Tuesday, June 8, 2010

నాడు హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ బూమ్ - నేడు బంగారం బూమ్!

[ముంబై స్టాక్ మార్కెట్ పతనం, బంగారం ధర పెరుగుదల వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ మధ్య చాలా సార్లు గమనించాను. ముంబై స్టాక్ ఎక్చేంజ్ లో సెన్సెక్స్ భారీగా పడిపోయినప్పుడల్లా బంగారం ధర పెరుగుతుంది. మదుపుదార్లంతా, షేర్ లలో పెట్టుబడి వెనక్కి తీసుకునీ లేదా షేర్ లలో పెట్టుబడి పెట్టకుండా, మదుపుదార్లంతా బంగారం మీద పడ్డందుకే బంగారం ధర పెరిగిందని, మీడియా విశ్లేషణలు వస్తుంటాయి. మదుపుదార్లంతా బంగారం కొనటానికి ఎగబడగా, కొనుగోళ్ళు పెరిగాయని వార్తలొస్తాయి. అంత కొనుగోళ్ళు పెరిగాయంటే, అంతగా అమ్మకాలు జరిగాయనే కదా?

సుబ్బారావు:
అవును. అయితే?

సుబ్బలష్షిమి:
ధర పెరిగినప్పుడు కొనేవాళ్ళుండటం ఒక ఎత్తయితే, అమ్మేవాళ్ళేవరు బావా? అదీగాక... బంగారం ధర పెరిగి ‘కొనుగోళ్ళు’ జోరందుకున్నాయన్న తర్వాత, ఒకటి రెండు రోజులలో మళ్ళీ స్టాక్ మార్కెట్ పైకి ఎగబాకుతూ ఉంటుంది, బావా! ముందురోజు స్టాక్ మార్కెట్ మీద నమ్మకం లేక, బంగారం మీద పెట్టుబడి పెట్టిన మదుపుదార్లకు తరువాత రోజే స్టాక్ మార్కెట్ మీద నమ్మకం ఎలా వచ్చినట్లు? ఎలా పెట్టుబడులు పెడుతున్నట్లు? ఎందుకిలా జరుగుతున్నట్లు?

సుబ్బారావు:
నిజమే మరదలా! రెండింటి మధ్య ఏదో బాదరాయణ సంబంధం ఉన్నట్లుంది. ప్రధానీ, విత్తమంత్రితో సహా ఆర్దికవేత్తలందరూ అబద్దాలే చెబుతున్న చోట, అసలు సత్యమేదో ఎవరికి తెలుస్తుంది చెప్పు! హర్షద్ మెహతా అవకతవకల నాడు కూడా ‘స్టాక్ మార్కెట్ బూమ్’ అన్నారు. బద్దలయ్యాక గానీ నిజమేమిటో తెలియలేదు. అలాగే ఇప్పుటి ఈ ‘స్టాక్ మార్కెట్ మతలబు’ ‘బంగారం బూమ్’ సంగతి కూడా, తేలిన నాడు తెలియాల్సిందే!

సుబ్బలష్షిమి:
అంతేకాదు బావా! ఈ సంగతి పరిశీలించు. హంగేరి ప్రధానమంత్రి "గతంలోని సోషలిస్టు ప్రభుత్వం తప్పుడు సమాచారం ప్రకటించింది. గ్రీసులోనూ సంక్షోభానికి ముందు సర్కారు తప్పుడు ఆర్థిక గణాంకాలను చెప్పింది. చివరకు అసలు నిజాలు బహిర్గతమయ్యాయి. ప్రస్తుతం హంగరీదీ అదే పరిస్థితి" అని వ్యాఖ్యానించాడు, తెలుసా!

సుబ్బారావు:
దీన్ని బట్టి నీకేం అర్ధమయ్యింది మరదలా! ప్రభుత్వాలు, ప్రధానులు కూడా నిజాలు చెప్పరు. పార్లమెంట్ సాక్షిగా అబద్దాలు చెబుతారు. ఇక ‘గ్రిప్ చేయలేం’ అనుకున్నప్పుడు, అసలు విషయాన్ని బద్దలు చేస్తారు. అంతే! నిన్న గ్రీసు, నేడు హంగేరి, రేపు....?

2 comments:

  1. డియర్ సుబ్బలష్షిమి & సుబ్బారావు!

    చాలాబాగాచెప్పారు!

    నేనే గనక ప్రథాన మంత్రినయితే, ఈ స్టాక్ మార్కెట్లు, ట్రేడింగులు, నిషేధించి, పేకాట, కోడిపందాలు లాంటివి అన్నీ చట్టబధ్ధం చేస్తాను!

    నాకే మీ వోటేయ్యండేం?

    ReplyDelete
  2. కొంచెం వేచిచూడండి పేకాట, కోడిపందాలే కాదు, ఇంకా చాలా వాటిని చట్టబద్దం చేసేలా ఉన్నారు. సరికొత్త పన్నులు వినూత్నంగా ఎలా వేయ్యాలో సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు మంత్రిపుంగవులు! మీరు ప్రధాన మంత్రి అయినా చేయటానికి ఏవీ మిగిల్చేలా లేరు! :)

    ReplyDelete