Saturday, April 24, 2010

పాలెగాళ్ళు బ్రిటీష్ వాళ్ళకి కప్పం కట్టినట్లు, పైకి వాటాలు పంపటానికి ఎంసీఐ లు !

[భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) అధ్యక్షుడు కేతన్ దేశాయ్, మౌలిక సదుపాయాలు లేని కాలేజీకి అనుమతి ఇవ్వటానికి 2 కోట్లు లంచం తీసుకుంటూ సీబీఐ కీ పట్టుబడ్డ - వార్త నేపధ్యంలో ]

సుబ్బలష్షిమి:
బావా!ఎంసీఐ అధ్యక్షుడు కేతన్ దేశాయ్ 2 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడట తెలుసా?

సుబ్బారావు:
మరి? మూడేళ్ళ క్రితం కూడా లలిత్ మోడి లాంటి వాళ్ళకి వ్యాపారంలో కలిసిరాలేదు. తరువాత ఐపీఎల్ తో ఎడాపెడా డబ్బులు సంపాదించి సొంత విమానాలు, లగ్జరీ బోట్లు, ఖరీదైన కార్లు కొన్నారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు, డబ్బుసంపాదన పరుగులో తాము వెనకపడినట్లు అనిపించదూ? అందుకే తాము కూడా నాలుగు చేతుల సంపాదించాలని వీలైనంత ఎక్కువ లంచాలు పడుతుంటారు. పైవాళ్ళతో సహా ఎవరి వాటాలు వాళ్ళకి పంపగా, అందులో తమకి మిగిలేది కొంతే కదా!

సుబ్బలష్షిమి:
బావా! ఇతడి గురించి అప్పుడే అయిపోలేదు. 2001 లో అవినీతి ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టడంతో, అప్పట్లో ఒకసారి ఎంసీఐ అధ్యక్ష పదవి నుంచి ఈ కేతన్ దేశాయ్ తప్పుకున్నాడు. తర్వాత మళ్ళీ ఆ పదవిని చేజిక్కించుకున్నాడు. ఎంత ఖర్చుపెట్టి ఉంటాడో?

ఈ విషయం మీద ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ అజాద్ మాత్రం.... ఎంసీఐ అధ్యక్షుడి నియామకం, తొలగింపులో ప్రభుత్వ పాత్రమీ ఉండదని, ప్రభుత్వంలో గానీ, ఆరోగ్యశాఖలో గానీ ఎంసీఐ భాగం కాదని వివరించారు. అదో ఎన్నికైన ప్రత్యేక వ్యవస్థని, భారత్ లో అలాంటివి వందల సంఖ్యలో ఉన్నాయని చెప్పాడు. మరి వాళ్ళకి జీతాలు ఎవరిస్తారు బావా? అసలు ఎన్నికైన ప్రత్యేక వ్యవస్థ అంటే ఏమిటి బావా!

సుబ్బారావు:
అంటే అది ఒకప్పటి పాలెగాళ్ళ వ్యవస్థ అన్నమాట. పాలెగాళ్ళు బ్రిటీష్ వాళ్ళకి కప్పం కట్టినట్లు, పైకి వాటాలు పంపటానికి మాత్రమే ఉంటుంది. వాటి మీద చర్యలు తీసుకోవటానికి మాత్రం, ప్రభుత్వం అవి తమ పరిధిలో ఉండవని చెబుతుంది. అలా చెప్పటానికి చక్కగా చట్టాలు చేసుకొని ఉంటారు మరదలా!అంతే!

సుబ్బలష్షిమి:
ఓరి నాయనో! ఇంత పచ్చి దోపిడీనా? ఇదేం ప్రజాస్వామ్యం బావా!

No comments:

Post a Comment