Wednesday, June 2, 2010

ఎవరికి వాళ్ళే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేసుకుంటారా?

[రెండోసారి ఎన్నికల్లో గెలిచి, ఏడాది పూర్తయిన సందర్భంగా.... యూపీఏ ప్రభుత్వం తరుపున మన్మోహన్, సోనియాలు ప్రగతి నివేదిక(progress Report) ను విడుదల చేసిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! విద్యార్ధుల ప్రోగ్రెస్ రిపోర్టుని ఎవరు ఇస్తారు?

సుబ్బారావు:
టీచర్లు!

సుబ్బలష్షిమి:
నటీనటుల ప్రోగ్రెస్ రిపోర్టుని ఎవరు నిర్దారిస్తారు?

సుబ్బారావు:
ప్రేక్షకులు!

సుబ్బలష్షిమి:
మరి ప్రభుత్వపు ప్రోగ్రెస్ రిపోర్టుని ఎవరు నిర్ణయించాలి?

సుబ్బారావు:
ప్రజలు!

సుబ్బలష్షిమి:
మరి ప్రజలు ఇవ్వాల్సిన ప్రోగ్రెస్ రిపోర్టుని మన్మోహన్ సోనియాలే ఇచ్చుకుంటున్నారేం బావా?

సుబ్బారావు:
అదా సంగతి! ఇన్ని ప్రశ్నలడుగుతుంటే ఏమిటబ్బా అనుకున్నా? తమకు తామే ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చుకుంటే.... ‘వృద్ది రేటు ఇంతా, ద్రవ్యోల్బణం ఇంత తగ్గింది, ఒడుదుడుకులున్నా ధరలు అదుపులోనే ఉన్నాయి’ అంటూ దొంగ లెక్కలన్నీ చూపించుకోవచ్చు. అచ్చంగా ఇప్పుడు ఇంటర్ జవాబు పత్రాలలో, అధ్యాపకులు చేతి కొచ్చిన మార్కులు వేసినట్లన్నమాట!

అదే ప్రజలని ప్రభుత్వం గురించిన ప్రగతి నివేదిక ఇమ్మన్నారనుకో.... ఏడాదిలో జరిగిన స్కాంలు, పెంచిన పన్నుల రేట్లు, పెరిగిన ధరలు, పట్టపగలు జరిగిన దొంగతనాల సంఖ్యలూ, రోడ్డు, రైలు విమాన ప్రమాదాల సంఖ్యలూ, మృతుల సంఖ్యలూ, తుఫానూ వరదల సంఖ్యలూ, నష్టాల అంకెలూ, అందని నష్టపరిహారాలు, నక్సల్ దాడుల సంఖ్యలూ, టెర్రరిస్టుల పేల్చిన బాంబుల సంఖ్యలూ కూడా కలిపి మార్కులు వేస్తారు మరి!

అందుకే... ప్రజలకా ఛాన్స్ ఇవ్వకుండా, తమకు తామే ‘శభాష్’ అని చెప్పుకుంటున్నారు. ఎటూ ఈవిఎం లు చేతిలోనే ఉన్నాయి కదా? ఇంకెందుకు చింత?

3 comments:

  1. బాగా చెప్పారు.

    ReplyDelete
  2. abhignya గారు: నెనర్లండి.

    సామాన్యుడు గారు : నెనర్లండి.

    ReplyDelete