[ద్రవ్యోల్బణం Jan.3 నాటికి ముగిసిన వారానికి 5.9% నుండి 5.3%కి తగ్గిందనీ, ముడి చమురు ధరలూ నిత్యావసర వస్తువుల ధరలూ తగ్గడంతో ఇది సంభవించిందనీ Jan.15, రాత్రి 7:00 గం. D.D. వార్తల నేపధ్యంలో]
సుబ్బులష్షిమి:
ఇదేమిటి బావా! ఉల్లి ధర 24రూ, బియ్యం 31రూ., మిగిలిన అన్నీ సరుకులు అందనంత ఎత్తులో ఉంటే, ధరలు తగ్గాయిగనుక ద్రవ్యోల్బణం తగ్గిందంటారేమిటి? ఇదేం లెక్కలు?
సుబ్బారావు:
అంతే మరదలా! వ్యాపార సంస్థలు దగ్గర నుండీ ప్రభుత్వాల దాకా అందరూ దొంగ లెక్కలే చెబుతున్నారు.
సుబ్బలష్షిమి:
అయితే జనమేం చెయ్యాలి?
సుబ్బారావు:
కామమ్మ మొగుడంటే కామోసను కోవాలేమో?
సుబ్బలష్షిమి:
అదేం సామెత బావా?
సుబ్బారావు:
’కామమ్మ మొగుడంటే కామోసను కున్నాను’ - అన్న సామెత వెనకున్న కథ ఇదీ!
ఒకప్పుడు మనదేశంలో బాల్య వివాహాలు జరిగేవి. చిన్న పిల్లలకి పెళ్ళి చేసేసేవారు. అలాగే చాలామంది దేశాల మీద పోయేవాళ్ళు. అంటే ఇంట్లో వాళ్ళ మీద అలిగో, పలుప్రదేశాల చూడాలన్న కాంక్షతోనో, మరో కారణంతోనో కొంతమంది ఇల్లువిడిచి పోయే వాళ్ళు.
అలాగే ఓ వూరిలో ఓ కామందు కూతురు ’కామమ్మ’ అన్న అమ్మాయికి అయిదారేళ్ళ వయస్సుకే పెళ్ళి చేశారు. పెళ్ళికొడుక్కి పదిహేను పదహారేళ్ళుంటాయి. తరువాతేం తిక్క రేగిందో, ఆ పిల్లవాడు కాస్తా దేశాలు పట్టిపోయాడు.
ఏళ్ళు గడిచాయి. కామమ్మ పెరిగి పదాహారేళ్ళు యువతి అయ్యింది. అందంగా ఉంది.
అంతలో ఆ ఊరికి పాతికేళ్ళ పైబడ్డ యువకుడొకడు వచ్చాడు. అందరికీ అతడిలో కామమ్మ మొగుడు పోలికలు కనిపించాయి. అదిగో కామమ్మ మొగుడు దేశాలు తిరిగి వచ్చాడంటే వచ్చాడంటూ అంతా అతడి చుట్టూ మూగారు.
ఇంటికి తీసికొచ్చి పెరిగిన జుట్టు క్షౌరం చేయించారు. స్నానం చేయించి చిరిగిన దుస్తులు మార్చి కొత్త దుస్తులు తొడిగించారు. కామమ్మ నలంకరించి శోభనం గదికి పంపించారు. ఆ తరువాత హాయిగా కామమ్మ, ఆమె మొగుడు కాపురం పెట్టారు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
కొన్నాళ్ళకి కామమ్మ మొగుణ్ణంటూ మరొకడు వచ్చాడు. అతడితో పాటు అతడి తల్లితండ్రులూ వచ్చారు. పుట్టుమచ్చలు దగ్గర నుండీ, అలవాట్లుదాకా ఈ క్రొత్తగా వచ్చిన వాడికే సరిపోయాయి.
దాంతో ముందు వచ్చిన వాడు అసలు వాడు కాదని తేలింది. “ఇదేమి పనిరా? ఇంత మోసం ఎందుకు చేసావు?" అంటే “నాకేం తెలుసు? అందరూ కలిసి నన్నే కామమ్మ మొగుడంటే కామోసనుకొన్నాను” అన్నాడట.
అందరూ అంటే మాత్రం తన జీవితంలో 10 ఏళ్ళ క్రిందట తనకి కామమ్మతో పెళ్ళయిందో లేదో తనకి తెలీదా? అంటే కావాలనే, ’ఇదీ బాగుందిలే’ అనుకొనే అవుననేసాడన్న మాట.
అబద్దమని తెలిసినా, గమ్మునుండటం అన్న సందర్భంలో ఈ సామెతని పెద్దవాళ్ళు వాడుతుంటారు.
*****************
Friday, January 16, 2009
Subscribe to:
Post Comments (Atom)
hahahaa....bhale undi andi
ReplyDeleteAdi Lakshmi గారు,
ReplyDeleteYou have conveyed the actual message through the story. Keep up the good work.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని చాలా బాగా చెప్పారు.
ReplyDeleteబాగా చెప్పారు. సామెత వెనకున్న కథ బావుంది :)
ReplyDelete