Tuesday, June 1, 2010

సోనియాతో చిరంజీవి చర్చలు - మరింకేదో సమస్య పరిష్కారానికి ఆపసోపాలు!

[కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, ప్రరాపా అధ్యక్షుడూ సినీ నటుడూ అయిన చిరంజీవితో భేటీ - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఒకప్పుడు కాంగ్రెస్ అధిష్టానం సోనియా అపాయింట్ మెంట్, సీనియర్లకి సైతం దుర్లభంగా ఉండేది. ఇప్పుడేమిటీ, స్థానిక పార్టీ ప్రరాపా, అందునా పెద్దగా ఎం.ఎల్.ఏ.లనీ, ఎంపీలనీ గెలిపించుకోలేక చతికిల పడిన పార్టీ, ఆ ప్రరాపా అధ్యక్షుడైన చిరంజీవిని అహ్వానించి మరీ అప్పాయింట్ మెంట్ ఇచ్చింది. అధిష్టానానికి అంత అవసరం ఏమొచ్చింది బావా!?

సుబ్బారావు:
వై.యస్.‘జగన్’ కి చెక్ పెట్టేందుకే చిరంజీవితో చర్చలు జరిపిందని మీడియా అంటుంది మరదలా! రాజ్యసభ టిక్కెట్లు వ్యవహారామని మరికొందరి ఉవాచ! ‘ఇదిగో మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి. ఇది అందుకే సంకేతం’ అని జోస్యాలు చెబుతున్నారు మరికొందరు.

సుబ్బలష్షిమి:
ఈ పైమాటల కేమొచ్చిందిలే బావా! లోపలి మాట చెప్పు!

సుబ్బారావు:
ఆ మధ్య చిరంజీవి అల్లుడికి సెన్సార్ బోర్డులో మెంబర్ షిప్ వచ్చింది మరదలా! ఆ తరువాత ‘వరుడు’ సినిమా విడుదలకి ముందు పైరసీపై ఉక్కుపాదం అంటూ రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేసింది. ఇటీవల చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజకు ముంబై సినిమా పిలుపులూ, కొత్త సినిమాలూ వచ్చాయి. ‘పెప్సీ’ వంటి బడా కంపెనీల నుండి బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాలు వచ్చాయి. ఆ తరువాత పోలవరం ప్రాజెక్ట్ అంటూ చిరంజీవి ‘యాత్ర’కు మీడియా విపరీత ప్రచారం చేసింది. ఈ విధంగా జగన్ ‘యాత్ర’ రగడకు, చాలా ముందు నుండే... కాంగ్రెస్ అధిష్టానం, ఆ వెనక మంత్రాంగం, చిరంజీవిని ఎప్పుడో మంచి చేసుకున్నాయి.

ఇదంతా చూస్తుంటే.... కాంగ్రెస్ అధిష్టానం మరింకేదో సమస్య పరిష్కారానికి ఆపసోపాలు పడుతున్నట్లుంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! బొమ్మ పూర్తయితేనే గదా అందులో ఉందేమిటో తెలిసేది!

No comments:

Post a Comment