Tuesday, July 27, 2010

ఎన్ని చెట్లు కొట్టేస్తే ఇన్ని కాగితాలు తయారవ్వాలి?

[పదో తరగతి విద్యార్దులకు 24 పేజీల జవాబు పత్రం వచ్చే ఏడాది నుండి ఇవ్వనున్నారు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! పదో తరగతి పబ్లిక్ పరీక్షలు వ్రాసే విద్యార్దులకు, 24 పేజీలతో కూడిన ఆన్సర్ బుక్ లెట్ ను, వచ్చే ఏడాది నుండి ఇస్తారట. పారదర్శకత పెంపుకూ, ఇన్విజిలేటర్ పై పని భారాన్ని తగ్గింపుకూ ఇది ఉపయోగపడుతుందట. ఇది ప్రయోగాత్మకంగా ఇంటర్ పరీక్షల్లో విజయవంతమైందట. వచ్చే ఏడాది అన్ని సబ్జెక్టులకీ అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి బలరామయ్య చెప్పాడు.

బహుశః ఏ రాజకీయ కుటుంబానికో గుత్తకివ్వలని అనుకుంటున్నారేమో బావా! విడిగా పేపర్లిచ్చే దాని కన్నా, 24 పేజీల కట్ట అంటే - బల్క్ గా ఉంటుంది, లాభమూ ఎక్కువ వస్తుంది కదా!

సుబ్బారావు:
పారదర్శకత పెరిగేదే ముంది మరదలా! కార్పోరేట్ స్కూళ్ళ పైసలకి అవకతవకలన్నీ పారదర్శకంగానే అందుబాటులో ఉన్నాయయ్యె! ఇక ఇన్విజిలేటర్లు పని భారమా? అంతకంటే ప్రైవేటు రంగంలో ఒళ్ళు విరగ్గొట్టించుకుని చాకిరీ చేసేవాళ్ళున్నారు. అదీగాక... ఒక విద్యార్ది 24 పేజీలు వ్రాస్తాడు. ఒకోకడు రెండు పేజీలు కూడా వ్రాయడు. ఎంత స్టేషనరీ దండగో తెలుసా? ఎన్ని చెట్లు కొట్టేస్తే ఇన్ని కాగితాలు తయారవ్వాలి?

సుబ్బలష్షిమి:
అన్నిరకాలుగా.... మన దేశ ఆర్దిక, ప్రాకృతిక, వస్తు వనరుల్ని దుంప నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నట్లున్నారు బావా! శతృవుని నాశనం చేసే ముందు, వారి ఉత్సాహ ఐశ్వర్య మంత్రాంగాలని నాశనం చెయ్యాలన్నాడు భారతంలో కణికుడు! అదే అమలు చేస్తున్నారు ప్రస్తుత పాలకులు!

1 comment: