ్యక్తి సోనియాకీ... వై.యస్. హయాంలో దేవాలయాల్ని, ముఖ్యంగా తిరుమల ఆలయాన్ని నానా దుంపనాశం చేసినా పట్టలేదేం బావా!

సుబ్బారావు:
అప్పటి పరిస్థితులు అప్పటివి, ఇప్పటి అవసరాలు ఇప్పటివి మరదలా!

Monday, October 4, 2010

‘దొందూ దొందే!’ మరి

[త్యాగంలో సోనియాకు జగన్ తీసిపోరు: గట్టు రామచంద్రరావు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు - సాక్షి, 04 అక్టోబరు, 2010, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భారత దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం xyz సార్లు వచ్చినా... సోనియా త్యాగం చేసిందట. అలాగే వై.యస్.మరణించినప్పుడు 156 మంది ఎమ్యెల్యేల మద్దతు ఉన్నా... జగన్, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశాడట. అందుచేత, త్యాగంలో... సోనియాకి జగన్ తీసిపోడట. ఇలాగని ఓ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ చోట నేత అన్నాడు, జగన్ తన పేపర్‌లో ప్రచురించుకున్నాడు! చూశావా బావా?

సుబ్బారావు:
అందుకే గదా మరదలా, ‘దొందూ దొందే!’ అనే పెద్దల నానుడి గుర్తుతెచ్చుకునేది?

సుబ్బలష్షిమి:
ఇంతకీ ఈ త్యాగ ధనులందరినీ భారత ప్రజలు ఎప్పుడు త్యాగం చేస్తారో కదా బావా!

సుబ్బారావు:
కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగదన్నట్లు, దేనికైనా తగిన సమయం రావాల్సిందే గదా మరదలా!

~~~~~~

దొందూ దొందే కథ నేపధ్యం:

అనగా అనగా...

ఒక ఊళ్ళో ఓ నత్తి యువకుడు ఉన్నాడు. అతడికి మాటలు సరిగా రాకపోవటం చేత, పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో అతడి తల్లిదండ్రులు, దూరాన ఉన్న గ్రామానికి పోయి, తమ పిల్లవాడి లోపం గురించి దాచిపెట్టి, పెళ్ళి సంబంధం కుదుర్చుకొచ్చారు.

పెళ్ళి వైభవంగా జరిగింది. పెళ్ళి పల్లకీలో ఊరేగుతుండగా... చింత చెట్లు విరగ బూసి కనిపించాయి. పెళ్ళి కూతురు, పెళ్ళి కుమారుడితో "తేతంది! తింత తెత్తు తూలంది. దెంత దాదా తూతిందో!"(ఏమండీ! చింత చెట్టు చూడండి. ఎంత బాగా పూసిందో) అందట.

దానికి పెళ్ళికుమారుడు "తూతే తాలంలో తూయాదూ మలి!"(పూచే కాలంలో పూయదూ మరి!) అన్నాడట.

అప్పటిగ్గానీ... పెళ్ళి కొడుకు బంధువులకి, తమ వాడిలాగే వధువుకూ నత్తి ఉందనీ, తమలాగే వాళ్ళూ విషయం దాచి పెళ్ళి చేసారనీ అర్ధం కాలేదు.

ఇదంతా చూస్తున్న పెళ్ళి కొచ్చిన వాళ్ళలో ఒక పెద్దాయన "ఇద్దరూ ఇద్దరే" అనటానికి బదులు "దొందూ దొందే!" అన్నాడట.
~~~~~~~~~~

Saturday, October 2, 2010

`చూస్తే పోలా' అనుకుంటే ప్రాణాలే పోయాయి, పాపం!

[టీవీలో నాగ రాజు]


సుబ్బలష్షిమి:
బావా! ఇదేదో దోమ గ్రామమట. ఆ వూళ్ళో ఒకరింట్లో టీవీలోకి పాము దూరింది చూశావా?

సుబ్బారావు:
అవును మరదలా! "జనాలంతా టీవీలకి అతుక్కుపోయి చూస్తుంటారు కదా! అసలేముందో ఆ పెట్టెలో, ఓసారి చూస్తే పోలా?" అనుకుందేమో మరదలా!

సుబ్బలష్షిమి:
పాపం! `చూస్తే పోలా' అనుకుంటే ప్రాణాలే పోయాయి బావా!

Friday, October 1, 2010

ప్రజలేప్పుడైనా శాంతికాముకులే!

[ఎంత గొప్ప పరిణితి! సంయమనం భరత జాతికే చెల్లు. అయోధ్య తీర్పు నేపధ్యంలో అల్లర్లు జరగకుండా శాంతి పాటించిన ప్రజలని అభినందిస్తున్న ఈనాడువార్త నేపధ్యంలో.]

సుబ్బలష్షిమి:
బావా! నిన్న అయోధ్య తీర్పు వెలువడిన నేపధ్యంలో... ప్రజలంతా శాంతి సామరస్యాలతో, సంయమనం పాటించారు. అదే 1989లో శిలాన్యాస్, 1992లో కరసేవల నేపధ్యంలో... మతఘర్షణలు, రక్తధారలూ చోటు చేసుకున్నాయి. తేడా ఎక్కడుంది బావా?

సుబ్బారావు:
అద్వానీలు, అశోక్ సింఘాల్‌లు, ఇమాం బుఖారీలు, ఓవైసీలు, బిన్ లాడెన్‌లూ రెచ్చగొట్టక పోతే ఎప్పుడైనా, ఏ దేశంలోనైనా ప్రజలు శాంతి కాముకులే మరదలా!

సుబ్బలష్షిమి:
వెరసి... ప్రజలు మంచివాళ్ళే బావా! నాయకులే పుచ్చుబద్దలు!