Saturday, June 12, 2010

బాధితులకో స్థాయి కావాలా? - మీడియా, మాఫియాలు అవిభక్త కవలలా?

[రాష్ట్రంలో ఎన్నో కిడ్నాపులూ, హత్యలు జరుగుతున్న వార్తల నేపధ్యంలో]

[బాధితులకో స్థాయి కావాలా?
>>>కుటుంబ కలహాలతో విజయవాడ చిన్నారి నాగ వైష్ణవిని కిరాతకంగా చిదిమేసిన దుర్మార్గం, పర్యవసానంగా ఆ అమ్మాయి తండ్రి ప్రభాకర్ గుండెపగిలి మృతి చెందిన విషాద ఉదంతం రాష్ట్రాన్ని పట్టి కుదిపేసింది. ఆ ఘటనపై స్పందించని నాయకుడు గానీ, పార్టీ గానీ లేవు. పోటీలు పడి విజయవాడకు క్యూలు కట్టారు. మీడియా ఎన్నో రోజులపాటు వైష్ణవి నివాసం ముందే తిష్టవేసింది. అంత వరకూ సరే... కానీ దానికన్నా హేయమైన ఘటన ఇటీవల హైదరాబాద్ లోని బోరబండలో జరిగింది.

మరికొన్ని రోజులలో పెళ్ళి జరగబోతున్న ఓ బాలికపై అత్యంత హేయంగా అత్యాచారం జరిపి హతమార్చారు. ఆ అమ్మాయి ఇద్దరు సోదరుపైనా దుండగులు దాడి చేశారు. వారిలో ఒకరికి చూపు పోయింది. తాజాగా మరో ఘటన జరిగింది. ముఖ్యమంత్రి రోశయ్య నివాసానికి కూతవేటు దూరంలోని బల్కంపేటలో, రాత్రి పూట ఒక యువతిపై కొందరు దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచారు. ఆ యువతి ఒళ్లంతా కత్తిపోట్లకు గురై, కాపాడండని ప్రతి గుమ్మాన్నీ తట్టినా పట్టించుకున్న నాథుడు లేక ప్రాణాలొదిలింది.

దూరప్రాంతం నుండి వలస వచ్చి, మహానగరంలో ఏదో పని చేసుకుంటూ ఆ యువతి పొట్టపోసుకుంటోంది. నాగవైష్ణవి ఉదంతంలో నిందితుల్ని ఎన్ కౌంటర్ చెయ్యమని రోడ్లెక్కి ఆక్రోశించిన నానా విధ వర్గాల్లో ఒక్కటీ ఈ దారుణాలపై కిమ్మనలేదు. పోలీసులైతే యాధావిధిగా నిమ్మకు నీరెత్తినట్టున్నారు. మీడియాకు, మహిళా సంఘాలకు, ఇతర పక్షాలకు ఇవి సాధారణ నేర వార్తలుగానే కనిపించడం మరింత ఆశ్చర్యం కలిగించింది. రాజధానిలో జరిగిన ఈ దారుణాలు మృగ్యుమవుతున్న శాంతి భద్రతలకు నిదర్శనం కావా? బాధితులకు సంఘంలో హోదా, పలుకుబడి, రాజకీయ అండలేవు. దాంతో వారి తరుపున మాట్లాడే వారే లేకుండా పోయారు. మరుసటి రోజుకే అందరూ ఆ దారుణాల్ని మరచిపోయారు. ప్రభుత్వం సంగతి పక్కన పెడితే - మీడియా, హక్కుల సంఘాల వంటివీ తీవ్రతను గుర్తించకపోవడం దారుణాలను మించిన విషాదం. - జూన్ 7, 2010; ఈనాడు కు లేఖ - హరిత పారుపల్లి, హైదర్ గూడ, హైదరాబాద్. ]


సుబ్బలష్షిమి:
బావా! ఈ పాఠకురాలు ఎవరో గాని, మంచి ప్రశ్నలే లేవనెత్తింది. విజయవాడ నాగవైష్ణవి హత్యకేసు విషయమై స్పందించిన మీడియా, ఇలాంటి హత్యలు, నేరాల మీద ఎందుకని కిమ్మన లేదంటావు బావా?

సుబ్బారావు:
నాగ వైష్ణవి హత్య నేపధ్యంలోనే, ఆ వ్యవహారం వెనుక భూ మాఫియా ఉందన్న మాటొకటి బయటికొచ్చింది మరదలా! అప్పట్లో తెలంగాణా ఉద్యమం, తెర మీద ఉడుకుతోంది. హైదరాబాద్ నుండి విజయవాడకు రియల్ ఎస్టేట్ వ్యాపారం మారనుంది.నాగవైష్ణవి తండ్రికి భూవివాదం కూడా ఉన్నాయన్న వార్తలొచ్చాయి. విజయవాడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక ఝలక్ ఇచ్చేందుకు... నాగవైష్ణవి, ఆమె తండ్రి ‘దెబ్బలబ్బాయి’లుగా ఉపయోగపడ్డారు. వ్యాపార మాఫియాకి మానవ ప్రాణాలు లెక్క కాదు కదా? అందుకే కదా మరదలా, ఆ కేసు ఇప్పుడు మూతపడే దిశగా ప్రయాణిస్తున్నది!?

సుబ్బలష్షిమి:
అయితే మీడియా-మాఫియాలు, అవిభక్త కవలలై పోయినట్లున్నారు బావా!

No comments:

Post a Comment