Tuesday, July 13, 2010

ఇవా పత్రికా విలువలు? ఇదా ప్రజాసేవ?

సంచార మద్యం దుకాణం - వార్త నేపధ్యంలో
>>>రఘుదేవపురం, న్యూస్ టుడే: మద్యం విక్రయాలపై మహిళలు సాధించిన విజయం ఇది. పాటదారుడు, గ్రామంలో షాపు ఏర్పాటు చేయకుండా వారు అడ్డుకోవటంతో చివరకు అధికారులు సంచార వాహనం ద్వారా విక్రయాలు జరుపుకోవాలని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం మండలంలోని మిర్తిపాడులో మద్యం దుకాణం నెలకొల్పడాన్ని మహిళలు అడ్డుకున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఆ దుకాణం ప్రారంభం కావాల్సి ఉన్నా, గ్రామం అంతా మద్యం దుకాణం కుదరదని భీష్మించడంతో అధికారులు తలలు పట్టుకున్నారు.

ఆదివారం ఉదయం పాటదారులు మళ్ళీ జీపులో మద్యం సీసాలతో రావడంతో మహిళలు అడ్డుకున్నారు. దీంతో రాజమండ్రి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటిండెంట్ ప్రదీప్ రావు, కోరుకొండ సీఐ మోహన రావు, సీతానగరం ఎస్సై త్రిమూర్తులు, మహిళలతో చర్చలు జరిపారు. పంచాయితీ మద్యం దుకాణానికి స్థలం చూపి తీర్మానం చేసేంత వరకు, వాహనంలో మద్యం బాటిళ్ళు ఉంచి రోడ్డుపై మద్యం విక్రయాలు జరపాలని నిర్ణయించారు.

సుబ్బలష్షిమి:
బావా! ఈనాడు పత్రిక అడ్డగోలు వార్తాంశం చూడు! మొగుళ్ళు మద్యం తాగి, కొంప కొల్లేరు చేస్తున్నారని మొత్తుకుంటూ, మహిళలు, గ్రామంలో మద్యం దుకాణం పెట్టడాన్ని అడ్డుకుంటే, ప్రభుత్వాధికారులు వాహనంలో మద్యం సీసాలుంచి రోడ్డుప్రక్కనుంచి అమ్ముకునేటట్లు ఏర్పాట్లు చేశారట. సాయంత్రానికి, కూలీ డబ్బువచ్చే సరికి, తాగుబోతుల జేబులు ఖాళీ చేయటానికి ఈ సంచార మద్యం దుకాణాలు సిద్దంగా ఉంటాయన్నమాట.

అలాంటి చోట... కుటుంబ శ్రేయస్సు కోసం పోరాడిన ఆ మహిళలని ప్రభుత్వం దొంగదెబ్బ తీస్తే.... అది మహిళల విజయమని వ్రాసింది చూడు సదరు పత్రిక!?

సుబ్బారావు:
మరదే గమ్మత్తు మరదలా! కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనటం లేదు. కనీసం కుటుంబ శ్రేయస్సు కోసం అల్లాడుతూ, పోరాడిన మహిళలకు, బాసటగా నిలిచిన దూబగుంట్ల సంగతి దేవుడెరుగు, వాళ్ళ గోడైనా పట్టించుకోకుండా, సంచార మద్యం దుకాణం తెరిచిన ప్రభుత్వాన్ని ఏకి పారేయకుండా, మహిళల విజయమంటూ ఓ మొక్కుబడి వ్రాత వ్రాసేసి చేతులు దులుపుకుంది. పైగా సంచార మద్యం దుకాణం అంటూ హెడ్డింగ్! ఎక్కడా మహిళల బాధల ఊసే లేదు.

సుబ్బలష్షిమి:
బావా! ఇదంతా సరే! ఊరందరు ఒకటే మాటై, సంఘటితం అయి చేస్తున్న ఉద్యమానికి, మరి ప్రతిపక్షాలన్నా మద్దతు తెలపాలి కదా బావా!?

సుబ్బారావు:
ఈ ప్రతిపక్షాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి మరదలా!

సుబ్బలష్షిమి:
ఇంత నిస్సిగ్గు ప్రభుత్వాన్నీ, ప్రతిపక్షాలనీ, పత్రికలనీ ఎక్కడా చూడమేమో బావా! ఇంతోటి దానికి, ఇది ప్రజాస్వామ్యం అనీ, ప్రభుత్వాలు ప్రజాసేవ చేస్తున్నాయనీ, పత్రికాధిపతులలో రామోజీరావు దగ్గరే ఎంతోకొంత విలువలున్నాయనీ ప్రచారం కూడా!

4 comments:

  1. ఈనాడు అనేది వార్తా పత్రిక అంటే వార్తలని ప్రజలకి అందించే పత్రిక. మీరు చెప్పినట్టు ప్రభుత్వాన్ని ఎకిపారెయ్యడం లేదా ప్రభుత్వం తో కుమ్ముక్కై వాటికి అనుకూలంగా రాయడం రెండు తప్పే, అవి ఎడిటర్ పేజి లో సంపాదకీయం లో మాత్రమే రాయాలి. మిగితా చోట్ల అక్కడ ఏమి జరిగితే, అదే విషయాన్ని మనకి అంటే ప్రజలకి తెలియ చేయాలి. ఈ విషయం లో ఈనాడు తన పని తను చేసింది.

    ReplyDelete
  2. మొత్తానికి ఈనాడు తన పని తను చేసిందంటారు! దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమం రోజుల్లో కూడా ఇలాగే చేసాడా? అంటే ఎడిటోరియల్ పేజీలలో మాత్రమే వ్రాసాడా! నాకు గుర్తుండి ప్రత్యేక పేజీలు వ్రాసాడు. ఆపై మీ విజ్ఞత!

    ReplyDelete
  3. నేను ఈనాడు కు representative ని కాదు. ఈ టపాకి మాత్రమే నా అభిప్రాయం రాసాను. మీరు పెట్టిన heading "ఇవా పత్రికా విలువలు? ఇదా ప్రజాసేవ" దీనికి వర్తించదు అని మాత్రమే చెప్పడం నా ఉద్దేశం . కాంగ్రెస్ వాళ్ళ లాగ తప్పు ఇతి చూపిస్తే తెలుగు దేశం వాళ్ళు అప్పుడేం చేసారు అని అడిగినట్టుంది మీ వాలకం. lol

    ReplyDelete
  4. ఆ వార్త లో తప్పేముంది..? నాకేమి అర్థం కావట్లేదు, వార్తను కేవలం వార్తగానే పబ్లిష్ చేసారు..! మీకేమన్న ప్రత్యేకమైన అభిప్రాయాలుంటే..?!! అవి ఇలా మీ ఆర్టికల్ ద్వార ఆ వార్త మీద రుద్దుతున్నట్లు అనిపిస్తున్నది..మరంత వరకు నిజమో అన్నది మాకు తెలియదు

    ReplyDelete