Tuesday, July 27, 2010

ఎన్ని చెట్లు కొట్టేస్తే ఇన్ని కాగితాలు తయారవ్వాలి?

[పదో తరగతి విద్యార్దులకు 24 పేజీల జవాబు పత్రం వచ్చే ఏడాది నుండి ఇవ్వనున్నారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసే విద్యార్దులకు, 24 పేజీలతో కూడిన ఆన్సర్ బుక్ లెట్ ను, వచ్చే ఏడాది నుండి ఇస్తారట. పారదర్శకత పెంపుకూ, ఇన్విజిలేటర్ పై పని భారాన్ని తగ్గింపుకూ ఇది ఉపయోగపడుతుందట. ఇది ప్రయోగాత్మకంగా ఇంటర్ పరీక్షల్లో విజయవంతమైందట. వచ్చే ఏడాది అన్ని సబ్జెక్టులకీ అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి బలరామయ్య చెప్పాడు.

బహుశః ఏ రాజకీయ కుటుంబానికో గుత్తకివ్వలని అనుకుంటున్నారేమో బావా! విడిగా పేపర్లిచ్చే దాని కన్నా, 24 పేజీల కట్ట అంటే - బల్క్ గా ఉంటుంది, లాభమూ ఎక్కువ వస్తుంది కదా!

సుబ్బారావు:
పారదర్శకత పెరిగేదే ముంది మరదలా! కార్పోరేట్ స్కూళ్ళ పైసలకి అవకతవకలన్నీ పారదర్శకంగానే అందుబాటులో ఉన్నాయయ్యె! ఇక ఇన్విజిలేటర్లు పని భారమా? అంతకంటే ప్రైవేటు రంగంలో ఒళ్ళు విరగ్గొట్టించుకుని చాకిరీ చేసేవాళ్ళున్నారు. అదీగాక... ఒక విద్యార్ది 24 పేజీలు వ్రాస్తాడు. ఒకోకడు రెండు పేజీలు కూడా వ్రాయడు. ఎంత స్టేషనరీ దండగో తెలుసా? ఎన్ని చెట్లు కొట్టేస్తే ఇన్ని కాగితాలు తయారవ్వాలి?

సుబ్బలష్షిమి:
అన్నిరకాలుగా.... మన దేశ ఆర్దిక, ప్రాకృతిక, వస్తు వనరుల్ని దుంప నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నట్లున్నారు బావా! శతృవుని నాశనం చేసే ముందు, వారి ఉత్సాహ ఐశ్వర్య మంత్రాంగాలని నాశనం చెయ్యాలన్నాడు భారతంలో కణికుడు! అదే అమలు చేస్తున్నారు ప్రస్తుత పాలకులు!

ఇవాళా రేపూ, పత్రికలూ రాజకీయ పార్టీలూ కుటుంబ ఆస్తులై పోయాయి కదా!

[జగన్ ఓదార్పు యాత్ర కవరేజ్ - సాక్షి పత్రిక - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సాక్షి పత్రిక లో, పరమ ఫాక్షనిస్టూ, పక్కా అవినీతితో వేల కోట్ల రూపాయలు గడించిన వై.యస్.ఆర్. ని పట్టుకుని... మహానేత అంటూ, ప్రధాన పేజీ పై మూలన, అదేదో క్రీస్తు సూక్తి లెవెల్లో... రోజుకో డైలాగు, మరణించిన వై.యస్.ఆర్. పేరిట వేస్తున్నారు చూశావా?

సుబ్బారావు:
అలాగంటావేం మరదలా! జగన్ కి, జగన్ తండ్రి మహానేతే మరి! జన్మనివ్వటమే గాక... ఆస్తిపాస్తులూ, కెరియర్ స్టెప్పులూ, ఎదిగేందుకు టిప్పులూ ఇచ్చాడు మరి! ఇక సాక్షి పత్రిక అంటావా, అది వాళ్ళ కుటుంబ పత్రిక! ఇవాళా రేపూ... పత్రికలూ, రాజకీయ పార్టీలూ కుటుంబ ఆస్తులై పోయాయి కదా!

సుబ్బలష్షిమి:
ఇలాంటి కుటుంబ పార్టీలని, కుటుంబ బాకా మీడియాలని భరించవలసి రావటం నిజంగా ప్రారబ్దమే బావా!

సుబ్బారావు:
చిన్నప్పుడు సోషల్ పాఠాల్లో... ‘ప్రజాస్వామ్యంలో పత్రికలది [మీడియాది] ప్రముఖ పాత్ర’ అని చదువుకున్నాం. అప్పుడు తెలియలేదు గానీ, ఇప్పుడు మాత్రం మీడియా ముఖం/గుట్టు ఏమిటో, బాగా అర్దమౌతోంది మరదలా!

Monday, July 26, 2010

త్యాగ శీలి మాత్రమే కాదు, క్షమాశీలి కూడా!

[మాజీ గవర్నర్ ఎన్దీ తివారీ, రాజభవన్ లో కామక్రీడలు సాగించిన ఉదంతపు అనంతర పరిస్థితుల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కొన్ని నెలల క్రితం, అప్పటి రాష్ట్ర గవర్నర్ ఎన్డీ తివారీ, రాజభవన్ ని కాస్తా వేశ్యాగృహంగా మార్చేసాడు కదా? ఆ కంపంతా బయటపడి గగ్గోలెత్తినప్పుడు, కాంగ్రెస్ అధిష్టానం సోనియా అతణ్ణి అసహ్యించుకుందని కూడా వార్తలొచ్చాయి. అయినా గానీ, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గానీ, పార్టీ ప్రభుత్వం గానీ అతడిపై ఏ చర్యలూ తీసుకోలేదేం బావా?

సుబ్బారావు:
>>> "ఎవరి మీద కక్ష పెంచుకోకుండా క్షమించే గుణం పెంచుకున్నప్పుడే అది నిజమైన గొప్పతనం"- జవహర్ లాల్ నెహ్రూ.
>>> "ఎదుటి మనిషిని అర్దం చేసుకోవాలంటే, నీకు క్షమించే గుణం ఉండాలి" - బుద్దుడు.
‘క్షమించటం మీద’ ఇలాంటి ఈనాడు సూక్తులు[ఎక్కువగా వేస్తుంటారు. ఉదాహరణకి 23 జూలై, 2010 కర్నూలు ఎడిషన్ లో] కాంగ్రెస్ అధిష్టానం సోనియాకి తెలిసి ఉండాలి. దాంతో ఎన్డీ తివారీని ‘క్షమించేసి’ ఉంటుంది మరదలా! లేదా ఏ చర్యలూ తీసుకోకుండా ఉండేందుకు, ‘అధిష్టానానికి అసహ్యం కలిగింది’ అనే పైకారణం సరిపోతుందనుకున్నారు కాబోలు!

సుబ్బలష్షిమి:
సోనియా కి తెలుగు రాదు కదా బావా, ఈనాడు సూక్తులు చదవటానికి?

సుబ్బారావు:
‘అధిష్టానానికి అన్నీ తెలుసు’ అనే పదేపదే కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు కదా! మొన్న ‘కేకే’ గట్టిగా నొక్కి వక్కాణ్ణించాడు కూడా! కాబట్టి అధిష్టానానికి అన్నీ తెలుస్తాయి, అంతే!

Sunday, July 25, 2010

సోనియా త్యాగంతో పోల్చుకుంటే ప్రజల త్యాగం ఏపాటిది?

[చిన్నపట్టణాల్లో సెజ్ లు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! సెజ్ ల ఏర్పాటు నిబంధనలను, కేంద్ర ప్రభుత్వం సవరించటంతో, చిన్న పట్టణాల్లో వాటి ఏర్పాటు మరింత ఆకర్షణీయం కానున్నట్లు నాస్కాం ప్రెసిడెంట్ సోమ్ మిట్టల్ చెప్పాడట. గుట్టు చప్పుడు గాకుండా సెజ్ ల ఏర్పాటు నిబంధనలను ఎప్పుడు సవరించారో బావా!?

సుబ్బారావు:
టట్టడాయ్! ఇహ కాస్కో పిల్ల! నంద్యాల, గిద్దలూరు, పొన్నూరు, చెన్నూరుల్లో కూడా, ఇక సెజ్ ల కోసం భూములు లాక్కుంటారు. ప్రజల బతుకులు ‘భీంరావ్ బాడాలే’ మరదలా!

సుబ్బలష్షిమి:
ఒకప్పుడు కత్తులూ కటార్లు పట్టుకుని... గజనీ, ఘోరీ మహమ్మదులు వచ్చారు.
తర్వాత తూటాలూ తుపాకులూ పట్టుకుని... బ్రిటీషూ, ఫ్రెంచి వాళ్ళొచ్చారు.
ఇప్పుడు కాగితాలు కలాలూ పట్టుకుని... మన్మోహన్ సింగులూ, సోనియాలూ వచ్చినట్లున్నారు బావా!
చూస్తుండగానే దేశం మొత్తం అన్యాక్రాంతం అయిపోతుంటే, జనాలు మాత్రం, ఇంకా ‘ఇక్కడ ప్రజాస్వామ్యమే నడుస్తుందంటూ’ కలవరింతలు పెడుతున్నారు.

సుబ్బారావు:
ఇండియా... సింగపూరూ, అమెరికా ల్లాగా అవ్వాల్లంటే ప్రజలు తమ ఆస్తుల్ని ఆ మాత్రం త్యాగం చెయ్యాలి కదా మరదలా! సోనియాను చూడు! ఇండియాను ఎక్కడికో తీసుకెళ్లటానికి... తనకు అంది వచ్చిన ప్రధాని పదవిని త్యాగం చేయ లేదా? ఆ త్యాగంతో పోల్చుకుంటే ప్రజల త్యాగం ఏపాటిది?

సుబ్బలష్షిమి:
నిజమే బావా! ఇప్పటికీ, ప్రజల త్యాగం కంటే సోనియా త్యాగమే, కాంగ్రెస్ వాళ్ళకి భజన కీర్తనగా కనిపిస్తుంది.

Saturday, July 24, 2010

తమ నాయకుడి విగ్రహం నిర్మాణంలోనూ అదే అవినీతి!

[కడపలో కుప్పకూలిన వైస్ విగ్రహం: కడప నగరం తిరుపతి బైపాస్ సర్కిల్లో ఈనెల 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం 15 రోజుల్లోనే కుప్ప కూలి పడిపోయింది. 17 అడుగుల విగ్రహం, 10 అడుగుల దిమ్మెతో కలిసి మొత్తం 27 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహం కూప్పకూలింది.

బైపాస్ సర్కిల్లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం రాయలసీమలో పెద్ద విగ్రహంగాను, వైఎస్ రూపురేఖలు అచ్చుగుద్దినట్లుగాను ఉన్నాయి.విగ్రహం పాదాల నుండి ఏర్పాటు చేసిన కమ్మీలు సెట్ అయ్యేందుకు కాంక్రీట్ సరిగా కలుపలేదు. ఇసుక , సిమెంట్, కంకర చిప్స్ సరిగా కలువలేదు. పొడిపొడిగా కనిపించాయి.

మొత్తంమీద చూస్తే విగ్రహం దిమ్మెపైన ఏర్పాటు చేయడంలో సాంకేతికపరమైన జాగ్రత్తలు పాటించలేదన్న అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విగ్రహం పునఃప్రతిష్ఠకు ముందు శాంతియాగం చేస్తున్నట్లు కూడా మేయర్ పేర్కొన్నారు. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! కడపలో వై.యస్. విగ్రహం పెట్టిన 15 రోజుల్లోనే కూప్పకూలిందట. ఇసుక, సిమెంట్, కంకర చిప్స్ సరిగా కలపలేదట! విగ్రహం పునఃప్రతిష్ఠకు ముందు శాంతియాగం చేస్తున్నట్లు మేయర్ రవీంద్రనాధ్ రెడ్డి చెప్పాడు, బావా!

సుబ్బారావు:
అంతే మరదలా!’నీవు నేర్పిన విద్యయే...’ అన్నట్లు చివరాఖరికి తమ నాయకుడి విగ్రహం నిర్మాణ విషయంలో కూడా అదే అవినీతి చూపించారు. శాంతి యాగం కాదు ముందు నిజాయితీ నేర్చుకుంటే అప్పుడు కట్టడాలు కలకాలం నిలుస్తాయి మరదలా!

సుబ్బలష్షిమి:
బావా! నీకో కొసమెరుపు చెప్పమంటావా! నంద్యాలలో క్రైస్తవుల సమాధుల చుట్టూ నిర్మించిన ఫెన్సింగ్ గోడ, మొన్న వరదల సమయంలో చుక్క నీరు కూడా గోడల నుండి లీక్ రాలేదు. చుట్టూ వరద నీరు గోడల మీదగా వచ్చి సమాధులు మునిగాయి. అంత పటిష్ఠతతో గోడ కట్టారు బావా!

సుబ్బారావు:
అంతే మరదలా! ఆ రోజు నిజాయితీ అది. ఈ రోజు అవినీతి ఇది.

డబ్బులున్న అయేషా తన్వీర్ లు - డబ్బుల్లేని అయేషా మీరాలు !

[పార్క్ ఉడ్ స్కూల్ పాలక వర్గం నుండి అయూబ్ ని తొలగించాం - స్కూల్ అకడమిక్ హెడ్ అయేషా తన్వీర్... ప్రకటన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పార్క్ ఉడ్ స్కూల్ ను ప్రారంభించిందే అయూబ్. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ అతడి చెల్లెలే! అలాంటిది ఆ పాఠశాల అకడమిక్ హెడ్ అయేషా తన్వీర్, ఇప్పుడు తీరిగ్గా, పాఠశాల పాలక మండలి నుండి అతణ్ణి తొలగించామనీ, పాఠశాలలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా 350 మంది విద్యార్దుల విద్యాసంవత్సరానికి నష్టం కలిగించరాదనీ ప్రభుత్వాన్ని కోరుతోంది.

ఈమెకు తెలియదా బావా, అన్న, అమ్మాయిల హాస్టల్ పైనే పెంట్ హౌస్ కట్టించుకు ఉంటున్నాడనీ, పిల్లల మానప్రాణాలతో ఆడుకుని జీవితాలకే నష్టం కలిగించాడనీ?

సుబ్బారావు:
ఇవతల ఆ పిల్లల జీవితాలు, దృక్పధాలు అన్ని నాశనం అయితే ఏం లేదు గానీ, తొక్కలోది విద్యా సంవత్సరం నష్ట పోరాదట! ఆ స్కూలు కాకపోతే మరో స్కూలులో చదువుకుంటారు. అసలా అసభ్యపు స్కూల్లో ఏం విద్య నేర్పిస్తారట? పైగా ఒక్క సంఘటన అట. మెల్లిగా బాధితుల చిట్టా బయటికొస్తుంటే, ఏం చెబుతోంది కీచక సోదరి?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెడుతుందంటారు పెద్దలు. ప్రభుత్వపు అలుసుంటే, అవ్వని దేమిటి డబ్బులున్న అయేషా తన్వీర్ లకి? అదే డబ్బుల్లేని అయేషా మీరాలైతే... దారుణంగా రేప్ హత్య చెయ్యబడినా, ఏళ్ళూ పూళ్ళూ గడిచినా, ఏ న్యాయమూ జరగదు!

Friday, July 23, 2010

నాటి బ్రిటీషు వాళ్ళ నుండి నేటి ఇటలీ మహిళ దాకా-----

[బాబు బాబ్లీ యాత్ర, శివసేన సాలూరుపై దాడి , అయోధ్య రామమందిరం నిర్మించి తీరతాం వీహెచ్ పీ నేత ఆశోక్ సింఘాల్ ప్రకటనల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! గత ఏడాది కర్నూలు వరదల సమయంలో, కలిసి మెలిసి కష్టం గట్టెక్కిన అఖిలాంధ్ర ప్రజలు, సోనియా, మీడియా, కేసీఆర్ లూ పాత్రధారులుగా, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ షురూ ప్రకటనతో తన్నుకుంటున్నారు కదా!

సుబ్బారావు:
అవునూ!

సుబ్బలష్షిమి:
ఇక ఇప్పుడు.... సోనియా అంతస్సూత్రధారిగా, తెదేపా, చవాన్, శివసేనలు తెర మీద పాత్రధారులుగా.... మరాఠీలు, తెలుగు వాళ్ళు కొట్టుకునే స్థితి వచ్చింది కదా!

సుబ్బారావు:
అవునూ!

సుబ్బలష్షిమి:
ఇప్పుడు వీహెచ్ పీ నేత ఆశోక్ సింఘాల్ ఆరు నూరైనా గానీ అయోధ్య రామ మందిరం నిర్మించి తీరతాం అంటున్నాడు. అసలే అధికారంలో ఉన్నది సోనియా కాంగ్రెస్. ఇప్పుడు హిందూ, ముస్లిం లంటూ, సమస్త భారత ప్రజలు కొట్టుకు ఛస్తారా ఏమిటి?

సుబ్బారావు:
ఏడాదిన్నర క్రితం ముంబై ముట్టడి నేపధ్యంలో, ప్రాంతాలకు, మతాలకు అతీతంగా.... శత కోటి భారతీయులు కలిసి నినదించారు మరదలా! మరి ఆ ఐక్యతని దెబ్బకొట్టొద్దా? అసలుకే నాటి బ్రిటీషు వాళ్ళ నుండి నేటి ఇటలీ మహిళ దాకా, పాటించే సూత్రం ‘విభజించి పాలించటమే’ నయ్యె!

సుబ్బలష్షిమి:
ప్యాకింగ్ మారిందే గానీ లోపలి సరుకు ఒకటే అనటానికి ఇదీ చక్కని ఉదాహరణే బావా!

ఎన్టీ రామారావు పేరు వాడుకునే హక్కు ఎవరి కుంది?

[ఎన్టీఆర్ పేరు వాడుకునే హక్కు పురందేశ్వరి కెవరిచ్చారు? - తెదేపా ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య... వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
ఎన్టీఆర్ పేరు వాడుకునే హక్కు పురందేశ్వరికి లేదనీ, ఎన్టీఆర్ కుమారై అయినంత మాత్రాన ఆమెకా అర్హత రాదనీ, తెదేపా ప్రధాన కార్యదర్శి అంటున్నాడు బావా?

సుబ్బారావు:
ఆమెకి అర్హత లేదు, బాగానే ఉంది. మరి ఎన్టీఆర్ పేరు వాడుకునే హక్కు, అతడికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి ఉందా? అప్పుడు నోరుమూసుకు కూర్చుని, ఇప్పుడు చంద్రబాబు కొడుక్కి పిల్లనిచ్చుకున్న బాలకృష్ణకి ఉందా? ఇంకా.... అయితే గియితే అతడి పేరు వాడుకునే హక్కు, పోయే దాకా వెంట ఉన్న లక్ష్మీపార్వతికి ఉందేమో!

సుబ్బలష్షిమి:
అసలా లక్ష్మీపార్వతి స్టెరాయిడ్లు వాడించటం వల్లే ఆ వృద్ద వరుడు మరణించాడని, ఎన్టీఆర్ మరో కుమారుడు హరికృష్ణ ఆరోపిస్తూ ఉంటాడు బావా! నువ్వా విషయం మరిచిపోయావు!

సుబ్బారావు:
నిజమే! అయితే, అతడి పేరు వాడుకునే హక్కు అసలెవ్వరికీ లేదు ఫో! ఎన్టీఆర్ సినిమాలు చూసి ఆనందించే జనాలకి తప్ప!

సంస్కృతి నాశనం చేసుకున్నాక ఇటువంటి వారే తామరతంపరగా తారసపడతారు!

[పార్క్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ అయూబ్, విద్యార్ధినులపై అత్యాచారాలు చేసిన అపర కీచకుడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2002 లో స్థాపించబడిన పార్క్ వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్, ఆయూబ్ అట. ఏభై ఏళ్ళ గురువు, శిష్యురాళ్ళ మీద అత్యాచారం చేశారు. దృశ్యాలను సెల్లు ఫోన్ లో బిగించి బ్లాక్ మెయిలింగు చేస్తూ లైంగిక వాంఛలు తీర్చుకున్నాడట. పైగా సదరు స్కూలు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థ అట కూడా, తెలుసా?

సుబ్బారావు:
‘మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ’ అనే సంస్కృతీ సాంప్రదాయాలని, సత్య ధర్మాలనీ మరిచి పోయాక కేంబ్రిడ్జి అనుబంధాలైనా, ఆక్స్ ఫర్డ్ అనుబంధాలైనా ఇంతే మరదలా! తమ కుమార్తెల కంటే చిన్న వయస్సు పిల్లలపైన కామవాంఛ కలిగి ఉండేవాళ్ళని పశువులతో పోల్చినా అవీ అవమాన పడతాయేమో!

సుబ్బలష్షిమి:
అవును బావా! పోలీసు రాధోడ్ లూ అంతే! గురువు అయూబ్ లూ అంతే! ఎన్డీ తివారీలు అంతే! ఏమైనా రానున్న గురు పూర్ణిమ నేపధ్యంలో గొప్ప గురువే తారసపడ్డాడు.

సుబ్బారావు:
గొంగట్లో తింటే వెంట్రుకలే వస్తాయి మరదలా! సంస్కృతి నాశనం చేసుకున్నాక ఇటువంటి వారే తామరతంపరగా తారసపడతారు.

Thursday, July 22, 2010

ఈ ఆర్దికవేత్తలు సుత్తీ శాణాలు పట్టుకు తిరుగుతున్నారా?

[దేశవ్యాప్తంగా కేబుల్ టీవీ ఛార్జీలను నెలకు రూ.250/- గా స్థిరీకరించాలని యోచిస్తున్నట్లు ’ట్రాయ్’, సుప్రీం కోర్టుకు తెలియజేసింది. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! టెక్నాలజీ పెరిగితే, పోటీ వలన ధరలు తగ్గి, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని... మన్మోహన్ సింగూ, ప్రణబ్ ముఖర్జీ, చిదంబరాల వంటి ఆర్దిక వేత్తలు ఆదరంగా సెలవిస్తుంటారు కదా! మరి కేబుల్ టీవీల వంటి సేవలు, ఎందుకు రాను రాను మరింత అందనంత ధరకు ఎగిరి పోతున్నాయి బావా?

సుబ్బారావు:
సదరు మేధావులు ఆర్దిక సూత్రాలనీ, సిద్దాంతాలనీ సెలవిస్తున్నప్పుడు ఎదురు ప్రశ్నించకూడదు మరదలా! ఎందుకంటే అవి సిద్దాంత రాద్దాంతాలు మరి!

సుబ్బలష్షిమి:
అసలు నాకో పెద్ద అనుమానం బావా! ఈ మన్మోహను సింగూ, చిదంబరం గట్రా ఆర్దిక వేత్తలూ, మంత్రిపుంగవులూ జేబుల్లో పెన్నూ పేపర్ల బదులు, సుత్తీ శాణం పెట్టుకు తిరుగుతున్నారేమోనని?

సుబ్బారావు:
సుత్తీ శాణాలా? అవెందుకు మరదలా?

సుబ్బలష్షిమి:
ఎందుకేమిటి బావా! దొంగలు ఇళ్ళకి కన్నాలు వేయటానికి వాడేది అవే కదా? వీళ్ళూ ఇంకో రకంగా అదే పని చేస్తున్నారు. అంతే కదా తేడా?

Friday, July 16, 2010

అధికారంలో ఉంటే వాతలు - పదవులూడితే ఓదార్పులు!

[సోంపేట కాల్పులూ, లాఠీఛార్జీల ఘటనల్లో మహిళనని కూడా చూడకుండా పోలీసులు కొట్టారని సోంపేట ఆసుపత్రిలో దెబ్బలను చంద్రబాబుకు చూపుతున్న మహిళ - ఈనాడు ఫోటో వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొన్న సోంపేట విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ప్రతిఘటనలో పోలీసులు లాఠీఛార్జీ, కాల్పులు జరిపారు కదా? ఆ బాధితులని పరామర్శించడానికి చంద్రబాబు ఇతర విపక్ష నేతలు వెళ్ళారు.

సుబ్బారావు:
చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉండగా, ఆడవాళ్ళని కూడా చూడకుండా అంగన్ వాడీ కార్యకర్తలని ఇలాగే కొట్టించాడు. ఇప్పుడదే ఘోర తప్పిదంగా అన్పిస్తోంది. తాము అధికారంలో ఉండగా ఇలాగే వాతలు తేలేటట్లు కొడతారు, పదవులూడితే ఓదార్పులు చేపడతారు.

సుబ్బలష్షిమి:
కుర్చీలో ఉంటే ఒక మాట, కుర్చీ దిగిపోతే మరో మాట! భాజపా హయాంలో పెట్రోలు, కిరోసిన్ ధరలు పెంచితే, సోనియా "ప్రజల రక్తం పీల్చుతున్నారు" అన్నదట. అదే భాజపా ఇప్పుడు, యూపీఏ పెట్రో ధరలు పెంచితే ఆ మాటలనే సోనియాకి తిరిగి వడ్డించారు. వెరసి ప్రజలకు మాత్రం అప్పుడు ఇప్పుడు ధరల దెబ్బలే తగిలాయి.

సుబ్బారావు:
అంతే మరదలా! అప్పుడెప్పుడో భోజరాజు కాలంలో విక్రమాదిత్యుడి సింహాసనం పూడుకుపోయిన మట్టి మీద మంచె ఎక్కినప్పుడో మాట, దిగిపోతే మరో మాట మాట్లాడాడట ఓ రైతు! వీళ్ళ అధికారపు కుర్చీని ‘అభోజరాజ సింహాసనం’ అనో ‘అక్రమార్కుల సింహాసనం’ అనో పిలవాలేమో బావా!

Thursday, July 15, 2010

ఆప్పుడు వరుస బాంబు పేలుళ్ళు - ఇప్పుడు సోంపేట కాల్పులు, అంతే తేడా!

[పంట చేలో నెత్తుటి ధార - [సోంపేట] విద్యుత్ కేంద్రం వ్యతిరేక ఆందోళన కారులపై పోలీసుకాల్పులు - వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2009 ఎన్నికలకు ముందు, వై.యస్.ఆర్. బ్రతికున్న రోజులలో ఓసారి, కాంగ్రెస్ అధిష్టానం సోనియా, అనంతపురం పర్యటనకి వచ్చింది, గుర్తుందా!? అప్పుడు ఇడుపుల పాయలో.... వై.యస్. కుటుంబసభ్యులతో, [కేవలం కుటుంబసభ్యులతో మాత్రమే] కలిసి భోజనం చేసింది. ఏయే వంటకాలు వడ్డించారో ఈనాడు పత్రిక విపులంగా జాబితా వ్రాసింది. గుర్తు కొచ్చిందా?

సుబ్బారావు:
గుర్తుకొచ్చింది మరదలా! ఆరోజు రైతులతో వై.యస్. "సోనియా గాంధీ గారు మన రాగి సంకటి రుచి చూశారూ. మీ సమస్యలు అర్ధం చేసుకున్నారూ" అంటూ దీర్ఘాలు కూడా తీసాడు. డీడీ, వాళ్ళ సభా కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారం చేసింది కూడా! అయితే ఏమిటి?

సుబ్బలష్షిమి:
ఆ రోజు అనంతపురం సభలో వైయస్సారు "అమ్మా! అక్కడ ఆడవాళ్ళు సర్దుకు కూర్చొండి. తోసుకోవద్దు! పిల్లలు నలిగిపోతున్నారు. సోనియా గాంధీ గారు చెబుతున్నారు, స్త్రీలు కొంచెం సర్దుకొండి తల్లీ!" అంటూ... ‘పాపం! ఎంతో కన్సర్న్ చూపించారు’. కెమెరా సోనియా వైపు తిరిగితే, ఆమె చేతులటు వైపు చూపిస్తూ ఉంది. అంత జాగ్రత్త, ప్రేమ తమకి పబ్లిక్ పట్ల ఉన్నాయంటారు కదా?

ఈ రోజు పచ్చటి పొలాలు[సంవత్సరానికి మూడు పంటలు పండే పొలాలు] విద్యుత్ కేంద్రం వలన బీడు బారతాయంటూ ఆందోళన చేస్తూన్న వాళ్ళని అడ్డంగా కాల్చి చంపేసారే! మరి దీనికే మంటుంది అభినేత్రి సోనియా? అప్పటి బ్రిటీషు సర్కారుకీ, ఈ ఇటలీ మహిళ పాలనకీ తేడా ఏముంది బావా?

సుబ్బారావు:
ఆ రోజు ఎన్నికల అవసరం మరదలా! ఇప్పుడు ఈవీఎం లుండగా ఎవరితోనైనా పనేమిటి? అదీగాక... హఠాత్తుగా... సోంపేటలూ, కాశ్మీరు సమస్యలూ, పాక్ సరిహద్దు కాల్పులు గట్రా ‘హైజాక్ ’లు సృష్టించబడతాయి మరదలా! 2008లో పార్లమెంట్ లో ‘ఓటుకు నోటు’ బయటపడితే, జాతీయ స్థాయిలో ప్రజాదృష్టిని హైజాక్ చేయటానికి, నగరాలలో వరుసగా బాంబుపేలుళ్ళు జరిగాయి చూశావా!? అలాగే ఇప్పుడు రాష్ట్రస్థాయిలో, జగన్ Vs అధిష్టానం గొడవ నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటి సోంపేట లన్న మాట! అంత కౄరమైనది వీళ్ళ రాజకీయం!

Tuesday, July 13, 2010

ఇవా పత్రికా విలువలు? ఇదా ప్రజాసేవ?

సంచార మద్యం దుకాణం - వార్త నేపధ్యంలో
>>>రఘుదేవపురం, న్యూస్ టుడే: మద్యం విక్రయాలపై మహిళలు సాధించిన విజయం ఇది. పాటదారుడు, గ్రామంలో షాపు ఏర్పాటు చేయకుండా వారు అడ్డుకోవటంతో చివరకు అధికారులు సంచార వాహనం ద్వారా విక్రయాలు జరుపుకోవాలని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం మండలంలోని మిర్తిపాడులో మద్యం దుకాణం నెలకొల్పడాన్ని మహిళలు అడ్డుకున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఆ దుకాణం ప్రారంభం కావాల్సి ఉన్నా, గ్రామం అంతా మద్యం దుకాణం కుదరదని భీష్మించడంతో అధికారులు తలలు పట్టుకున్నారు.

ఆదివారం ఉదయం పాటదారులు మళ్ళీ జీపులో మద్యం సీసాలతో రావడంతో మహిళలు అడ్డుకున్నారు. దీంతో రాజమండ్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటిండెంట్ ప్రదీప్ రావు, కోరుకొండ సీఐ మోహన రావు, సీతానగరం ఎస్సై త్రిమూర్తులు, మహిళలతో చర్చలు జరిపారు. పంచాయితీ మద్యం దుకాణానికి స్థలం చూపి తీర్మానం చేసేంత వరకు, వాహనంలో మద్యం బాటిళ్ళు ఉంచి రోడ్డుపై మద్యం విక్రయాలు జరపాలని నిర్ణయించారు.

సుబ్బలష్షిమి:
బావా! ఈనాడు పత్రిక అడ్డగోలు వార్తాంశం చూడు! మొగుళ్ళు మద్యం తాగి, కొంప కొల్లేరు చేస్తున్నారని మొత్తుకుంటూ, మహిళలు, గ్రామంలో మద్యం దుకాణం పెట్టడాన్ని అడ్డుకుంటే, ప్రభుత్వాధికారులు వాహనంలో మద్యం సీసాలుంచి రోడ్డుప్రక్కనుంచి అమ్ముకునేటట్లు ఏర్పాట్లు చేశారట. సాయంత్రానికి, కూలీ డబ్బువచ్చే సరికి, తాగుబోతుల జేబులు ఖాళీ చేయటానికి ఈ సంచార మద్యం దుకాణాలు సిద్దంగా ఉంటాయన్నమాట.

అలాంటి చోట... కుటుంబ శ్రేయస్సు కోసం పోరాడిన ఆ మహిళలని ప్రభుత్వం దొంగదెబ్బ తీస్తే.... అది మహిళల విజయమని వ్రాసింది చూడు సదరు పత్రిక!?

సుబ్బారావు:
మరదే గమ్మత్తు మరదలా! కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనటం లేదు. కనీసం కుటుంబ శ్రేయస్సు కోసం అల్లాడుతూ, పోరాడిన మహిళలకు, బాసటగా నిలిచిన దూబగుంట్ల సంగతి దేవుడెరుగు, వాళ్ళ గోడైనా పట్టించుకోకుండా, సంచార మద్యం దుకాణం తెరిచిన ప్రభుత్వాన్ని ఏకి పారేయకుండా, మహిళల విజయమంటూ ఓ మొక్కుబడి వ్రాత వ్రాసేసి చేతులు దులుపుకుంది. పైగా సంచార మద్యం దుకాణం అంటూ హెడ్డింగ్! ఎక్కడా మహిళల బాధల ఊసే లేదు.

సుబ్బలష్షిమి:
బావా! ఇదంతా సరే! ఊరందరు ఒకటే మాటై, సంఘటితం అయి చేస్తున్న ఉద్యమానికి, మరి ప్రతిపక్షాలన్నా మద్దతు తెలపాలి కదా బావా!?

సుబ్బారావు:
ఈ ప్రతిపక్షాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి మరదలా!

సుబ్బలష్షిమి:
ఇంత నిస్సిగ్గు ప్రభుత్వాన్నీ, ప్రతిపక్షాలనీ, పత్రికలనీ ఎక్కడా చూడమేమో బావా! ఇంతోటి దానికి, ఇది ప్రజాస్వామ్యం అనీ, ప్రభుత్వాలు ప్రజాసేవ చేస్తున్నాయనీ, పత్రికాధిపతులలో రామోజీరావు దగ్గరే ఎంతోకొంత విలువలున్నాయనీ ప్రచారం కూడా!

Saturday, July 10, 2010

అందుకే కదా, ప్రజల కోసం గాకుండా, సోనియా కోసం పనిచేస్తున్నాడు!

["మీకు సీఎం పదవిని సోనియా ఇచ్చారు. ప్రజలు ఎన్నుకుంటే రాలేదు." - రోశయ్య గురించి చంద్రబాబు విమర్శ నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఎంఎల్ సీ గా ఉండి సీఎం అయిన రోశయ్యని చంద్రబాబు, మీకు సీఎం పదవి ప్రజలివ్వలేదు, సోనియా ఇచ్చిందని విమర్శిస్తున్నాడు చూశావా!

సుబ్బారావు:
అందుకే గదా మరదలా! రోశయ్య తన శాయశక్తులా... ప్రజల కోసం గాకుండా, సోనియా కోసం పనిచేస్తున్నాడు. ‘అధిష్టానం ముద్రే తన ముద్ర’ అని ఢంకా బజాయించీ మరీ చెబుతున్నాడు. ఈ పాటి దానికి ఇది ప్రజాస్వామ్యమనే వాళ్ళకి దండేసి దండం పెట్టాలి మరదలా!

సుబ్బలష్షిమి:
నిజానికి వాళ్ళకి కాదు బావా దండలెయ్యాల్సింది, అది నిజమేనని నమ్మేవాళ్ళకి దండలేసి సన్మానం చెయ్యాలి!
~~~~~~

ఇండియా చేస్తే మూఢనమ్మకం, సింగపూర్ లూ, జర్మనీలూ చేస్తే శాస్త్రీయమూ నేమో!

[సాకర్ పుట్ బాల్ విజయాల గురించి ‘పాల్’ అక్టోపస్ చెప్పిన జోస్యాలు నిజమౌతున్నాయి - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పుట్ బాల్ మ్యాచ్ ల్లో ఏ దేశపు జుట్టు గెలుస్తుందో, ఎనిమిది కాళ్ళుండే అక్టోపస్ జోస్యం చెబుతుందట ‘పాల్’ అనే పేరున్న, ఆ అక్టోపస్ చెప్పిన జోస్యాలు నిజమౌతున్నాయట తెలుసా? అలాగే సింగపూర్ లోనూ చిలక చెప్పిన జోస్యాలు నిజమౌతున్నాయి? అదెలా సంభవం బావా?

సుబ్బారావు:
ఎవరికి తెలుసు మరదలా! క్రికెట్ కి మాదిరిగా ఫుట్ బాల్ మ్యాచులూ మ్యాచ్ ఫిక్సింగ్ లయితే, ఇక సింగపూర్ చిలకలూ,పాల్ లూ క్రానే లౌతాయి కదా? క్రానే గుర్తున్నాడా? క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ ల రహస్యాన్ని బైట పెట్టాక విమాన ప్రమాదంలో మరణించాడు.

సుబ్బలష్షిమి:
గుర్తుంది బావా! అయినా నాకు తెలియకడుగుతాను, ఒకప్పుడు మనదేశ ప్రజలు సోదమ్మి జోస్యాలనీ, చిలక జోస్యాలనీ నమ్మితే తెగ ఎగతాళి చేశారు. మరిప్పుడు ‘పాల్’ జోస్యాలని టీవీలలో, పత్రికలలో చూపించి మరీ ఎలా ప్రచారిస్తున్నారు బావా?

సుబ్బారావు:
తాను చేస్తే లౌక్యమూ, మరొకరు చేస్తే మోసమూ అన్నాట్ట వెనకటి కెవరో. అలాగే.... అభివృద్ది దేశాలు చేస్తే ఆధునికత, వర్దమాన దేశాలు చేస్తే ఆనాగరికత అంటారు. ఒకప్పుడు ఇండియా చేస్తే మూఢనమ్మకం, సింగపూర్ లూ, జర్మనీలూ చేస్తే శాస్త్రీయమూ నేమో!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! కాన్సెప్ట్ మనది, ప్యాకింగ్ మార్చి అదే విషయాన్ని వ్యాపారం చేసుకునేది తెల్లోళ్ళు! ఇదే కదా కార్పోరేట్ కంపెనీల వ్యాపార రహస్యం!

Friday, July 9, 2010

అప్పుడే చెప్పింది ఆంధ్రజ్యోతా? ‘అమ్మఒడి’ బ్లాగా?

[ఆంధ్రజ్యోతి చెప్పిదంటే అక్షరాల నిజమే! అధిష్టానం పట్ల జగన్ వైఖరి గురించి నెలన్నర క్రితమే చెప్పిన ఆంధ్రజ్యోతి - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అధిష్టానం పట్ల జగన్ వైఖరి గురించి, ఆంధ్రజ్యోతి నెలన్నర క్రితం నుండే పలు కథనాలు ప్రచురించిందని, సదరు పత్రిక గొప్పగా చెప్పుకుంటోంది. మరి ‘అమ్మఒడి’ బ్లాగు, జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు అంటూ, తొమ్మిది నెలల క్రితం నుండీ [oct.10, 2009 నుండి] చెప్పింది కదా బావా?

సుబ్బారావు:
ఎంత మాట అన్నావ్ మరదలా! వార్తా పత్రికలు వ్రాస్తే నిజాలు, బ్లాగులు వ్రాస్తే అబద్దాలని, ఈనాడు పత్రిక ఎప్పుడో చెప్పలేదా? మీడియా చెబితేనే నిజాలు గానీ, బ్లాగుల్లో చెబితే ఏముంది?

సుబ్బలష్షిమి:
ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చెప్పినా.... సత్యం సత్యమే కదా బావా! మీడియా చెప్పిందని అబద్దాలు నిజాలై పోవు, బ్లాగుల్లో చెప్పారని నిజాలు అబద్దాలై పోవు కదా!

సుబ్బారావు:
అయినా అంతే! అలా అనటం మీడియా హక్కుమరి!
~~~~~

240. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 02 [పిల్లిదూరే కంతలో ఎలుక దూరదా సత్తెయ్యా!] [Nov.03, 2009]

242. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 03 [ఎవరు ఎవరికి దాసోహం అన్నారు?] [Nov.05, 2009]

243. జగన్ శిబిరానికీ, కాంగ్రెస్ అధిష్టానానికీ మధ్య సాగుతున్న అంతర్లీన పోరు – 04 [ఏకాంత భేటీ వరకూ…] [Nov.06, 2009]

Thursday, July 8, 2010

అధిష్టానం Vs జగన్ - ఇద్దరిలో ఎవరెక్కువ నిజాలు చెబుతున్నారు?

[దండయాత్రలా కాదు. ‘అధిష్టానం ఆలోచన’ పేరుతో రోశయ్య ప్రకటన నేపధ్యంలో....
>>>ఓదార్పు యాత్ర చేయాల్సింది దండయాత్ర మాదిరో, జైత్రయాత్ర మాదిరో కాదని ముఖ్యమంత్రి రోశయ్య హితవు పలికారు. అధిష్టానం ఎప్పుడూ ఓదార్పు యాత్రను వద్దనలేదని, జగన్ బహిరంగ లేఖలో పేర్కొన్నట్లు బాధిత కుటుంబాలను ఒకచోట చేర్పి ఆర్దిక సాయం, ఓదార్పు చేయవచ్చని సోనియా గాంధీ సూచించారని తెలిపారు. ]

సుబ్బలష్షిమి:
బావా! ముఖ్యమంత్రి రోశయ్య.... జగన్ ఓదార్పు యాత్ర బయలు దేరే ముందు వరకూ, తాను ఢిల్లీ వెళ్ళే ముందు వరకూ కూడా, అధిష్టానం ఓదార్పు యాత్ర వద్దందనీ, ఎం.ఎల్.ఏ. లెవరు అందులో పాల్గొన వద్దనీ, అధిష్టానాన్ని ధిక్కరించడం మంచిది కాదనీ అన్నాడు కదా! మరి ఢిల్లీ వెళ్ళి తిరుగు ప్రయాణం ముందు.... అధిష్టానం ఎప్పుడూ ఓదార్పు యాత్రని వద్దన లేదంటా డేమిటి? నిన్నటి దాకా ఢిల్లీలో... అభిషేక్ సింఘ్వీ, మనీష్ తివారీ దగ్గరి నుండీ కేకేలూ, వి.హెచ్.ల వరకూ అందరూ... ‘అధిష్టానం యాత్రకు వ్యతిరేకం. అంచేత ధిక్కరించవద్దంటూ’ జగన్ కు సుద్దులు చెప్పారు కదా? ఇదేం మడత నాలుక?

సుబ్బారావు:
అంతే కాదు మరదలా! మొన్నా మధ్య వీరప్ప మొయిలీ తనని ఆశీర్వదించి యాత్ర చేసుకో పొమ్మన్నాడన్నాడు జగన్. ‘ఠాఠ్’ నేనేం అలా అనలేదన్నాడు మొయిలీ! తనను అబద్దాల కోరుని చేశారని జగన్ ఘోల్లు మన్నాడు. ఆరోజు మొయిలీ జగన్ లలో... ఎవరు నిజం చెప్పారో, ఎవరు అబద్దం చెప్పారో ఎవరికీ తెలియదు గానీ, ఇప్పుడైతే విషయం మరింత బహిరంగ పడింది కదా?

సుబ్బలష్షిమి:
పోల్చి చూస్తే... అధిష్టాన బృందం Vs జగన్ శిబిరాలలో, క్రమంగా జగనే, ఎక్కువ పారదర్శకంగా, లోపల జరిగిన విషయాలు బయటపెడుతున్నట్లున్నాడు బావా!

సుబ్బారావు:
మరో విశేషం మరదలా! తెదేపాకి చెందిన పయ్యావుల కేశవులు, సూటిగా..."ఈ ఓదార్పు యాత్ర వల్ల సమాజానికి జరిగే తక్షణ నష్టమూ, లాభమూ ఏదీ లేదన్నాడు. రాజ్యాలేమీ కూలిపోవని చెప్పాడు. ఈ వివాదం కాంగ్రెస్ లో వ్యక్తి స్వేచ్ఛకు సంకెళ్ళు వేసే ప్రయత్నం చేస్తున్నారు" అని దుయ్యబట్టాడు. నిజమే కదా! ఓదార్పు యాత్ర చేస్తే రాజ్యాలు కూలుతాయా? ఎందుకంత గొడవ పడుతున్నారు?

సుబ్బలష్షిమి:
చూడబోతే ‘ఓదార్పుయాత్ర’ కేవలం పైకారణంలా ఉంది బావా! లోపల ఇంకేదో మరుగుతున్నట్లుంది. చూద్దాం! ఈ అంకం మరెన్ని మలుపులు తిరుగుతుందో! మరింత స్పష్టపడ్డాకైనా, ఎవరి గోల ఏమిటో తెలియక పోదు కదా?

Tuesday, July 6, 2010

సోనియా కంటే సమర్దులున్నారా?

[సోనియా కంటే సమర్ధులున్నారా? - రేణుకా చౌదరి ప్రశంస నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి ‘ఎన్టీఆర్ జిందాబాద్’ అన్న రేణుకా చౌదరి, కాంగ్రెస్ లోకి దూకి చాలా ఏళ్ళే అయ్యింది. ఆ రాజకీయ నాయకురాలు, ఇప్పుడు ఎంతగా ‘సోనియా జిందాబాద్’ అంటోందో చూడు! ‘సోనియా కంటే సమర్ధులున్నారా?’ అంటోంది.

సుబ్బారావు:
అవును మరదలా! సోనియా కంటే సమర్దులెవరున్నారు?
పీవీజీ ని అవమానించటంలో,
తన పాపాలన్నీ ఆయన ఖాతాలో వేయటంలో,
పెట్రో ధరలు దగ్గర నుండి చట్టబద్దంగా ప్రజలని దోపిడి చేయటంలో,
అన్నిరకాలుగా సామాన్యుల పీకలు పిసకటంలో,
వందిమాగధుల చేత కాళ్ళు పిసికించుకోవటంలో...
ఎందులోనూ సోనియా కంటే ఎవరూ సమర్ధులు కారు.

సుబ్బలష్షిమి:
అంతే కాదు బావా! బాకా ఊదటంలో రేణుకా చౌదరి కంటే కూడా సమర్ధులు లేరనుకుంటా!

సుబ్బారావు:
అందులోనే కాదు మరదలా, రేణుకా చౌదరి ఇంకా చాలా వాటిల్లో సమర్దురాలే! కాబట్టే ఇప్పుడు ఎంపిగా ఓడిపోయినా కూడా, ఉపాధి హామీ పధకానికి చైర్మన్ వంటి ఉన్నత పదవుల్ని ఆనందిస్తోంది. అలాంటప్పుడు ఆ పాటి భజన చేయదా ఏం?

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ఎంతగా అధినేత్రికి భజన చేస్తే అంతగా పదవులూ, పైసలూ వస్తాయి మరి!

Monday, July 5, 2010

ఎవరెంత బాగా గొంతు పిసికారూ?

[జనంపై పెట్రోభారం తక్కువే. విపక్షాల ఆందోళనలో అర్ధం లేదు. మురళీ దేవ్ రా ధ్వజం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పెట్రోధరల పెంఫుని కేంద్ర పెట్రోలియం మంత్రి మురళీ దేవ్ రా ఎంత అడ్డగోలుగా సమర్ధించుకుంటున్నాడో చూడు! ఈ పెంఫువల్ల పడే అదనపు భారం, వంటగ్యాస్ పై రోజుకు రూపాయి కన్నా తక్కువగా, కిరోసిన్ పై 26-27 పైసల కన్నా తక్కువగా ఉందని, అతడు గుర్తు చేశాడట. కిరోసిన్ పై లీటర్ కు 18.07/Rs. లు పెంచాల్సి ఉన్నా, తాము కేవలం 3/-రూ.లు మాత్రమే పెంచారట. ఎంత దయతో మెలిగామో చూడమంటున్నాడు.

సుబ్బారావు:
వంటగ్యాస్ ధర పెరిగితే, కమర్షియల్ సిలిండర్ ధరా పెరుగుతుంది. దెబ్బతో హోటళ్ళలో తినుబండారాలు ధర కూడా పెరుగుతుంది. అదీగాక, పెట్రో ధరలు పెరిగిన తక్షణమే, రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దాంతో అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. అవేమీ మాట్లాడకుండా, గ్యాస్ బండపై రోజుకు రూపాయి కంటే పెరగదని, ఎంత మాయమాటలు చెబుతున్నాడో సదరు మంత్రి మహాశయుడు!

సుబ్బలష్షిమి:
`గతంలో ఎన్డీయే ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచలేదా? విపక్షాలు వంచనకు పాల్పడుతున్నాయి. విపక్షాల ఆందోళనలో అర్ధం లేదని' కూడా సెలవిస్తున్నాడు.

సుబ్బారావు:
ధరలు పెంచడంలో ఎన్డీయే, యూపీఏలు ఎవరికి వారే సాటి! అపాటి దానికి ఎవరెక్కువ పెంచారంటూ పోలికలు కూడాను!

సుబ్బలష్షిమి:
అయితే ఎవరెంత బాగా గొంతు పిసికారంటూ పోలికలన్న మాట!
~~~~~

Saturday, July 3, 2010

ఇలాంటి పద్యం మీరెప్పుడయినా చదివారా?

[ఈనాడు హాయ్ బుజ్జీలో, వేమన పద్యం పేరిట ఈ రోజు[3 జూలై, 2010], ప్రచురితమైన

తనకు గలుగు పెక్కు తప్పులునుండగా
ఓగు నేర మెంచు నొరుల గాంచి
చక్కిలంబు జూచి జంతిక నగినట్లు
విశ్వదాభిరామ వినుర వేమ

అర్ధం:
తనలో చాలా తప్పులున్నా అవేవి లేనట్లు, దుర్మార్గుడు, ఎదుటి వారిలోని తప్పులను బయటపెడుతూ ఉంటాడు. ఎలాగంటే - జంతిక తనలో ఉన్న ఎక్కువ వంకర్లను చూసుకోకుండా, తక్కువ వంకర్లున్న చక్కిలాన్ని వెక్కిరింటినట్లు! - పద్యం నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ వేమన పద్యం చూశావా కొత్తగా ఉంది! ఇంతకీ... జంతికలకీ, చక్కిలాలకీ తేడా ఏమిటో తెలుసా బావా! కొందరు అన్నిటినీ ’చక్రాలు’ అనే అంటారు మరి!

సుబ్బారావు:
ఇలాంటి కొత్త కొత్త పద్యాలు ‘ఈనాడు’ లోనే చూస్తున్నాను మరదలా! అసలవి నిజంగా వేమన పద్యాలో కావో కూడా తెలియదు. ఎప్పుడూ ఎక్కడా చదివినవి కావు. మన బ్లాగర్లలో ఎవరికైనా ఇలాంటి ‘కొత్త వేమన పద్యాలు’ తెలుసునేమో అడుగుదాం!

సుబ్బలష్షిమి:
‘పదుగురాడు మాట పాడియై ధరజెల్లును’ అన్నది పాత మాట. ‘మీడియా ప్రచారించిందే పాడియై ధరజెల్లును’ అనేది కొత్త మాటలా ఉంది బావా!

Friday, July 2, 2010

రక్తం పారించిన కారణం మతం కాదు, ఆర్దికమే!

[భారత స్వాతంత్ర విజయోత్సవం గురించీ, దేశ విభజన విషాదం గురించీ, భారత్ సింధ్ ల మధ్య అవిభాజ్య సంబంధం గురించీ - అద్వానీ ఆత్మకథలో ప్రస్తావన నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! అద్వానీ తన ఆత్మకథలో, దేశ విభజన నాటి రోజుల విషాదం గురించి విశదీకరించాడు చూశావా! మాతృభూమిని కోల్పోయి, ఆస్థిపాస్థుల్ని పోగొట్టుకుని, ఆత్మీయులందరూ చెల్లాచెదురై పోగా, శరణార్ధులై లక్షలాది మంది సింధీలు భారత దేశానికి వలస వచ్చిన నాటి రోజుల గురించి చదివితే గుండెలవిసి పోయాయి.

నిజంగా అమ్మఒడి లాంటిది మాతృభూమి. దాన్ని కోల్పోవటం జీవితంలో అత్యంత విషాదకరం కదూ బావా! సింధ్ లో ధనికులుగా పరిగణింపబడ్డవాళ్ళు, ఇక్కడికి వచ్చాక రైల్వేస్టేషన్లలో వార్తాపత్రికలు అమ్ముకునే స్థాయికి పడిపోయారట!

సుబ్బారావు:
భారత దేశం నుండి కరాచీకి పెద్దఎత్తున [ముస్లింలు] ముజాహిర్లు చేరారట! కరాచీ నుండీ, సింధ్ లోని ఇతర ప్రాంతాల నుండి దాదాపు హిందువులంతా ఇళ్ళను వదలి వలసి వెళ్ళినప్పుడు, వారు వదిలిపెట్టిన భూములను, ఆస్తులను స్వాధీన పరుచుకునేందుకు, అక్కడి వారు ఉన్మాదంతో ఎగబడ్డారట!

ఇక అలాంటి వార్తలు ప్రచారం అయినప్పుడు, అటు నుండి ఇటు వలస వచ్చిన హిందువులలో పెరిగిన ఆక్రోశం, ఇటు నుండి అటు వలస వెళ్ళిన ముస్లింలో కలిగిన ఆశ, ఉత్సాహం.... వెరసి దేశ విభజన నాడు, మట్టి, రక్తంతో తడిసింది. మత విద్వేషాలు, మత ఘర్షణలుగా చరిత్రలో వ్రాయబడింది. రక్తం పారించిన కారణం మతం కాదు, ఆర్దికమే!

ఇవన్నీ వదిలేసి....క్రికెటర్ల జీవితం చరిత్రలని పిల్లలకి పాఠ్యాంశాలుగా పెట్టారు. నిజానికి ఇలాంటి విషయాలని చరిత్ర పాఠాలుగా నేర్పాలి మరదలా! అప్పుడు గానీ జనాలకి, మాతృదేశాన్ని ఎందుకు కాపాడుకోవాలో అర్ధం కాదు.

సుబ్బలష్షిమి:
నిజం బావా! "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి!" అన్నాడు శ్రీరామ చంద్రుడు! ఆ నిజం ఎప్పటికి ఈ పదార్దవాదులకి అర్ధమౌతుందో!?

ఏ రోలు దగ్గర ఆ రోటిపాట పాడటం అంటే ఇదే!

[>>>1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల విషయం ప్రస్తావిస్తూ.. భారత న్యాయవ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్నాయని మన్మోహన్ సింగ్ అంగీకరించారు. - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోత విషయం ప్రస్తావిస్తూ, భారత న్యాయవ్యవస్థలో లోపాలున్నాయని మన్మోహన్ సింగ్, మొన్న కెనడా పర్యటనలో అన్నాడట తెలుసా?

సుబ్బారావు:
అవునా!? మరి ఆ విషయం తెలిసీ, జగదీష్ టైటర్లని ఎందుకు దరిజేర్చుకు ఆదరిస్తున్నారట? మొత్తానికీ ఈ ఆర్దిక వేత్త.... ‘ఏ రోలు దగ్గర ఆ రోటిపాట పాడటం, ఏ ఎండకు ఆ గొడుగు పట్టటం’ వంటి తన గుప్త విద్యని, ఇప్పుడు బాగానే ప్రదర్శిస్తున్నాడు.

సుబ్బలష్షిమి:
అంతే బావా! బహిర్గతమైతేనే కదా ఎవరేమిటో తెలిసేది?

Thursday, July 1, 2010

ఎక్కడయినా బావా కాని, ధరల విషయంలో మాత్రం కాదు!

[>>>ఒక కారు వినియోగదారునిపై నెలకు 190 రూపాయలకు మించి భారం పడదు. ద్విచక్ర వాహనదారుడిపై కూడా 30-35 రూపాయలకు మించిన భారం ఉండదని అంచనా. ఇది చాలా హేతుబద్దం.

కిరోసిన్, వంటగ్యాస్ ధరలు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లతో పోల్చుతూ అక్కడి కంటే భారత్ లోనే చాలా తక్కువని, కాబట్టి పెంచడం సరియైన చర్య -కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి సుందరేశన్ వివరణల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ సుందరేశన్... కిరోసిన్, గ్యాస్ సిలిండర్ ధరలు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంకలలో మనదేశంలో కంటే చాలా ఎక్కువట. ఇక్కడ తక్కువ కాబట్టి సంతోషించమంటున్నాడు. అలా పోల్చుకునేటప్పుడు, మరి ధరలు తక్కువ ఉన్న దేశాలతో పోల్చుకోవచ్చు కదా?

అంతేకాదు బావా,మన రాష్ట్రప్రభుత్వం కూడా... ‘ఫలానా రాష్ట్రంలో ఫలానా ధరలు తక్కువ. కాబట్టి ఇక్కడ ధరలు పెంచడం సబబే’ అంటూ అన్ని రకాల ధరలు పెంచుకుంటూ పోతున్నారు. మరి మన రాష్ట్రంలో కందిపప్పు ధర కిలో 100/-రూ. ఉన్నరోజుల్లో కేరళలో 40-50 రూపాయలకే దొరికింది కదా! అలాగే చాలా రాష్ట్రాల్లో చాలా వస్తువుల ధరలు తక్కువగానే ఉంటాయి కదా! మరి వాటి విషయంలో పోల్చుకోవేం బావా?

సుబ్బారావు:
ఎక్కడయినా బావా కాని వంగతోట కాదు అన్నట్లు, ధరలు పెంచే విషయంలో మాత్రమే పోల్చుకుంటారు, మరదలా!

సుబ్బలష్షిమి:
మొత్తానికీ... ప్రజాస్వామ్యబద్దంగా, చట్ట సమ్మతంగా దోచుకుంటున్నారు కదా, బావా!

మీరంతా ఏడుస్తూ ఇడుపులపాయ రండి. మేమొచ్చి మిమ్మల్ని ఓదార్చుతాం!

[ఓదార్పు యాత్ర వద్దని జగన్ కి సోనియా సూచించిన వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! జగన్, తండ్రి వై.యస్. చనిపోయినప్పుడు, మృతి చెందిన అభిమానులని ఓదారుస్తానంటూ యాత్ర చేపడతానంటాడు. సోనియా వద్దంటోందట. ఖమ్మంలో యాత్ర సజావుగానే జరిగినా, వరంగల్ లో తెరాస శ్రేణులు, తెలంగాణా వాదులూ అడ్డుకున్నారు. చివరగా ‘నో’ అంటూ సోనియా పైకి తేలింది. అంటే అప్పుడు వరంగల్ లో అడ్డుకున్న వారి వెనక ఉన్న అదృశ్య హస్తం ఎవరిది బావా?

సుబ్బారావు:
ఇంకెవరిది? సోనియాదేనని స్పష్టంగా తేలింది కదా మరదలా!

సుబ్బలష్షిమి:
పైగా.... అందరినీ ఒకేచోట చేర్చి, వాళ్ళని కలిసి, సాయం అందించాల్సిందిగా సోనియా సూచించిందట. ‘మీరంతా ఏడుస్తూ ఇడుపులపాయ రండి. మేమొచ్చి మిమ్మల్ని ఓదార్చుతాం. ఆపైన ఫోటోలు తీసుకుని పేపర్లో, వీడియోలు తీసుకుని టీవీలో వేస్కుంటాం’ అనాలన్న మాట! ఎంత గొప్ప సంస్కారం బావా? బాధల్లో ఉన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదారుస్తారా, వాళ్ళని మన దగ్గరికి పిలిపించి ఓదారుస్తారా?

సుబ్బారావు:
బహుశః అది సోనియా సాంప్రదాయమేమో మరదలా!