Thursday, October 28, 2010

‘సానుకూల దృక్పధం’ అంటే ఇదన్న మాట!

[సివిల్స్...తీరు మారిన ప్రిలిమ్స్ -సాక్షి విద్య శీర్షిక నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసి వెళ్ళిన స్మితా సబర్వల్ అనే ఐఎఎస్ అధికారిణి, సివిల్స్ విధానం మీద తన అభిప్రాయం చెబుతూ, సివిల్స్ కు తయారయ్యే అభ్యర్ధులకి సూచనలిస్తోంది. ఈవిడ 2001లో సివిల్స్ ఆలిండియా స్థాయిలో 4వ ర్యాంకు సాధించిందిట. ఈవిడ భర్త ఐపీఎస్ అధికారి. ఓసారి కర్నూలు జిల్లా సంచికలో ఈవిడ ఇంటర్యూ చదివాం, గుర్తుందా!

సుబ్బారావు:
గుర్తుంది, అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
ఈవిడ సానుకూల దృక్పధం(positive thinking) ఎంతటిదో తెలుసా బావా? గతేడాది కర్నూలు వరదల్లో కొంపా గోడూ సర్వం కోల్పోయిన బాధితులకు పంపిన వాటిల్లో 50బస్తాల బియ్యాన్ని పరీక్షిస్తే... అందులో 47 బస్తాల దాకా.... 50కిలోలకు బదులు 45-46 కేజీలే ఉన్నాయి. రెడ్ హాండెడ్ గా పట్టుబడిన ఈ సంఘటన, అప్పటి అవినీతికి ఓ మచ్చుతునకన్న మాట!

అదే విషయం నిలదీస్తూ, ఈ జాయింట్ కలెక్టర్ ని అప్పట్లో విలేఖర్లు నిలదీస్తే... ఈవిడ ‘అది వ్యతిరేక ఆలోచన(Negitive thinking) విధానమంటూ’..."మీరు తరుగుపడిన ఆ 47బస్తాలనే చూస్తున్నారు, సరైన కొలత ఉన్న 3బస్తాలనెందుకు చూడరు? ఇలా తప్పుబడుతూ పోతే, ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయలేరు" అంది. అప్పట్లో కర్నూలు జిల్లా సంచికలో వచ్చిన వార్త అది!

వరద బాధితుల కడుపు నింపేందుకు పంపిన తక్షణ ‘సాయం’లోనే... అంత ‘మాయం’ చేయగల సదరు ప్రభుత్వ ఉద్యోగుల చేతివాటం... ఇక శాశ్వత సాయంలో ఎలా ఉంటుందో... ఇప్పటికీ బాగుపడని కర్నూలు వరదబాధితుల బ్రతుకు చిత్రమే చెబుతుంది కదా!?

అంతలా తమ పనితీరు సమర్ధించుకున్న ఈ సివిల్స్ మాజీ టాపర్, ఇప్పుడు కాబోయే సివిల్స్ టాపర్లకు సలహాలిస్తోంది. అసలు ఈవిడకు సివిల్స్ లో 4వ ర్యాంకు ఎలా వచ్చింది బావా?

సుబ్బారావు:
బహుశః ఈ ‘సానుకూల దృక్పధం’తోనే సంపాదించి ఉంటుంది మరదలా!

11 comments:

  1. హహహ.. ఎంత గలీజ్ ది అది.. శవాల పై పేలాలు ఏరుకునె పని ..వరద బాధితుల సహాయాన్ని దోచటం అంటే ..

    ReplyDelete
  2. ఇందులో ఆమెను తప్పుపట్టాల్సిన అవసరం లేదేమో. అంటే ఆమెనే బియ్యం నొక్కేసి వుంటుందనుకోను. 2-3కె.జి ల బియ్యం నొక్కేసిన వాళ్ళు ఏ కూలీలో అయి వుంటారు. కలెక్టర్ దర్యాప్తు చేయడం అనవసరమైన వేస్ట్ అని ఆమె వుద్దేశ్యం అయి వుండవచ్చు. ఇలా ఆమె అర్హతను ప్రశ్నించడం సరి కాదేమో.

    ReplyDelete
  3. కిరణ్ గారు: మీ కోపం సహేతుకమే గానీ, భాష అభ్యంతరకరమండి. ‘వాళ్ళు చేస్తే తప్పు లేదు గానీ మనం అంటే తప్పొచ్చిందా?’- అంటే ఏం చెప్పలేమను కోండి! :)

    ReplyDelete
  4. snkr గారు: ఈ విషయంలో మీతో ఏకీభవించలేనండి!

    ReplyDelete
  5. మీరు ఏకీభవించినా, వించకున్నా కలెక్టర్లు(అదీ direct IAS, not conferred IAS officer) ప్రతి సంచి నుంచి 2-3కె.జి.లు గిల్లుతారనే మీతో ఎవరైనా ఏకీభవిస్తారేమో చూద్దాం.

    ReplyDelete
  6. అక్కడ సమస్య ఉంది అనేది నిజమే అయ్యుండొచ్చు. ప్రతి బస్తాలో కొన్ని కేజీలు తగ్గించి ఎవడో పనికిమాలిన వాడు అవినీతి చేసి ఉండొచ్చు.

    కాకపోతే అటువంటి నెగెటివ్ చర్చకీ దానిమీద ఆందోళనకీ అది సమయం కాదు తరువాత దాని సంగతి చూడొచ్చు అని ఆమె భావించి ఉండొచ్చు కదండీ.

    వరదల్లాంటి సమయాల్లో మన ప్రజలు నిరాశా వాదాన్నీ, అపనమ్మకాన్నీ పక్కన బెట్టి ప్రవర్తిస్తారు. అటువంటి వాటి మీద కూడా నమ్మకం సడలి పోయే విధంగా ఉండకూడదు అనే మార్గంలో ఆవిడ చేసుంటే అభినందించాల్సిందే కానీ మరీ కోడిగుడ్డుకు ఈకలు పీక కూడదేమో!

    ReplyDelete
  7. వీకెండ్ పొలిటీషియన్ గారు: 1990ల్లో వైజాగ్ ఏరియాలో తుఫాన్ వచ్చిందండి. అప్పట్లో మా వారు వైజాగ్ లో ఉండేవాళ్ళు. అప్పటి వైజాగ్ కలెక్టర్ (మా వారికి గుర్తుండి దయాకర్ శర్మ), బాధితులకి పంపుతున్న బ్రెడ్ పాకెట్స్ నుండి బ్రెడ్ తింటూ ప్యాక్ చేస్తున్న సిబ్బందిని చూసి, తానో ఐఏఎస్ అధికారినని కూడా మరిచిపోయి బండతిట్లూ తిట్టేసాడు, "అవతల ఆకలితో అల్లాడుతున్న వాళ్ళ కోసం పంపేటప్పుడు కూడా ఇంత కక్కుర్తా" అని! ఒకసారి వరదల్లో... మురికిలో... అన్ని పోగొట్టుకుని ఆకలిదప్పులతో, అల్లాడిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళకి సాయమందించాలనే తపన, విధి పట్ల నిజాయితీ అది!

    ‘యధా రాజ తధా ప్రజః’ అన్నట్లు, పైఅధికారిని బట్టే క్రింది వారి పనితీరు ఉంటుందన్నది మా నమ్మకం, అనుభవం కూడా!

    ఏడాది గడిచినా, వరద బాధితులు, కర్నూలు జిల్లా గ్రామాలలో ఇప్పటికీ గుడ్డ గుడారాల్లో బ్రతకటం గురించి మెయిన్ ఎడిషన్లలో రావు గానీ, జిల్లా ఎడిషన్ లో వస్తుందండి. ఇక ఆపైన మీకిది కోడి గుడ్డుకు ఈకలు పీకటంగా ఆనిపిస్తే.. అది మీ అభిప్రాయం, మీ విచక్షణ! నెనర్లు!

    ReplyDelete
  8. నాకు జరిగినదాంట్లో కొద్దిగా మంచి ఉద్దేశ్యం ఉందేమో అనిపించిందండి. అంతేగానీ జరిగినది సరైన పద్దతి అని చెప్పట్లేదు.

    కాకపోతే, జరిగిన తప్పుని గమనించారు కాబట్టి తరువాతైనా దాని మూల కారకుల్ని శిక్షించి ఉంటే బావుండేది. మరి అలా జరిగిందో లేదో నాకు తెలియదు. మామూలుగా మన వ్యవస్థ పనితీరు తెలుసు కాబట్టి జరిగుండక పోవచ్చు అనిపిస్తుంది.

    అప్పటికప్పుడు ఆవిషయం మీద రాద్ధాంతం చెయ్యకుండా ఉండడం మాత్రం ఒకరకంగా మంచిపనే అనిపిస్తుంది.

    ReplyDelete
  9. snkr గారు : అవినీతి, కూలీలు లేదా ఉద్యోగులు... ఎవరైనా చేసి ఉండొచ్చు. కానీ అది వెల్లడైనప్పుడు ఒక IAS అధికారిణి స్పందించాల్సిన తీరు అది కాదు. అక్కడా ఆమె దృక్పధమే కన్పిస్తోంది. దాన్నే నేను ఎత్తి చూపించాను. అలాంటి వ్యక్తులు, తర్వాత మాత్రం ఏపాటి చర్యలు తీసుకుంటారో తెలిసిందే కదా!? నెనర్లు!

    ReplyDelete
  10. క్షమించాలి ...సరిగా వ్రాయ లేదు .. ఎంత గలీజ్ పని అది ... అది = ఆ పని ..

    ReplyDelete
  11. కిరణ్ గారు: ఒకోసారి అంతే!:)

    ReplyDelete