Wednesday, April 29, 2009

నిరాహార దీక్షలు ఇలా కూడా చేయవచ్చన్న మాట !

[తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి హైటెక్ ఆమరణనిరాహార దీక్ష వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! తమిళనాడు సి.ఎం. కరుణానిధి మొన్న హఠాత్తుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడట. లంకలో యుద్ధం కారణంగా తమిళులు నలిగిపోతున్నారని, అంచేత సైన్యం యుద్ధం ఆపాలని డిమాండ్ చేస్తూ దీక్షబూనాడట. సింగిల్ కాట్, మెత్తటి పరుపు, రెండు కూలర్లు గట్రా పెట్టుకుని మరీ నిరశన వ్రతం చేపట్టాడు. బహుశః స్వాతంత్ర సమరం రోజుల్లో ఎవరూ ఊహించి ఉండరు కదూ భవిష్యత్తులో నిరశన వ్రతాలు, నిరాహార దీక్షలూ కూడా ఇంత లగ్జరీగా చేయవచ్చని!

సుబ్బారావు:
అవును మరదలా! ‘పోనీలే పాపం, కరుణానిధి వయస్సు పైబడ్డవాడు’ అని సరిపెట్టుకుందామన్నా, ఆనాడు బ్రిటిషు వాళ్ళకి వ్యతిరేకంగా అంతకంటే వయోవృద్దులు కూడా నిరాహార దీక్షల్లోనూ, హర్తాళ్ ల్లోనూ పాల్గొన్నారు మరి!
***********

లెవెల్ పెరుగుతుంది కదా! అందుకు వ్యతిరేకించడం గానీ…

[ఎన్నాళ్ళకీ ‘మమత’, 2001 తర్వాత ఒకేవేదికపై సోనియాగాంధీ, మమతా బెనర్జీ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
గత దశాబ్ధంలో, సోనియా గాంధీ విదేశీయతని ప్రశ్నిస్తూ, ఆ విదేశీ మహిళ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించడాన్ని వ్యతిరేకిస్తూ, మమతా బెనర్జీ పార్టీ నుండి వెళ్ళిపోయి, తృణమూల్ కాంగ్రెస్ పెట్టుకుందిట. మళ్ళీ అదే సోనియా గాంధీ తో పొత్తుపెట్టుకుని ఒకే వేదికని పంచుకుంది. ఇప్పుడు సోనియా గాంధీ, మమతాబెనర్జీ దృష్టిలో స్వదేశీ మహిళ అయిపోయిందా బావా?

సుబ్బారావు:
ఇదే కేసు శరద్ పవార్ ది కూడా! పార్టీలో ఉంటే సబార్డినేటు. వ్యతిరేకించి స్వంత పార్టీ పెట్టుకుంటే పొత్తుదారు. లెవెల్ పెరుగుతుంది కదా! అందుకు వ్యతిరేకించడం గానీ, వాళ్ళు పైకి చెప్పే కారణాలు నిజం కావు మరదలా!

Tuesday, April 28, 2009

మాట మార్చింది ఎవరు? నిజం ఏమిటి?

[విదేశీ అకౌంట్లలో నల్లధనం – భారత రాజకీయ పార్టీలకు ఇది ఎన్నికల మేతగా దొరికింది. వారు చెబుతున్న మొత్తాలు విశ్వగించేట్లు లేవు – స్విస్ బ్యాంకర్ల అసోసియేషన్ వ్యాఖ్య నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
ఈవార్త చూశావా బావా! ఎన్.డి.టివీ లో వ్యాఖ్యానిస్తూ స్విస్ బ్యాంకర్ల అసోసియేషన్ ప్రతినిధి నాసర్, ‘లక్షల కోట్ల నల్లధనం స్విస్ బ్యాంకుల్లో లేదనీ, అంత భారీ మొత్తాల గురించి మాట్లాడుతూ భారత రాజకీయ పార్టీలు ఎన్నికలలో లబ్ధి పొంద ప్రయత్నిస్తున్నాయనీ’ అన్నాడట. కొన్నిరోజుల క్రిందట ఈ ఆసోసియేషన్ వాళ్ళే స్విస్ లో నల్లధనం దాచిన దేశాల్లో భారతదేశమే మొదటి ర్యాంకులో ఉందనీ అన్నారంటూ పత్రికలు ప్రకటించాయి. ఇప్పుడీ వార్త! ఇంతకీ ఏం జరిగి ఉంటుంది బావా?

సుబ్బారావు:
ఏమైన జరగవచ్చు మరదలా! ఈ స్విస్ బ్యాంకర్ల అసోసియేషన్ మాట మార్చి ఉండొచ్చు. లేదా పత్రికలు రంగు మార్చి ఉండవచ్చు. లేదా కాంగ్రెస్ పార్టీగానీ, ఇతర పార్టీలు గానీ, మొత్తంగా డబ్బుదాచుకున్న బడాబాబులు గానీ, లాబీయింగ్ చేసి, బ్యాంకర్ల అసోసియేషన్ తమకు అనుకూల ప్రకటన చేసేలా ప్రభావపరిచి ఉండొచ్చు!
***********

Sunday, April 26, 2009

నాజుకైన నాలుకలు ఎన్నిఒంపులైనా తిరుగుతాయి

[నిన్న తిట్టుకుని, ఈరోజు భాయీ భాయీ అంటున్న ప్రణబ్, లాలూ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మంగళవారం బీహార్ ఎన్నికల ప్రచార పర్యటనలో ప్రణబ్ ముఖర్జీ, లాలూ మీద తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడట. ఈసారి మంత్రి అయ్యేదీ అనుమానమే అన్నాడట. దానికి లాలూ కూడా తీవ్రంగా స్పందించాడట. మంగళవారం రాత్రి మళ్ళీ ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుని ఒకటైపోయారట. లాలూపై వచ్చీరాని హిందీలో తాను చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి కారణమయ్యాయని ప్రణబ్ బుధవారం విలేఖరులకి చెప్పారట.

సుబ్బారావు:
ప్రతీసారి తమ మాటలని మీడియా వక్రీకరించింది అంటే వినేవాళ్ళకి బోరు కొడుతుందని, పాపం ఈసారి నింద తన హిందీ పరిఙ్ఞానం మీద వేసుకున్నారన్నమాట. అంతేమరదలా! రాజకీయ నాయకుల నాలుకలు మహా నాజూకైనవి, ఎన్ని ఒంపులైనా తిరగ్గలవు.

మా నాన్నకు, మా అమ్మకు ఉన్నతేడా ఇదే: రాహుల్ గాంధీ

[ఇప్పటికప్పుడు ప్రధాని అయ్యేంత అనుభవం నాకు లేదు, వందరూపాయలకు 10 పైసలే ప్రజలకు చేరుతున్నాయి - రాహుల్ గాంధీ ]

సుబ్బలష్షిమి:
బావా! ఈవార్త చదివావా? ఇప్పటికిప్పుడు ప్రధాని అయ్యే అనుభవం తనకి లేదని రాహుల్ గాంధీ, పాపం చివరాఖరికి చెప్పుకుంటున్నాడు. అంతేకాదు, వాళ్ళ నాన్న “రూపాయికి పది పైసలే సామాన్యుడికి అందుతోంది’ అని అన్నాడట. అయితే ఇప్పుడు ‘వందరూపాయలకి పదిపైసలు’ అందుతున్నాయట సామాన్యుడికి. రాహుల్ గాంధీ విశ్లేషిస్తున్నాడు.

సుబ్బారావు:
అదే మరదలా! వాళ్ళనాన్నకీ, అమ్మకీ ఉన్నతేడా! రాజీవ్ గాంధీ పాలననాటి రోజుల్లో సామాన్యుడికి రూపాయికి పదిపైసలు చేరితే, సోనియాగాంధీ పాలనలో దోపిడి కాస్తా వందరూపాయలకి పదిపైసలయ్యింది. పాపం, రాహుల్ గాంధీ! ఇప్పటికైనా నిజం ఒప్పుకున్నాడు.

**********

Friday, April 24, 2009

పొరుగుదేశాల్లో భారత రాజకీయపార్టీల ఎన్నికల ప్రచారం

[పాక్ కూ పాకిన కమలం! రెండు పత్రికల్లో భా.జ.పా. ప్రకటనలు. బంగ్లాదేశ్ మీడియాలో కాంగ్రెస్ విపరీత ప్రచారం. అదేబాటలో పార్టీలు. బంగ్లా, నేపాల్ మీడియా ద్వారా ప్రచారం – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
పొరుగుదేశాల్లో భారత రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారం చేస్తున్నాయట. ఎందుకు బావా?

సుబ్బారావు:
అదే నాకూ వింతగా ఉంది మరదలా! ఇదీ విషయం అని వ్రాసిన పత్రికలేవీ, దాని వెనుక ఉన్న మర్మమేమిటో, కారణమేమిటో వ్రాయలేదు. వార్తలు సమగ్రంగా అందించే వారే లేరు గదా!

సుబ్బలష్షిమి:
పత్రికలు కొనటం, ప్రైవేటు టి.వీ. ఛానెళ్ళకు నెలనెలా రుసుములు కట్టటమేగానీ నిజం చెప్పేవాళ్ళు మాత్రం లేరు. చీకట్లో ఏనుగుని తడుముతున్న గుడ్డివాళ్ళలా ఉంది సామాన్యుల పరిస్థితి.

************

Wednesday, April 22, 2009

సోనియా రామాయణం

[రామరాజ్యంలో విద్వేషాల్లేవ్. అద్వానీ అది తెలుసుకోవాలి – సోనియా, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సోనియా గాంధీ రామాయణం ఎప్పుడు చదివిందో మరి! రామరాజ్యంలో విద్వేషాల్లేవ్ అని అద్వానీకి ఉపదేశం చేస్తోంది. రామరాజ్యం సంగతి తరువాత, ఆవిడ విద్వేషాల మాటేమిటి? తన అవినీతిని ప్రశ్నించిన సీనియర్లు, మార్గరేట్ ఆల్వా లాంటి వారిని పంపించేసింది, పీ.వి.నరసింహారావు వంటి వారిని మరణానంతరం కూడా అగౌరవపరిచింది కదా!

సుబ్బారావు:
పిచ్చిమరదలా! దీనికే ఆశ్చర్యపోతున్నావు. ఈ మధ్య సోనియా, ఆమె సంతానం భారత పురాణగ్రంధాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు తెలుసా? మొన్న ప్రియాంక వాద్రా, తన తమ్ముడు వరుణ్ గాంధీకి భగవద్గీత చదవమని సలహా ఇచ్చింది. నిన్న సోనియా గాంధీ [తన అన్నలాంటి] అద్వానీకి రామాయణం తెలుసుకోమని ఉపదేశం ఇచ్చింది. ఇదో కొత్త ప్రక్రియ మరి!

సుబ్బలష్షిమి:
బహుశః భారతంలో కురుక్షేత్రం అనంతర పరిణామాల్లో స్వర్గారోహణ పర్వం ఉన్నట్లు, తమందరకీ ఈ ఎన్నికల రణక్షేత్రం అనంతర పరిణామాల్లో నరకావరోహణ పర్వం ఉంటుందని భయమేస్తోందేమో!

*************

Tuesday, April 21, 2009

మీడియా మాయా జాలమా, రాజకీయ నాటకమా?

[అవసరమైతే లెప్ట్ తో మళ్ళీ దోస్తీ – ప్రధాని వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చూశావా? ఎన్నికల తర్వాత, అవసరమైతే లెప్ట్ తో మళ్ళీ దోస్తీ చేస్తాడట ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. పోయినేడాది జూలైలో, విశ్వాసపరీక్షకు ముందు వెనుక రోజుల్లో, రోజుకో దూషణ చేసాడు కదా, ‘లెప్ట్ పార్టీవాళ్ళు తనని హీనంగా చూశారని, ప్రతీరోజూ అవమానాలు సహించాననీ’ అన్నాడు. పోతే పోండని తరిమేసాడు. మళ్ళా ఈ రోజు ఇదేమిటి?

సుబ్బారావు:
అలా కాదు మరదలా! ముందు సిగ్నల్ ఇస్తున్నాడన్న మాట. దానిమీద లెప్ట్ వాళ్ళు వెక్కిరింతగా మాట్లాడరనుకో. వెంటనే మీడియా వక్రీకరించింది అంటే సరిపోతుంది.

సుబ్బలష్షిమి:
అయితే, ఇది మీడియా మాయాజాలం అనుకోవాలా, రాజకీయ మతలబు అనుకోవాలా?

ప్రజలకో న్యాయం, రాజకీయనాయకులకీ, వారి మిత్రులకీ ఒక న్యాయం

[రాప్తాడు కాంగ్రెస్ అభ్యర్ధి తోపుమర్తి ప్రకాశ్ రెడ్డి అరెస్టు – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
తమ పగవారిపై యాసిడ్ దాడి కేసులో అరెస్టయిన రాప్తాడు కాంగ్రెసు అభ్యర్ధి తోపుమర్తి ప్రకాశ్ రెడ్డి, గతంలో పరిటాల రవి హత్య కేసు విషయంలో మూడేళ్ళు జైల్లో ఉండి వచ్చాడట. ఇంత నేర చరితులకి ఎన్నికల్లో పొల్గొనే అర్హత ఎలా వచ్చింది బావా? అదే మనలాంటి సామాన్యులకి పాస్ పోర్ట్ కావాలన్నా, కష్టపడి చదివి ఐ.ఏ.ఎస్.కో లేక ఐ.పి.ఎస్.కో వ్రాత పరీక్షలూ, ఇంటర్యూలలో గట్టెక్కినా, శిక్షణకీ ప్రవేశం రావాలంటే స్థానిక పోలీసు స్టేషన్ లలో నుండి క్లీన్ చిట్ పొందుపరచాల్సి ఉంటుంది గదా! మరి అవేవీ రాజకీయ నాయకులకి వర్తించవా?

సుబ్బారావు:
బహుశః తమ జీతభత్యాలు పెంచుకుంటూ ఎంచక్కా రాజ్యాంగ సవరణలు చేసుకున్నట్లు, గప్ చుప్ గా ఇలాంటి విషయాల్లోనూ ఏవో మినహాయింపులూ, మతలబులూ చేసుకున్నారేమో మరదలా! ఈ రాప్తాడు కాంగ్రెస్ అభ్యర్ధి ఒక్కడేనా ఏమిటి? లాలూప్రసాద్ యాదవ్ పశువుల దాణా కుంభకోణం లో జైలుకు వెళ్ళి రాలేదా? శిబుసోరన్ తన పి.ఏ. హత్య కేసు విషయంలో జైలుకు వెళ్ళిరాలేదా? బహుశః ఇంకా కేసులు కోర్టులో సా………గ దీయబడుతూ ఉంటాయి. ఇంకా తీర్పువెలువడి తమ దోషులుగా నిరూపించబడలేదు గనుకా, కేవలం నిందుతులు మాత్రమే గనుకా నేరచరితులు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అన్నరూల్ తమకు వర్తించదు అని చట్టసవరణలు చేసుకుని ఉంటారు.

సుబ్బలష్షిమి:
మొత్తానికి ప్రజలకో న్యాయం, రాజకీయనాయకులకీ, వారి మిత్రులకీ ఒక న్యాయం! ఏం ప్రజాస్వామ్యం బావా ఇది?

సుబ్బారావు:
ఇది ప్రజాస్వామ్యం అనుకుంటే అది నీ అమాయకత్వం మరదలా! ఇది ప్రజాస్వామ్యం కాదు. దొంగల రాజ్యం, అంతే!

*********

Monday, April 20, 2009

జూ. ఎన్టీయార్ Vs లోక్ సత్తా జె.పి. – ఈనాడు ప్రాధాన్యత ఎవరికి?

[నేడు టీవీల్లో జూనియర్ ఎన్టీ ఆర్ మలి విడత ప్రచారం, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎలక్ర్టానిక్ మీడియా, పేపర్ మీడియా ముఖ్యంగా ఈనాడు ఈ జూనియర్ ఎన్టీ ఆర్ కి ఇచ్చిన ప్రచారంలో పదోవంతు కూడా లోక్ సత్తా అభ్యర్ధులకీ గాని, జయప్రకాష్ నారాయణకు గాని ఇవ్వలేదు చూసావా? వయస్సులోనూ, అనుభవంలోనూ, మేధస్సుల్లోనూ, వాగ్ధాటిలోనూ వేటిల్లోనూ జే.పి., జూనియర్ ఎన్టీ ఆర్ తో సరితూగ లేక పోయాడా?

సుబ్బారావు:
భలే దానివే మరదలా! ఈనాడు రామోజీరావుకి అవినీతి, అనైతికత లోంచి వచ్చిన వాళ్ళ మీద ఉన్నంత ప్రేమ, నిరంతరం నీతి, నిజాయితీలతో, ప్రజలను చైతన్యపరుస్తూ మాట్లాడే వాళ్ళ మీద ఉంటుందా? నువ్వెంత అమాయకురాలివి?

***************

ప్రభాకరన్ కరుణానిధికే కాదు, సోనియాగాంధీకి కూడా మంచి మిత్రుడే!

[ప్రభాకరన్ ఉగ్రవాది కాదు. నాకు మంచి మిత్రుడు – కరుణానిధి, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వార్త చదివావా?? ఎల్.టి.టి.ఇ. ప్రభాకరన్ ఉగ్రవాది కాదట. తనకు మంచి మిత్రుడట. డి.యం.కె. కరుణానిధి చెబుతున్నాడు.

సుబ్బారావు:
అంటే భారత మాజీ ప్రధాని, ప్రస్తుత యూ.పి.ఏ. ప్రభుత్వకుర్చీవ్యక్తి సోనియాగాంధీ భర్తా అయిన రాజీవ్ గాంధీని హత్య చేసిన ధనూ, శివరాసన్, శుభ, నళిని లాంటి ఎల్.టి.టి.ఇ. సభ్యులు కూడా కరుణానిధికి మిత్రులేనన్నమాట.

సుబ్బలష్షిమి:
అందుకే గదా మరి! యూ.పి.ఏ. కుర్చీవ్యక్తి డి.ఎం.కె. వాళ్ళందరికీ పదవులిచ్చి మరీ తన ప్రభుత్వంలో చేర్చుకుంది!

*************

ఐదేళ్ళ క్రితం కూడా ఇదే డైలాగ్, వ్యక్తి మారాడు అంతే!

[వై.యస్. అక్రమ సంపాదన వెలికితీస్తాం – చంద్రబాబు, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఐదేళ్ళ క్రితం, ఇదేమాట వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు గురించి అన్నాడు కదా?

సుబ్బారావు:
ఇంకో ఐదేళ్ళ తర్వాతా ఇదే డైలాగు విన్పిస్తుంది. రాజకీయ పార్టీలూ, నాయకులూ కలిసి మ్యూజికల్ ఛైయిర్ ఆట ఆడుకుంటున్నారు, ప్రజలు చూస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో?

*************

Thursday, April 16, 2009

ఉగ్రవాదాన్ని అన్నిరాజకీయ పార్టీలు సహిస్తాయి

[ఉగ్రవాదాన్ని దేశం సహించదు – మన్మోహన్ సింగ్, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఉగ్రవాదాన్ని దేశం సహించదట. మన్మోహన్ సింగ్ ప్రకటించాడు, చూశావా బావా!

సుబ్బారావు:
అవును మరదలా! ఉగ్రవాదాన్ని దేశప్రజలు సహించరు గానీ అన్నిరాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు సహిస్తాయి.
********

అవును మరి! సేవించేది తమనే కదా!

[మన్మోహన్ సేవలు అమోఘం – రాహుల్ గాంధీ, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
మన్మోహన్ సేవలు అమోఘమని రాహుల్ గాంధీ శ్లాఘీస్తున్నాడు చూశావా బావా!

సుబ్బారావు:
అవును మరదలా! మన్మోహన్ సేవలు చేసేది తమ కుటుంబానికే అయినప్పుడు అమోఘం అని గాక రాహుల్ గాంధీ మరేమంటాడు?

*********

రాహుల్ భయ్యా! త్వరగా ఎక్కు



ప్రియాంకా వాద్రా: రాహుల్ భయ్యా! త్వరగా ఎక్కు, ప్రధాని సీటు మనదే. లేకపోతే ఎవరయినా ఎక్కుతారేమో?