Friday, January 30, 2009

25. సినిమా రంగం చేసుకున్న కర్మ

[సినిమా పరిశ్రమ పైరసీ తో మసి అయిపోతుందన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
సినిమాలు వచ్చిన కొత్తలో వీధి భాగవతులు, హరి కథలు, బుర్ర కథలు, పగటి వేషగాళ్ళు, పద్య నాటకాలు, తోలు బొమ్మలాటలు – ఇలాంటి వందలాది కళారూపాలు, వాటిని నమ్ముకొని అప్పటివరకూ బ్రతుకుతున్న వేలాది కుటుంబాలు మసి అయిపోయాయట కదా బావా, తాతయ్య చెప్పేవాడు!

సుబ్బారావు:
అవును మరదలా! జానపద కళా రూపాలని సినిమా సాంకేతిక ఙ్ఞానం మింగేసింది. ఇప్పుడు సినిమాని సి.డి., కంఫ్యూటర్ సాంకేతికత మింగేస్తుంది.

సుబ్బలష్షిమి:
పాపం! అప్పుడు జానపద కళాకారులు రోడ్డున పడ్డారు. ఇప్పుడు సినిమా వాళ్ళు రోడ్డున పడుతున్నారు.

సుబ్బరావు:
బాధిత వ్యక్తులు మారిపోయారు గానీ సినిమా రంగమైతే చేసుకొన్న కర్మ అనుభవిస్తున్నట్లే ఉంది మరదలా!

సుబ్బాలష్షిమి:
నిజమే బావా! 1992 కి ముందు, దాదాపు రెండు దశాబ్ధాలు నానా చెత్తాతీసి మన నెత్తిన రుద్దారు. అదేమంటే ‘తీస్తున్నారు గనుక చూస్తున్నాం, చూస్తున్నారు గనుక తీస్తున్నాం’ అంటూ Paradox లు చెప్పారు. ఆ అనుభవంతో జనం 10/-రూ. తో అద్దె సి.డి. చూసి సినిమాని పక్కన పారేస్తున్నట్లున్నారు. చూడబోతే ’సినిమారంగం’ చేసిన ఖర్మ అనుభవిస్తున్నట్లే ఉంది.

*****************

24. పరమానందయ్య శిష్యులు – మంగుళూరు పబ్బ్ Vs శ్రీరామ సేన

[మంగళూరు పబ్బులో తాగితందనాలు ఆడుతున్న ఆడవాళ్ళు – వాళ్ళని జుట్టుపట్టుకు ఈడ్చి తన్నిన శ్రీరామసేనల గురించిన వార్తల నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా! చిన్నప్పుడు పరమానందయ్య గారి శిష్యులు కథ చదివాం, గుర్తుందా?

సుబ్బారావు:
ఏ కథ మరదలా!

సుబ్బలష్షిమి:
ఓ సారి గురువుగారు తన శిష్యుల్లో ఇద్దరికి తన కాళ్ళు వత్తమని చెబుతాడు. కాళ్ళు వత్తుతున్న శిష్యుల్లో ఒకడు రెండోవాణ్ణి ’నీ కాలు డొక్కుది. నా కాలు బంగారం’ అంటూ తాను ఒత్తుతున్న గురువు కాలును చూపుతాడు. రెండోవాడికి వొళ్ళుమండి ’నీ కాలే డొక్కుది – చూస్కో’ అంటూ గురువు కాలిని కొడతాడు. దెబ్బతో ఇద్దరు కలిసి గురువుగారి రెండు కాళ్ళనీ చితగ్గొడతారు. ఆ కథ.

సుబ్బారావు:
ఆ కథా! అవునూ, ఇప్పుడు ఆ కథెందుకు గుర్తొచ్చింది నీకు?

సుబ్బలష్షిమి:
ఏం లేదు బావా! మంగుళూరు పబ్బులో ఆడవాళ్ళు తాగి తందనాలాడారట. అందుకు ఆగ్రహించిన ’శ్రీరామ సేన’ వాళ్ళు ఆ ఆడవాళ్ళని తన్ని తగలేసారట. వెరసి ఆ ఆడవాళ్ళు, ఈ సేన వాళ్ళూ కలిసి జయప్రదంగా భారతీయ సంస్కృతినీ భ్రష్ఠు పట్టిస్తున్నారు గదా!

సుబ్బారావు:
అవును మరదలా! తాగి తందనాలడటమూ తప్పే, ఆడవాళ్ళని హింసించడమూ తప్పే! వెరసి మీడియా మాత్రం ఈ సంఘటనని చక్కగా ఉపయోగించుకుంటోంది! సెన్సేషన్ కి సెన్సెషన్, డబ్బుకి డబ్బు; దేశ సంస్కృతిని భ్రష్ఠుపట్టించే అవకాశానికి అవకాశమూ! లేకపోతే – సమాజ పెద్దగా కనీసం రెండువర్గాల తప్పు ఒప్పుల్నీ విశ్లేషించాలి గదా! ఆ పని మీడియా ఛస్తే చేయదు గాక చేయదు.

***********

Thursday, January 29, 2009

23. పొలానికి నీళ్ళు పెట్టాల్సింది గిన్నెతోనా, చెంచాతోనా?



సుబ్బలష్షిమి:
బావా పై ఫోటో చూశావా! కాలవలో ‘ఎంత’ నీళ్ళు లేకపోయినా, రైతు పొలానికి మరీ అరచేతిలో పట్టేంత గిన్నెతో నీళ్ళు పెట్టడమా? ఇది మరీ ఓవర్ గా లేదూ?

సుబ్బారావు:
ఇంకానయం! చెంచాతో నీళ్ళు చల్లాడు కాదు. చూడబోతే ’పత్రికలో ఫోటో వేస్తాం, చెప్పినట్లు ఫోజు పెట్టవయ్య’ అంటే ఆయనెవరో గానీ రైతులాగా మోడలింగ్ చేసినట్లున్నాడు. ఇది మీడియా అతిశయోక్తో లేక వెటకారమో మరి!

********

22. ఏ సుత్తి అయినా ఒకటే గుండు పగలగొట్టటానికి

[మూసీనది ఒడ్డున, సన్ సిటీ కోసం భూములు గుంజు కుంటున్న ప్రభుత్వం వార్తల నేపధ్యంలో.....]


సుబ్బలష్షిమి:

ఓ వైపు వ్యవసాయం పండగ అంటూ మరో వైపు భూములు లాగేసుకుంటాడేమిటి బావా ఈ ముఖ్యమంత్రి?


సుబ్బారావు:

ముందటి ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ, కార్పోరేట్ వ్యవసాయం మేలు, ఐ.టి. మేలు అంటూ రైతుల్ని చావబాదాడు. ఇప్పటి ముఖ్యమంత్రి వ్యవసాయం పండగ అంటూనే భూముల్ని గుంజుకొని రైతుల్ని చావబాదు తున్నాడు.


సుబ్బలష్షిమి:

అయితే పైకి ఇద్దరూ వేర్వేరు మాటలన్నా, వెనకాల ఇద్దరు చేస్తోందీ ఒకటేనా బావా!


సుబ్బారావు:

జరుగుతున్నవి చూస్తుంటే తెలియటం లేదా మరదలా! ఏ సుత్తి అయినా ఒకటే గుండు పగలగొట్టటానికి!


************


Wednesday, January 28, 2009

21. బాదేటప్పుడు గబుక్కున బాదేయాలి. తాయిలం పెడతానంటూ ఊరించాలి

[పెట్రో రేట్లు తగ్గిస్తామంటూ కేంద్రమంత్రులు ఊరిస్తున్న ప్రకటనల నేపధ్యంలో......]

సుబ్బలష్షిమి:
బావా! పెట్రో ధరలు పెంచేటప్పుడు ఒక్క ఉదుటున పెంచేసారు కదా! మరి ఇప్పుడు తగ్గించేటప్పుడు ’తగ్గిస్తాం తగ్గిస్తాం’ అంటూ పదే పదే ప్రకటిస్తారు ఎందుకు? టక్కున తగ్గించవచ్చుగదా!

సుబ్బారావు:
అదేమరి నైపుణ్యం! బాదేటప్పుడు గబుక్కున బాదేయాలి. తాయిలం పెడతానంటూ ఊరించి ఊరించి ఆనక తీరిగ్గా కాసింత చేతిలో పెట్టాలి. తెలిసిందా!

****************

20. వాస్తవానికి దగ్గరకు వచ్చిన బ్రిటన్ మహిళలు

[బ్రిటన్ మహిళలు 32 వ ఏట తమ అందం ద్విగుణీకృత స్థితిలో ఉంటుందని భావిస్తున్నారన్న సర్వే వార్తల నేపధ్యంలో....]

సుబ్బలష్షిమి:
ఈ వార్త విన్నావా బావా! బ్రిటన్ లో ఆడవాళ్ళు 32 వ ఏట తమ అందం పతాక స్థాయిలో ఉంటుందని అనుకొంటారట!

సుబ్బారావు:
ఇంతకు ముందు 42 నుండి 45 ఏళ్ళు వస్తే గానీ ’తాము అప్పుడు యవ్వనంలోకి అడుగుపెట్టామనీ, జీవితం అప్పుడే ప్రారంభమైంది’ అనీ అనుకొనే వాళ్ళు. ఇప్పుడు ఓ 10 ఏళ్ళు తగ్గించుకున్నారన్న మాట.

సుబ్బలష్షిమి:
అది ఆర్ధిక మాంద్యం తెచ్చిన మార్పేమో బావా! ఎందుకంటే డబ్బులుంటే కాళ్ళు నేలమీద ఉండవంటారు కదా!

సుబ్బారావు:
ఈ లెక్కన వీళ్ళు ఎప్పటికి యదార్ధ స్థితికి వస్తారో!

************

Tuesday, January 27, 2009

19. అమాత్యుల మాటలకు అర్ధాలు వేరులే

ఓ ప్రక్క నౌకరీలు – హరీ, ఊడుతున్న ఉద్యోగాల వార్తలు, మరోప్రక్క ఆర్థిక మాంద్యం మన దేశాన్ని తాక లేదు అంటున్న కేంద్ర హోంమంత్రి చిదంబరం వ్యాఖ్యల నేపధ్యంలో ……]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా! ఓ ప్రక్క ఉద్యోగాలు ఊడిపోతున్నాయంటూ వార్తలు హోరెత్తిస్తుంటే, ఆర్థిక మాంద్యం మన దేశాన్ని తాక లేదు అంటాడేంటీ ఈ కేంద్ర హోంమంత్రి?

సుబ్బారావు:
అదే ఆయన ప్రత్యేకత మరదలా! ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడూ అంతే! ధరలు పెరగలేదంటూ కొన్నాళ్ళూ, రెండు నెలల్లో తగ్గుతాయంటూ కొన్నాళ్ళు గడిపేసి, తీరిగ్గా ‘రాత్రికి రాత్రి ధరలు తగ్గించడానికి నా దగ్గరేం మంత్రదండం లేదు’ అన్నాడు.

సుబ్బలష్షిమి:
అనవసరంగా ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే అంటారు గానీ నిజం చెప్పాలంటే అమాత్యుల మాటలకు అర్ధాలు వేరులే అనాలి బావా!

సుబ్బరావు:
నిజం చెప్పావ్ మరదలా.

****************

Sunday, January 25, 2009

18. నిన్నటి మాట నిన్నది – ఈ రోజు మాట ఈరోజుది

[కళ్యాణ్ సింగ్ బి.జె.పి.కి రాజీనామా, ములాయం సింగ్ తో మంతనాలు, కళ్యాణ్ సింగ్ కుమారుడు రాజ్ వీర్ సింగ్ యస్.పి. పార్టీలో చేరిక – వార్తల నేపధ్యంలో.]

సుబ్బలష్షిమి:
అయోధ్యలో బాబ్రీ మసీదు కూలగొట్టినప్పుడు ఉత్తర ప్రదేశ్ లో బి.జె.పి. సి.ఎం. గా పనిచేసింది కళ్యాణ్ సింగే కదూ బావా?

సుబ్బరావు:
అవునూ. అయితే?

సుబ్బలష్షిమి:
అప్పట్లో ఆయన హిందువులకూ ప్రముఖ ప్రతినిధి గానూ, ములాయం సింగ్ ముస్లింలకు ప్రముఖ ప్రతినిధి గానూ బాహబాహీ గా పోరాడుకున్నారు కదా?

సుబ్బరావు:
అవునూ. అయితే?

సుబ్బలష్షిమి:
మరి ఇప్పుడు ఇద్దరూ ఒకటైపోయారేమిటి?

సుబ్బారావు:
అదంతే మరదలా! భారతదేశపు రాజకీయ వ్యభిచారం ప్రతీ చోట, ప్రతీ రోజూ మనం చూస్తున్నదే. ఎడారిలో ఇసుక గీతల్లా, నేతలు మాటలూ చేతలూ నిత్యమూ మారిపోతుంటాయి.

*************

Friday, January 23, 2009

17. మాజీ ప్రెసిడెంట్లు - గజినీలు

[అమెరికాలో ప్రెసిడెంట్లు మాజీలయ్యాక అల్జీమర్స్ వ్యాధికి గురవ్వటం, సీనియర్ బుష్ కూడా పదవి దిగిపోయిన తరువాత అల్జీమర్స్ బారిన పడిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
పదవి దిగిపోయిన పెద్దాళ్ళొకి అల్జీమర్స్ వ్యాధి వస్తుందేందుకు బావా?

సుబ్బారావు:
అప్పుడెంచక్కా, పదవిలో ఉండగా తాము చేసిన ఏ కుంభకోణాలు బయటపడినా ఏ బాధా ఉండదు కదా మరదలా! అంచేత గజినీలైపోతే ఏ బాదర బందీ లేదు.

*******************

Wednesday, January 21, 2009

16. తెలం’గానం’

[’తెలంగాణా’ విషయంలో ఢిల్లీలో నడిచిన హైడ్రామా, ’తెరదించేసారు’ ఎన్నికలనాటికి ఏదో ఒకటి చెబుదాం, గడువులేం లేవు, వగైరా – తొలిపేజీ వార్తలు, ఈనాడు 20-01-2009 నేపధ్యంలో ......]

సుబ్బలష్షిమి;
గిదేంది బావా! గీ పేపరోళ్ళు, పార్టీలోళ్ళు తెలంగాన మంటూ ఓ గిట్ల లొల్లి పెడుతరేంటి? నిజంగా మల్ల జనమే తెలంగానం గావాల్నంటే మరి పోయనేడు బై ఎలచ్చన్ల తెరాస నోడ గొట్టిన్రెందుకు? గసలా పెద్దాయన కే.సీ.ఆర్. కే రెండు లచ్చల ఓట్లు నుండి పదేనేల ఓట్ల మెజార్టికి పడిపోయెండు గదే? జనాలకి సరుకుల రేట్లు జూసే కళ్ళంట నీళ్ళొత్తంటే ఇంగా ఏ రాట్టమైతే నేంది? గట్లమల్ల జార్ఖండ్ల సూట్టంలా?

సుబ్బారావు:
అవ్ మల్లా. పేపరోళ్ళకీ, పార్టీ వోళ్ళకీ లొల్లి జయ్యనికే జనాలక్కర్లే. ఆల్లల్లో ఆల్లే లొల్లి బడతరు.

సుబ్బలష్షిమి:
ఆల్లల్లో ఆల్లే గట్ల లొల్లి బెట్టుకుంటే మరిమనమేంటి జేసెడిది?

సుబ్బారావు:
సైల్మాటాకీసు కెల్లి జూడక్కర్లే. ఇంటగూకనే సైల్మా జూడచ్చనుకోవాలె. గదంతే పోరీ!

****************

Tuesday, January 20, 2009

15. చచ్చినోడి కళ్ళు చారెడు

[‘సహచరుల అనుమానమే బాధించింది’ – ఫెర్నాండేజ్. ఈనాడు వార్త 19-01-09.
న్యూఢిల్లీ: జార్జ్ ఫెర్నాండెజ్………… మాజీ రక్షణ మంత్రి. తెహల్కా కుంభకోణం వెలుగు చూసిన వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తి – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఇదేమిటి బావా? తెహల్కా కుంభకోణం బయటికొచ్చినప్పుడు అప్పటి రక్షణమంత్రి ఫెర్నాండెజ్ ముందు బుకాయించి, రభస పెద్దదయ్యే సరికి తప్పని సరై సీటు దిగినట్లు గుర్తు. ఇదే పేపరు అప్పుడలా వ్రాసి, ఇప్పుడిలా వ్రాస్తోందేమిటి?

సుబ్బారావు:
అంతే మరదలా! ఎటూ జనాలందరూ, గజినీ సినిమా హీరోల్లాంటి వాళ్ళని పేపరోళ్ళ నమ్మకం. అందుకే అంటారేమో పెద్దలు ’చచ్చినోడి కళ్ళు చారెడంత’ అని.

*************

Monday, January 19, 2009

14. ప్రజా సమస్యల కంటే కోడిపందాలే లాభం


సంక్రాంతికి కోడిపందాలు నిర్వహణ కోసం పశ్చిమ గోదావరి ఎం.ఎల్.ఏ.లు సి.ఎం. వద్ద పట్టుపట్టి సాధించుకొని కోట్లరూపాయలు దాని పై జూదం నడిపిన వార్తల నేపధ్యంలో]


సుబ్బారావు:

పశ్చిమ గోదావరి ఎం.ఎల్.ఏ.లు, కోడి పందాల నిర్వహించుకోడానికి సి.ఎం. దగ్గర పట్టుపట్టి సాధించుకోని నిర్వహించుకొన్నారు. సంక్రాంతికి కోడిపందాలు జూదం బాగా నడిపారు మరదలా!


సుబ్బలష్షిమి:

అవునుబావా! ఇలాంటి వాటి కోసం పట్టుబట్టే ఈ ఎం.ఎల్.ఏ.లూ, రాజకీయనాయకులూ ప్రజా సమస్యలు పరిష్కారానికి పట్టుబట్టరేం?


సుబ్బారావు:

ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఏమొస్తుంది బూడిద? అదే కోడిపందాలైతే డబ్బులూ, చికెనూ రెండూ వస్తాయి గాని.


************

Sunday, January 18, 2009

13. వీధికుక్కలకి మహార్ధశ రానుందా?

[బహిరంగ ప్రదేశాల్లో బాంబుపేలుళ్ళని నివారించేందుకు వీధికుక్కలకి బాంబులు గుర్తించేలా శిక్షణనిస్తామన్న పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు – 06-01-‘ 09 డి.డి. వార్త నేపధ్యంలో]

సుబ్బారావు:
సుబ్బలష్షిమి! బహిరంగ ప్రదేశాల్లో, చెత్తకుండీల్లోనూ బాంబు పేలుళ్ళు జరక్కుండా వీధికుక్కలకి బాంబు డిటెక్షన్ చేసేలా శిక్షణ ఇస్తారట.

సుబ్బలష్షిమి:
పోనీలే బావా! అలాగన్నా పల్లెల్లో మనం చేసే కోర్ల పౌర్ణమి లాంటి పండగలు మళ్ళీ నగరాల్లోనూ వస్తాయేమో!

సుబ్బారావు: ఎంత స్పాలూ, బ్యూటీ పార్లర్లూ, హాస్పటళ్ళూ, ఫ్యాషన్ షోలతో పెంచినా సీమ కుక్కల కంటే, గుప్పెడన్నం పెడితే విశ్వాసం చూపించే వీధికుక్కలకి ఇప్పుడన్నా కాసిని మంచి రోజులొస్తాయోమో చూద్దాం మరదలా!

*********************

Saturday, January 17, 2009

12. క్లైమాక్స్ చూపించటానికి ఇదే మన్నా ఇజ్రాయేల్ ప్రభుత్వమా?


[పాక్ కి ముంబాయి పై దాడుల గురించిన ఆధారాలు ఇచ్చిన విదేశాంగ మంత్రి, ఆ ఆధారాలు చాలవన్న పాకిస్తాన్ వార్తల నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:

చూశావా బావా! ముంబాయి పై తీవ్రవాదుల దాడి గురించి ఆధారాలిస్తే పాకిస్తాన్ చాలవు పొమ్మంటోందట.


సుబ్బారావు:

వీళ్ళు ఆధారాలిచ్చాం అనటం, వాళ్ళు ఠాఠ్ చాలవు పొమ్మనటం రోజూ చూస్తున్న నాటకమే కదా. కాకపోతే రెండే డైలాగులున్న నాటకం.


సుబ్బలష్షిమి:

అంతేలే బావా! క్లైమాక్స్ చూపించేందుకు ఇండియాలోని యూ.పి.ఏ. ప్రభుత్వమేమన్నా ఇజ్రాయేలు ప్రభుత్వమా?

**************

Friday, January 16, 2009

11. కామమ్మ మొగుడంటే కామోసు అనుకొన్నా

[ద్రవ్యోల్బణం Jan.3 నాటికి ముగిసిన వారానికి 5.9% నుండి 5.3%కి తగ్గిందనీ, ముడి చమురు ధరలూ నిత్యావసర వస్తువుల ధరలూ తగ్గడంతో ఇది సంభవించిందనీ Jan.15, రాత్రి 7:00 గం. D.D. వార్తల నేపధ్యంలో]

సుబ్బులష్షిమి:
ఇదేమిటి బావా! ఉల్లి ధర 24రూ, బియ్యం 31రూ., మిగిలిన అన్నీ సరుకులు అందనంత ఎత్తులో ఉంటే, ధరలు తగ్గాయిగనుక ద్రవ్యోల్బణం తగ్గిందంటారేమిటి? ఇదేం లెక్కలు?

సుబ్బారావు:
అంతే మరదలా! వ్యాపార సంస్థలు దగ్గర నుండీ ప్రభుత్వాల దాకా అందరూ దొంగ లెక్కలే చెబుతున్నారు.

సుబ్బలష్షిమి:
అయితే జనమేం చెయ్యాలి?

సుబ్బారావు:
కామమ్మ మొగుడంటే కామోసను కోవాలేమో?

సుబ్బలష్షిమి:
అదేం సామెత బావా?

సుబ్బారావు:
’కామమ్మ మొగుడంటే కామోసను కున్నాను’ - అన్న సామెత వెనకున్న కథ ఇదీ!

ఒకప్పుడు మనదేశంలో బాల్య వివాహాలు జరిగేవి. చిన్న పిల్లలకి పెళ్ళి చేసేసేవారు. అలాగే చాలామంది దేశాల మీద పోయేవాళ్ళు. అంటే ఇంట్లో వాళ్ళ మీద అలిగో, పలుప్రదేశాల చూడాలన్న కాంక్షతోనో, మరో కారణంతోనో కొంతమంది ఇల్లువిడిచి పోయే వాళ్ళు.

అలాగే ఓ వూరిలో ఓ కామందు కూతురు ’కామమ్మ’ అన్న అమ్మాయికి అయిదారేళ్ళ వయస్సుకే పెళ్ళి చేశారు. పెళ్ళికొడుక్కి పదిహేను పదహారేళ్ళుంటాయి. తరువాతేం తిక్క రేగిందో, ఆ పిల్లవాడు కాస్తా దేశాలు పట్టిపోయాడు.

ఏళ్ళు గడిచాయి. కామమ్మ పెరిగి పదాహారేళ్ళు యువతి అయ్యింది. అందంగా ఉంది.

అంతలో ఆ ఊరికి పాతికేళ్ళ పైబడ్డ యువకుడొకడు వచ్చాడు. అందరికీ అతడిలో కామమ్మ మొగుడు పోలికలు కనిపించాయి. అదిగో కామమ్మ మొగుడు దేశాలు తిరిగి వచ్చాడంటే వచ్చాడంటూ అంతా అతడి చుట్టూ మూగారు.

ఇంటికి తీసికొచ్చి పెరిగిన జుట్టు క్షౌరం చేయించారు. స్నానం చేయించి చిరిగిన దుస్తులు మార్చి కొత్త దుస్తులు తొడిగించారు. కామమ్మ నలంకరించి శోభనం గదికి పంపించారు. ఆ తరువాత హాయిగా కామమ్మ, ఆమె మొగుడు కాపురం పెట్టారు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.

కొన్నాళ్ళకి కామమ్మ మొగుణ్ణంటూ మరొకడు వచ్చాడు. అతడితో పాటు అతడి తల్లితండ్రులూ వచ్చారు. పుట్టుమచ్చలు దగ్గర నుండీ, అలవాట్లుదాకా ఈ క్రొత్తగా వచ్చిన వాడికే సరిపోయాయి.

దాంతో ముందు వచ్చిన వాడు అసలు వాడు కాదని తేలింది. “ఇదేమి పనిరా? ఇంత మోసం ఎందుకు చేసావు?" అంటే “నాకేం తెలుసు? అందరూ కలిసి నన్నే కామమ్మ మొగుడంటే కామోసనుకొన్నాను” అన్నాడట.

అందరూ అంటే మాత్రం తన జీవితంలో 10 ఏళ్ళ క్రిందట తనకి కామమ్మతో పెళ్ళయిందో లేదో తనకి తెలీదా? అంటే కావాలనే, ’ఇదీ బాగుందిలే’ అనుకొనే అవుననేసాడన్న మాట.

అబద్దమని తెలిసినా, గమ్మునుండటం అన్న సందర్భంలో ఈ సామెతని పెద్దవాళ్ళు వాడుతుంటారు.

*****************

Thursday, January 15, 2009

10.కుక్క మనిషిని చూసి మొరిగినా వార్తే

[రామలింగరాజు కొడుకు, తండ్రిని పలకరించటానికి జైలుకు వచ్చిన వార్తనూ హెడ్డింగ్ గా పెట్టి ప్రచురించిన ఈనాడు వార్త [Jan.13, 2009] నేపధ్యంలో

సుబ్బలష్షిమి:
ఏంటి బావా! కొడుకు, తండ్రిని పలకరించటం కూడా వార్తేనా?

సుబ్బారావు:
అవునూ సుబ్బలష్షిమి! ఒక్కప్పుడు కుక్క మనిషిని కరిస్తే వార్తకాదు, కుక్కని మనిషి కరిస్తే వార్త అయ్యేది, ఇప్పుడు కుక్క మనిషిని చూసి మొరిగిన వార్తే అవుతోంది.

************

Wednesday, January 14, 2009

09. దొరికినప్పుడే కదా దోచుకొనేది దొంగలు [ప్రభుత్వాలు]


[పండుగలప్పుడు ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరు మీద అధిక చార్జిల వడ్డన, రైల్వే శాఖ తత్కాల్ పేరిట దోపిడిల గురించి వార్తల నేపధ్యంలో]


సుబ్బలష్షిమి:

ఏంటి బావా! పండుగలప్పుడు ఆర్టీసీ వాళ్ళూ, రైల్వే వాళ్ళూ అదనంగా బస్సులూ, రైళ్ళూ వేసి జనానికి సౌకర్యం కల్పించాల్సింది పోయి అదనంగా చార్జిలు వేసి జనాన్ని దోచుకుంటున్నారు?


సుబ్బారావు:

అంతే మరదలా! దొరికినప్పుడే కదా దోచుకొనేది దొంగలు[ప్రభుత్వాలు].


************