Wednesday, June 23, 2010

డీకోడ్ తెలిస్తేనే, కోడ్ భాష అర్ధం అవుతుంది! [అద్వానీ ఆత్మకథ నుండి]

[>>>బెంగుళూర్ లో ఉండగా నేను (అద్వానీ), దేశమంతటా 40 జైళ్ళకు పైగా ఉన్న రాజకీయ ఖైదీలతో, నిరంతర సంబంధాలు పెట్టుకునేవాడిని. వారి నుండి తరచూ, కోడ్ భాషలో ఉత్తరాలు వచ్చేవి. జనవరి 7న నాకు ఈ క్రింది సందేశంతో ఒక టెలిగ్రాం అందింది.

‘ఉమ్మడి కుటుంబంలో ప్రముఖ సభ్యులందరూ, కట్టబోయే కొత్త ఇంటి కోసం చర్చిస్తున్నారు. ఇవ్వాళ నేను తాతయ్యను చూసేందుకు వెళ్తున్నాను’- మధుబాల అద్వానీ.

ఆ టెలీగ్రాం మధు దండావతే నుండి వచ్చిందని నాకు తెలుసు. అందులోని నిగూఢ సందేశం నాకు అర్ధమైంది. తన విడుదల తరువాత ఆయన వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సహచరులను కలుసుకొని, కొత్త రాజకీయపార్టీ ఏర్పాటుపై చర్చిస్తున్నారు. ఆయన ఈ విషయంపై మార్గదర్శకత్వం కోసం, జయప్రకాశ్ నారాయణ్ ను కలుసుకునేందుకు పాట్నా బయలుదేరి వెళ్తున్నారు.

16 జనవరిలో నా డైరీలో ఇలా రాసుకున్నాను. ‘మార్చి నెలాఖరులో కానీ, ఏప్రిల్ మొదటి వారంలో కానీ లోక్ సభ ఎన్నికలు జరగవచ్చునని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఒక బ్యానర్ కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు పార్లమెంట్ వచ్చే సమావేశాల మొదటి రోజు అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.’ సరిగ్గా రెండు రోజుల తరువాత 1976 జనవరి 18న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ లోక్ సభ రద్దును ప్రకటించారు. - అద్వానీ ఆత్మకథ నుండి,పేజీ నెం. 216, 217]

సుబ్బలష్షిమి:
బావా! ఎమర్జన్సీ రోజులలో అద్వానీ జైలులో ఉండగా, తనకు కోడ్ భాషలో ఉత్తరాలొచ్చేవని వ్రాసుకున్నాడు, చూశావా?

సుబ్బారావు:
అంతేకాదు మరదలా! అద్వానీ తనకు మధుదండావతే నుండి కోడ్ భాషలో ఉత్తరం వ్రాసాడన్నాడే గానీ, ‘ఎమర్జన్సీ ఎత్తి వేయనున్నారని’ ఇండియన్ ఎక్స్ ప్రెస్ నుండి కోడ్ భాషలో హింట్ అందిందని చెప్పాడా? తన డైరీలో జాగ్రత్తగా ‘పేపర్ బ్యానర్ కథనాన్ని’ మాత్రం వ్రాసుకున్నాడు.

జైలులో ఉన్నప్పుడే కాదు మరదలా! ఈ రాజకీయ నాయకులు, ఎల్లవేళలా తమదైన కోడ్ భాషలోనే సంభాషించుకుంటారు. ఆ స్టేట్ మెంట్లు అర్ధం గాక సామాన్యప్రజలు, "ఏమిటో ఈ రాజకీయాలు!? అర్ధం కావు!" అనుకుంటారు.

సుబ్బలష్షిమి:
నిజమేలే బావా! మన కళ్ళెదుటే, ప్రతీ రోజూ, మీడియా సాక్షిగా.... వాద ప్రతివాదనలు, ఖండనలూ, ప్రకటనలూ గుప్పిస్తూ ఉంటారు. మనకదంతా అర్ధం పర్ధం లేనట్లు ఉంటుంది. డీ కోడ్ తెలిస్తేనే కదా, ఏ కోడ్ భాష అయినా అర్ధమయ్యేది!?

No comments:

Post a Comment