Wednesday, June 30, 2010

ప్రజలింకా బ్రతికే ఉన్నారు కాబట్టి ధరలింకా పెంచవచ్చు!

[>>>ఐదేళ్ళకో టీవీ మారుస్తున్నారు. వినియోగదార్ల వాడకంపై అసోచామ్ నివేదిక.
>>>ప్రజలు భరించగలిగే స్థితిలోనే ఉన్నారు, కాబట్టి పెట్రోధరలు పెంచవచ్చు.... అసోచామ్ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, అసోచామ్ జనరల్ సెక్రటరీ డి.ఎస్.రావత్ వెల్లడించిన వివరాలు ఓ సారి చూడు! దేశంలో వినియోగదారులు 4-5 ఏళ్ళకోసారి టీవీలను, 7-8 ఏళ్ళకోసారి గృహోపకరణాలను మారుస్తున్నారట. అంత డబ్బులెక్కువగా ఉన్నాయంటావా బావా?

సుబ్బారావు:
ఏమో మరదలా! మన కాలనీ, మన చుట్టు ప్రక్కలైతే ఎవరూ అంతగా కొత్త మోడల్ వచ్చింది కదా అని టీవీలు మార్చెయ్యలేదు. బహుశః అసోచామ్ నిర్వచనాల ప్రకారం ఇలాంటి వాళ్ళంతా పేదవాళ్ళేమో! ఇక రిఫ్రిజిరేటర్లూ, ఎయిర్ కూలర్లూ అంటావా? పాడయ్యి, రిపేర్లు తడిసిమోపెడైతే కొత్తవి కొనుక్కోక ఏం చేస్తారూ?

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! ‘ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది ఇలా’... అంటూ ఓ జాబితా కూడా ఇచ్చాడు.
>>>ఆరో వేతన సంఘం సిఫార్సుల అమలు కారణంగా, దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరిగాయి. ఆదాయ స్థాయి పెరగడంతో సహజంగా వారి వ్యయాలూ ఊపందుకున్నాయి.

సుబ్బారావు:
దేశంలో దాదాపు 120 కోట్లమంది ఉంటే అందులో అరకోటి మందికి జీతాలు పెరిగితే అందరికీ ఆదాయాలు పెరిగినట్లన్న మాట. కాబట్టి అందరి కొనుగోలు శక్తీ పెరిగినట్లన్న మాట. భేష్! మాంఛి లెక్క!

సుబ్బలష్షిమి:
>>>కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం వల్ల 2008-09 ఆర్దిక సంవత్సరం నుండి 4.7కోట్ల పై చిలుకు కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభించాయి. ఫలితంగా వారి కొనుగోలు శక్తి బలపడింది.

సుబ్బారావు:
మన ఇంటి ముందు కూడా ఈ ఉపాధి కూలీలు, ఉదయాన్నే ఓ మూడు గంటలు పనికిరాని కాల్వలు తవ్వి పోతున్నారు మరదలా! ఆ పధకంలో ఉన్న అవినీతి లోకానికంతా తెలిసిందే! కూలీలకు ఇస్తున్నది 40-50 రూపాయలు అయితే మిగిలినదంతా అధికారుల జేబుల్లోకే పోతున్నది. పోస్టాఫీసు బట్వాడాల తీరు బట్వాడాలదే! అధికారుల వాటాలు అధికారులవే! అదేమంటే ‘పైనుండి క్రిందిదాక ఎవరి వాటా వాళ్ళకివ్వవద్దా?’ అంటారు. అదీ ప్రతిష్ఠాత్మక జాతీయ ఉపాధి హామీ పధకం! అందునా అది సోనియా కుమారుడు రాహుల్ మానసపుత్రిక అట!

సుబ్బలష్షిమి:
ఇంకా చాలా చెప్పారు బావా!
>>>67,500-4,50,000 రూపాయల మధ్య, ఆదాయాలను సంపాదించే కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని... టెలివిజన్లు, గృహోపకరణాల తయారీ కంపెనీలు, సరసమైన ధరలకే మార్కెట్లోకి ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. దీంతో మధ్యస్థాయి ఆదాయవర్గాలూ కొనుగోలుకు ముందుకొస్తున్నారు.
>>>భారత్ నిర్మాణ్ ప్రాజెక్ట్ లో భాగంగా 11 వ పంచవర్ష ప్రణాళిక ముగిసేనాటికి 1,25,000 గ్రామాలు, వాటిలోని 2.3కోట్ల కుటుంబాల్లో విద్యుద్దీకరణ వెలుగులు విరజిమ్మనుంది.
>>>వీటన్నింటి ఊతంతో రానున్నరోజుల్లో టీవీలు, రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు అమ్మకాలు రెక్కలు తొడగొచ్చు.

సుబ్బారావు:
మొత్తానికీ అసోచామ్ వాళ్ళు అంచనాలే గాక జ్యోస్యాలూ చెబుతారన్న మాట!

సుబ్బలష్షిమి:
వాళ్ళని తక్కువగా అంచనా వేయకు బావా! మొన్నామధ్య.... ‘ప్రజలు భరించగలిగే స్థితిలోనే ఉన్నారు. కాబట్టి పెట్రోధరలు పెంచవచ్చు’ అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం పెట్రోధరలు పెంచింది, తెలుసా?

సుబ్బారావు:
ఇంకానయం! ‘ప్రజలింకా బ్రతికే ఉన్నారు కాబట్టి ధరలింకా పెంచవచ్చు’ అన్నారు కాదు.

సుబ్బలష్షిమి:
భవిష్యత్తులో అదీ అంటారేమో బావా!

No comments:

Post a Comment