Tuesday, June 22, 2010

పెక్కావి: నా వద్ద సింధ్ ఉన్నది - అద్వానీ ఆత్మకథ నుండి!

[>>>1843లో బ్రిటీష్ కమాండర్ ఇన్ ఛీఫ్ సర్ ఛార్లెస్ జేమ్స్ నెపియర్ (1782-1853), సింధ్ ను ఆక్రమించి, తూర్పు ఇండియా కంపెనీకి స్వాధీనం చేశాడు. సింధ్ అమీర్ల సంపద గురించి ప్రపంచానికి అప్పటికే తెలియడమే ఈ దాడికి కారణం. నేపియర్ సైన్యం, సింధ్ సంపదను హస్తగతం చేసుకోవడానికి, నెత్తురుటేర్లే పారించవలసి వచ్చింది.

ఒక్క హైదరాబాద్(పాకిస్తాన్) కోటలోనే, ఆయనకు రెండు కోట్ల స్టెర్లింగ్ ల విలువైన సంపద లభించింది. ఇందులో కోటి 30లక్షల నాణాలు, మిగతావి అభరణాల రూపంలో ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున సంపద స్వాధీనపరిచినందుకు, కంపెనీ డైరెక్టర్లు, ఆయనకు పెద్ద ఎత్తున బహుమానాలిచ్చారు. అయినప్పటికీ ఈ ఊచకోతను వర్ణించేందుకు, తన యజమానులను విమర్శించేందుకు ఆయన వెనకాడలేదు.

‘భారత దేశాన్ని ఆంగ్లేయులు ఆక్రమించుకున్నారు. మన రాణి తప్పు చేయనప్పటికీ, ఆమె మంత్రులు చేసే అవకాశాలున్నాయి. నెపోలియన్ కంటే ఎక్కువగా, ఇంగ్లీషు మంత్రులపై ఈ విషయంలో తీవ్ర ఆరోపణలు చేయవచ్చు. వారు భారతదేశం, ఆస్ట్రేలియాలను స్వాధీనపరుచుకున్నారు. దారుణాలకు పాల్పడిన వారిని కాపాడారు. భారత దేశాన్ని గెలుచుకోవడానికి ఏకైక కారణం ధనం. వేల మిలయన్ల స్టెర్లింగ్ లను, గత 90 సంవత్సరాలుగా, భారత్ నుండి పిండి తీసుకువెళ్ళారు. దక్కించుకున్న ప్రతి నాణం, రక్తంతో తడిసింది. రక్తాన్ని తుడిచి ఆ నాణాలను హంతకులు జేబుల్లో నింపుకున్నారు. అబ్బో.... ఆ దురదృష్టపు నేలపై తుడుస్తూనే పోవాలి కాని తరిగేదేమీ లేదు..’ అని ఆయన రాసుకున్నారు.

స్కూలులో నేను(అద్వానీ) ద్వితీయ భాషగా లాటిన్ ను తీసుకున్నాను. దాని వల్ల నాకు, నేపియర్ తో సంబంధం ఉన్న, బహుళ ప్రచారం గల ఒక శ్లేషను అర్ధం చేసుకునేందుకు వీలు కలిగింది. ఆయన అమీర్లను ఓడించిన తర్వాత, లండన్ లో ఉన్న తన యజమానులకు ‘పెక్కావి’... అనే ఒకే ఒక పదాన్ని, టెలిగ్రామ్ లో పంపారు. లాటిన్ లో దాని అర్ధం - ‘నేను పాపం చేశాను’(ఐ హావ్ సిన్న్ డ్) అని. కాగా ఆయన అసలు ఉద్దేశం - ‘నా వద్ద సింధ్ ఉన్నది’... అని (ఐ హావ్ సింధ్). - అద్వానీ ఆత్మకథ నుండి, పేజీ నెం.12]

సుబ్బలష్షిమి:
బావా! నెపియర్ అనబడే ఈ బ్రిటీష్ కమాండర్ ఇన్ ఛీఫ్ ఎంత ధూర్తుడో చూడు! ఈస్టిండియా కంపెనీ కోసం, సింధ్ సంపద దోపిడి చేయటానికి, ఓ ప్రక్క రక్తపుటేర్లు పారించింది అతడే! అందుకు కంపెనీ నుండి భారీగా బహుమానాలని, తన వాటాగా పుచ్చుకుందీ అతడే! మరో ప్రక్క, ఆ ఊచకోతని వర్ణించటానికీ, తన యజమానులను విమర్శించటానికీ అతగాడు వెనుదీయలేదట. ఎంత గొప్ప వ్యక్తిత్వమో! ఇదేమీ స్ట్రాటజీ బావా?

సుబ్బారావు:
ఆ నెపియర్ అన్నవాడు, ఫక్తు బ్రిటీష్ వాడికి ప్రతీక మరదలా! ఇక ఊచకోతని వర్ణించడం ఎందుకంటే - ఇతరులని భయపెట్టటానికి! తన యజమానులని విమర్శించడం ఎందుకంటే - ఇతరులెవరూ విమర్శించకుండా నిరోధించటానికి! ఎదుటి వాళ్ళు ఏమైనా అనేముందే, తమని తామే అనేసుకుంటారు చూడు కొంతమంది, అలాగన్న మాట. అంతేగాక విమర్శించేవారిని తనతో కలుపుకుంటే, మొత్తం పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇందుకు, సదరు ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లు, నెపియర్ కి మరోసారి భారీ బహుమానాలే ఇచ్చి ఉంటారు.

సుబ్బలష్షిమి:
అక్కడితో అయిపోలేదు బావా! నెపియర్... ‘మన రాణి తప్పు చేయనప్పటికీ, ఆమె మంత్రులు చేసే అవకాశాలున్నాయి’ అని వ్రాసుకున్నాడట తెలుసా?

సుబ్బారావు:
రాణికి బాగా తైరు కొట్టాడు మరదలా! అసలు బ్రిటీష్ రాణీయే పెద్ద ఢాకూ రాణి. కాకపోతే... కోహినూర్ వజ్రాలనీ, మయూర సింహాసనాల్ని ఇండియా నుండి ఎత్తుకుపోయింది గాక, తిరిగి ఇవ్వను గాక ఇవ్వనని భీష్మించుకు కూర్చుంటుందా? ఒక్క ఇండియా నుండేం ఖర్మ, ఏ దేశం నుండి దోచుకెళ్ళిన సంపద గురించైనా ఇదే వ్యవహారం!

అందునా కుత్రంతాలు పన్నీ, నెత్తుటేర్లూ పారించీ, రోగాలు పుట్టించీ దోచుకెళ్ళిన సొమ్ము! అంతోటి దానికి, మళ్ళీ బ్రిటీష్ వాళ్ళు.... మానవ హక్కులనీ, మానవత్వమనీ, స్వేచ్ఛా స్వాతంత్రాలనీ అంటారు. అసలు అంత అమానుష చరిత్ర కలిగిన బ్రిటీష్ ని, పెద్దమనిషిగా గుర్తించి, ఐరాసలో వీటో పవర్ కట్టబెట్టారు చూడు, అదీ పెద్ద జోక్! అసలు ఐరాస నే పెద్ద జోక్ అనుకో, అది వేరే విషయం!

సుబ్బలష్షిమి:
ఇక్కడ మరో గమ్మత్తు గురించి కూడా వ్రాసాడు బావా అద్వానీ! నెపియర్ తన యజమానులకి, సింధ్ సంపన్నులను ఓడించాక, లాటిన్ భాషలో ‘పెక్కావి’ అని టెలిగ్రాం ఇచ్చాడట. అంటే లాటిన్ లో అర్ధం... ‘నేను పాపం చేశాను’ అనిట. దాన్నే ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే... ‘ఐ హావ్ సిన్న్ డ్’ అలియాస్ ‘ఐ హావ్ సింధ్’ అనిట. ఎంత మర్మగర్భమైన భాష, బావా!

సుబ్బారావు:
అది గూఢచర్యపు భాష మరదలా! అదే మరింత మెరుగులు దిద్దుకొని, ఈనాడు ప్రపంచాన్ని నడిపిస్తోంది. మీడియా వాడేది కూడా దీన్నే! ప్రజలు మామూలు అర్ధాలు చదువుతారు. ‘ఐ హావ్ సిన్న్ డ్’ లేదా ‘పెక్కావి’ లాగా! ‘నా దగ్గర సింధ్ ఉన్నది’ లాంటి అసలైన అర్ధాలు, అర్ధం కావాల్సిన వాళ్ళకి అర్ధమౌతాయి.

సుబ్బలష్షిమి:
ఓహో! మతలబు తెలిస్తే గానీ అర్ధం కాని ‘మీడియా మాయాజాలం’ అన్న మాట ఇది!

No comments:

Post a Comment