Friday, May 28, 2010

వీళ్ళా దేశాలకు ప్రధమ మహిళలూ, ప్రముఖ మహిళలూ?

[కార్లా బ్రూనీ గతంలో ఇచ్చిన ఇంటర్యూ బయటకు పొక్కిన వార్త నేపధ్యంలో...
>>>లండన్: ఒకప్పుడు అందాల మోడల్‌గా ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం ఫ్రాన్సు ప్రథమ పౌరురాలైన కార్లా బ్రూనీ.. ఇప్పుడు తల పట్టుకుంటున్నారు. గతంలో ఆమె ఇచ్చిన ఓ ఎక్స్-రేటెడ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వెలుగు చూడటమే ఆ తలనొప్పికి కారణం.

28 ఏళ్ల వయసులో ఉన్నపుడు చానల్4లో వచ్చే యూరోట్రాష్ అనే షోలో ఆమె పాల్గొన్నారు. అందులో 'మీకు నా వక్షోజాలు నచ్చాయా' అని కూడా అడిగారు. తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఎప్పుడూ ఉండే 'సెక్స్ ఫ్రేజ్ బుక్' నుంచి ఈ వాక్యాన్ని జర్మన్, ఇటాలియన్, స్పానిష్ భాషల్లో చూసుకుని మరీ అడిగారు.

"మనం ప్రపంచమంతా తిరుగుతూ, రకరకాల వ్యక్తులను కలుస్తాం. కాబట్టి ఇలాంటి పుస్తకాలు మనవద్ద ఎప్పుడూ ఉండాలి. వాళ్లతో పడక పంచుకోవాలంటే ఏం చెప్పాలో మనకు తెలియాలి'' అంటూ బ్రూనీ సవివరంగా చెప్పారు.

రాక్‌స్టార్లు మిక్ జాగర్, ఎరిక్ క్లాప్‌టన్ సహా పలువురితో తనకున్న ఎఫైర్ల గురించి కూడా ఆమె చర్చించారు. 'ఒకరితోనే ఉండటం నాకు బోర్' అని ఆమె 2007లో చెప్పిన మాటలనే ఆ వీడియోకు టైటిల్‌గా పెట్టారు.]

సుబ్బలష్షిమి:
బావా! ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ మూడవ భార్య కార్లా బ్రూనీ, గతంలో మోడల్ గా పనిచేసినప్పుడు పత్రికలకు నగ్నంగా ఫోటో ఫోజులిచ్చింది. అప్పట్లో ఇంటర్యూలు కూడా ఇచ్చిందట. అలాంటి ఒక ఇంటర్యూ ఇటీవల బయటికొచ్చింది. ఆ వార్తాంశం చదివావా?

సుబ్బారావు:
ఇలాంటి వాళ్ళని మామూలుగా అయితే ‘వేశ్యలు’ అంటారు మరదలా! ఫ్యాషన్, వాణిజ్య రంగాలలో అయితే మోడళ్ళు అంటారు. వీళ్ళే... ప్రముఖ రాజకీయ నాయకులనో, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యుల్నో, ప్రేమలో పడేసి పెళ్ళి చేసుకుంటే.. ఆ దేశంలో ప్రధమ మహిళలూ, ప్రముఖ మహిళలూ అయిపోతారు.

సుబ్బలష్షిమి:
ఇంకా నయం బావా! అంతటితో ఆగారు! వాళ్లని ప్రధమ మహిళలూ, ప్రముఖ మహిళలూ అనటం గాకుండా ‘ఆదర్శ మహిళలూ’ అని ఉంటే మరింత భయంకరంగా ఉండేది.

Thursday, May 27, 2010

జగన్ మినరల్ వాటరట, రోశయ్య మామూలు వాటరట - అందరూ మూసీ వాటరే!

[మేం మినరల్ వాటరుని అడిగాం. అధిష్టానం నార్మల్ వాటర్ ఇచ్చింది. ఏమైనా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం.... అంటూ పార్టీ విప్ శైలజా నాధ్ తాము జగన్ ని సీఎంగా కోరుకున్నామనీ, అధిష్టానం రోశయ్యని సీఎంని చేసిందనీ పోలుస్తూ వ్యాఖ్యానించాడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ రాజకీయ నాయకుడు శైలజానాధ్ ఏమంటున్నాడో చూడు! జగన్ మినరల్ వాటర్ అట. రోశయ్య నార్మల్ వాటరట.

సుబ్బారావు:
అసలీ రాజకీయ నాయకులంతా, ఇమ్లిబన్ బస్టాండ్ ప్రక్క నుండి ప్రవహించే మూసీ వాటరే! ముక్కు మూసుకోలేక జనం అల్లాడుతున్నారు. అంతే!

ముక్కంటి మూడో కన్ను తెరిచే వరకూ ఇంతే!

[ఎఐడీఎంకే అధినేత్రి జయలలితకి సాష్టాంగ ప్రణామం చేస్తున్న తమిళ రాజకీయులు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ తమిళ రాజకీయ నాయకులు చూడూ! ఏఐడీఎంకే అధినాయకురాలు జయలలితకు, అక్షరాలా సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు. ఇంకా పొర్లు దండాలు కూడా పెడతారేమో! ఆవిడ కూడా స్థంబంలా నిలబడి దణ్ణాలు పెట్టించుకుంటోంది. దేవుడికి కూడా ఇంతగా దణ్ణాలు పెట్టరేమో కదా వీళ్ళు!?

సుబ్బారావు:
నిజమే మరదలా! పదవులు ఇస్తే చాలు! ఆ సీట్లలో కూర్చొని అక్రమార్జనలు చేస్కోనిస్తే చాలు! ‘దేవుడా గీవుడా! పదవులూ, పక్కదారి ఆదాయాలూ ఇచ్చే అధిష్టాన అధినేత్రులే అన్నీ!’ అనుకుంటున్నారు కాబట్టే.... ఇంతగా భజనలు చేస్తున్నారు. లేకపోతే చూడు! రోజూ కోట్లాది రూపాయల ఆదాయం, హిందూ దేవాలయాల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ సంపాదిస్తోంది. అందులో అందినంత సొమ్ము, మంత్రుల దగ్గరి నుండి అటెండరు దాకా అందరూ దండుకుంటున్నారు. ఈ రోజు, శ్రీకాళహస్తిలో, శతాబ్దాల క్రితం శ్రీకృష్ణదేవ రాయలు కట్టించిన గాలిగోపురం కుప్పకూలి పోయింది. పదేళ్ళ క్రితమే బీటలిచ్చినా, ఏ పార్టీ ప్రభుత్వానికి పట్టలేదు మరి!

సుబ్బలష్షిమి:
శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ముక్కంటి అంటారు బావా! ఆ ముక్కంటి మూడో కన్ను తెరిచే వరకూ, ఈ రాజకీయ నాయకులకి ‘ఒళ్ళూ పై’ తెలియదనుకుంటా!

అందరూ చైనాకే ఎందుకు క్యూ కడుతున్నారబ్బా?

సుబ్బలష్షిమి:
బావా! భారత రాష్ట్రపతి నిన్న చైనా పర్యటనకి వెళ్ళింది. చైనాలో సరిహద్దు సమస్య గురించి చర్చిస్తారట. మొన్న చైనా పర్యటనలో ఉండే జైరాం రమేష్, భారత ప్రధానిని అమెరికా అధ్యక్షుడు ఒబామా ’మిస్టర్ గురు’ అని సంభోదించాడని ఆర్భాటంగా ప్రకటించి, ఆపైన మరో విషయమై ప్రధాని చేతిలో చీవాట్లు తిన్నాడు. ఇలా వీళ్ళందరూ క్యూగట్టి మరీ చైనా వెళ్తున్నారేం ఈ మధ్య?

సుబ్బారావు:
ఏమో మరదలా? ఒకవేళ భారత్ లో, తమకి ఏదైనా అనుకొని ఉపద్రవం ఏర్పడితే.... ప్రజల దృష్టిని మళ్ళించి ముప్పు తప్పించుకునేందుకు, అలాంటి క్లిష్ట సమయంలో భారత్ మీద దాడికి దిగమంటూ లాబీయింగ్ చేస్తున్నారేమో! పైకి మామూలుగా రాష్ట్రపతి పర్యటన ఉంటుంది. రబ్బర్ స్టాంప్ రాష్ట్రపతి కూడా ఏమీ తెలియకుండానే[?], ఫార్మల్ గా పర్యటిస్తుంది. ఎటొచ్చి ఆ బృందంలో వెళ్ళే వాళ్ళే... చల్లగా సమాచార మార్పిడి పూర్తి చేసుకు వస్తారు.

సుబ్బలష్షిమి:
నిజమే బావా! అప్పట్లో వాఘా సరిహద్దు దాటి, లాహోర్ కు బస్సు యాత్ర చేసి వచ్చాడు ఆనాటి ప్రధాని వాజ్ పేయి! ఆ తర్వాతే కార్గిల్ యుద్దం జరిగింది. ఏదైనా జరిగాకే కదా తెలిసేది? అప్పటి వరకూ ఏ కన్నంలో ఏ పాముందో ఎవరికి ఎఱుక?

Wednesday, May 26, 2010

మీడియా నిఘంటువులో లజ్జా బిడియాలనే పదాలుండవు!

[టెన్నిస్ క్రీడాకారిణి రుచికా పై, హర్యానా పోలీసు మాజీ డీజీపీ రాధోడ్ లైంగిక వేధింపు, ఆత్మహత్యకు పురికొల్పటం కేసులో కోర్టు తీర్పు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రుచికా అనే ఈ అమ్మాయి కేసు చదివావా! 20 ఏళ్ళ క్రితం 14 ఏళ్ళ అమ్మాయిని పోలీసు ఉన్నతాధికారి లైంగికంగా వేధించాడు. కేసు పెట్టినందుకు ఆమె కుటుంబాన్ని, ఆమె స్నేహితురాలి కుటుంబాన్ని వేధించాడు. కేసు తెమలడానికి 20 ఏళ్ళుపట్టింది. 17 ఏళ్ళ క్రితమే అన్యాయానికి గురైన రుచికా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మహిషానికి మారుటి తమ్ముడు లాంటి రాధోడ్ కి మాత్రం, ప్రభుత్వం నుండి పదోన్నతి వచ్చింది. విశిష్ట సేవలకు[?] గుర్తింపుగా పసిడి పతకాలూ వచ్చాయి. నానా వెతలూ, వేధింపులూ పడి, రుచిక స్నేహితురాలు ఆరాధనా గుప్తా కోర్టులో పోరాడితే, అతగాడికి ఆరునెలలు జైలు శిక్ష పడింది. చివరికి దాన్ని 1 1/2 సంవత్సరాలుగా మార్చారు.

ఈ వార్త గురించి ఈనాడు పత్రిక ‘ఓ మగువ తెగువ’ అని వ్రాస్తూ.... ‘అటు మీడియా ఇటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆరాధనా గుప్తా పోరాడిందని’ వ్రాసింది తెలుసా?

సుబ్బారావు:
మీడియా సహకరిస్తే అసలా కేసు 20 ఏళ్ళు సాగేదా? పద్నాలుగేళ్ళ పసిపిల్ల అవమానానికీ, కుటుంబ వేధింపులకీ గురయ్యి ఆత్మహత్య చేసుకునేదా? కేసుపెట్టి పోరాడిన ఆరాధనా గుప్తా, కుటుంబంతో సహా వేధింపులకి గురయ్యేదా? ఆ రాధోడ్ కి పదోన్నతులూ, పతకాలూ వచ్చేవా? ఇంతా చేసి ఆ దుష్టుడికి పడింది తొక్కలోది ఆరునెలలు శిక్ష! ఇంకా కొనసాగిస్తే చివరికది ఒకటిన్నర సంవత్సరాలైంది. ఈపాటి దానికి ‘మీడియా సహకరించింది’ అని వ్రాసుకోవటానికి పత్రికా విలువలు అడ్డం రాకపోయినా, కనీసం లజ్జా బిడియాలన్నా అనిపించలేదు కాబోలు!

సుబ్బలష్షిమి:
లజ్జా బిడియాలా? మీడియాకి అసలా పదాలు నిఘంటువులోనే ఉండవు బావా!

Monday, May 24, 2010

సోనియా తప్పుచేసినా నిలదీస్తాం!... కాస్కోమల్లా!

[సోనియా తప్పుచేసినా నిలదీస్తాం... జగన్ వర్గం ఎం.ఎల్.ఏ.లు ఆదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఒకప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందంటేనే ఆర్జున్ సింగ్ లాంటి సీనియర్ నాయకులు సైతం గజగజ వణికేవాళ్ళు. ఇప్పుడు జూనియర్ ఎం.ఎల్.ఏ.లు కూడా `సోనియా తప్పు చేసినా నిలదీస్తాం. పార్టీలో తమకు ఆ హక్కు ఉంది' అంటున్నారు! పార్టీలో అంతగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందా బావా?

సుబ్బారావు:
ప్రజాస్వామ్యమా పాడా! పార్టీలో పరిస్థితులు తిరగబడ్డాయి మరదలా! గత ఏడాది చివరిలో, మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసుతో సహా పలువురు `అధిష్టానమా, అదెక్కడుంది? మాకు తెలిసింది వై.యస్. జగనే' అన్నారు. అయినా ఇప్పటికీ అధిష్టానం ఆ మంత్రుల్ని ఇంటికి పంపలేదు కదా! మంత్రివర్గ విస్త’రణం’ చెయ్యాలంటే అధిష్టానికీ భయమేస్తున్నట్లుంది. అంతగా పరిస్థితులు మారిపోయాయి మరి!

సుబ్బలష్షిమి:
షిప్పులు డింగీలు, డింగీలు షిప్పులూ అవ్వటమంటే ఇదే కాబోలు బావా!

Sunday, May 23, 2010

ఆ రోజు అవినీతిలో వాటా పుచ్చుకున్న అధిష్టానం, ఈ రోజు పత్తివిత్తనమా?

[వై.యస్. కుటుంబం, మంత్రులు రాష్ట్రాన్ని దోచారు. వారి దోపిడీతోనే దుస్థితి.... తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! చంద్రబాబు నాయుడు.... ఈ అక్రమాలపై తామిప్పుడు మాట్లాడటం కాదని, గతంలోనే ’రాజా ఆఫ్ కరప్షన్’ వంటి పుస్తకాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసి కెళ్ళామంటున్నాడు, చూశావా? పైగా... ఈ అవినీతిపై ఇప్పటికైనా సోనియా, మన్మోహన్ స్పందించాలని డిమాండ్ చేశాడు కూడా! అక్కడికి ఈ అవినీతి విషయంలో..... సోనియా మన్మోహన్ లు అభం శుభం తెలియని అమాయకులన్నట్లు, ఏం బిల్డప్ బావా ఇది?

సుబ్బారావు:
అదే గమ్మత్తు మరదలా! కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, కాంగ్రేసేతర భాజపా, తెదేపా గట్రా అన్ని పార్టీల వాళ్ళూ సోనియా, మన్మోహన్ లకి అవినీతిలో ‘అ ఆ’లు కూడా తెలియవన్నట్లు, వాళ్ళిద్దరూ మహా పత్తి విత్తనాలన్నట్లు మాట్లాడతారు. ఇంత అవినీతి వాళ్ళ అనుమతి లేకుండానూ, వాటాల్లేకుండానూ నడుస్తోందని నమ్మించ చూస్తారు. అంతా అంతర్గత సర్ధుబాటు మరి!

సుబ్బలష్షిమి:
నీకింకో విషయం గుర్తుందా బావా! ఇదే చంద్రబాబు నాయుడు, వై.యస్.బ్రతికి ఉన్న రోజుల్లో.... ఢిల్లీకి ప్రతీరోజూ సూట్ కేసుల కొద్దీ డబ్బు వెళ్తోందన్నారు. అప్పుడంతగా అవినీతిలో తమ వాటా తాము పుచ్చుకున్న ఢిల్లీ, హఠాత్తుగా ఇప్పుడు అమాయకం ఎలా అయిపోయిందో చంద్రబాబుకే తెలియాలి!

Friday, May 21, 2010

ఎప్పుడూ రాయల సీమ ఫ్యాక్షన్ గొడవలేనా? వెరైటీగా పాకిస్తాన్ ఫ్యాక్షన్ గొడవల సినిమాలొస్తే!

[పాకిస్తాన్ లో ఫ్యాక్షన్ గొడవలు వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కరాచీ లో ఇండియా నుండి పాకిస్తాన్ వెళ్ళి స్థిరపడిన ముస్లింల పార్టీ [MQM] వాళ్ళు, పాస్తున్ పఠాన్ ల పార్టీ [ANP] వాళ్ళ మధ్య ఫ్యాక్షన్ గొడవలట! ఇప్పటి దాకా మన తెలుగు సినిమా వాళ్ళు, రాయల సీమ ఫ్యాక్షన్ గొడవల మీద సినిమాలు తీస్తున్నారు కదా! ఈ పాకిస్తాన్ ఫ్యాక్షన్ మీద సినిమాలు తీస్తే వెరైటీగా ఉంటుంది కదా!

సుబ్బారావు:
ఈ విషయం అర్జంటుగా సీనియర్ ఎన్.టీ.ఆర్. ఫ్యామిలీకి తెలియ జేయాలి మరదలా! ఇక చూస్కో నా సామీ రంగా, బాలకృష్ణ గడ్డాలు పెట్టుకుని, ఏకె 47లు తీసుకుని.... ఎంత రంజుగా ఉంటాయో సినిమాలు!

Wednesday, May 19, 2010

రక్షాదారాలు ఫలించకపోతే బాణామతులు నేర్చుకుంటే సరి!

[రాయ్ బరేలీలో పలు పథకాలను ప్రారంభించిన సోనియా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రాయ్ బరేలీలో పూజలు చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతికి రక్షాదారాలు కట్టించుకుంది తెలుసా?

సుబ్బారావు:
ఈ రాజకీయ నాయకురాలు, చేసేదంతా చేసి రక్షాదారాలు కట్టించుకుంటే దేవుడు రక్షించేస్తాడా మరదలా?

సుబ్బలష్షిమి:
సరే! దేవుడు రక్షించకపోతే, ఆ తరువాత రామ్ గోపాల్ వర్మ దగ్గరికెళ్ళి చేతబడులు, బాణామతులు నేర్చేసుకుంటుందేమోలే బావా!

Tuesday, May 11, 2010

దెబ్బలబ్బాయి స్ట్రాటజీ కి విపర్యయం దండలబ్బాయి స్ట్రాటజీ !

[అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారతప్రధాని మన్మోహన్ సింగ్ ని ’మిస్టర్ గురు’ అని సంబోంధించాడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కోపెన్ హేగన్ లో ధరిత్రీ సదస్సు జరుగుతున్నప్పుడు, నల్లవజ్రం అంటూ గతంలో ఈనాడు/మీడియా తెగ ఊదగ పెట్టిన, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా... మన్మోహన్ సింగ్ ని ’మిస్టర్ గురు’ అంటూ మూడు సార్లు సంబోంధించాడట. ’మీ ప్రధానమంత్రి మాకు గురువు లాంటి వాడు’ అని కితాబిచ్చాడని, జీజింగ్ లో కేంద్రమంత్రి జైరాం రమేష్ చెబుతున్నాడు. "అలాంటి ప్రధానినీ, ఆర్ధిక వేత్తనీ, మేధావినీ పట్టుకుని మన దేశంలోనేమో అసమర్ధ ప్రధాని, రోబో ప్రధాని అనటం ఏపాటి సబబు?" అని కాబోలు!

సుబ్బారావు:
ఎవరైనా మాట వినలేదనుకో మరదలా! మరొకరిని దెబ్బకొట్టి "చూశావా? నిన్నూ ఇలాగే కొడతా" అన్నటాన్ని ‘దెబ్బలబ్బాయి స్ట్రాటజీ’ అంటారు మరదలా! దానికి విపర్యయమే ఈ దండలబ్బాయి స్ట్రాటజీ! అంటే "చూశావా! నీ కంటే గొప్పవాడు, లేదా అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నవాడు.... అంతటి వాడే నన్ను గురువు గారు అని పిలుస్తున్నాడు. నీకు అర్ధం కావడం లేదు" అనటం!

సుబ్బలష్షిమి:
బహుశః అధిష్టానానికి దేశంలో పట్టు తగ్గినట్లుంది బావా! అందుకని దెబ్బలబ్బాయిల బదులు దండలబ్బాయిని చూపుతున్నారు. ఈ మధ్య స్వంత పార్టీలో వాళ్ళే కేంద్ర,రాష్ట్ర మంత్రి వర్గంలో మధుకోడాలున్నారు అంటున్నారు కదా మరి?

Monday, May 10, 2010

కార్పోరేట్ వాళ్ళు తుమ్మినా దగ్గినా వార్తే మరి!

[లక్ష్మీమిట్టల్ పుత్రోత్సాహం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రవాస భారతీయుడు, కోట్లాదిపతి అయిన లక్ష్మీ నివాస్ మిట్టల్, భవిష్యత్తులో తమ కంపెనీ ‘యార్సెలర్ మిట్టల్’ పగ్గాలను, తన కుమారుడు అదిత్య మిట్టల్ తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాడట. ‘ఏమైనా నిర్ణయించాల్సింది మాత్రం బోర్డే’ అని కూడా వ్యాఖ్యానించాడట. ఇదేం వార్త బావా? మన వీధి చివర చిల్లర కొట్టు సుబ్బయ్య కూడా తన వ్యాపారాన్ని కొడుక్కే అప్పగించాడు. సుబ్బయ్య తండ్రీ అంతే! అలాగే.... లక్ష్మీమిట్టల్ తన వ్యాపారాన్ని, తన కొడుక్కి అప్పగించాలనుకుంటున్నాడు. దానికే ‘లక్ష్మీ మిట్టల్ పుత్రోత్సాహం’ అంటూ కవరేజ్ ఇస్తోందేమిటి మీడియా? పోనీ మిట్టల్ తన వ్యాపారాన్ని కొడుక్కి అప్పగించిన సందర్భంలో నన్నా వ్రాస్తే అర్ధం ఉండేది. అలా ఆకాంక్షించటమే వార్త అవుతుందా?

సుబ్బారావు:
ఓసి అమాయక మరదలా! మన వీధి చివరి సుబ్బయ్య చిల్లర కొట్టు, తిప్పికొట్టినా లక్ష చెయ్యదు. లక్ష్మీ మిట్టల్ కోట్లాదిపతి మరి! కార్పోరేట్ వాళ్ళు తుమ్మినా దగ్గినా వార్తే మరి! కార్పోరేట్ లకి కవరేజ్ ఇస్తే పైసలు ముడతాయి! సుబ్బయ్యకి కవరేజ్ ఇస్తే సున్నం తప్ప రాలేదేముంది?

సుబ్బలష్షిమి:
ఔనులే బావా! కార్పోరేట్లు సుష్టుగా తింటే సామాన్యులు బ్రేవుమని త్రేన్చాలనీ, అంబానీలు విల్లాలు కడితే, ‘అబ్బా మన దేశం ఎంత అభివృద్ది అయ్యింది’ అనీ.... మామూలు జనం మురిసి పోవాలంటుంది మీడియా!

`మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కడం' అంటే ఇదే కాబోలు!

[తీగ మీద నడుస్తున్నట్లుంది ప్రభుత్వ పరిస్థితిపై రోశయ్య - వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి రోశయ్య ‘తీగ మీద నడుస్తున్నట్లుంది’ అని వ్యాఖ్యానించాడట. ప్రభుత్వ పరిస్థితి నిజంగా అంత కష్టంగా ఉందా బావా?

సుబ్బారావు:
వాళ్ళకేం కష్టం మరదలా!? ఉంటే గింటే సామాన్య ప్రజల పరిస్థితి, పప్పు కూరగాయల ధరల మోతతో, పన్నుల వాతతో, పాఠశాలల ఫీజుల ఫిరంగులతో, అతలాకూతలమై, సామాన్యులకి తీగ మీద నడుస్తున్నట్లుంటుంది గానీ!

సుబ్బలష్షిమి:
నిజం బావా! ఓ ప్రక్క ప్రజల బ్రతుకుని అధ్వాన్నం చేస్తూ, తమకి కష్టంగా ఉందనటం! ‘మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కడం’ అంటే ఇదే కాబోలు!

వరాల మూటల్లాంటి ఫీజుల చెల్లింపు పధకాలు

[ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో, గత ఏడాది యాజమాన్య కోటాలో 55% సీట్లు, ఎవరూ చేరకుండా మిగిలి పోయాయి. ప్రభుత్వం చెల్లించే ట్యూషన్ ఫీజుల పధకం పుణ్యామాని ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు బ్రతికేస్తున్నాయి. ప్రక్షాళనకు తరుణం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! గత నాలుగేళ్ళలో ఏర్పాటైన నాలుగు వందలకు పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు, ప్రభుత్వమే ట్యూషన్ ఫీజులను చెల్లించే పధకం వరంగా మారిందట. ఏ నాణ్యతా ప్రమాణాలను చూసి ప్రభుత్వం ఈ కళాశాలలను పోషిస్తుందనేది చర్చనీయాంశంగా మారిందని పత్రిక వ్రాసింది. చూశావా?

సుబ్బారావు:
ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో 90%, రాజకీయ నాయకుల యాజమాన్యంలోనివే మరదలా! ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదలు ఎమ్మెల్యేల దాకా, అందరికీ విద్యావ్యాపారాలున్నాయి.

సుబ్బలష్షిమి:
అదా సంగతి! గుట్టు చప్పుడు కాకుండానే ప్రజా ప్రతినిధుల జీతభత్యాలని పెంచుకున్నట్లే, వరాల మూటల్లాంటి ఫీజుల చెల్లింపు పధకాలు తెచ్చుకున్నారన్న మాట! ఇక ఇందులో చర్చంచడానికేముంది, దోపిడి తప్ప!?

Sunday, May 9, 2010

ఆ నలుగురు నేపధ్యంలో మెగా అవసరాలు

[‘మెగా’ధీర - విశాఖ జిల్లా పాయక రావు పేటలో చిరంజీవి పర్యటన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య ఈనాడు ‘మగధీర’ కత్తి డాలూ వేలం!, మగ ధీర రామ్ చరణ్ తేజాకు ముంబైపిలుపు, ’మెగా’ధీర..... గట్రాగట్రా వార్తాంశాలతోనూ, చిరంజీవి పోలవరం యాత్ర అంటూనూ తెగ కవరేజ్ ఇస్తోంది కదూ!

సుబ్బారావు:
అవును మరదలా! సినిమా రంగంలో ‘ఆ నలుగురు’ అంటూ రచ్చమొదలైన నేపధ్యంలో.... ఏ అవసరాలు మారాయో గానీ, ఈనాడు, ఒకప్పుడు తెరాసకూ, కేసీఆర్ కూ ఇచ్చిన కవరేజ్ స్థాయిని క్రమంగా ప్రరాపాకూ, చిరంజీవికూ ఇస్తోంది!

సుబ్బలష్షిమి:
అవును బావా! పత్రికలు తమ అవసరాల కోసం వార్తలు వ్రాయడం కాక, ప్రజా ప్రయోజనాల కోసం వ్రాయడం ఎప్పుడూ చేస్తాయో కదా!

ప్రజల చెవిలో పెట్టడానికి రఫ్లేషియాను మించిన పూలు!

[మంత్రివర్గంలో మధుకోడాలు - రాయపాటి సాంబశివరావు .
కోడాల్లో గుండెదడ, తీగలాగమన్న అధిష్టానం - ఈనాడు వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొన్న జి.వెంకటస్వామి, నిన్న రాయపాటి, ఈ రోజు పాల్వాయి గోవర్ధన రెడ్డి. ఇలా సీనియర్లంతా అవినీతిపై ధ్వజం ఎత్తడం మీద కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారిస్తోందట. ఆరాతీయనున్నదట, తీగలాగుతున్నదట, తెలుసా బావా!

సుబ్బారావు:
అవసరమైనప్పుడు - ‘అధిష్టానానికి అన్నీ తెలుసు. ఏ రోజు పేపర్లలలో ఏమేం వార్తలొచ్చాయో వెనువెంటనే ఆఫీసుకు ఫాక్స్ లు వస్తాయని’ అంటారు మరదలా! అవసరాలు మారినప్పుడు ఇలా.... ఇదిగో ఇప్పుడే తెలిసినట్లు ఆరాతీయమన్నారు, తీగలాగమన్నారు అని వ్రాస్తాయి పత్రికలు!

సుబ్బలష్షిమి:
అవినీతి జాడే తమకు తెలియనట్లు! తమకి వాటాలే రానట్లు!.... ఏం నంగనాచి కబుర్లు బావా! ప్రజల చెవిలో పెట్టడానికి ఇంత కంటే పెద్ద పువ్వులు [రఫ్లేషియా] ఇంకెక్కడా దొరకవేమో!

రాజకీయాల్లో అంటరానితనమే కాదు.......

[రాజకీయాల్లో అంటరానితనం లేదు - అద్వానీ, వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొన్న పార్లమెంటులో కోతల తీర్మానానికి యూపీఏ [కాంగ్రెస్]కు అనుకూలంగా ఓటు వేసినందుకు జార్ఖండ్ లో శిబూసోరేన్ [జేఎంఎం] ప్రభుత్వానికి భాజపా మద్దతు ఉపసంహరించింది. మళ్ళీ అదే పొత్తులతో ఈసారి భాజపాకు జెంఎంఎం మద్దతిస్తూ ప్రభుత్వం ఏర్పడుతుంది. అదే అలయన్స్! మొన్న జేఎంఎం ముఖ్యమంత్రి, ఇప్పుడు భాజపా ముఖ్యమంత్రి! ‘కాంగ్రెస్ కు అనుకూలం’ అన్న పైకారణమే[over leaf reason] నిజమైతే, మద్దతు ఇవ్వడానికైనా, పుచ్చుకోవడానికైనా అభ్యంతరం ఉండాలి కదా? ఇవేం రాజకీయాలు బావా?

సుబ్బారావు:
భాజపా అగ్రనేత అద్వానీ చెబుతూనే ఉన్నాడు కదా మరదలా "రాజకీయాల్లో అంటరానితనాలు ఉండవని?"

సుబ్బలష్షిమి:
అంటరాని తనాలే కాదు బావా, రాజకీయాల్లో సిగ్గూ లజ్జా, విలువలు కూడా ఉండవని మరోసారి నిరూపించుకున్నారు!

Wednesday, May 5, 2010

మృతుల అనుమతి తీసుకునే చంపాడా?

[నిందితుడి అనుమతి లేకుండా నార్కో పరీక్షలు నిర్వహించటం రాజ్యాంగ విరుద్దం - సుప్రీం కోర్టు తీర్పు నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తో కూడిన డివిజన్ బెంచ్, ముంబై ముట్టడి విలన్ కసబ్ కేసు విషయమై, నిందితుడి అనుమతి లేకుండా నార్కో పరీక్షలు జరపటం రాజ్యాంగ విరుద్దమని తీర్పు చెప్పిందట. మరి సదరు నిందితుడు, భారత దేశం అనుమతి తీసుకుని వచ్చాడా, మృతుల అనుమతి తీసుకునే చంపాడా బావా?

సుబ్బారావు:
అవన్నీ అడగ కూడదు మరదలా! అసలు రాజ్యాంగం, మానవహక్కుల సంఘాలూ ఉన్నదే నిందితులనీ, నేరగాళ్ళనీ కాపాడేందుకు! ఆ కర్తవ్యాన్నే శక్తి వంచన లేకుండా కోర్టులూ నిర్వహిస్తున్నాయి. అలాంటప్పుడు తీర్పులు ఇలా ఉండక, ఇంకెలా ఉంటాయి చెప్పు!