Friday, July 16, 2010

అధికారంలో ఉంటే వాతలు - పదవులూడితే ఓదార్పులు!

[సోంపేట కాల్పులూ, లాఠీఛార్జీల ఘటనల్లో మహిళనని కూడా చూడకుండా పోలీసులు కొట్టారని సోంపేట ఆసుపత్రిలో దెబ్బలను చంద్రబాబుకు చూపుతున్న మహిళ - ఈనాడు ఫోటో వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! మొన్న సోంపేట విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ రైతులు చేసిన ప్రతిఘటనలో పోలీసులు లాఠీఛార్జీ, కాల్పులు జరిపారు కదా? ఆ బాధితులని పరామర్శించడానికి చంద్రబాబు ఇతర విపక్ష నేతలు వెళ్ళారు.

సుబ్బారావు:
చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉండగా, ఆడవాళ్ళని కూడా చూడకుండా అంగన్ వాడీ కార్యకర్తలని ఇలాగే కొట్టించాడు. ఇప్పుడదే ఘోర తప్పిదంగా అన్పిస్తోంది. తాము అధికారంలో ఉండగా ఇలాగే వాతలు తేలేటట్లు కొడతారు, పదవులూడితే ఓదార్పులు చేపడతారు.

సుబ్బలష్షిమి:
కుర్చీలో ఉంటే ఒక మాట, కుర్చీ దిగిపోతే మరో మాట! భాజపా హయాంలో పెట్రోలు, కిరోసిన్ ధరలు పెంచితే, సోనియా "ప్రజల రక్తం పీల్చుతున్నారు" అన్నదట. అదే భాజపా ఇప్పుడు, యూపీఏ పెట్రో ధరలు పెంచితే ఆ మాటలనే సోనియాకి తిరిగి వడ్డించారు. వెరసి ప్రజలకు మాత్రం అప్పుడు ఇప్పుడు ధరల దెబ్బలే తగిలాయి.

సుబ్బారావు:
అంతే మరదలా! అప్పుడెప్పుడో భోజరాజు కాలంలో విక్రమాదిత్యుడి సింహాసనం పూడుకుపోయిన మట్టి మీద మంచె ఎక్కినప్పుడో మాట, దిగిపోతే మరో మాట మాట్లాడాడట ఓ రైతు! వీళ్ళ అధికారపు కుర్చీని ‘అభోజరాజ సింహాసనం’ అనో ‘అక్రమార్కుల సింహాసనం’ అనో పిలవాలేమో బావా!

No comments:

Post a Comment