Wednesday, April 21, 2010

అధిష్టానానికి అన్నీ తెలుసు మ్యాచ్ ఫిక్సింగ్ లూ, బెట్టింగులతో సహా!

[ఐపిఎల్ మ్యాచ్ ఫిక్సింగులూ, బెట్టింగులూ, బినామీ వాటాల అవకతవకలు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ ఐపీఎల్ లలిత్ మోడీ మూడేళ్ళ క్రితం ఏ వ్యాపారంలోనూ నిలదొక్కుకోలేకపోయాడట. ఇప్పుడో! స్వంతంగా విమానం, లగ్జరీ బోటు, బెంజికార్లు, గట్రా గట్రాలు! సునంద పుష్కర్, శశిధరూర్ ల వార్తల నేపధ్యంలో, వెలుగు చూసిన ఎన్నో అవకతవకలు! ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగులూ, బెట్టింగులూ, పెద్దవాళ్ళకి బినామీ పేర్లతో వాటాలు....! వెరసి నల్లడబ్బు తెల్లగా మారుతుందట. అదెలాగో మరి! ఇంతకీ బావా, ఈ మధ్య ఇలాంటి అవకతవకలన్నీ, మరేదో విధంగా బద్దలై సంచలనాలయ్యాకే కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తోందేమిటి? ప్రభుత్వ ఇంటలిజెన్స్ విభాగాలేం చేస్తున్నట్లు? అందునా అధిష్టానికీ అన్ని తెలుసంటారు మళ్ళీ!

సుబ్బారావు:
భలే చెప్పావులే మరదలా! అవకతవకలు బయటికి పొక్కి గగ్గోలు అయ్యాక, ఇక తప్పదన్నట్లు విచారణకు ఆదేశించే ఈ ప్రభుత్వం, తానుగా అవకతవకలు బయటకు తీస్తుందా?

సుబ్బలష్షిమి:
అందుకేనా.... విచారణకు ఆదేశం అన్న తర్వాత ఇక అన్నీ చల్లారిపోతున్నాయి? ఎన్.డి. తివారీ రాజభవన్ రచ్చకు మాదిరిగా నన్నమాట! వెరసి నేరగాళ్ళ రక్షణకు, అవకతవకలలోని నిజాలని తొక్కిపట్టేందుకూ పనిచేస్తోందన్న మాట ప్రస్తుత ప్రభుత్వం. బహుశ ఆ ధైర్యంతోనే శశిధరూర్ పార్లమెంట్ లో తన మీద విచారణ చేయమని చెప్తున్నాడు.

సుబ్బారావు:
మరొకటి మరిచిపోయావు మరదలా! పన్నులు వడ్డించటానికి, పెట్రో కరెంటు గట్రా ధరలు పెంచటానికి, ఇప్పుడప్పుడే ధరలు తగ్గవు అని ప్రకటనలు చేయటానికి కూడా పని చేస్తోంది!

No comments:

Post a Comment